Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులను ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగం


 

ప్రియమైన సోదరీమణులు మరియు సోదరులారా,

నమస్కారం.

వివిధ పథకాలు సామాన్యుల జీవితాలలో ఏ విధమైన మార్పులనైనా తీసుకువచ్చాయా అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసమే నేను ప్రయత్నిస్తుంటాను; ఇందుకోసం ఆయా పథకాల లబ్ధిదారుల తో నేరుగా మాట్లాడి సదరు పథకాల బాగోగులను అర్థం చేసుకోవడానికి కృషి చేస్తాను. ఈ కారణంగానే నేను వారితో తరచుగా భేటీ అవ్వాలని చూస్తుంటాను. ఆ పథకం సరైందా లేదా సరైంది కాదా, మంచిదా లేక చెడ్డదా, వారు ఏవైనా సమస్యలను ఎదుర్కొన్నారా లేక ఆ పథకం వారికి సౌకర్యవంతంగానే ఉందా.. ఈ విషయాలన్నింటినీ మీ వద్ద నుండి, ప్రజల వద్ద నుండి ముఖాముఖి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ప్రభుత్వంలో భాగమైన అధికారులు తయారు చేసే నివేదికలకు ఉండవలసిన ప్రాముఖ్యం ఎలాగూ ఉంటుంది. కానీ, లబ్ధిదారులతో ప్రత్యక్షంగా సంభాషించి ఉచిత వంటగ్యాస్ పథకం ‘ఉజ్జ్వల యోజన’పై వారి నుండి కొత్త విషయాలను తెలుసుకోవాలని భావించాను.  ఈ పథకం గురించి నేను చాలా సార్లు ప్రస్తావిస్తుంటాను.  అయితే, ఉజ్జ్వల యోజన లబ్ధిదారులను నేరుగా కలుసుకున్నప్పుడు వారు నాకు ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు.  అది ఏమిటంటే.. ఈ పథకం నీటి పొదుపు నకు ఎంతగానో తోడ్పడిందట.  అప్పుడు- ‘‘నీరు పొదుపు చేయడానికి అది ఎలా దోహదపడింది ?’’ అని వారిని నేను అడిగాను.  వారేం చెప్పారంటే- ‘‘కట్టెల పొయ్యి మీద వంట చేసే రోజులలో పాత్రలన్నిటికీ మసి పట్టేసి నల్లగా తయారయ్యేవి.  వాటిని రోజు కు నాలుగు సార్లు తోమితే గానీ మళ్లీ మామూలుగా చూడలేం.  అందువల్ల బోలెడన్ని నీళ్లు కావాల్సి వచ్చేవి.  ఇప్పుడు మాకు గ్యాస్ పొయ్యి ఉంది కాబట్టి అంత శ్రమ గాని, అన్ని నీళ్లు గాని అవసరం లేదు’’ అని బదులిచ్చారు.  వారితో ప్రత్యక్షంగా మాట్లాడకుండా ఈ వాస్తవాన్ని నేను అర్థం చేసుకోగలగడం నమ్మశక్యం గాని విషయం.  ఇటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. నేను ఇలా స్వయంగా ఇలాంటి వారితో మాట్లాడడంలో భాగంగా ఇవాళ ప్రధాన మంత్రి గృహనిర్మాణ పథకం (PMAY) లబ్ధిదారులైన మీతో సమావేశమయ్యాను.  ఎవరి ఇల్లు వారి కళ్ల ముందే నిర్మించి ఇవ్వబడిందో లేక తమ ఇంటి నిర్మాణంలో స్వయంగా పాలుపంచుకున్న వారు ఎవరో లేక త్వరలో పూర్తి కాబోయే తమ సొంత ఇంట్లో చేరబోయే వారు ఎవరో.. అలాంటి మీ అందరితో చర్చించే అవకాశం లభించింది.

ప్రతి ఒక్క వ్యక్తికి నాకంటూ ఒక ఇల్లు ఉండాలని కలలుగంటారు.  అత్యంత నిరుపేదలు కూడా ఎంత చిన్నదైనా సొంత గూడు కోసం పరితపిస్తారు.  ఓ ఇంటి కి యజమాని కావడం లోని ఆనందం ఏమిటో సొంత ఇల్లు ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది తప్ప ఇతరులకు తెలియదు.  నేను ఇవాళ ఈ సాంకేతిక సదుపాయం ద్వారా మిమ్మల్ని అందరినీ టీవీ లో చూస్తూ ఉంటే సొంత ఇంటికి యజమానులైన మీ మోములో ఆనందం నాకు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  మీలో ఉరకలెత్తుతున్న నూతనోత్సాహం, కళ్లలో సంతృప్తి.. అన్నీ పొంగిపొర్లడం స్పష్టంగా చూస్తున్నాను.  మీ ఆనందాతిరేకాన్ని చూస్తూ ఉంటే నాలోనూ హర్షం పదింతలు అవుతోంది.  దాంతో ప్రజల కళ్లలోని ఆనందాన్ని చూడడం కోసం మరింత శ్రమించాలన్న ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది.  సొంత ఇంటిని చూసుకున్నాక మీలో కలిగిన సంతృప్తి, సంతోషమే నా ఈ ఆనందానికి కారణం.

గృహనిర్మాణ పథకం అంటే కేవలం తల దాచుకొనేందుకు గూడు ను కల్పించడం కాదు.  అలాగే నాలుగు గోడలతో, పైకప్పు తో సరిపెట్టేది కాకూడదు.. ఇల్లు అంటే అందులో నివసించే వారికి అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉండాలి.  ఆ ఇంటి తో ముడిపడ్డ కుటుంబం లోని సభ్యులందరి కలలకు ప్రతిరూపంగా, సంతోషం కలిగించేదిగా ఉండాలి.  ప్రధాన మంత్రి గృహనిర్మాణ పథకం వెనుక లక్ష్యం ఇదే.  సొంత ఇల్లు ప్రతి పౌరుడి స్వప్నం.  ఓ పక్కా ఇంటి యజమాని ని అనిపించుకోవాలన్న ఆకాంక్ష అత్యంత పేదవారికీ ఉంటుంది.  కానీ, స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం అనేక సంవత్సరాల పాటు ఈ కోరిక కలలోనైనా తీరనిదిగానే మిగిలిపోయింది.  ఈ పరిస్థితుల నడుమ మా ప్రభుత్వం ఒక ప్రతినను పూనింది.  ‘‘మన దేశం స్వాతంత్ర్యం సముపార్జించుకొని 2022 కల్లా 75 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది.  ప్రగతి బాటలో ప్రతి ఒక్కరు పరుగు తీయాలనే సందర్భాలు అనేకం వస్తుంటాయి.  చూడు సోదరా, ఆ మేరకు ఈ 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి మనం ఏదైనా సాధించాలి.. ఏదో ఒకటి కాకుండా మరింత మెరుగైంది ఏదో అది చేద్దాం.. ఏదైనా మంచి పని.. అందరి శ్రేయస్సుకు దోహదపడే మంచి కార్యం సాధిద్దాం’’ అన్నదే ఆ ప్రతిజ్ఞ.

ఈ దిశగా మాకు లభించిన ఐదేళ్ల పాలన కాలానికిగాను నాలుగు సంవత్సరాల సమయంలో మా ప్రయత్నాలు మేం చేశాం.. ఈ నేపథ్యంలో 2022 కల్లా 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు సమీపిస్తాయి.  తదనుగుణంగా ముందుకు పరుగు తీయడానికి మేమూ సాహసంతో అడుగులు వేస్తూ కొంత పనిచేయాలని తలపెట్టాం.  అందులో భాగంగానే 2022లో భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్యం పూర్తి చేసుకునే నాటికి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఉండాలన్న స్వప్నాన్ని సాకారం చేయాలని సంకల్పించాం.  వారు పట్టణాల్లో లేదా పల్లెల్లో; మురికివాడలో లేదా పాదచారుల బాట మీద.. ఎక్కడ నివసిస్తున్నారన్న తేడా లేకుండా సొంత పక్కా ఇంటిని సమకూర్చాలని నిర్ణయించాం.  ఇది కేవలం ఇల్లులా కాకుండా ‘సౌభాగ్య’ పథకం కింద దానికి విద్యుత్తు సదుపాయం ఉండాలి.  మంచినీటి కొళాయితో పాటు అందులో నిత్యం నీరు వచ్చేలా ఉండాలి.  ప్రతి ఇంటికీ ఒక గ్యాస్ స్టవ్ ఉండాలి.  ఓ మరుగుదొడ్డి కూడా ఉండి తీరాలి.  అలాంటి జీవించదగ్గ ఇంట్లో నివసిస్తున్నామన్న సంతృప్తి కలగాలి.  ఇక ఏదో ఒకటి చేసి జీవన గమనంలో ముందడుగు వేయాలి.  ఆ మేరకు నిరుపేద విశ్రాంతి తీసుకునే సౌకర్యం కల్పించడం ఒక్కటే చాలదు.  తన కుటుంబానికి గౌరవ మర్యాదలు ఆర్జించుకునే అవకాశం లభించాలి.  ఇలాంటి ఆశయం ఇతివృత్తంగానే ‘‘అందరికీ ఇల్లు’’ అనే స్వప్నానికి రూపాన్ని ఇవ్వాలని నిశ్చయించాము.  ఇది మాకు ఒక పవిత్రమైనటువంటి సంకల్పం కూడాను.  అంటే- మీ కలలు మావి.. అంతేకాదు- మీ కలలు ఈ దేశాన్ని పాలించే ప్రభుత్వ కలలు కూడా అయ్యాయి.

కోట్ల కొద్దీ జనాభా గల ఇంత పెద్ద దేశంలో ఈ స్వప్నం నెరవేరడం అనుకున్నంత సులభ సాధ్యం ఏమీ కాదు.  ఇది ఎంతో కఠినమైన, సవాలును విసరేటటువంటి కార్యం.  పైగా ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన అనుభవాలు ఇది దాదాపు అసాధ్యం అంటున్నాయి.  ఏదేమైనా, ఇలాంటివి అనేక ఉదాహరణలు ఉన్నప్పటికీ ఇది నిరుపేద మానవుడి జీవితం.  సొంత ఇల్లు అంటూ లేకుండా దుర్భరమైన జీవనాన్ని గడుపుతూ వచ్చిన నిరుపేదల జీవన స్థితిగతులే అందరికీ గృహ వసతిని కల్పించాలని నేను నిర్ణయించుకోగల ధైర్యాన్ని ఇచ్చాయి.  మీ అందరి మీదా నాకు గల ప్రేమాభిమానాల తోనే నేను ఇంతటి భారీ నిర్ణయాన్ని తీసుకొన్నాను.  తదనుగుణంగా దాని అమలుకు ప్రభుత్వ యంత్రాంగం అంకితం అయింది.  ఇందులో ఇతర భాగస్వాములు కూడా ఉన్నారు.  పనులు మొదలు అయ్యాయి.. అయితే, ఈ బృహత్ లక్ష్య సాధన కు ఆత్మస్థైర్యం ఒక్కటే సరిపోదు.. అన్నీ ప్రణాళికబద్ధంగా సాగాలి.  అందుకు ఎంతో వేగం తోడు కావాలి.  వీటన్నింటితో పాటు ప్రజల విశ్వాసం, మద్దతు ఉండాలి.  ప్రజల పట్ల చిత్తశుద్ధి మరింత ముఖ్యం.  ఈ విషయంలో మునుపటి ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొనడానికి ఏమాత్రం ప్రయత్నించిందో మీకందరికీ బాగా తెలుసు.  పనులు ఎలా చేశారో, ఎక్కడ ప్రారంభించి మరెక్కడ ఆగిపోయారో మీకు తెలియంది కాదు.

దీనికి సంబంధించి నేడు గొప్ప మార్పును తెచ్చామని నేను భావిస్తున్నాను.  ఇవాళ మేము పనులు మొదలుపెట్టాము.. ఆలయాల పేరిట, సమాజాల పేరిట, కొన్ని చోట్ల మురికివాడల పేరిట ఇళ్ల నిర్మాణాన్ని ఆరంభించాము.  కానీ, నానాటికీ పెరుగుతున్న జనాభా కారణంగా అది సరిపోదు అని స్పష్టం అయింది.  అందుకే ఈ పథకాన్ని వ్యక్తుల పేరిట, కుటుంబాల పేరిట రూపొందించాము.  అయితే, ఇటువంటి కార్యక్రమాలు పేదలకు గృహ వసతి కల్పన కన్నా ఎక్కువగా రాజకీయ లబ్ధిని ఆశించే సాగుతాయన్న భావన సహజం.  మరోవైపు దళారుల సైన్యం పుట్టుకురావడమేగాక ఈ పథకాలు కాంట్రాక్టర్లకు భారీ ఆర్జన మార్గాలు అయ్యాయి.  ఈ సవాలును అధిగమించేందుకు మేం విభిన్న మార్గాన్ని ఎంచుకున్నాము.  గృహనిర్మాణాన్ని విడివిడిగా చేపట్టడం కాకుండా ఉద్యమ స్థాయి లో  ప్రారంభించాలని నిర్ణయించాము.  ఆ మేరకు 2022 కల్లా గ్రామీణ ప్రాంతాలలో 3 కోట్ల ఇళ్లను, పట్టణ ప్రాంతాల్లో ఒక కోటి ఇళ్లను నిర్మించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నాము.  లక్ష్యం ఇంత భారీగా ఉన్నపుడు దానికి అవసరమైన కేటాయింపులు కూడా భారీగా ఉండడం సహజమే కదా.  ఒకనాడు బడ్జెటు కేటాయింపులకు అనుగుణంగా లక్ష్యాలు నిర్ణయించే వారు.  కానీ, ఇప్పుడు మొదట అత్యవసరమైంది ఏదన్నది గ్రహించి, అందులో దేశానికి ఏది ముందు కావాలో నిర్దేశించుకొని దాని ఆధారంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొంటున్నాము.  దానికి తగినట్లుగానే బడ్జెటు ను కేటాయిస్తున్నాము.  ఫలితం ఎలా ఉంటుందో మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు.. ఇక  మునుపటి ప్రభుత్వాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకొంటే.. పేదల పేరిట అది ఎటువంటి ఆటలను ఆడిందో మనకు తెలిసిందే.

పది సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని నడిపిన యుపిఎ హయాములో దశాబ్ద కాలం పాటు  13.5 లక్షల ఇళ్లు మంజూరు అయ్యాయి.  దీనితో పోలిస్తే నాలుగు సంవత్సరాల లోనే మేము అంతకు నాలుగు రెట్లు అధికంగా- దాదాపు 47 లక్షల ఇళ్లను మంజూరు చేశాము.  త్వరలోనే ఈ సంఖ్య అర కోటి.. అంటే 50 లక్షల.. స్థాయిని దాటిపోనుంది.  ఇక ఇప్పటి దాకా మేము మంజూరు చేసిన ఇళ్లలో 7 లక్షల మేర అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించబడ్డాయి.  గృహ నిర్మాణ రంగం లో కొత్త సాంకేతిక విజ్ఞానానికి ప్రాముఖ్యం ఇచ్చిన నేపథ్యంలో తక్కువ ధర ఇళ్ల నిర్మాణం లోనూ దీన్ని వినియోగించేలా అంతర్జాతీయ గృహకల్పన సవాలు కు శ్రీకారాన్ని చుట్టాము.  అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే మునుపటి ప్రభుత్వ హయాము లోని చివరి నాలుగు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా సుమారు 25.5 లక్షల ఇళ్లు నిర్మిస్తే అదే వ్యవధిలో మేము కోటికి పైగా ఇళ్లను నిర్మించాము.  అంటే ఏకంగా 325 శాతం ఎక్కువన్న మాట.  ఇంతకుముందు ఒక ఇంటి నిర్మాణానికి నిర్దేశించిన గడువు 18 నెలలు కాగా, ఈ పథకానికి గల ప్రాధాన్యం దృష్ట్యా మేము ఆ గడువును 12 నెలలకు తగ్గించి పనుల వేగాన్ని పెంచాము.  అందుకు తగినట్లుగా 18 నెలలు పట్టే పనిని ఆరు నెలలు ముందుగానే పూర్తి చేయాలని సంకల్పించాము.

ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే సంవత్సరాని కన్నా ముందే ఇంటి నిర్మాణం పూర్తి అయిపోతోంది.  ఆ మేరకు ఇవాళ నిర్మాణ వేగం పెంచబడింది.  ఇది ఎలా సాధ్యం అయ్యిందో చూద్దాము..  ఇటుకలను, రాళ్లును అమిత వేగంగా ఒకదానిపై ఒకటి పేర్చివేసి ఇంటి నిర్మాణం అయిపోయిందంటే సరిపోదు. ఇందుకోసం నిర్దేశించిన ముందస్తు ప్రణాళిక ప్రకారం ప్రతి దశలోనూ తీసుకోవాల్సిన చర్యలను నిర్ధారించాం. అలాగే నిర్మాణంలో ప్రమాణాలను మాత్రమే కాకుండా ఇంటి పరిమాణాన్ని కూడా పెంచాం. ఇంతకుముందు గ్రామాల్లో 20 చదరపు మీటర్ల స్థలంలో ఒక ఇల్లు వంతున నిర్మించాలని నిబంధనలు రూపొందించారు.  కానీ, అధికారంలోకి వచ్చాక మేము ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగంగా ఈ విస్తీర్ణాన్ని 25 చదరపు మీటర్లకు పెంచాము.  కేవలం 5 చదరపు మీటర్లు పెంచితే ప్రయోజనం ఏమిటని మీరు ఆశ్చర్యపోతూ ఉండవచ్చు.  ఇందులో అత్యంత ఉపయోగకరమైంది ఏమిటంటే ఒక పరిశుభ్రమన, ప్రత్యేకమైన వంటిల్లు సమకూరడం.

ఇక పిఎంఎవై లో భాగంగా మునుపు గ్రామాలలో ఒక ఇంటి నిర్మాణానికి రూ.70- 75 వేల వంతున ఆర్థిక సహాయం ఇచ్చే వారు.  మేము ఆ మొత్తాన్ని రూ.1.25 లక్షలకు పెంచాము.  దీంతోపాటు నిర్మాణ వేతన వ్యయం కోసం ఉపాధి హామీ పథకం లో భాగంగా 90- 95 రోజుల మొత్తాన్ని ప్రతి లబ్ధిదారు ఖాతా లో జమ చేస్తున్నాము.

అదనంగా, మరుగుదొడ్డి నిర్మాణం కోసం మరో రూ.12వేలు అందిస్తున్నాము.  ఇంతకుముందు రాజకీయ నేతల దళారుల ఇళ్లు తప్ప పేదల ఇళ్లు నిర్మించబడేవి కాదన్నది మనందరి అనుభవం.  కానీ, పేదల కోసం ఉద్దేశించిన నిధులను మరెవరూ అలా స్వాహా చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాము.  ఆ విధంగా ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డిబిటి) విధానంతో ఇవాళ దళారులు రూపుమాసిపోయారు.  ఆర్థిక సహాయంగా అందజేస్తున్న సొమ్ము నేరుగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమ అవుతోంది.  మొదట మేము జ‌న్‌ ధ‌న్‌ ఖాతాలను తెరిపించాము.  అటుపైన ఆ ఖాతాలలో సొమ్మును వేయడం మొదలుపెట్టాము.  ఇక పిఎంఎవై  కింద లబ్ధిదారు కోసం నిర్మించే ఇళ్లకు భౌగోళిక గుర్తింపును ఇస్తూ ఏర్పాట్లు చేసి పూర్తి పారదర్శకతకు వీలు కల్పించాము.  ఇళ్ల నిర్మాణం తదితర పనులను మీరే పర్యవేక్షించే విధంగా ‘డిఐఎస్ హెచ్ ఎ’ (దిశ) పోర్ట‌ల్‌ తో అనుసంధానం చేశాము. మీరే కాదు.. నేను కూడా నా కార్యాలయం నుండి పనులు ఎక్కడ, ఎలా సాగుతున్నదీ పరిశీలించేందుకు వీలు ఉంటుంది.  నా కుర్చీలో కూర్చుని అన్ని వివరాలనూ క్షుణ్నంగా తనిఖీ కూడా చేయవచ్చు.

యుపిఎ ప్రభుత్వ హయాములో వృద్ధ రాజకీయ నాయకులు తయారుచేసిన ‘‘దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న’’ (బిపిఎల్) వారి జాబితా ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసే వారు.  కానీ, మేము సామాజిక, ఆర్థిక, కుల గణన ప్రాతిపదికగా ఆ పని చేయడం ప్రారంభించాము.  దీని ఫలితంగా మునుపు వదలివేయబడిన పేదలకూ ఇల్లు పొందే అవకాశం లభించింది.  అంతేకాక ఈ పథకం ద్వారా పేదలు గరిష్ఠ సంఖ్యలో లబ్ధి ని పొందుతున్నారు.. దీనితో ప్రతి ప్రాంతంలోని, ప్రతి వర్గం లోని పేదలు లబ్ధిదారులు అవుతున్నారు.  ఇల్లు ఒక అవసరం మాత్రమే కాక మన్ననతోను, స్వీయ గౌరవంతోను ముడిపడి ఉంటుంది.  సొంత ఇల్లు అంటూ ఏర్పడిన తరువాత కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆలోచన ధోరణి కూడా మారుతుంది.  తదనుగుణంగా ప్రగతి పథంలో ముందడుగు వేసేందుకు కొత్త ధైర్యం వస్తుంది.  కాబట్టే ప్రతి కుటుంబం యొక్క ఇంటి అవసరాన్ని తీర్చాలని, తద్వారా వారి పరువు ప్రతిష్ఠలు ఇనుమడింపజేయాలని మేము సంకల్పించాము.  ఆ దిశగా పిఎంఎవై కింద ప్రత్యేకించి సమాజం లోని బలహీన వర్గాలపై, మహిళలపై దృష్టిని సారించాము.  వారు గిరిజనులు కావచ్చు లేదా వెనుకబడిన లేదా షెడ్యూల్డు కులాలు/తెగల వారు కావచ్చు లేదా అల్పసంఖ్యాకవర్గాలు  కావచ్చు, దివ్యాంగ సోదరీమణులు మరియు దివ్యాంగ సోదరులు కావచ్చు..  ఆయా వర్గాలకు తగిన ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం ముందుకు సాగిపోతోంది.  నేడు సమగ్ర స్థాయి లో సంయుక్తంగా సాగుతున్న ఈ కృషి ఫలితంగా ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది.  మేము ఎన్నడూ నేలను విడచి సాము చేయం.  సామాన్యుడి కష్టాలు, సమస్యలు ఏమిటన్నది మాకు బాగా తెలుసు.  కాబట్టే వారి అవసరాలు ఏమిటో గుర్తించి అందుకు తగినట్లు పని చేసుకుపోతున్నాము.  ప్రతి పథకం ప్రత్యేక పద్ధతిలో అమలు కావాలన్నది ప్రభుత్వ విధానాల్లో సహజం.  కానీ, ఇంతకుముందు రెండు మంత్రిత్వ శాఖల మధ్య గానీ, రెండు విభాగాల నడుమ గానీ, రెండు పథకాల మధ్య గానీ సమన్వయం ఉండేది కాదు.

ఈ పరిస్థితిని చక్కదిద్దుతూ అనేక ప్రభుత్వ పథకాలను ప్రధాన మంత్రి గృహనిర్మాణ పథకం తో గుదిగుచ్చాము.  ఇళ్ల నిర్మాణంతో పాటు ఉపాధికి అనుగుణంగా దీన్ని మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంతో అనుసంధానించాము.  ప్రతి ఇంటికీ మంచినీరు, వంటగ్యాస్, మరుగుదొడ్డి వంటి సదుపాయాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాము. ఆ మేరకు ‘పరిశుభ్ర భారతం’ కార్యక్రమంతో జోడించి ఇంటింటికీ మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండే విధంగా చూస్తున్నాము.  విద్యుత్తు సౌకర్యం కోసం ‘పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ జ్యోతి యోజన, సౌభాగ్య యోజన’లతో ముడిపెట్టాము.  రక్షిత మంచినీటిని అందించేందుకు వీలుగా గ్రామీణ నీటి సరఫరా కార్యక్రమానికి జోడించాము.  వంటగ్యాస్ సదుపాయం కోసం ఉజ్జ్వల పథకం తో సంధానించాము.  ఇలాంటి సదుపాయాలతో కూడిన ఇల్లు ఒక్క గృహనిర్మాణానికే పరిమితం కాదు..  అన్ని విధాలా సాధికారిత కు ఇది ఒక ఉపకరణం.  ఇక పట్టణ ప్రాంతాల లబ్ధిదారులలో 70 శాతానికి పైగా మహిళలే ఉన్నారు.

ఇది కొత్త ఉపాధి మార్గాలను సృష్టిస్తున్న కారణంగా మునుపటితో పోలిస్తే నేడు తక్కువ కాలం లోనే ఎక్కువ ఇళ్లను నిర్మించగలుగుతున్నాము.

ఇటుక నుండి ఇసుక, సిమెంటు ల దాకా ప్రతి నిర్మాణ సామగ్రి సంబంధిత వ్యాపారం స్థానిక స్థాయిలో వృద్ధి చెందుతోంది.  స్థానిక కూలీలకు, తాపీ మేస్త్రీలకు పని దొరుకుతోంది.  దీనికి తోడు గ్రామాలలో నాణ్యమైన రీతిలో పనులు సాగేందుకు వీలుగా ప్రభుత్వం లక్షమంది తాపీ మేస్త్రీలకు శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది.  కొన్ని రాష్ట్రాలలో పురుష మేస్త్రీలతో పాటు మహిళా మేస్త్రీలు కూడా శిక్షణ పొందుతున్నారని తెలిస్తే మీరు కూడా సంతోషిస్తారు.  మహిళా సాధికారిత దిశగా ఇది ఒక కీలకమైన ముందంజ.

పట్టణ ప్రాంతాలలో మరింత మందిని భాగస్వాములను చేయడం కోసం ప్రభుత్వం ఈ పథకానికి నాలుగు నమూనాలను జోడించింది.  ప్రధాన మంత్రి గృహనిర్మాణ పథకంలో భాగంగా పట్టణ ప్రాంతాల లబ్ధిదారులకు రూ.1.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తోంది.  ఈ మొత్తంతో వారు కొత్త ఇంటిని నిర్మించుకోవచ్చు లేదా ఉన్న ఇంటిని విస్తరించుకోవచ్చు.

అలాగే అనుబంధ రాయితీ పథకంలో భాగంగా ఇంటి రుణంపై చెల్లించే వడ్డీలో 3 నుంచి 6 శాతం రాయితీ కల్పిస్తోంది.  ప్రాంతీయ పునరాభివృద్ధి కోసం ఒక్కొక్క ఇంటికి 1 లక్ష రూపాయల వంతున సహాయాన్ని అందిస్తోంది.  ప్రభుత్వ రంగ సహకారంతో సరసమైన ధరలో ఇంటి నిర్మాణం కోసం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 1.5 లక్షల రూపాయల వంతున సహాయం చేస్తోంది.  ఇక మునుపటి పరిస్థితిని ఓసారి గుర్తుచేసుకుంటే… గృహ‌ నిర్మాతలకు డబ్బు ను ముట్టజెప్పడమే గాని నిర్మాణ స్థలంలో ఏళ్ల తరబడి ఒక్క ఇటుకైనా కనిపించని దు:స్థితి ఉండేది.  అందుకే… పేదలు, మధ్యతరగతి ప్రజలకు లబ్ధిని చేకూర్చడంతో పాటు ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వం సంకల్పించింది.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు వారి జీవితకాలపు పొదుపు సొమ్ము తో ఇళ్లను కొనుగోలు చేస్తూ ఉంటాయి.  ఈ వర్గాల వారందరికీ రక్షణ గా ప్రభుత్వం స్థిరాస్తి రంగ నియంత్రణ చట్టం (ఆర్ ఇఆర్ ఎ) ను తీసుకువచ్చింది.  ఇక ఈ వర్గాల వారిని ఎవరూ మోసం  చేయలేరు.. ఇలా పారదర్శకత కు పెద్ద పీటను వేయడమే కాకుండా ఇళ్ల కొనుగోలుదారులకు హక్కులు కూడా కల్పించబడ్డాయి.. తద్వారా కొనుగోలుదారులను మోసం చేయాలని చూసే గృహ‌ నిర్మాతలు భయపడవలసిన పరిస్థితిని తీసుకువచ్చాము.

కనుకనే ఇవాళ ఈ పథకం వారి ఆశలకు, ఆకాంక్షలకు భరోసా ఇచ్చింది అనేందుకు అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి.  సొంత ఇల్లు ఉండాలన్నది ప్రతి ఒక్కరి ప్రాథమ్యం.  ఇల్లు ఉందంటే భద్రతతో పాటు, సౌభాగ్యంతో పాటు అందరి ఆరోగ్యానికీ భరోసా కూడా ఉంటుంది.  సొంత ఇల్లు ప్రతి వ్యక్తికీ తొలి ప్రాధాన్యం.. ఇది ఇంతకుముందూ ఉన్నదే.  దురదృష్టవశాత్తూ ఈ ప్రథమ ప్రాధాన్యం జీవితపు చివరి అంకంలో గానీ సాకారం అయ్యేది కాదు.  కానీ, ఇప్పుడు ఈ పరిస్థితి ఎంతమాత్రం లేదు.

‘ఇల్లు కట్టి చూడు’ అన్న నానుడిని మనం చాలా సార్లు వింటూ ఉంటాము.  అంటే ఇల్లు కట్టుకోవడానికి ఒక జీవిత కాలం పడుతుందన్న మాట!  అయితే, ఇది విభిన్నమైన ప్రభుత్వం.. అందుకే దేశంతో పాటు సామెతలు కూడా మారిపోతున్నాయి.. మార్చవలసిన కాలం కూడా సమీపించింది.  ప్రస్తుతం ‘మన జీవితాలను మన యొక్క సొంత ఇళ్లలోనే గడుపుతాం’ అనేటటువంటి మాటలు మన హృదయాంతరాళంలో నుండి వినిపించాల్సిన తరుణం ఆసన్నమైంది.

ఏదిఏమైనా ఇదొక భారీ వ్యవస్థ గనుక పాత అలవాట్లు మార్చుకోలేని వ్యక్తులు కొందరు ఉంటారన్నది నా నమ్మకం.  అయితే, నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా- ఈ పథకం లో భాగంగా లబ్ధి ని చేకూర్చేందుకు ఎవరైనా ప్రతిఫలం ఆశించినా, లంచం ముట్టజెప్పాలని పట్టు బట్టినా ఏమాత్రం వెనుకాడకుండా అలాంటి వారిపై ఫిర్యాదు చేయండి.  ఇలాంటి అంశాలపై మీరు కలెక్టర్ కు లేదా మంత్రి కి కూడా ఫిర్యాదును చేయవచ్చు.  అయితే, ఇలాంటి పథకాల తోనే భారతదేశం యొక్క స్వప్నాలు, ఆకాంక్షలు సాకారం అయిపోవు.  ఈ మాటలను నేను ఇదివరకు కూడా చెప్పాను.  ఇందుకోసం మేము బలమైన పునాదిని వేశాము.. ఇక ఆకాశమే హద్దుగా ముందుకు సాగిపోదాము.  ‘‘అందరికీ ఇల్లు, అందరికీ విద్యుత్తు, అందరికీ బ్యాంకు సేవలు, అందరికీ బీమా, అందరికీ వంటగ్యాస్’’ల వంటివి సాకారమైతేనే ‘న్యూ ఇండియా’ సంపూర్ణ రూపంలో సాక్షాత్కరిస్తుంది.  అన్ని గ్రామాలు.. యావత్తు సమాజం ఆధునిక సదుపాయాలతో విలసిల్లాలన్న ఆశయం దిశగా మేము ముందుకు పోతున్నాము.  అందుకే ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన సోదరీమణులతోను, సోదరులతోను సంభాషించే అవకాశం నాకు దక్కింది.  ఇప్పుడు నేను మీకు ఒక చిన్న వీడియో ను చూపించదలచుకొన్నాను.. ఆ తరువాత మీరు మీ యొక్క అభిప్రాయాలను నాకు వినిపించవచ్చు.