పిఎంఇండియా
జమీయత్- ఉలేమా- ఎ హింద్ నేతృత్వంలో 25 ముస్లిం సముదాయ నాయకులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమయ్యారు.
ప్రతినిధి వర్గానికి జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజీత్ డోభాల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచం యావత్తూ ఈ రోజు భారతదేశం వైపు చూస్తోందని, ఈ సమయంలో దేశాన్ని ముందుకు తీసుకుపోవలసిన బాధ్యత భారతీయ సమాజంలోని అన్ని వర్గాల పైనా ఉందన్నారు.
ప్రతినిధి వర్గంలోని నాయకులు శ్రీ డోభాల్ అభిప్రాయంతో ఏకీభవించారు. ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’’ అంటూ ప్రధాన మంత్రి పిలుపు ఇచ్చినందువల్ల దానికి అనుగుణంగా దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించడమే ధ్యేయం కావాలని వారు అన్నారు.
ప్రధాన మంత్రి కనబరచిన దార్శనికతను ప్రతినిధి వర్గం సభ్యులు ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ప్రజలలో ఆయన పట్ల నెలకొన్న విశ్వాసం సమాజంలోని అన్ని వర్గాలు సమృద్ధి చెందేటట్లు, అభ్యున్నతి సాధించేటట్లు చూడగలదన్న ఆశను వారు వ్యక్తం చేశారు. న్యూ ఇండియా ఆవిష్కారంలో సమాన భాగస్వామి కావాలన్న ఆతురత ముస్లిం సముదాయంలో ఉందని వారు చెప్పారు.
ఉగ్రవాదం ఒక ప్రధాన సవాలు గా పరిగణించిందంటూ, దీనితో పోరాడడానికి తమ శక్తినంతా ఉపయోగించాలని ఉమ్మడి సంకల్పాన్ని వ్యక్తం చేశారు. దేశ భద్రతతో గాని, దేశ క్షేమం విషయంలో గాని ఎట్టి పరిస్థితులలో ఎవరూ రాజీ పడకుండా చూడడం ముస్లిం సముదాయం యొక్క బాధ్యత అని వారు పేర్కొన్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా జరిగే ఎటువంటి కుట్రనైనా ముస్లిం సముదాయం ఎన్నటికీ అనుమతించబోదని వారు స్పష్టంచేశారు.
కశ్మీర్ లోయ లోని పరిస్థితి పట్ల ప్రతినిధి వర్గ సభ్యులు ఆందోళనను వ్యక్తం చేస్తూ, ఈ సమస్యను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక్కరే పరిష్కరించగలరన్నారు.
మూడు సార్లు తలాక్ అంటూ పలికే అంశంపై ప్రధాన మంత్రి అనుసరించిన వైఖరిని వారు ప్రశంసించారు.
విద్యాసంస్థలతో సంబంధం ఉన్న ప్రతినిధి వర్గంలోని సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన నగదు రహిత లావాదేవీలు, స్టార్ట్- అప్ సంస్థల వంటి కార్యక్రమాలతో పాటు నీతి ఆయోగ్ ఇటీవల నిర్వహించిన హ్యాక థాన్ లో వారి విద్యా సంస్థలు సాధించిన పురోగతిని కూడా వివరించారు.
అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తీరును సైతం ప్రతినిధి వర్గం అభినందించింది.
ప్రధాన మంత్రి ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ, సామరస్యం, మైత్రి అనేవి ప్రజాస్వామ్యం యొక్క గొప్ప బలం అన్నారు. పౌరుల మధ్య వివక్షను చూపే హక్కు ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశపు ప్రత్యేకత అన్నారు. భారతదేశ నవతరాన్ని అంతర్జాతీయంగా విస్తరిస్తున్న ఉగ్రవాదం ప్రభావంలో పడనివ్వకూడదని ఆయన అన్నారు.
మూడు సార్లు తలాక్ అంటూ పలికే విషయమై ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ విషయాన్ని రాజకీయం చేయడాన్ని ముస్లిం సముదాయం అనుమతించకూడదని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో సంస్కరణను మొదలుపెట్టే బాధ్యతను తీసుకోవాలని ఆయన ప్రతినిధివర్గ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రతినిధి వర్గం సభ్యులలో జమీయత్- ఉలేమా- ఎ హింద్ అధ్యక్షుడు మౌలానా శ్రీ ఖరీ సయ్యద్ మొహమ్మద్ ఉస్మాన్ మన్సూర్ పురి, జమీయత్- ఉలేమా- ఎ హింద్ ప్రధాన కార్యదర్శి మౌలానా శ్రీ మహమూద్ ఎ. మదాని, ముంబయి లోని అంజుమన్-ఎ-ఇస్లామ్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీ జహీర్ ఐ కాజి, ప్రొఫెసర్ శ్రీ అఖ్తరుల్ వాసే లతో పాటు మౌలానా శ్రీ బదారుద్దీన్ అజ్మల్ లు ఉన్నారు.
Had fruitful discussions on a wide range of subjects with leaders of the Jamiat Ulama-i-Hind. https://t.co/oB4QZpTMgx
— Narendra Modi (@narendramodi) May 9, 2017