Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మొజాంబిక్ లో పర్యటించిన సందర్భంగా ఏర్పాటైన విందులో ఆయన ఇచ్చిన ఉపన్యాసం పూర్తి పాఠం (జులై 07, 2016)

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మొజాంబిక్ లో పర్యటించిన సందర్భంగా ఏర్పాటైన విందులో ఆయన ఇచ్చిన ఉపన్యాసం పూర్తి పాఠం (జులై 07, 2016)


యువర్ ఎక్స్ లెన్సీ, అధ్యక్షుడు శ్రీ ఫిలిప్ న్యూసీ,

సోదర సోదరీమణులారా,

ఎక్స్ లెన్సీ, మీ దయాపూరిత వచనాలు విని నేను చలించిపోయాను. మొజాంబిక్ – భారత దేశం బాంధవ్యానికి ఉన్న శక్తికి సంబంధించి మీరు వెల్లడించిన ఆలోచనలకు ఇవే నా కృతజ్ఞతలు. అలాగే, మొజాంబిక్ ప్రజలూ, ప్రభుత్వమూ అందించిన ఆప్యాయభరిత స్వాగతానికీ, ఇంకా ఉదారతాపూర్వక ఆతిథ్యానికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను.

ఎక్స్ లెన్సీ, మన దేశాల మధ్య ఉన్న సంబంధం కొత్తది ఏమీ కాదు. భారతీయ మూలాలు కలిగిన వేలాది ప్రజలు మొజాంబిక్ ను వారి స్వదేశంగానే చెప్పుకుంటూ ఉంటారు. భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో నివసిస్తున్న సిద్దీ సముదాయానికి చెందినవారిలో అనేకుల పూర్వీకులు మొజాంబిక్ వారే అన్న సంగతి కూడా నా దృష్టికి వచ్చింది. మన ప్రజలను, వారి ఆలోచనలను, సంప్రదాయాలను, సంస్కృతిని, మరియు వాణిజ్యాన్ని జోడించిన ఎంతో పురాతనమైన బంధాలకు సజీవ సాక్ష్యమే ఈ సముదాయాలు.

ఎక్స్ లెన్సీ, మన ఉభయ దేశాలూ వలస పాలనలో మగ్గినవే. మొజాంబిక్ విషయానికి వస్తే, ఈ దేశానిది సుదీర్ఘమైన పోరాటం. వలస పాలన నుండి మొజాంబిక్ విముక్తం కావాలని బిగ్గరగా వాదించిన దేశాలలో స్వతంత్ర భారతదేశం కూడా ఒకటి. మొజాంబిక్ 1975 లో స్వేచ్ఛాయుత దేశాల సరసన చేరినందుకు మేమెంతో గర్విస్తున్నాం.

మరి ఈ రోజు, ఇటీవలి దశాబ్దాలలో ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో మొజాంబిక్ ఒకటిగా నిలువడాన్నిమేము ప్రశంసిస్తున్నాము. ఎక్స్ లెన్సీ, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా మనం ఒకే విధమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నాము. ఈ కారణంగానే అభివృద్ధిలోను, ఆర్థికపరమైన అంశాలలోను మన భాగస్వామ్యమనేది మన సంబంధాల్లో ఓ కీలకమైన భాగంగా మారిపోయింది.

మన వ్యాపారం, పెట్టుబడి పరమైన బంధాలు.. మరీ ముఖ్యంగా గత కొన్నేళ్లుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. దీనిని మరింత పటిష్ట పరచుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఇందుకోసం భారత దేశం తన అనుభవాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని, రాయితీలతో కూడిన పరపతిని మొజాంబిక్ తో మొజాంబిక్ ప్రాధాన్యాలకు అనుగుణంగా పంచుకోవడానికి నిబద్ధతతోను, సంసిద్ధంగాను ఉన్నది.

మొజాంబిక్ గత సంవత్సరం ఒక స్వతంత్ర దేశంగాను, మాతో దౌత్య సంబంధాలను ఏర్పరుచుకున్న దేశంగాను 40 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నది. అంతే కాదు, మన రెండు దేశాలకు మధ్య ఇదివరకు ఎరుగని అన్యోన్యత కూడా ఏర్పడింది కూడా కిందటి సంవత్సరమే. 2015 ఆగస్టులో మీరు భారతదేశానికి ఆధికారిక పర్యటనకు తరలి రావడం ఇందులోని విశేషం. దీని తరువాత చెప్పుకోవలసింది ఏమిటంటే, మీ ప్రధాన మంత్రి ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ 3 వ సంచికకు హాజరై మమ్మల్ని గౌరవించారు. ఎక్స్ లెన్సీ, 34 సంవత్సరాలలో మొజాంబిక్ ను సందర్శించిన మొట్ట మొదటి భారతీయ ప్రధాన మంత్రిని నేనేనన్న సంగతిని నేనెరుగుదును. ఈ అంతరం ఇంత సుదీర్ఘంగా ఉండి ఉండకూడదు. భవిష్యత్తులో ఇలా జరగదు అనే నేను నమ్ముతున్నాను.

ఎక్స్ లెన్సీస్, సోదర సోదరీమణులారా,

ఈ మాటలతో మీరంతా ఇక నాతో విందుకు ముందుకు పదండి:

హిజ్ ఎక్స్ లెన్సీ, అధ్యక్షుడు శ్రీ ఫిలిప్ జసింతో న్యూసీ ఆరోగ్యం, ఆనందం, శ్రేయం కోసం, మొజాంబిక్ ప్రజల పురోగతి కోసం, వారి శాంతి, సౌభాగ్యాలు వర్ధిల్లడం కోసం, ఇంకా.. భారతదేశం, మొజాంబిక్ ల మధ్య స్నేహం- సహకారాల బంధం గట్టిగా పెనవేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ విందులో మనం పాలుపంచుకొందాము.