Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచాన్ని శాంతి వనంగా మార్చుదాం: వరల్డ్ సూఫీ ఫోరమ్ కార్యక్రమంలో శ్రీ నరేంద్ర మోదీ

ప్రపంచాన్ని శాంతి వనంగా మార్చుదాం: వరల్డ్ సూఫీ ఫోరమ్ కార్యక్రమంలో శ్రీ నరేంద్ర మోదీ


• మతం పేరిట హింసను వ్యాప్తి చేయడం మత విరుద్ధమైందే: ప్రధాన మంత్రి శ్రీ మోదీ

• హింసకు, మతానికి మధ్య ఎటువంటి లంకె ఉన్నా దానిని మనం తిరస్కరించే తీరాలి: ప్రధాన మంత్రి శ్రీ మోదీ

• వరల్డ్ సూఫీ ఫోరమ్ కార్యక్రమానికి విచ్చేసిన వారు తమ జీవనాన్నే శాంతి, సహనం, ప్రేమ లతో కూడిన సందేశంగా చేసి చాటుతున్న వ్యక్తులు: ప్రధాన మంత్రి

• సూఫీయులకు దైవ సేవ అంటే మానవ జాతికి సేవ చేయడం వంటిది: ప్రధాన మంత్రి శ్రీ మోదీ

• అల్లాహ్ కు ఉన్న 99 పేర్లలో ఏ ఒక్క పేరూ హింసను సూచించడం లేదు: ప్రధాన మంత్రి శ్రీ మోదీ

• సూఫీతత్వం అనేది శాంతి, సహజీవనం, సహానుభూతి, సమానత్వాల వాణి; విశ్వ మానవ సౌభ్రాతృత్వం వర్ధిల్లాలంటూ ఇచ్చిన పిలుపు అని ప్రధాన మంత్రి శ్రీ మోదీ అంటున్నారు.

• హింస, ఉగ్రవాదం ఈ కాలంలో అత్యంత విధ్వంసకర శక్తిగా మారిపోయాయి; ఈ తరుణంలో సూఫీతత్వం చాటి చెప్పే సందేశానికి ప్రపంచమంతటితోనూ సంబంధం ఉంది: ప్రధాన మంత్రి

• సూఫీ తత్వం చాటి చెప్పే సందేశం ఒక్క ఉగ్రవాదంపై పోరాటానికే పరిమితం కాదు, అది “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” పంథాను ఆవరించేదే: ప్రధాన మంత్రి

• ఉగ్రవాదంపై పోరు ఏ ఒక్క మతాన్నో డీకొట్టడం కాదు: ప్రధాన మంత్రి శ్రీ మోదీ

• ఉగ్రవాదంపై జరిపే పోరులో మన విలువల బలం తోను, మతాల నిజ సందేశంతోను గెలిచి తీరాలి: ప్రధాన మంత్రి

2016 మార్చి 17 గురువారం సాయంత్రం న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో ఏర్పాటైన ద వరల్డ్ సూఫీ ఫోరమ్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని ద ఆల్ ఇండియా ఉలేమా అండ్ మషాయిక్ బోర్డ్ నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి 20 దేశాల నుంచి అనేక అంతర్జాతీయ ప్రముఖులు హాజరు అవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఈజిప్టు, జోర్డాన్, టర్కీ, యునైటెడ్ కింగ్ డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, పాకిస్తాన్ తదితర దేశాల నుంచి ఆధ్యాత్మిక నాయకులు, పండితులు, విద్యావేత్తలు, వేదాంతులు తరలివచ్చారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తమ ప్రసంగంలో పలు విషయాలు ప్రస్తావించారు. సూఫీ తత్వానికి ఉన్న ఘనమైన, విశిష్టమైన చరిత్రను గురించి, సహనం, సహానుభూతిలకు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి, ఇంకా హింస, ద్వేష భావనలను ప్రేరేపించే శక్తులకు ఎదురొడ్డటం కోసం మానవతా శక్తులన్నీ ఏకం కావలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి తమ ప్రసంగంలో నొక్కిచెప్పారు. మతానికి, హింసకు మధ్య ఎటువంటి లంకె ఉండటానికి వీలు లేదంటూ ప్రధాన మంత్రి నిర్ద్వంద్వంగా ఖండించారు. మతం పేరుతో హింసను వ్యాపింపచేసే వారు మత వ్యతిరేకులే నని కూడా ఆయన స్పష్టంచేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగానికి విస్తృత స్థాయిలో ప్ర‌శంస‌లు ల‌భించాయి. విఖ్యాత వ్యాఖ్యాతలు ఈ ప్రసంగాన్ని మెచ్చుకొన్నారు.

ద వరల్డ్ సూఫీ ఫోరమ్ “ఎవరి జీవనమైతే దానంతట అది శాంతి, సహనం, ప్రేమ ల సందేశం అవుతున్నదో అటువంటి వారి కలయిక”గా తోచిందని ప్రధాన మంత్రి అభివర్ణించారు. “హింసకు చెందిన చీకటి నీడ అంతకంతకు పెద్దది అవుతున్న సమయంలో, మీరు ఒక కాంతిగానో లేదా ఆశా కిరణం గానో కనిపిస్తున్నారు. పసి వారి నవ్వును వీధులలో గర్జిస్తున్న తుపాకులు అణచిసిన వేళ మీరు గాయాలను మాన్పించే వాణిగా ఉంటున్నారు” అని ప్రధాన మంత్రి కార్యక్రమానికి హాజరైన సూఫీ పండితులు, ఆధ్యాత్మిక నాయకులతో చెప్పారు.

మానవ చరిత్రలో నిలచిపోయే ఒక పాఠాన్ని గురించి సూఫీ తత్వం స్పష్టంగా చెప్పింది.. అదేమిటంటే– దాపరికం లేని తనం, తెలుసుకోవాలనే తపన, సంప్రదింపులు, సర్దుబాట్లు, వైవిధ్యాన్నిఆదరించడం ద్వారానే మానవాళి ముందంజ వేస్తుందని, దేశాలు పురోగతిని సాధించగలవని, ప్రపంచం సౌభాగ్యవంతం అవుతుందని.

దీనినే మరింత సాకల్యంగా వివరిస్తూ, సూఫీయుల దృష్టిలో దైవానికి సేవ చేయడం అంటే మానవ జాతికి సేవ చేయడమే అని అర్థమని ప్రధాన మంత్రి అభిప్రాయపడ్డారు. “శ్రీ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ మాటలలో చెప్పాలంటే– ప్రార్థనలన్నింటిలోకెల్లా దేనివల్లనైతే అసహాయులకు, పేదలకు ఉపశమనం లభిస్తుందో.. అదే దైవానికి అత్యంత ఇష్టమైన ప్రార్థన” అని ప్రధాన మంత్రి అన్నారు.

సూఫీ తత్వం అందించిన సందేశాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఆ సందేశం ”ప్రతి ఒక్క వైపు నుంచి ప్రవహిస్తూ వచ్చే నదులు చివరకు ఒక మహా సముద్రంలో కలసి పోతాయ”ని హిందూ ధర్మంలో సాధువు ప్ర‌బోధించిన భ‌క్తి మార్గ సారాంశంతో సరిగ్గా సరిపోలుతోంది అన్నారు.

“ఇది మనకు మరో అంశాన్ని కూడా స్ఫురణకు తెస్తుంది. మనం అల్లాహ్‌కు గ‌ల 99 నామాల‌ను గురించి జ్ఞ‌ప్తికి తెచ్చుకొన్నామంటే, బలప్రయోగాన్ని, హింస‌ను గురించి వాటిలో ఏ ఒక్క‌టీ సూచించ‌డం లేదు. అల్లాహ్‌కు గ‌ల తొలి పేరు సహానుభూతికి, రెండో పేరు ద‌య‌కు సంకేతంగా ఉన్నాయి. అల్లాహ్ అంటే ర‌హ‌మాన్‌, అల్లాహ్ అంటే ర‌హీమ్ కూడా” అని ప్రధాన మంత్రి చెప్పారు. సూఫీ త‌త్వం శాంతికి, క్ష‌మ‌కు, సహజీవనానికి, క‌రుణ‌కు, స‌మాన‌త్వానికి ఒక ప్రతీక; విశ్వ మానవ సౌభ్రాతృత్వం వర్ధిల్లాలనే సందేశాన్ని అందిస్తోంది అని ఆయన అన్నారు.

ప్ర‌పంచ‌ సాంస్కృతిక వైభ‌వానికి మహనీయ భారత దేశం అందించిన ఒక గొప్ప కానుక‌ అయిన సమ్మిళిత సంస్కృతిని సూఫీ త‌త్వం ఎలా మరింత బలోపేతం చేసిందో ప్రధాన మంత్రి చెప్పుకొచ్చారు.

వేరు వేరు మతాలకు నిలయమైనప్పటికీ సమైక్యంగా మనుగడ సాగిస్తున్న భారతదేశంలో భిన్న మతాలను అవలంబించే పౌరులు భిన్న‌త్వంలోనే ఏక‌త్వాన్ని ద‌ర్శిస్తున్నారని, వారి కళ, పోరాట ప‌టిమ‌, త్యాగాలు, ధైర్యం, మేధస్సు, నైపుణ్యం ల సాయంతోనే ఈ దేశం అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తోంది అని ప్రధాన మంత్రి తెలిపారు.

ఉగ్రవాదం ప్రపంచానికంతటికీ ఒక పెను సవాలుగా మారిందని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఇంకా ఆయన “సూఫీ త‌త్వంలోని ఆధ్యాత్మిక ప్రేమ స‌రిహ‌ద్దులు దాటి ప్ర‌యాణం చేయాలి గాని, ఉగ్ర‌వాద హింస కాదు. అటువంటప్పుడే భార‌త‌దేశం శ్రీ అమిర్ ఖుస్రో చెప్పిన‌ విధంగా ఈ భూమిపైన స్వ‌ర్గంగా విల‌సిల్లుతుంది” అన్నారు. ఉగ్ర‌వాదం, తీవ్ర‌వాదం విప‌రీత‌మైన విధ్వంసాన్ని సృష్టిస్తున్న ఈ స‌మ‌యంలో సూఫీ త‌త్వం అందించిన సందేశం ప్ర‌పంచానికి ఎంతో ప్రాముఖ్యం కల అంశమని ప్రధాన మంత్రి చెప్పారు.

ప్రపంచంలో ఉగ్రవాదులు ఒడిగడుతున్న దారుణ మారణ కాండను గురించి ప్రధాన మంత్రి చెబుతూ, ఉగ్రవాదం కలిగించే ప్రభావాన్ని కేవలం గణాంకాల ద్వారానే పసిగట్టలేము అన్నారు. “దేశాలు అనుసరిస్తున్న పంథా, విధానాల ఫలితంగా ఉగ్రవాద శక్తులు, మూకలు పుట్టుకు వస్తున్నాయి.పెడదోవ పట్టిన విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం ఈ ముఠాలలో చేరుతున్నారు మరికొందరు” అని ప్రధాన మంత్రి వివరించారు.

ఉగ్రవాదంపై పోరాడటం మానవాళి తప్పనిసరిగా పాలించవలసిన కర్తవ్యం అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ఇది ఏ ఒక్క మతం మీదో జరపాల్సిన సంఘర్షణ కాదు. ఇది మానవీయ విలువలకు, అమానవీయ విలువలకు మధ్య జరిగే సంఘర్షణ అని ఆయన అన్నారు. ఈ పోరులో మనం “మన విలువల శక్తి సాయంతోను, మతాల సిసలైన సందేశం అందించే శక్తితోను గెలిచి తీరాల్సివుంద”ని ఆయన పేర్కొన్నారు.

సూఫీ తత్వం అందిస్తున్న సందేశం కేవలం బీభత్స వాదంతో పోరాటానికి మాత్రమే పరిమితం కాదు, అది అది “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” పంథాను ఆవరించి ఉండేదే అని తెలిపారు.

పవిత్ర గ్రంథాలలోని ప్రవచనాలను ప్రధాన మంత్రి తన ప్రసంగంలో పలు మార్లు ప్రస్తావించారు. “హింసాత్మక శక్తులతో మనం ప్రేమతో కూడిన కరుణ తోను, సార్వజనీన మానవ విలువల సాయం తోను తలపడుదాం” అని ఆయన పిలుపునిచ్చారు.

అంతక్రితం, సభలో ద ఆల్ ఇండియా ఉలేమా అండ్ మషాయిక్ బోర్డ్ వ్యవస్థాపక సభ్యుడు హజ్ రత్ సయ్యద్ మొహమ్మద్ అష్రఫ్ ప్రారంభ వ్యాఖ్యలు వినిపించారు. భారతదేశంలోని ముస్లిములు ఈ దేశంలో వారి భవిష్యత్తు ను గురించి ఆత్మవిశ్వాసపూర్ణులై ఉన్నారని, దేశ సమైక్యత, సమగ్రత, ప్రాదేశిక సార్వభౌమత్వాల పరిరక్ష‌ణ‌కు వారు నిబద్ధులై ఉన్నారన్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ నజ్మా హెప్తుల్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.