Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం- 2018 ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం- 2018 ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం- 2018 ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం- 2018 ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం


సమాజం లోని వివిధ వర్గాల నుండి ఇక్కడకు విచ్చేసిన మహిళలు సజ్జనులారా;
మిత్రులారా,

ఆగష్టు నెల స్వచ్ఛత ను, సంకల్పాలతో కూడిన వాతావరణాన్ని వెంటబెట్టుకువస్తుంది.   ఇది విప్లవాన్ని, అలాగే దేశం కోసం ప్రాణాలను అర్పించినటువంటి స్వాతంత్య్ర సమర యోధులను స్మరించుకొనే మాసం.  ఇది కేవలం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునే నెలే కాదు, మన సామాజిక, సాంస్కృతిక జీవితాలను సుసంపన్నం చేసే ఇతర పండుగ లను కూడా ఈ నెల లో మనం జరుపుకొంటాం.  రానున్న పర్వదినాల సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.

మన సంప్రదాయాలు, సంస్కృతి, మరియు పండుగ లలో పర్యావరణ పరిరక్షణ కు చాలా పెద్ద స్థానం ఉంది.  ఈ నాటి కార్యక్రమం కూడా పర్యావరణం తో పాటు ఆధునిక సంప్రదాయాలతో కూడుకొని వుంది.  ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.

మిత్రులారా,

125 కోట్ల మంది భారతీయుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. అందుకోసం అసంఖ్యాక పథకాలకు రూపకల్పన చేస్తోంది.  గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ ను పటిష్ఠపరచడం, రైతుల ఆదాయం రెట్టింపు చేయడం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ లకు ప్రత్యామ్నాయాన్ని అందుబాటు లోకి తీసుకు రావడం, పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచడం మొదలైనవి ప్రభుత్వ ప్రాధాన్యాలు గా ఉన్నాయి.  ఈ లక్ష్యాల సాధన లో జీవ ఇంధనం ఒక కీలకమైన పాత్ర ను పోషిస్తుంది.   మన పర్యావరణ అభివృద్ధి కీ, ఆర్ధిక అభివృద్ధి కీ మధ్య సమతుల్యత ను సృష్టించే శక్తి జీవ ఇంధనానికి ఉంది.

మిత్రులారా,

జీవ ఇంధనం ఒక శాస్త్రం మాత్రమే కాదు.  ఇది భారతదేశం తో పాటు యావత్తు ప్రపంచ దేశాలకు ఒక శక్తి ని సమకూర్చే మంత్రం.  జీవ ఇంధనం అంటే ఇది పంటల నుండి, పంటల అవశేషాలు, చెత్త, మిగిలిన పదార్ధాల నుండి ఉత్పత్తి అయ్యే ఇంధనం అని అర్థం.  ఇది గ్రామీణ ప్రాంతాల, పట్టణ ప్రాంతాల ప్రజల జీవన నాణ్యతలో ఓ పరివర్తన ను తీసుకు రానుంది.  అంతే కాక వారి జీవన నాణ్యతను మెరుగుపరచనుంది కూడా.  ఈ రోజు చూపించిన ఒక చిత్రం లో ఒక పాత నానుడి ని బలపరుస్తూ – ‘‘ఆమ్ కే ఆమ్ ఔర్ గుఠ్ లీ కే దామ్’’ అంటే ‘‘ఒక వస్తువు యొక్క రెట్టింపు వినియోగం లేదా పూర్తి వినియోగం’’ అని అర్ధం. ఇది ఒక చాలా పాత సామెత.  ఇది ఒక రకంగా ఆధునిక తరహా వినియోగం.

జీవ ఇంధనాలను ఎక్కువగా ఉపయోగించడం వలన రైతుల ఆదాయం పెరుగుతుంది.  కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.  దేశ సంపద ఆదా అవుతుంది.  వీటికి తోడు పర్యావరణానికి ఇదొక వరంగా పరిగణించబడుతుంది.

గ్రామాల్లో పరిశుభ్రత, ఆరోగ్యం లతో పాటు గ్రామాలకు సాధికారిత దిశ గా మనం నిర్ణయించుకొన్న ప్రణాళిక లో ఇది ఒక భాగం గా ఉంటుంది.  తద్వారా గ్రామాల్లోని పేద రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.  దీనికి తోడు ఇది మన పట్టణాభివృద్ధి సంబంధ ఆధునిక నమూనా తో సంబంధాన్ని కలిగివుంటుంది.   పచ్చదనాన్ని పెంపొందించడానికి తీసుకొనే చర్యల్లో భాగంగా- ఈ జీవ ఇంధనం- పట్టణాలలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

మిత్రులారా,

మన రైతు సోదరులు, రైతు సోదరీమణులు ఈ రోజు ఇక్కడకు పెద్ద సంఖ్య లో తరలివచ్చారు.  విజ్ఞాన్ భావన్ లో రైతులు హాజరు కావడమే దేశానికి ఒక పెద్ద సందేశం ఇచ్చినట్లు.  మన దేశంలో వర్షపాతం ఒక్కో ప్రాంతం లో ఒక్కో విధంగా ఉంటుంది.  కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతూంటే, ఇతర ప్రాంతాల్లో ప్రజలు వాన నీటి కోసం ఎదురుచూస్తూ ఉంటారు.  మనం తరచుగా వార్తల్లో చూస్తూ ఉంటాం.  ఒక ప్రదేశం లో సమృద్ధిగా వర్షాలు కురియడం వల్ల మనం ఎంతో ఆహ్లాదంగా ఉంటాము, అయితే అదే వర్షాలు మరో ప్రాంతం లో మనకు కష్టాలు కలిగిస్తూ ఉంటాయి.

ఈ పరిస్థితి మన రైతు సోదరులకు, సోదరీమణులకు చాలా ముఖ్యమైంది.   దేశం లోని చాలా ప్రాంతాల్లో వరి తో పాటు ఇతర ఖరీఫ్ పంట లను ఇప్పటికే నాటివుంటారని నేను భావిస్తున్నాను.  14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర ను ప్రభుత్వం 1.5 రెట్లు పెంచిన సంగతి మీకు ఇప్పటికే తెలుసు.  మనం వ్యవసాయాన్ని గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా ఎం.ఎస్. స్వామినాథన్ గారి ని గురించి చెప్పుకుంటాము.  రెండు రోజుల క్రితమో మూడు రోజుల క్రితమో అనుకుంటాను, స్వామినాథన్ గారు ఒక వ్యాసాన్ని వ్రాశారు.  అందులో వారు వ్యవసాయ రంగం లో పరివర్తన ను గురించి, ప్రభుత్వం తీసుకొన్న చర్యలను గురించి, ప్రభుత్వ విధానాలను గురించి  వివరించారు.  ఈ రంగం పైన ఆయనకు మంచి పట్టు ఉంది.  రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అనుసరిస్తున్న విధానాలు, చేపట్టిన కృషి గురించి ఆయన విస్తృతంగా వివరించి, అభినందించారు.

ఖరీఫ్ పంటలతో పాటు చెరకు కనీస మద్దతు ధర ను కూడా పెంచిన విషయాన్ని మీరు  స్వయంగా  చిత్రం లో చూశారు.  అందువల్ల రైతులు తమ సాగు ఖర్చు పై 80 శాతం అధిక ప్రయోజనాన్ని పొందుతారు.  ఈ పంట కాలంలో, చెరకు కనీస మద్దతు ధర ను క్వింటాలు కు 20 రూపాయల నుండి 275 రూపాయల వరకు పెంచడం జరిగింది.  ఈ పెంచిన ధర వల్ల రైతులు ఎక్కువగా ప్రయోజనం పొందుతారు.  దీనికి తోడు చెరకు నుండి ఇథెనాల్ ను ఉత్పత్తి చేయడానికి వీలుగా ప్రభుత్వం చేపట్టిన కృషి వల్ల కూడా రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

మిత్రులారా,

చెరకు నుండి ఇథెనాల్ ను ఉత్పత్తి చేయాలనే ఆలోచన అటల్ బిహారీ వాజ్ పేయీ గారి పాలన లో ఆరంభం అయింది.  అయితే, గత దశాబ్ద కాలంలో అధికారం లో ఉన్న ప్రభుత్వాల పరిస్థితి మాదిరి గానే, ఈ పథకాలు కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాయి.  ఈ ప్రయత్నాన్ని గంభీరంగా తీసుకోలేదు.  2014 లో ఎన్ డిఎ తో భారతీయ జనతా పార్టీ మరో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ విషయమై ఒక ప్రణాళిక ను రూపొందించడం జరిగింది.  ఇథెనాల్ ను మిశ్రణ చేసే కార్యక్రమం మొదలైంది.  ప్రస్తుతం ఈ పథకాలు 25 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సజావుగా కొనసాగుతున్నాయి.  గత నాలుగు సంవత్సరాలలో ఇథెనాల్ ఉత్పత్తి రికార్దు స్థాయి లో ఉంది.  వచ్చే నాలుగు సంవత్సరాలలో దాదాపు 450 కోట్ల లీటర్ల ఇథెనాల్ ను ఉత్పత్తి చేసే దిశగా దేశం ముందుకు పోతోంది.

మిత్రులారా,

ఇథెనాల్ రైతులకు సహాయపడడం తో పాటు దేశ సంపదను కూడా ఆదా చేసింది.  పెట్రోల్ లో ఇథెనాల్ ను కలపడం వల్ల గత ఏడాది దిగుమతులపై ఖర్చు చేసే సుమారు 4 వేల కోట్ల రూపాయల మేర విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది.

వచ్చే నాలుగు సంవత్సరాలలో ఈ ఆదాను 12,000 కోట్ల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.  అంతేకాకుండా, వచ్చే నాలుగు సంవత్సరాలలో ఒక్క చెరకు నుండి ఇథెనాల్ ను ఉత్పత్తి చేయడం ద్వారానే మనం 20,000 కోట్ల రూపాయలను ఆర్జించగలం.  ఈ పొదుపు ద్వారాను, చెరకు కు ప్రత్యామ్నాయంగాను, చెరకు రైతులు వారి పునరావృత్త సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్నంటూ పొందేందుకు వీలు ఉంటుంది.  ఆ రకంగా ఇథెనాల్ డబ్బు ను ఆదా చేసిపెడుతోంది.  దీనికి తోడు, పెట్రోల్ నుండి వచ్చే విష వాయువులను సైతం ఇది తగ్గిస్తుంది.

మిత్రులారా,

జీవ ఇంధనానికి సంబంధించి లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతోంది.  అంటే ఇది అభిలషితాలోచన కాదు అని దీని భావం.  దృఢమైన విధానాలను, చట్టాలను, వ్యూహాలను రూపొందించడం జరుగుతోంది.  బాధ్యత ను, జవాబుదారు తనాన్ని ఖరారు చేయడం జరుగుతున్నాయి.  పెట్టుకొన్న లక్ష్యాన్ని సాధించడం కోసమని క్రమం తప్పని పర్యవేక్షణను ఆచరించడం జరుగుతోంది.  ఇథెనాల్ తో సహా జీవ ఇంధనాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఒక జాతీయ విధానాన్ని రూపొందించింది.  పెట్రోల్ తో ఇథెనాల్ ను కలిపే సామర్ధ్యాన్ని 2022 కల్లా 10 శాతానికి అయినా, మరి అలాగే 2030 కల్లా  కనీసం 20 శాతానికి వరకు అభివృద్ధి పరచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.

జీవ ఇంధనం చెరకు రైతులకు ఒక ప్రత్యామ్నాయంగా మాత్రమే కాక దేశం లోని ఇతర రైతులకు కూడా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.  తరచుగా, మనం పండించుకున్న గోధుమ, వరి, మొక్కజొన్న, బంగాళదుంపలు, ఇతర కాయగూరలు వంటివి వాతావరణంలో మార్పు వల్ల లేదా సరైన నిల్వ సదుపాయాలు లేక పాడైపోతూ ఉంటాయి.  అలాంటి పరిస్థితుల్లో పాడైపోయిన పంటలను రైతులు సహజంగానే బయట పారవేస్తారు.  అయితే, వాటిని కూడా ఇథెనాల్ ఉత్పత్తి కి ఉపయోగించవచ్చని మేము నిర్ణయించాము.

రైతులకు మరో సమస్య కూడా ఉంది.  వాతావరణ పరిస్థితుల కారణంగా ఒక్కొక్క సారి పండించిన పంటలపైన మచ్చలు పడడం, పరిమాణం తగ్గడం జరిగి నిర్ణీత ప్రమాణాలకు లోబడి లేకపోవడంతో వాటిని విక్రయించడం రైతులకు కష్టమౌతుంది.  వాటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఇష్టపడరు.  దుకాణదారులు కూడా అటువంటి పంటలను కొనుగోలు చేయరు.  ఆ విధంగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు ఆ నష్టాన్ని భరించవలసి వస్తుంది.  అయితే, నిర్ణీత పరిమాణంలో లేని చిట్లిపోయిన, రంగు వెలిసిన, నేరుగా వినియోగానికి పనికి రాని ఇటువంటి పంటల నుండి కూడా ఇథెనాల్ ను ఉత్పత్తి చేయవచ్చు.  మనం ఒక క్రమబద్దమైన విధానాన్ని రూపొందించినట్లైతే- నన్ను నమ్మండి- రైతులు పండించిన ఒక్క గింజ కూడా వృథా కాదు.  అప్పుడు రైతు ఎటువంటి శక్తి ని పొందుతాడో మీరు ఊహించండి.

మిత్రులారా,

జాతీయ విధానం లో భాగంగా, గృహ సంబంధమైన చెత్త తో పాటు పొలాల్లోని వ్యర్ధాలనూ, పశువుల పేడ మొదలైన వాటిని కూడా ఇంధనంగా మార్చడానికి ఒక జాతీయ విధానానికి రూపకల్పన చేయడమైంది.  ఇళ్ల నుండే కాక, పొలాల నుండి కూడా వచ్చే అరటి తొక్కలను సమీప భవిష్యత్తు లో సమర్ధమైన ఇంధనంగా ఉపయోగించుకొనే అవకాశం ఉంది.

దీనితో పాటు, గడ్డి, వెదురు చెట్ల నుండి కూడా ఇథెనాల్ ను ఉత్పత్తి చేయవచ్చు.  వెదురు ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో పెరుగుతుంది.  ఈ నేపథ్యంలో, వెదురు రైతులకు  ప్రయోజనాన్ని చేకూర్చి,  వారి ఆర్ధిక స్థితి ని మెరుగుపరచేందుకు ఇది ఒక భారీ ముందడుగు అవుతుంది.

మిత్రులారా,

పంట అవశేషాలు లేదా పొలం లోని వ్యర్థాలు ఈ రైతులకు ఒక భారీ సమస్యగా ఉంది.  ఈ పంట అవశేషాలు ఒక విలువైన ప్రకృతి వనరు.  అయితే, అవగాహన లేకపోవడం వల్ల ఈ ముఖ్య మూలికలను మనం కాల్చివేస్తున్నాము.  ఇలా భూమి ని సారవంతం చేసి, పోషించడానికి ఉపయోగపడే విలువైన మూలికలను మనం కళ్ళెదుటే తగులబెట్టుకొంటున్నాం.  పంజాబ్, హరియాణా రైతులకు ఇది ఒక భారీ దిన చర్యగా నేను గమనించాను.  ఇది వారికి ఒక తీవ్రమైన సవాలుగా ఉంది.

ఇలా పంట అవశేషాలను తగులబెట్టడం వలన భూసారం తగ్గి పోతుంది.  దాని నుండి వెలువడే పొగ గాలిలో కాలుష్యానికి దారి తీస్తుంది; తద్వారా వాతావరణం లో నాణ్యత లోపిస్తుంది.  నేను తరచుగా నా రైతు సోదరులకు చెబుతూ ఉంటాను.. అందువల్లనే, పంట అవశేషాల నుండి ఇథెనాల్ ను ఉత్పత్తి చేసే అవకాశాలను పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతోంది.  అంటే దీని అర్ధం పంట అవశేషాలు కూడా రైతు ఆదాయానికి ఒక ఆర్ధిక వనరుగా మారాయి.  ఇది వాతావరణం లో కాలుష్యాన్ని నియంత్రించడం తో పాటు రైతుల ఆదాయ స్థాయి ని పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది.

మిత్రులారా,

బయో మాస్ ను జీవ ఇంధ‌నం గా మార్చ‌డానికిగాను ప్ర‌భుత్వం భారీ స్థాయిలో పెట్టుబ‌డులు పెడుతోంది.  10,000 కోట్ల రూపాయ‌లతో దేశ వ్యాప్తంగా 12 ఆధునిక రిఫైనరీ ల‌ను ఏర్పాటు చేయడం కోసం ప్ర‌ణాళిక ను సిద్ధ‌ం చేయడమైంది.  ఒక రిఫైన‌రీ లో 1000-1500 మందికి ఉద్యోగ కల్ప‌న జ‌రుగుతుంది.  దీని అర్థం ఏమిటంటే ఇవి ప‌ని చేసే ద‌గ్గ‌ర‌ నుండి ఇంధ‌నం స‌ర‌ఫ‌రా వ‌ర‌కు ఒక‌టిన్న‌ర ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు ఈ రిఫైన‌రీ ల ద్వారా ఉపాధి ని పొందుతారు.  అంతే కాదు ఆవు పేడ‌ నుండి ఇంధ‌నాన్ని ఉత్ప‌త్తి చేసే ప‌థ‌కం చాలా వేగంగా ప్ర‌గ‌తి ని సాధిస్తోంది.

గ‌త బ‌డ్జెటు లో మేము ‘గోబర్ ధన్ యోజ‌న’ పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించ‌డాన్ని మీరు చూసే వుంటారు.  గోబర్ ధన్ ప‌థ‌కం లో భాగంగా దేశం లో ప్ర‌తి జిల్లా లో ఒక బ‌యోగ్యాస్ ప్లాంటు ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది.  ప్ర‌స్తుతం 700 ప్లాంటు ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంది.  వీటి సంఖ్య‌ ను భవిష్య‌త్తు లో విస్త‌రించ‌డం జ‌రుగుతుంది. అన్న‌దాత‌లంద‌రితో పాటు స్వ‌యం స‌హాయ‌క బృందాలను కూడా వీటితో భాగ‌స్వాముల‌ను చేయ‌డం జ‌రుగుతోంది.

మిత్రులారా,

గోబర్ ధన్‌, వ‌న్ ధ‌న్‌, జ‌న్ ధ‌న్ వంటి ప‌థ‌కాల అండ తో పేద‌ల‌ కోసం, రైతుల‌ కోసం, గిరిజ‌నుల‌ కోసం కొత్త‌గా ఆదాయ అవ‌కాశాల‌ను త‌యారు చేసుకోవ‌డం జ‌రుగుతుంది.  మీరు పండించే పంట‌ల‌ను స‌క్ర‌మంగా ఉప‌యోగించుకోవ‌డానికి వీలుగా చ‌ర్య‌లను తీసుకోవడ‌మే కాకుండా ప‌శువుల పేడ‌, పంట అవ‌శేషాలు, ఇళ్ల‌ లోని వ్య‌ర్థాలు, ఇంకా అనేక‌ వాటిని ఉప‌యోగించుకోవ‌డం జ‌రుగుతోంది.

దీనికి తోడు మీరు అడ‌వుల్లో ల‌భించే పండ్లు, మొక్క‌ల‌ ద్వారా అద‌న‌పు ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు.  శిశిర రుతువు లో ఆకులు రాలడం మీరు గ‌మ‌నించే వారు.  అవి ఒక‌టి లేదా రెండు అడుగుల ఎత్తు లో కుప్ప‌గా ప‌డి వుంటాయి.  ఈ ఆకుల కుప్ప‌ల‌ను కూడా ఆదాయ వ‌న‌రుగా మ‌లుచుకోవ‌చ్చు.  ఇది ‘వ్య‌ర్థాల‌ నుండి సంప‌ద’ ప్రచారోద్య‌మ‌ం.  ఇది స్వ‌చ్ఛ్ భార‌త్ ఉద్య‌మానికి కావ‌ల‌సిన ప్రేర‌ణ‌ ను అందిస్తోంది.  ఎందుకంటే ఈ వ్యర్థాల‌ను అలాగే వ‌దలివేస్తే దుర్గంధ వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది.

మిత్రులారా,

ఈ ప్రచారోద్య‌మం లోని టెక్నిక్కుల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డానికిగాను మ‌న శాస్త్ర‌వేత్త‌లు, యువ‌తీయువ‌కులు స్టార్ట్- అప్ కంపెనీల సాయంతో గ‌ణ‌నీయ‌మైన కృషి చేశారు. ఈ సంద‌ర్భంగా మీకంద‌రికీ నేను నా కృత‌జ్ఞ‌త‌ను తెలియ‌జేసుకుంటున్నాను.  ఈ టెక్నిక్కు ను అభివృద్ధి చేయ‌డానికిగాను మీరు నిరంత‌రాయంగా శ్ర‌మిస్తున్నారు.  అయితే ఈ రంగం లో ప్ర‌గ‌తి ని సాధించ‌డానికి మ‌రింత అవ‌కాశం ఉంది.  ఉదాహ‌ర‌ణ‌కు చెప్పాలంటే అధిక దిగుబ‌డి ని అందించే పంట‌లను గురించి మ‌నం ఆలోచించాలి.  అంతే కాదు ఆ పంట‌లు స‌రైన నాణ్య‌త‌, అధిక ప‌రిమాణం గ‌ల జీవ ఇంధ‌నాల‌ను ఉత్ప‌త్తి చేసుకునేలా  ఉండాలి.  ఇది జ‌ర‌గాలంటే నవ పారిశ్రామిక వేత్త‌లు కొత్త స్టార్ట్- అప్ ల‌తో ముందుకు వ‌చ్చి, నూత‌న సాంకేతిక‌త‌ ను అందించే వారితో కలసి ప‌ని చేయాలి.

మ‌న ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల్లో జీవ ఇంధ‌నాల‌కు త‌గిన ప్రాధాన్య‌ం ఇవ్వాల‌ని నేను న‌మ్ముతున్నాను.  అంతే కాదు ఐఐటీలు, పాలిటెక్నిక్ కళాశాలల్లోను వాటికి ప్రాధాన్య‌ం ఇవ్వాలి.  కెవికె ల పేరుతో మ‌నం పిలుచుకునే కృషి విజ్ఞాన కేంద్రాల‌ ద్వారా జీవ ఇంధ‌నాల‌కు సంబంధించిన విజ్ఞానం మ‌న రైతుల‌కు చేరుకోవాలి.  జీవ ఇంధ‌నాలు అనే అంశాన్ని ప్ర‌ధాన అంశం గా తీసుకొని దేశ‌వ్యాప్తంగా వ్య‌వ‌సాయ సంత‌లను నిర్వ‌హించ‌డంద్వారా వీటి పైన త‌గిన చైత‌న్యాన్ని పెంపొందింప‌చేయాలి.

మిత్రులారా,

న‌గ‌రాల్లో పారిశుధ్యానికి సంబంధించి ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య‌ల్లో ఒక‌టి ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌.  దీనిపైన దృష్టి పెట్టిన ప్ర‌భుత్వం ప‌లు వ్య‌ర్థాల‌ నుండి ఇంధ‌నాన్ని తయారు చేయ‌డానికిగాను సాంకేతిక‌త‌ ను మెరుగుప‌రచే దిశగా కృషి చేస్తోంది.  మురికినీరు, పారిశ్రామిక వ్య‌ర్థ జ‌లాల వంటి వాటి నుండి కూడా విద్యుత్తు ను త‌యారు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాము.  ఒక చిన్న ప‌ట్ట‌ణంలో టీ అమ్మే వ్య‌క్తి ని గురించి ఒకసారి నేను ఒక వార్తా క‌థ‌నాన్ని చ‌దివాను.  ఆయన ఒక చిన్న మురుగు కాలువ ద‌గ్గ‌ర టీ అమ్ముతూ ఉండే వాడు.  టీ కి సంబంధించిన ఏ అంశం ప్ర‌స్తావ‌న‌ కు వ‌చ్చినా సాధార‌ణంగా నా దృష్టి అంతా దాని మీదే ఉంటుంది.  టీ అమ్ముతున్న వ్యక్తి కి ఒక ఆలోచ‌న వ‌చ్చింది.  కాలుష్య‌మ‌య‌ం అయిపోయిన మురుగునీటి కాలువ‌ నుండి సాధార‌ణంగానే దుర్వాస‌న‌ తో కూడిన వాయువు విడుద‌ల‌ అవుతూ ఉంటుంది.  ఒక పాత్ర‌ కు రంధ్రాన్ని చేసి దానికి ఒక పైపు ను అమ‌ర్చి, దాని ద్వారా ఆ మురుగునీటి కాలువ వాయువు ను సేక‌రించి ఆ వాయువు తో టీని త‌యారు చేయ‌డం మొద‌లుపెట్టాడు.  ఇది చాలా సులువైన సాంకేతిక‌త‌.

ఒక సారి నేను గుజ‌రాత్ లో ప్ర‌యాణం చేస్తున్నాను.  మా వాహనాల బారు ముందు నుండి ఒక స్కూట‌ర్ వెళ్తోంది.  ఆ స్కూట‌ర్ ను న‌డుపుతున్న వ్యక్తి తో పాటు ఒక భారీ ట్రాక్ట‌ర్ ట్యూబు ఉంది.  అది పూర్తిగా గాలితో నింప‌బ‌డి ఉంది.  ఒక భారీ ట్రాక్ట‌ర్ ట్యూబు ను స్కూట‌ర్ మీద పెట్టుకొని ఎవ‌రైనా మ‌న ముందు ప్ర‌యాణం చేస్తుంటే మ‌న‌కు ఏమ‌నిపిస్తుంది..  మ‌న వాహ‌నం ఆ స్కూట‌ర్ ను ఢీ కొడితే పెద్ద ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి అవ‌కాశ‌ం ఉంటుంద‌ని అనిపిస్తుంది.  నేను కూడా ఆ విష‌యంలో ఆశ్చ‌ర్య‌పోయాను.  సాధార‌ణంగా ఎవ‌రైనా ఖాళీ ట్యూబు తో ప్ర‌యాణం చేస్తారు.  త‌రువాతనే దానిని గాలితో నింపుతారు.  ఈ సందేహం వచ్చి నేను ఆయనను ఆగ‌మ‌ని చెప్పాను.

నేను కారులో నుండి దిగి ఆ వ్య‌క్తిని అడిగాను.. నీవు ఏం చేస్తున్నావు, ఆ విధంగా ట్యూబు ను ఎందుకు తీసుకువెళ్తున్నావ‌ని అడిగాను.  గాలి తో నిండిన ఆ ట్యూబు కార‌ణంగా ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశ‌ం ఉంది.  తాను పొలానికి వెళ్తున్న‌ట్టు ఆ వ్య‌క్తి నాతో చెప్పాడు.  ఉద్దేశ్యం చెప్ప‌మ‌ని అడిగాను.  ఇంట్లో ఉత్ప‌త్త‌ి అయ్యే వ్య‌ర్థాల‌ను, ప‌శువుల, జీవాల పేడ‌ ను ఉప‌యోగించి త‌న ఇంట్లో ఒక జీవ ఇంధ‌న ప్లాంటు ను ఏర్పాటు చేసుకున్నాడ‌ట‌.  ఆ గ్యాసు తో ఆ ట్యూబు ను నింపి దానిని తీసుకు పొలానికి వెళ్తున్నాడట‌.  ఆ గ్యాస్ సాయం తో త‌న పొలం లోని నీటి పంపును న‌డిపిస్తాన‌ని ఆ వ్య‌క్తి నాతో చెప్పాడు.  మ‌న దేశ రైతుల సామ‌ర్థ్యాన్ని గురించి ఒక్క సారి ఆలోచించండి!  ఈ రోజుల్లో మన రైతులు, పల్లె వాసులు సైతం వినూత్న‌మైన ప్ర‌యోగాలను చేస్తున్నారు.

స్టార్ట్- అప్ కంపెనీల‌ను ప్రారంభించే వారు ఈ ఆలోచ‌న‌ ను ఉప‌యోగించుకోవాల‌ని నేను కోరదలచాను.  ఒక్కొక్క సారి పెద్ద పెద్ద  క‌ళాశాల‌ల్లోనూ రానటువంటి ఘనమైన ఆలోచనలను దేశ రైతుల దగ్గర మనం గమనిస్తాం.  ప్రతి దానిని జోడించుకొంటూ దీనిని ముందుకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం.

ఈ రోజున మ‌నం భారీ స్థాయి లో బి- 3 ప‌థ‌కం మీద ప‌ని చేస్తున్నాం.  బి- 3 అంటే బ‌యోమాస్‌, బ‌యోప్యూయ‌ల్‌, బ‌యోఎన‌ర్జీ.  ఇథెనాల‌్ కు తోడు, వ్య‌ర్థాల‌ నుండి బ‌యో- సిఎన్ జి ని ఉత్ప‌త్తి చేసే కృషి అతి వేగంగా జ‌రుగుతోంది.

పెట్రోల్‌, డీజిల్ వినియోగం వ‌ల్ల వ‌చ్చే కాలుష్యాన్ని నివారించ‌డానికిగాను మ‌న దేశ ర‌వాణ వ్య‌వ‌స్థ‌ల్లో సిఎన్ జి ఉప‌యోగాన్ని ప్రోత్స‌హిస్తున్నాము.  ప్ర‌స్తుతానికి, మ‌నం సిఎన్ జి ని విదేశాల‌ నుండి దిగుమ‌తి చేసుకొంటున్నాము.

దిగుమ‌తుల మీద ఆధార‌ప‌డ‌డాన్ని త‌గ్గించుకోవ‌డానికి ప్ర‌స్తుతం మ‌నం ప్ర‌యత్నిస్తున్నాం. ఇంత‌వ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా 175 ప్లాంటుల‌ను నెల‌కొల్ప‌డం జ‌రిగింది. సిఎన్ జితో న‌డిచే వాహ‌నాల‌నేవి కేవ‌లం ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా క‌నిపించే రోజు ఎంతో దూరంలో లేదు.

మిత్రులారా,

ప్లాస్టిక్ వ్య‌ర్థాలు, పాత ర‌బ్బ‌ర్ టైర్ లు వంటివి ఆందోళ‌న‌క‌రంగా త‌యార‌య్యాయి. వీటిని ఇప్పుడు రహదారుల నిర్మాణం లో ఉప‌యోగించ‌డం జ‌రుగుతోంది.  అలాగే గృహాల‌ నుండి వ్య‌ర్థాల‌ను ఉప‌యోగించి రహదారులను వేయ‌డానికి వీలుగా ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయి.

ఆఫ్రికా దేశాల్లో ఒక దేశానికి చెందిన పేద ప్ర‌జ‌ల ప‌ని ని నేను ఇప్పుడే సోష‌ల్ మీడియా లో చూశాను.  వారు త‌మ గ్రామం లోని ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను స‌మీక‌రించి న‌దీ తీరానికి తీసుకుపోతున్నారు.  వారు అక్క‌డ ఆ వ్య‌ర్థాల‌ను కాల్చి త‌ద్వారా వ‌చ్చిన బూడిద‌ ను న‌దీతీరాన వున్న ఇసుక‌ తో క‌లుపుతున్నారు.  ఆ బూడిద- ఇసుక మిశ్ర‌మం తో భారీ స్థాయి లో ప‌ల‌క‌లను త‌యారు చేస్తున్నారు.  ఆ ప‌ని ని స్వ‌యం స‌హాయ‌క బృందాల‌కు చెందిన మ‌హిళ‌లు చేస్తున్నారు.  వారు ఆ ప‌ని ని చేయ‌డం ద్వారా వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డ‌మే కాకుండా వాటి తో నూత‌న ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేసి అంగడిలో విక్రయిస్తున్నారు.

ప‌ర్యావ‌ర‌ణానికి, అభివృద్ధి కి మ‌ధ్య‌ స‌మ‌న్వ‌యాన్ని నెల‌కొల్ప‌డానికి ప్ర‌భుత్వం కృషి చేస్తోంది.  అభివృద్ధి ని, ప‌ర్యావ‌ర‌ణాన్ని స‌మ‌న్వ‌యం చేయ‌డ‌మ‌నే అంశాన్ని మాట్లాడిన‌ప్పుడు ఇందులో విద్యుత్తు కీల‌క‌ పాత్ర‌ ను పోషిస్తోంది.  విద్యుత్తు ను ఉత్ప‌త్తి చేయడం, వినియోగించడం ప‌ర్యావ‌ర‌ణంపై నేరుగా ప్ర‌భావాన్ని చూపుతున్నాయి.

విద్యుత్తు ను ఉత్ప‌త్తి చేసుకోవ‌డానికి మ‌నం అనేక వ‌న‌రుల మీద ఆధార‌ప‌డుతున్నాము.  సౌర శ‌క్తి తో పాటు బొగ్గు, స‌హ‌జ‌వాయువులు మొద‌లైన వాటి పైన ఆధార‌ప‌డి విద్యుత్తు ను త‌యారు చేసుకుంటున్నాము.  అంతే కాదు ఈ రోజుల్లో మ‌నం అంత‌ర్జాతీయ సౌర కూటమి ద్వారా మ‌న దేశంలోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా సౌర విద్యుత్తు ను ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం మ‌నం వ్య‌వ‌సాయ‌ రంగంలో, పారిశ్రామిక రంగం లో, కార్యాలయాలలో క‌నీవినీ ఎరుగ‌ని స్థాయి లో  సౌర విద్యుత్తు ను ఉప‌యోగిస్తున్నాము. దీనికి తోడు ఇళ్ల‌లో, కార్యాలయాల్లో ఎల్ఇడి బ‌ల్బు ల‌ను ఉప‌యోగించ‌డం ద్వారా విద్యుత్తు ను ఆదా చేస్తున్నాము.  నేడు మ‌న దేశ రైల్వే స్టేశన్ లు ఎల్ఇడి బ‌ల్బు ల‌తో మెరుస్తున్నాయి.  రైల్వేస్టేశన్ లకు సంబంధించి వారు తమ ప‌ని ని పూర్తి చేశారు.  ఇక ముందు రైల్వే రంగానికి చెందిన ప్ర‌తి భ‌వ‌నం లోను, వారి నివాస‌ స్థ‌లాల్లోను ఎల్ఇడి బ‌ల్బు ల‌ను ఏర్పాటు చేయాల‌నే ల‌క్ష్యంతో ముందుకు పోతున్నారు.  ఎల్ఇడి బ‌ల్బు ల వినియోగాన్ని భార‌త ప్ర‌భుత్వం భారీ స్థాయిలో ప్రోత్స‌హిస్తోంది.  స్వ‌చ్ఛ్ భార‌త్ ఉద్య‌మం ద్వారా ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌ ల‌ను ప‌రిష్క‌రిస్తూ ముందుకు సాగుతున్నాం.

పొగ‌ లేని వంట‌ిళ్లు కూడా ఈ విస్తృత స్థాయి దృష్టికోణం లో ఒక భాగంగా ఉన్నాయి.  పొగ‌ బారి నుండి విముక్తమైన 5 కోట్ల మంది పేద కుటుంబాలకు, తల్లులకు, సోదరీమణులకు నేను అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.

ఇలాంటి పెద్ద ప‌ని ని భార‌త‌దేశంలో ఇంత త‌క్కువ స‌మ‌యంలో పూర్తి చేయ‌డం అద్భుతం.  ఇప్పుడు దేశ జ‌నాభా 125 కోట్లు.  దేశంలో 25- 26 కోట్ల కుటుంబాలు ఉన్నాయి.  దేశం లోని 25- 26 కోట్ల కుటుంబాల్లో 5 కోట్ల కుటుంబాలు అతి త‌క్కువ స‌మ‌యం లోనే గ్యాస్ క‌నెక్ష‌న్ లను అందుకొన్నాయి.  ప‌నులు వేగంగా జ‌రుగుతున్న‌ప్పుడు వాటి ఫ‌లితాలు తప్పక క‌నిపిస్తాయి.  ఈ విష‌యాన్ని మీరు స్వయంగా చూడ‌వ‌చ్చు.

మిత్రులారా,

ఈ రోజున రైతులు, సాంకేతిక నిపుణులు, ప్ర‌భుత్వ అధికారులు అంద‌రూ క‌లిపి జీవ ఇంధ‌నం గురించి దాని త‌యారీ లో ఎదుర‌య్యే స‌వాళ్లను గురించి ఈ రోజంతా చ‌ర్చ‌ించనున్నారు.  రైతులు వారి నిత్య జీవనంలో ఎదుర్కొనే స‌మ‌స్య‌ల గురించి ఇక్క‌డ‌ చ‌ర్చ‌ిస్తారు.  దేశం లోని 125 కోట్ల మంది భార‌తీయులకు సంబంధించిన శ‌క్తి అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి వీలుగా అనేక స‌ల‌హాలు, సూచ‌న‌లు వ‌స్తాయ‌ని నేను న‌మ్మ‌ుతున్నాను.  మీరందరూ క‌లసి వ్య‌వ‌సాయ రంగాన్ని లాభాల బాట‌లో ప‌య‌నింప‌చేయ‌గ‌ల‌రని ఆశిస్తున్నాను.

జీవ ఇంధ‌నం ద్వారా మ‌న‌కు ల‌భించే విప్ల‌వాత్మ‌క‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే కేవ‌లం ప్ర‌భుత్వం ప‌ని చేస్తేనే స‌రిపోదు;  విద్యార్థుల‌ను, ఉపాధ్యాయుల‌ను, శాస్త్ర‌వేత్త‌ల‌ను, పారిశ్రామిక‌వేత్త‌ల‌ను.. ఇలా అనేక‌ మందిని భాగ‌స్వాముల‌ను చేయ‌డం ద్వారా ఒక ప్ర‌జా ఉద్య‌మాన్ని త‌యారు చేయాలి.

జీవ ఇంధ‌నం ద్వారా చేకూరే ఫ‌లితాలు ప్ర‌తి గ్రామానికి చేరేలా త‌మ వ్య‌క్తిగ‌త స్థాయిల్లో ప‌ని చేయాల‌ని ఇక్క‌డ‌కు వ‌చ్చిన ఆయా రాష్ట్రాల ప్ర‌తినిధులను కోరుతున్నాను.  ఈ రోజున ప్ర‌పంచం జీవ ఇంధ‌న దినోత్స‌వాన్ని జ‌రుపుకొంటోంది.  జీవ ఇంధ‌న రంగం లో భార‌త‌దేశం అనేక కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది.  భూగోళ తాపం స‌మ‌స్య‌ ను ఎదుర్కోవ‌డంలో మ‌న దేశం కూడా సామ‌ర్థ్యం క‌లిగివుంద‌ని చాటుతున్నాము.  దీనికి సంబంధించి తీసుకున్న చ‌ర్య‌ల‌న్న‌ింటికీ నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌త‌దేశానికి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

భార‌త‌దేశం రూపొందిస్తున్నప్ర‌ణాళిక‌ల‌ను, విధానాలను ప్ర‌పంచం చాలా ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నిస్తోంది.  మ‌నం ఈ రోజున చేస్తున్న కృషి నూత‌నోత్సాహాన్ని ఇస్తోంది.  నూత‌న మార్గాన్ని అందిస్తుంది.  ప్ర‌గతిని అధికం చేస్తుంది.  ఈ విజ‌య‌వంత‌మైన ప్ర‌ణాళిక ను రూపొందిస్తున్నందుకు మీకు నా హృద‌య‌పూర్వ‌క‌మైన అభినంద‌న‌లు తెలియ‌జేసుకుంటున్నాను.

మీకు ధన్యవాదాలు.

*******