Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దిగుమతి చేసుకొనే ముడి చమురు కు సంబంధించిన విధానంలో సవరణ


ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (పి ఎస్ యు లు) దిగుమతి చేసుకొనే ముడి చమురుకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న విధానం స్థానంలో మార్పు తీసుకు వచ్చి, పిఎస్ యులకు తమ సొంత విధానాలను రూపొందించుకొనే అధికారాన్ని దఖలు పరచే ప్రతిపాదన
కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్రమంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. పర్యవసానంగా ముడి చమురు సేకరణకు మరింత సమర్ధమైన, మార్పులకు వీలు ఉండే, క్రియాశీలమైన విధానం అందుబాటులోకి రాగలదు. చివరకు వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది.

ముడి చమురు దిగుమతి కోసం ఇంతవరకు అమలులో ఉన్న విధానానికి 1979 లో అప్పటి కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. 2001 లో అప్పటి మంత్రివర్గం ఈ విధానంలో కొన్ని సవరణలను ప్రవేశపెట్టింది. ప్రస్తుత విధానం ప్రభుత్వ రంగ చమురు కంపెనీలన్నింటి అవసరాలను ఏళ్ల తరబడి నిలకడగా తీర్చేందుకు పూచీపడేదిగా ఉండగా, ఈ విధానం మారుతున్న కాలానికి తగ్గట్టు రూపొందవలసిన అవసరం ఏర్పడింది. భౌగోళిక- రాజకీయ వాతావరణం మార్పులకు లోను కావడంతో, ముడి చమురు దిగుమతి విధానాన్ని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పు చేయవలసిన అవసరం తలెత్తింది. ముడి చమురు కొనుగోలుకు స్పాట్ బేసిస్ ను కూడా అనుసరించిన పక్షంలోనే మార్కెట్ లో దీటుగా ప్రతిస్పందించే స్థితికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయంలో, ప్రస్తుతం అమలులో ఉన్న విధానం కొన్ని పరిమితులతోను, కొన్ని నిబంధనలతోను కూడుకొని ఉన్నది. ఈ పరిమితులు, నిబంధనలు.. వనరుల మూలాధారాలకు, వనరుల కొనుగోలు పద్ధతులకు హద్దులను ఏర్పరిచేటట్లుగా ఉన్నాయి.

2001 లో మంత్రివర్గం తీసుకున్న కడపటి నిర్ణయం అనంతరం భారత ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలలోన ‘నవరత్న’, ‘మహారత్న’ స్థాయి కలిగిన కంపెనీలకు గణనీయ స్థాయిలోనే అధికారాలను అప్పగించింది. ఆ కోవకు చెందిన కంపెనీలకు వేరు వేరు నిర్వహణసంబంధమైన, ఆర్ధికపరమైన, మరియు పెట్టుబడి పరమైన అంశాలలో ఉన్నత స్థాయి స్వతంత్ర ప్రతిపత్తిని ధారదత్తం చేశారు.

అలాగే, భారత ప్రభుత్వ ఆధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు ముడి చమురు దిగుమతి కోసం వాటి సొంత విధానాలను రూపొందించుకొనే అధికారం కల్పించాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అయితే ఈ విధానాలు కేంద్ర నిఘా సంఘం (సి వి సి) మార్గదర్శకాలకు లోబడి, ఆయా కంపెనీల బోర్డుల అనుమతి మేరకు ఉండాలి. ప్రభుత్వ జోక్యం తక్కువ గాను, స్వీయ పరిపాలన గరిష్ఠ స్థాయి లోను ఉండాలనే సిద్ధాంతానికి తగినట్లు ఉన్న ఈ నిర్ణయం చమురు కంపెనీలకు నిర్వహణ పరంగా వెసులుబాటును పెంపొందింపచేయగలదు; అంతే కాక, వాటికి వాణిజ్యపరంగా వెసులుబాటు కూడా మెరుగు పడుతుంది. ఫలితంగా ప్రభుత్వ చమురు కంపెనీలు ముడిచమురు దిగుమతి కోసం మరింత సమర్ధమైన కొనుగోలు విధానాలను అవలంబించేందుకు అవకాశం ఏర్పడుతుంది.