Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప‌శ్చిమ‌ బెంగాల్‌ లో గల శాంతినికేత‌న్‌ లో బాంగ్లాదేశ్ భ‌వ‌న్ ప్రారంభ కార్యక్రమంలో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం


మాన్యులు బాంగ్లాదేశ్ ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారు, గౌర‌వ‌నీయ అతిథులు, గౌర‌వ‌నీయులైన ముఖ్య‌మంత్రి గారు, గౌర‌వ‌నీయులైన గ‌వ‌ర్న‌ర్ గారు మ‌రియు మిత్రులారా,

బాంగ్లాదేశ్ భ‌వ‌న్ భార‌తదేశానికి, బాంగ్లాదేశ్ కు మ‌ధ్య ఉన్నటువంటి సాంస్కృతిక బంధానికి ఒక ప్ర‌తీక‌. క‌ళలు, భాష‌, విద్య‌, కుటుంబ సంబంధాల రీత్యా రెండు దేశాల ప్ర‌జ‌ల మధ్య నెలకొన్న బ‌ల‌మైన బంధాల‌కు ఈ భ‌వ‌నం ఒక సంకేతం. అలాగే హింస‌ కు వ్య‌తిరేకంగా సాగిన ఉమ్మ‌డి పోరాటాలు కూడా ఈ బంధాన్ని రుజువు చేస్తున్నాయి. వీట‌న్నింటికీ ప్ర‌తిరూపమైన ఈ భ‌వ‌న నిర్మాణంపై శేఖ్ హ‌సీనా గారితో పాటు బాంగ్లాదేశ్ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. భార‌త‌దేశం మరియు బాంగ్లాదేశ్ ల జాతీయ గీతాల రూప‌క‌ర్త‌, గురుదేవులు శ్రీ టాగోర్ క‌ర్మ‌ భూమి లో.. ఈ ప‌విత్ర రంజాన్ మాసం లో ఇటువంటి భ‌వ‌నాన్ని ప్రారంభించ‌డం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది.

మిత్రులారా,

ఈ ప‌విత్ర భూమి, ఈ విశ్వ‌విద్యాల‌యాల‌ చ‌రిత్ర బాంగ్లాదేశ్, భార‌త‌దేశాల స్వాతంత్య్ర చ‌రిత్ర‌ క‌న్నా.. చివ‌ర‌కు వ‌ల‌స పాల‌న కాలం నాటి బెంగాల్ విభ‌జ‌న చ‌రిత్ర‌ క‌న్నా కూడా ఎంతో పురాత‌న‌మైంది. అయితే, బ్రిటిష్ పాల‌కులు గాని, విభ‌జించి- పాలించే రాజ‌కీయాలు గాని విడ‌దీయ‌లేనంత‌టి మ‌న బ‌ల‌మైన ఉమ్మ‌డి వార‌స‌త్వానికి ప్ర‌తీక ఈ విశ్వ‌విద్యాల‌యం. అనంత గంగానది కెర‌టాలు రెండు దేశాల తీరాల‌ను తాకుతుంటాయి. మ‌న బంధాన్ని బ‌లోపేతం చేస్తోంది ఈ సారూప్య‌త‌లే. ఇక బంగ‌బంధు శ్రీ ముజీబుర్ ర‌హ్మాన్‌ కు బాంగ్లాదేశ్‌ లో ఎంత‌టి మ‌న్న‌న ఉందో అంతే గౌర‌వాద‌రాలు భార‌తదేశం లోనూ ఆయ‌న‌కు ల‌భిస్తాయి. అదే విధంగా మ‌హ‌నీయులైన స్వామి వివేకానందుల వారు, సుభాష్ చంద్ర‌బోస్‌ గారు, మ‌హాత్మ గాంధీ గారుల‌కు భార‌తదేశం లో ల‌భించే గౌర‌వ‌ ఆదరణలు బాంగ్లాదేశ్‌ లోనూ ప్ర‌స్ఫుటంగా ద్యోతకమవుతాయి. ప్ర‌పంచ ప్ర‌సిద్ధ క‌వి శ్రీ ర‌వీంద్రనాథ్ టాగోర్ ప‌ద్యాలు, పాట‌లు బాంగ్లాదేశ్‌ లోని ప్ర‌తి గ్రామంలో ప్ర‌తిధ్వ‌నిస్తుంటాయి. అలాగే కాజీ నూరుల్ ఇస్లామ్ గారు బాణీలు క‌ట్టిన పాట‌లు కూడా ప‌శ్చిమ‌ బెంగాల్‌ లోని మూల‌మూల‌లా మారుమోగుతుంటాయి.

బాంగ్లాదేశ్‌కు చెందిన అనేక‌ మంది ప్ర‌ముఖుల పేర్లు ఈ విశ్వవిద్యాల‌యంతో ముడిప‌డి ఉన్నాయి. రిజ్వాన్ చౌద‌రి బ‌న్యా గారు, అదితి మొహ్ సిన్‌ గారు, లిలీ ఇస్లామ్‌ గారు, లీనా త‌పోషి గారు, ష‌ర్మిలా బెన‌ర్జీ గారు, నిసార్ హుసేన్ గారు త‌దిత‌రుల పేర్లు అందులో కొన్ని మాత్రమే. ర‌వీంద్ర‌నాథ్ టాగోర్ గారి దార్శ‌నిక‌త పర్యవసానంగా ఈ మ‌హా విద్యా సంస్థ మ‌న రాజ‌కీయాలు, బంధాల‌కు అతీతంగా వ‌ర్ధిల్లుతోంది. హ‌ద్దులకు ప‌రిమితం కాని అనంత‌ స్వ‌తంత్ర భావాల‌కు గురుదేవులే ఒక నిదర్శనం. ఆయ‌నకు భార‌త‌దేశంతో ఎంత‌టి అనుబంధ‌ం ఉందో బాంగ్లాదేశ్‌ తోనూ అంతే అనుబంధం ఉంది. గ‌గ‌న్ హ‌ర్క‌రా గారు, లాల‌న్ ఫ‌కీర్‌ గారుల జాన‌ప‌ద గీతాల‌తో ఆయ‌న‌కు ప‌రిచ‌యం క‌లిగింది బాంగ్లాదేశ్ భూభాగం లోనే. ‘అమ‌ర్ సోనార్ బాంగ్లా’ వరుసలు క‌ట్ట‌డంలో గ‌గ‌న్ హ‌ర్క‌రా గారి నుండే ఆయ‌న స్ఫూర్తి ని పొందారు. ర‌వీంద్ర సంగీత్‌ లోనూ బౌల్ గేయం యొక్క ప్ర‌భావం మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. గురుదేవుని ఆద‌ర్శాలను, క‌ళా నైపుణ్యాల‌ను బంగ‌బంధు ఎంత‌గానో అభిమానించేవారు. టాగోర్ గారు ప్ర‌బోధించిన విశ్వ మాన‌వ‌వాదం బంగ‌బంధు శేఖ్ ముజీబుర్ ర‌హ్మాన్‌ గారిని ఎంత‌గానో ప్ర‌భావితం చేసింది. బంగ‌బంధు ఆక‌ట్టుకునే ప్ర‌సంగాల‌లో గురుదేవుని ‘సోనార్ బాంగ్లా’ ఒక ముఖ్య‌ భాగంగా ఉండేది. టాగోర్ గారు ప్రబోధించిన విశ్వ మాన‌వ‌వాదం భార‌త‌దేశానికీ ఒక ప్రేరణ. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ (అంద‌రి తోడ్పాటుతో అంద‌రి అభివృద్ధి) అన్న మా భావ‌న‌ లోనూ ఈ స్ఫూర్తి ప్ర‌తిబింబిస్తుంది.

మిత్రులారా,

భార‌తదేశం, బాంగ్లాదేశ్ ల సుసంప‌న్న సాంస్కృతిక సంప్ర‌దాయాల‌తో పాటు రెండు దేశాల మ‌హ‌నీయులు ఇందుకోసం చేసిన కృషి ని భావి త‌రాల‌కు సంక్ర‌మింపజేసేందుకు మ‌నం నిరంత‌రం శ్ర‌మించవలసివుంటుంది. ఈ కృషిలో ఇండియన్ హై క‌మిశన్‌, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేశన్స్, ఇత‌ర సంస్థ‌లు, వ్య‌క్తులు నిమ‌గ్న‌మై ఉన్నారు. నేడు ‘బాంగ్లాదేశ్ భ‌వ‌న్‌’ ను ఇక్క‌డ ప్రారంభించ‌డం ద్వారా బాంగ్లాదేశ్‌ లోని కుష్టియా జిల్లాలో గ‌ల‌ గురుదేవులు శ్రీ టాగోర్ నివాసం ‘కుతిబ‌రీ’ పున‌రుద్ధ‌ర‌ణ కృషి ని కూడా మేము ప్రారంభించినట్లయింది.

మిత్రులారా,

ర‌వీంద్ర సంగీత్ ఉమ్మ‌డి వారస‌త్వం, అందులోని తియ్య‌ద‌నం సుఖ‌ దుఃఖాలలో మ‌న సంబంధాల‌కు మాధుర్యాన్ని అద్ది మ‌న‌ను స‌దా ఐక్యంగా ఉంచాయి. ఈ కార‌ణంగానే బాంగ్లాదేశ్ విముక్తి పోరాటం మా స‌రిహ‌ద్దుల‌కు ఆవ‌ల సాగుతున్న‌ప్ప‌టికీ దాని స్ఫూర్తి బీజాలు మాత్రం ఈ నేల‌ నుండే మొల‌కెత్తాయి. అలాగే ప్ర‌త్య‌ర్థుల స్వార్థ‌పూరిత ఆకాంక్ష‌ల ఫ‌లితంగా బాంగ్లా ప్ర‌జ‌లు క్ష‌త‌గాత్రులైనా ఆ గాయాల బాధ‌ ను మేము సైతం అనుభ‌వించాము. కాబ‌ట్టే బంగ‌బంధు విముక్తి పోరాట నాయ‌కుడైన‌ప్పుడు ల‌క్షలాది భార‌తీయులు కూడా ఆ ఉద్య‌మంతో మాన‌సికంగా మ‌మేక‌మయ్యారు. నియంతృత్వంపై, ఉగ్ర‌వాదంపై మ‌న ఉమ్మ‌డి పోరాటం, సంక‌ల్పం మ‌న భ‌విష్య‌త్తు తరాల‌కు ఈ బాంగ్ల‌ాదేశ్ భ‌వ‌న్ రూపంలో నిరంత‌రం స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి.

మిత్రులారా, గడచిన సంవత్సరంలో ఢిల్లీ లో భార‌తీయ సైనికుల‌ను బాంగ్లాదేశ్ స‌త్క‌రించ‌డం ఎంతటి ఉద్వేగాన్ని క‌లిగించిందో నాకు గుర్తుకు వస్తోంది. బాంగ్లాదేశ్ విముక్తి కోసం అమ‌రులైన 1661 మంది భార‌త సైనికుల ప్రాణ‌ త్యాగాన్ని స‌గౌర‌వంగా స‌మ్మానించ‌డం లో మాత్ర‌మే కాకుండా బాంగ్లాదేశ్‌ లోని ప్ర‌తి స్వాతంత్య్ర యోధుడితో ముడిప‌డిన భావోద్వేగాల‌ను కూడా స్ఫుర‌ణ‌కు తెచ్చింది. ఇరుగు పొరుగు దేశాలు త‌మ సైనికుల‌ను ప‌ర‌స్ప‌రం స‌త్క‌రించుకోవ‌డం అత్యంత అరుదైన అంశం.

మిత్రులారా,

కొన్ని సంవత్సరాలుగా భార‌త‌దేశం, బాంగ్లాదేశ్ ల సంబంధాలలో సువ‌ర్ణాధ్యాయాలు లిఖిత‌మ‌వుతున్నాయి. ఒక‌నాడు ప‌రిష్కార సాధ్యం కానివిగా భావించిన భూ, స‌ముద్ర‌ స‌రిహ‌ద్దు సంబంధిత‌ సంక్లిష్ట ద్వైపాక్షిక స‌మ‌స్య‌లు నేడు ప‌రిష్కార‌మ‌య్యాయి. ఇక రహదారి, రైలు, అంత‌ర్గ‌త జ‌ల‌మార్గాల‌ అనుసంధానం, తీర‌ప్రాంత నౌకాయానం త‌దిత‌రాల‌ వైపు వేగంగా పురోగ‌మిస్తున్నాము. అలాగే అనుసంధానంలో కొత్త కోణాలు కూడా ఆవిష్కృత‌మ‌వుతున్నాయి.

నిరుడు కోల్‌క‌తా మరియు ఖుల్నా ల నడుమ ఎయిర్ కండిష‌న్డ్ రైలు స‌ర్వీసు కూడా ప్రారంభ‌మైంది. ఈ రైలుకు మనము ‘బంధ‌న్‌’ అని పేరు పెట్టుకొన్నాము. ఈ ‘బంధ‌న్‌’ ద్వారా మ‌న సంబంధాల‌ను మ‌రింత పురోమింప‌జేస్తున్నాము.

బాంగ్లాదేశ్‌ కు నిరంత‌రాయ విద్యుత్తు ను భార‌తదేశం స‌ర‌ఫ‌రా చేస్తోంది. ప్ర‌స్తుతం 600 మెగావాట్ల విద్యుత్తును అందిస్తుండ‌గా ఈ ఏడాది దీన్ని 1100 మెగావాట్ల‌కు పెంపును ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నాం.

భార‌తదేశం లోని ఈశాన్య రాష్ట్రాల‌కు బాంగ్లాదేశ్ నుండి కూడా ఇంట‌ర్ నెట్ అందుబాటులో ఉంది. బాంగ్లాదేశ్ కోసం ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారు నిర్దేశించుకున్న అభివృద్ధి ప్రాథ‌మ్యాల‌కు అనుగుణంగా 100 కోట్ల డాల‌ర్ల మేర విడ‌త‌లవారీ రుణాన్ని భార‌తదేశం అంద‌జేసింది. ఆ ప్రాథ‌మ్యాల ప్ర‌కారం ప్ర‌గ‌తి ప‌నులు చ‌క్క‌గా సాగుతున్నాయి. కొన్ని ప‌థ‌కాల‌ను ఇప్ప‌టికే గుర్తించి వాటికి రుణాన్ని మంజూరు చేశాము.

బాంగ్లాదేశ్ అంత‌రిక్ష విజ్ఞానం లోనూ వేగంగా ముంద‌డుగు వేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవ‌లే త‌న తొలి ఉప‌గ్ర‌హం ‘బంగ‌బంధు’ ను ప్ర‌యోగించింది. ఈ విజ‌యంపై ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారితో పాటు బాంగ్లాదేశ్ ప్ర‌జ‌ల‌కు నా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. ఇవాళ భార‌తదేశంలో అంత‌రిక్ష ప‌రిజ్ఞానాన్ని ప్ర‌జా జీవ‌న ప్ర‌మాణాల పెంపున‌కు, వ్య‌వ‌స్థ‌ లో పార‌ద‌ర్శ‌క‌తను తీసుకురావ‌డానికి మేము ఉప‌యోగిస్తున్నాము. ఈ నేప‌థ్యంలో అంత‌రిక్ష ప‌రిజ్ఞానంపై భ‌విష్య‌త్తులో రెండు దేశాల మ‌ధ్య స‌హ‌కారానికి దారులు ప‌ర‌చుకుంటాయ‌న్న విశ్వాసం నాకుంది.

ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారు నిత్యం మాతో ముచ్చ‌టిస్తూండడం రెండు దేశాల మ‌ధ్య స‌హ‌కారానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది. ఆమె గడచిన సంవత్సరంలో కూడా భార‌తదేశం లో ప‌ర్య‌టించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆవిడ పాల్గొన‌డం గౌర‌వాన్వితం.

మిత్రులారా,

మ‌న ఆకాంక్ష‌లు, మ‌నం ఎదుర్కొంటున్న స‌వాళ్లు ఒకే ర‌క‌మైన‌వి. జల వాయు పరివర్తన సంక్షోభం ఇప్పుడు మ‌న క‌ళ్లెదుటే ఉంది. నిప్పులు చెరిగే సూర్యుడు మ‌న‌కు స‌వాలును విసురుతున్న‌ప్ప‌టికీ మ‌న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కూడా ఆ సౌర‌ శ‌క్తి లోనే ఉండ‌డం విశేషం. బాంగ్లాదేశ్‌ లో 2021 కల్లా ప్ర‌తి ఒక్క‌రికీ విద్యుత్తు స‌దుపాయాన్ని క‌ల్పించాల‌న్న ల‌క్ష్యంపై ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారు ప్ర‌ధానంగా దృష్టి ని సారించారు. భార‌తదేశంలో వ‌చ్చే సంవత్సరానిక‌ల్లా ప్ర‌తి ఇంటికీ విద్యుత్తు క‌నెక్ష‌న్‌ ల‌క్ష్యాన్ని అందుకోవాల‌ని మేము దృఢ సంక‌ల్పంతో ఉన్నాము. దేశం లోని ప్ర‌తి గ్రామానికీ విద్యుత్తు స‌ర‌ఫ‌రా ల‌క్ష్యాన్ని ఇప్ప‌టికే అందుకున్నాము. ఇదంతా చూస్తుంటే మన సంక‌ల్పాలు, వాటిలో సత్ఫ‌లితాలు సాధిస్తున్న తీరు ఒకేవిధంగా ఉండ‌డం విశేషం.

మిత్రులారా,

ఇంటర్ నేశనల్ సోలర్ అలయెన్స్ కార్యక్రమానికి భార‌తదేశం నడుం కట్టింది. ఇందులో ప్ర‌పంచం లోని ప‌లు దేశాలు భాగ‌స్వాముల‌య్యాయి. ప్ర‌పంచ‌ వ్యాప్తంగా సౌర‌ శ‌క్తి సామ‌ర్థ్యాన్ని అన్వేషించేందుకు ఈ అలయెన్స్ కృషి చేస్తుంది. ఇందుకోసం వివిధ దేశాల‌కు నిధులు స‌మకూర్చే ఒక వ్య‌వ‌స్థ ఏర్పాటు కు ప్ర‌య‌త్నిస్తోంది. ఇటువంటి సౌర కూట‌మి లో బాంగ్లాదేశ్ కూడా భాగ‌స్వామి కావ‌డం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ ఏడాది మార్చి లోనే న్యూ ఢిల్లీ లో ఈ కూట‌మి శిఖ‌రాగ్ర స‌ద‌స్సును నిర్వ‌హించాము. ఈ స‌ద‌స్సు లో గౌర‌వ‌నీయులైన బాంగ్లాదేశ్ అధ్య‌క్షులు కూడా పాల్గొన‌డం ఎన‌లేని సంతోషాన్ని ఇచ్చింది. మ‌న‌కు స‌వాలు రువ్వుతున్న సూర్య‌ తాపాన్నే శ‌క్తి వ‌న‌రు గా మార్చుకునే అవ‌కాశంగా మ‌ల‌చుకోవ‌డం లో రెండు దేశాల దృఢ సంక‌ల్పానికి ఇది నిద‌ర్శ‌నం.

బాంగ్లాదేశ్‌ నుండి వ‌చ్చిన వంద‌ మంది స‌భ్యుల యువ‌ బృందాన్ని గ‌త‌ నెల‌ లో నేను క‌లుసుకున్నాను. వారి ఆశ‌లు, ఆకాంక్ష‌లు కూడా భార‌త‌దేశ యువ‌త కంటున్న స్వ‌ప్నాల త‌ర‌హా లోనే ఉన్నాయ‌ని నేను గ్ర‌హించాను. అందువ‌ల్ల రెండు దేశాల యువ‌త‌రం పురోగ‌మ‌నానికి, స్వ‌ప్న సాకారానికి మేము క‌ట్టుబ‌డి ఉన్నాం.

ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారి నాయ‌క‌త్వంలో బాంగ్లాదేశ్‌ లో అభివృద్ధి నేడు కొత్త పుంత‌లు తొక్కుతోంది. ‘వ‌ర్ధ‌మాన ఆర్థిక వ్య‌వ‌స్థ’ స్థాయి ని అందుకునే దిశ‌గా ఆమె నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను ప్ర‌జ‌లు అందుకోగ‌ల‌గ‌డంపై భార‌తదేశం ఎంతో గ‌ర్విస్తోంది. సామాజిక రంగం లోనూ బాంగ్లాదేశ్ గ‌ణ‌నీయ ప్ర‌గ‌తి ని సాధించడంతో పేద‌ల జీవితాలు బాగుప‌డ్డాయి. ఈ అద్భుత కృషి మా దేశ ప్ర‌జ‌ల‌కు కూడా స్ఫూర్తిని ఇస్తుంది.

మిత్రులారా,

భార‌త‌దేశం, బాంగ్లాదేశ్ ల ప్ర‌గ‌తి ప‌య‌నం ఓ అంద‌మైన‌ పూల‌ దండ‌ తో పెన‌వేసుకున్న దారం వంటిది. ప్ర‌పంచం లోని కొన్ని ప్రాంతాలలో అనిశ్చిత వాతావ‌ర‌ణం నెల‌కొంది. అంత‌ర్జాతీయ భౌగోళిక‌- రాజ‌కీయాలు నిరంత‌రం మారుతున్నాయి. అయితే, భార‌త‌దేశం, బాంగ్లాదేశ్‌ ల మ‌ధ్య పురోగతి, అభివృద్ధి, శాంతి మరియు సుస్థిర‌త‌ ల కోసం గ‌డ‌చిన కొన్ని సంవత్సరాలుగా నెల‌కొన్న బ‌ల‌మైన స్నేహం దేనికీ వెనుదీయ‌ద‌న్న వాస్త‌వం ఇవాళ‌ స్ప‌ష్టంగా రుజువైంది. ఈ స‌హ‌కారం ఒక్క ద్వైపాక్షిక సంబంధాల్లోనేగాక బిమ్స్ టెక్ (BIMSTEC) వంటి వేదిక‌ల‌ ద్వారా ప్రాంతీయ ప్ర‌గ‌తిని, అనుసంధానాన్ని కూడా ప్రోత్స‌హించింది.

మిత్రులారా, ఇలాంటి స‌హ‌కారం విస్తృత‌మైతే ప్ర‌తి దేశ‌మూ అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత ప‌రిస్థితుల‌లో ఇలాంటి ఒక అవ‌కాశం మ‌న‌కు క‌లిసివ‌చ్చింది. భార‌త‌దేశం, బాంగ్లాదేశ్‌ ల మ‌ధ్య ప్ర‌గాఢ‌ మైత్రిపై అధ్య‌య‌నం, అంచ‌నాలు ఇవాళ ఇత‌ర దేశాల‌న్నింటికీ ఒక‌ పాఠం కావాలి.

మిత్రులారా,

బాంగ్లాదేశ్ 2014 కల్లా స‌ర్వ‌తోముఖాభివృద్ధి చెందిన దేశంగా రూపొంద‌డానికి ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారు మార్గ‌నిర్దేశం చేశారు. బంగ‌బంధు నిర్దేశిత‌ దూర‌దృష్టికి, సంప్ర‌దాయానికి ఆమె మార్గ‌నిర్దేశక‌త్వం ఒక ప్ర‌తీక‌. ప్ర‌తి బంగ్లాదేశీ శ్రేయమే ఆమె దూర‌దృష్టి ల‌క్ష్యం. ఈ ల‌క్ష్యాన్ని సాధించ‌డంలో భార‌తదేశం పూర్తిగా స‌హ‌క‌రిస్తుంది.
భార‌తదేశాన్ని సంద‌ర్శ‌ించేందుకు వ‌చ్చినటువంటి ప్ర‌ధాని శేఖ్ హ‌సీనా గారికి మ‌రొక్క మారు నా హృద‌యపూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. అలాగే బాంగ్లాదేశ్ భ‌వ‌న్ ప్రారంభ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మీకంద‌రికీ కూడా నా శుభాకాంక్ష‌లు. మీకు ఇవే ధన్యవాదాలు.

***