Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫిక్కీ (ఎఫ్ఐసిసిఐ) 90 వ వార్షిక సాధార‌ణ స‌మావేశం ప్రారంభ సభ లో ప్ర‌ధాన‌ మంత్రి ఉపన్యాసం సారాంశం


ఫిక్కీ (ఎఫ్ఐసిసిఐ) అధ్య‌క్షుడు శ్రీ పంక‌జ్ ఆర్‌. ప‌టేల్‌ గారు, అధ్య‌క్షునిగా నూత‌నంగా ఎన్నికైన శ్రీ ర‌మేశ్ శాహ్ గారు, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ సంజ‌య్ బారు గారు మరియు ఈ స‌మావేశానికి హాజ‌రైన ఇత‌ర ప్ర‌ముఖులారా,

ఇక్క‌డ ఆసీనులైన మీరంతా గ‌త సంవ‌త్స‌రం జ‌రిగిన ప‌నిని స‌మీక్షిస్తూ ఉంటారు. ఈ సంవ‌త్స‌రం ఫిక్కీ (ఎఫ్‌ఐసిసిఐ) 90 వ‌సంతాలు పూర్తి చేసుకొంటోంది. సంస్థ‌కు ఇది గొప్ప గ‌ర్వ‌కార‌ణం. మీ అంద‌రికీ ఇవే నా శుభాకాంక్ష‌లు.

మిత్రులారా,

1927 ప్రాంతంలో సైమ‌న్ క‌మిష‌న్ ఏర్ప‌డింది. ఈ క‌మిష‌న్‌కు వ్య‌తిరేకంగా భార‌త పారిశ్రామిక రంగం సంఘ‌టిత‌మైంది. ఇది ఒక ప్రేర‌ణాత్మ‌క చారిత్ర‌క ఘ‌ట్టం. పారిశ్రామిక‌ రంగం త‌న స్వీయ ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న‌ పెట్టి సైమ‌న్ క‌మిష‌న్‌ కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పింది. భార‌తీయ స‌మాజం లోని ప్ర‌తి విభాగం జాతీయ ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కు ముందుకు వ‌చ్చిన‌ట్టే, భార‌తీయ పారిశ్రామిక వేత్త‌లు కూడా వారి శ‌క్తిని జాతి నిర్మాణంలో కేంద్రీక‌రించారు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

90 సంవ‌త్స‌రాల క్రితం సామాన్య ప్ర‌జ‌లు వారి రోజు వారీ కార్య‌క‌లాపాల‌తో పాటు దేశం కోసం వారి వంతు బాధ్య‌తను తీసుకొనేందుకు ముందుకు వచ్చారు. అటువంటి శ‌క‌మే మ‌రో సారి ప్రారంభ‌ం అయింది. ఈరోజుల్లో ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల స్థాయి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోగ‌ల‌రు. అవినీతి, న‌ల్ల‌ధ‌నం ల వంటి అనైతిక వ్య‌వ‌హారాల‌తో ప్ర‌జ‌లు విసిగిపోయారు. ఈ రుగ్మ‌త‌ల‌ను వ‌దలించుకోవాలని వారు కోరుకుంటున్నారు.

అందుకే ప్ర‌తి సంస్థా అది రాజ‌కీయ వ్య‌వ‌స్థ గాని, లేదా ఫిక్కీ వంటి పారిశ్రామిక సంస్థ గాని ఈ దేశ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను, వారి అవ‌స‌రాల‌ను అర్థం చేసుకొని, త‌గిన చ‌ర్చ జ‌రిపి భ‌విష్య‌త్తు వ్యూహాన్ని రూపొందించుకోవాలి.

మిత్రులారా,

స్వాతంత్ర్యం అనంత‌రం ఎన్నో సాధించాం. అంతేకాదు గ‌డ‌చిన కొన్ని ద‌శాబ్దాలుగా మ‌నం ఎన్నో స‌వాళ్ల‌నూ ఎదుర్కొన్నాం. 70 సంవ‌త్స‌రాల త‌రువాత‌ కూడా పేద‌లు ఏదో ఒక రూపంలో పోరాటం చేస్తున్న వ్య‌వ‌స్థ మ‌న‌కు ఉంది. ప్ర‌తి చిన్న దానికి వారు స‌త‌మ‌త‌మౌతున్నారు. పేద‌లు బ్యాంకు ఖాతాను ప్రారంభించాలంటే దానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. గ్యాస్ క‌నెక్ష‌న్ ను పొందాలంటే ప‌ది మంది త‌లుపులను త‌ట్టవలసిన ప‌రిస్థితి ఉంది. త‌న‌కు రావ‌ల‌సిన పింఛన్ లేదా ఉపకార వేతనం కోసంకూడా క‌మిష‌న్ చెల్లించాల్సి వస్తోంది.

ఇలా వ్య‌వ‌స్థ‌పై పోరాటం చేసే ప‌రిస్థితులు లేకుండా చేసే ప‌నిని మా ప్ర‌భుత్వం చేస్తోంది. పార‌ద‌ర్శ‌క‌త్వంతో కూడినటువంటి వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా సానుకూల దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించేటట్టు చ‌ర్య‌లు తీసుకొంటున్నాం. ఇటువంటి వ్య‌వ‌స్థ ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుంది.

అందుకే ‘జ‌న్‌ ధ‌న్ పథకాన్ని’ మేం ప్రారంభించిన‌పుడు మాకు బ్ర‌హ్మాండ‌మైన స్పంద‌న వ‌చ్చింది. మీరు ఆశ్చ‌ర్య‌పోతారు, అస‌లు ఎంత‌ మంది పేద ప్ర‌జ‌ల‌కు ఖాతాలను ప్రారంభించాల‌న్న‌దానికి మేం ల‌క్ష్యాన్ని కూడా నిర్దేశించుకోలేక‌పోయాం. ఎందుకంటే ఇందుకు సంబంధించిన గ‌ణాంకాలు గాని, స‌మాచారం గాని ప్ర‌భుత్వం వ‌ద్ద‌ లేవు.

బ్యాంకులు పేద ప్ర‌జ‌ల‌కు ఖాతాలు ప్రారంభించకుండా పంపించివేస్తాయ‌ని, లేదా వారి ద‌ర‌ఖాస్తుల‌లో లోపాల‌ను ఎత్తిచూపుతుంటాయ‌న్న స‌మాచారం ఉంది. కానీ, ఇవాళ జ‌న్‌ ధ‌న్ ప‌థ‌కం కింద దేశంలో 30 కోట్ల‌ మందికి పైగా పేద ప్ర‌జ‌లు బ్యాంకు ఖాతాలను తెరవడం చూశాక ప్ర‌జ‌ల ముఖ్య‌మైన అవ‌స‌రం ఎలా తీరిందో తెలుసుకున్నాను. గ్రామీణ ప్రాంతాల‌లో పెద్ద సంఖ్య‌లో పేద‌లు ఖాతాలను తెరచార‌ని, ఆ ప్రాంతాల‌లో ద్ర‌వ్యోల్బ‌ణం రేటు త‌గ్గింద‌ని ఒక అధ్య‌య‌నం వెల్ల‌డించింది. అంటే పేద ప్ర‌జ‌ల జీవితాల‌లో ఇది ఎంత‌టి మార్పును తెచ్చిందో గ‌మ‌నించండి.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ప్ర‌జ‌ల అవ‌స‌రాలు, వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో ఉంచుకొని మా ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని రూపొందించింది. ప్ర‌జ‌ల జీవితాలు మ‌రింత సరళత‌రం కావాల‌ని, త‌ద్వారా వారి జీవ‌నం మ‌రింత మెరుగుప‌డాల‌న్న దృష్టితో దీనికి ప్రాధాన్య‌ం ఇవ్వ‌డం జ‌రిగింది.

‘ఉజ్జ్వ‌ల ప‌థ‌కాన్ని’ పేద ప్ర‌జ‌లకు వంట‌గ‌దిలో పొగ‌ వచ్చే పొయ్యిల బారి నుండి విముక్తిని క‌ల్పించేందుకు తీసుకురావ‌డం జ‌రిగింది. 3 కోట్ల మందికి పైగా మ‌హిళ‌ల‌కు మేం ఉచితంగా గ్యాస్ క‌నెక్ష‌న్ లను ఇచ్చాం. ఈ ప‌థ‌కంతో గ్రామీణ ప్రాంతాల‌లో ఇంధ‌న ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గింది. అంటే ఇంధ‌నంపై పేద ప్ర‌జ‌లు త‌క్కువ ఖ‌ర్చుపెడితే స‌రిపోతుంది.

మేం పేద ప్ర‌జ‌ల అవ‌స‌రాలను అర్థంచేసుకొని వారు ఎదుర్కొనే ప్ర‌తి చిన్న స‌మ‌స్యను ప‌రిష్క‌రించ‌డానికి, వారి ప్ర‌తి చిన్న అవ‌స‌రాన్ని తీర్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. పేద మ‌హిళ‌లు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసేందుకు 5 కోట్ల కు పైగా మరుగుదొడ్లను నిర్మించాం. ఆ ర‌కంగా వారి ఆరోగ్యానికి, భ‌ద్ర‌త‌కు ముప్పు రాకుండా చ‌ర్య‌లు తీసుకొన్నాం.

పేద ప్ర‌జ‌లు వారి సొంత ఇంటిని కలిగివుండేందుకుగాను ‘ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజ‌న’ ను ఆరంభించడం జరిగింది. వారు అద్దె ఇంటికి చెల్లించే అద్దె మొత్తంతో వారు సొంత ఇంటిని పొంద‌గ‌లుగుతున్నారు.

మిత్రులారా,

మీరు దేశ మారుమూల‌ ప్రాంతాలకు, గ్రామీణ‌ ప్రాంతాల‌కు వెళ్తే ఇక్క‌డ ఉన్న‌ ప‌రిస్థితికి పూర్తి భిన్న‌మైన వాతార‌ణం క‌నిపిస్తుంది. ఈ విజ్ఞాన్ భ‌వ‌న్‌ లోక‌ నిపిస్తున్న మిరుమిట్లు గొలిపే విద్యుత్తు వెలుగులు, అద్భుతమైన అలంక‌ర‌ణ‌లు ఏవీ అక్క‌డ క‌నిపించ‌వు. నేను అటువంటి పేద‌రిక ప్ర‌పంచం నుండి, అటువంటి ప్ర‌జ‌ల‌లో నుండి వ‌చ్చాను. ప‌రిమిత వ‌న‌రులు, ప‌రిమిత విద్య‌, మ‌రొక వైపు అప‌రిమిత‌మైన, అనంతమైన క‌ల‌లు. ఆ ప్ర‌పంచం నాకు పేద‌ ప్ర‌జ‌ల‌ కోసం క‌ష్ట‌ప‌డే త‌త్త్వాన్ని నేర్పింది. దేశ అవ‌స‌రాలను అర్థం చేసుకొని నిర్ణ‌యాలు తీసుకు అమ‌లు చేయ‌డాన్ని నేర్పింది.

‘ముద్ర ప‌థకం’ యువ‌త అవ‌స‌రాల‌ను పెద్ద ఎత్తున తీరుస్తోంది. ఇది బ్యాంకు పూచీకత్తు కు సంబంధించింది. ఎవ‌రైనా యువ‌తి లేదా యువకుడు సొంతంగా ఏదైనా చేయాల‌నుకొంటే ముందుగా ఎదుర‌య్యే ప్రశ్న వారు డ‌బ్బును ఎలా స‌మ‌కూర్చుకోవాల‌న్న‌ ప్ర‌శ్న‌ే. ప్ర‌భుత్వం ‘ముద్ర ప‌థ‌కం’ కింద ఈ పూచీకత్తును ఇస్తోంది. గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో మేం సుమారు 9.75 కోట్ల‌ రుణాల‌ను మంజూరు చేశాం. ఎటువంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా 4 లక్షల కోట్ల రూపాయ‌ల రుణాల‌ను యువ‌త‌కు పంపిణీ చేశాం. యువ‌త అవ‌స‌రాల‌కు అనుగుణంగా వారికి భార‌త ప్ర‌భుత్వం అండ‌గా నిల‌బ‌డుతోంది. దీని ఫ‌లితంగా గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో దేశానికి దాదాపుగా మూడు కోట్ల మంది నవ పారిశ్రామిక వేత్త‌లు ల‌భించారు.

వీరంతా ముద్ర ప‌థ‌కం కింద తొలిసారిగా రుణాలను పొందిన వారు. ఈ మూడు కోట్ల మంది దేశ చిన్న‌ ప‌రిశ్ర‌మ‌ల రంగాన్ని, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మల రంగాన్ని మ‌రింత విస్త‌రించారు; బ‌లోపేతం చేశారు కూడాను.

ప్ర‌భుత్వం స్టార్ట్- అప్‌ ల‌ను కూడా ప్రోత్స‌హిస్తోంది. స్టార్ట్- అప్‌ ల‌కు పెద్ద అవ‌స‌రం రిస్క్ కాపిట‌ల్‌. ఈ అవ‌స‌రాన్ని తీర్చేందుకు ఎస్‌ఐడిబిఐ కింద నిధులను అందుబాటులో ఉంచింది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఇత‌ర ఇన్వెస్ట‌ర్ల స‌హ‌కారంతో ఎస్‌ఐడిబిఐ పెట్టే పెట్టుబ‌డులు నాలుగు రెట్లకు పైగా పెరిగాయి. దీనివ‌ల్ల కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌చ్చే స్టార్ట్- అప్‌ ల‌కు ప‌ని సుల‌భ‌మైంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

స్టార్ట్- అప్‌ ల‌కు ప్ర‌త్యామ్నాయ పెట్టుబ‌డి ఫండ్‌లుపెట్టే పెట్టుబ‌డులు ముఖ్యం. ప్ర‌భుత్వం తీసుకున్న విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల కార‌ణంఆ ఈ ర‌క‌మైన పెట్టుబ‌డులు గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో గ‌ణ‌నీయంగా పెరిగాయి. మీరు గ‌మ‌నించే ఉంటారు.. యువ‌త అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వం విధాన రూప‌క‌ల్ప‌న‌ చేయ‌డం, నిర్ణ‌యాలు తీసుకోవ‌డం చేస్తోంది. గ‌త ప్ర‌భుత్వ విధానాల‌కు ఇప్ప‌టి ప్ర‌భుత్వ విధానాల‌కు మధ్య ఉన్నటువంటి మార్పును కూడా మీరు గ‌మ‌నించే ఉంటారు. అప్ప‌ట్లో కొంద‌రు బ‌డా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు వంద‌ల కోట్ల రూపాయ‌ల రుణాలు ఇచ్చారు. బ్యాంకుల మీద ఒత్తిడి తెచ్చి రుణాలు మంజూరు చేయించారు.

మిత్రులారా,

విధాన‌ప‌ర‌మైన మార్పును కోరుకుంటున్న పారిశ్రామిక వేత్త‌ల గొంతుక‌ను ఫిక్కీ వినిపిస్తోంది. మీరు ప‌రిశ్ర‌మ‌ల గొంతుక‌ను ప్ర‌భుత్వానికి వినిపిస్తారు. మీరు మీ స‌ర్వేక్షణ ల‌ను ప్ర‌చురిస్తారు. సద‌స్సు ల‌ను నిర్వ‌హిస్తారు. అయితే, గ‌త ప్ర‌భుత్వ విధానాలు బ్యాంకింగ్ రంగాన్నిఎలా దెబ్బ‌తీశాయో ఫిక్కీ ఏదైనా స‌ర్వేక్షణ ను నిర్వ‌హించిందో లేదో నాకు తెలియ‌దు. ప్ర‌స్తుతం నిరర్ధ‌క ఆస్తుల గురించి ఎక్కువ‌గా విన‌ప‌డుతోంది. ఎక్క‌డ విన్నా ఎన్‌పిఎ- ఎన్ పిఎలను గురించిన మాట‌లే. గత ప్ర‌భుత్వం లోని కొంద‌రు ‘ఆర్థిక వేత్త‌లు’ ఈ ప్ర‌భుత్వానికి అందించిన పెద్ద భారం ఈ నిర‌ర్థ‌క ఆస్తులు.

బ్యాంకుల‌పై ఒత్తిడి తెచ్చి కొంద‌రు బ‌డాపారిశ్రామిక వేత్త‌ల‌కు ప్ర‌భుత్వం లోని పెద్ద‌లు కొంద‌రు రుణాలను ఇప్పిస్తుంటే ఫిక్కీ వంటి సంస్థ‌లు ఏం చేస్తూ వ‌చ్చాయో తెలుసుకోవాల‌ని నాకు ఆస‌క్తిగా ఉంది. గ‌తంలో ప్ర‌భుత్వంలో తిష్ట‌ వేసిన వారికి ఇది త‌ప్పు అని తెలుసు. బ్యాంకుల‌కూ ఇది త‌ప్ప‌ని తెలుసు; ప‌రిశ్ర‌మ‌ల‌కూ తెలుసు. మార్కెట్‌కు సంబంధించిన సంస్థ‌ల‌కూ తెలుసు ఇది త‌ప్పు అని.

యుపిఎ ప్ర‌భుత్వంలో జ‌రిగిన అతి పెద్ద కుంభ‌కోణం ఇది. కామ‌న్ వెల్త్‌, 2 జి, బొగ్గు గ‌నుల కుంభ‌కోణాల‌ కంటె కూడా ఇది పెద్ద‌ది. ఆ ర‌కంగా బ్యాంకుల ద్వారా ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్మును లూటీ చేశారు. ఇది ఏదైనా స‌ర్వేక్షణలో ప్ర‌స్తావించారా ? ఒక‌్క సారైనా అధ్య‌య‌నం జ‌రిగిందా ? అన్నీ గ‌మ‌నిస్తూ మౌనం వ‌హిస్తున్న వారిని మేల్కొలిపేందుకు ఏదైనా సంస్థ ఎటువంటి ప్రయత్నాన్ని అయినా చేసిందా ?

మిత్రులారా,

మ‌న బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు, బ్యాంకింగ్ రంగంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దేందుకు ఈ ప్ర‌భుత్వం క్ర‌మం త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకొంటూ వ‌స్తోంది. బ్యాంకుల ప్ర‌యోజ‌నాలు కాపాడితే, వినియోగదారుల ప్ర‌యోజ‌నాలు కాపాడ‌బ‌డతాయి. త‌ద్వారా దేశ ప్ర‌యోజనాలు భ‌ద్రంగా ఉంటాయి.

ఇటువంటి ప‌రిస్థితుల‌లో ప్ర‌జ‌ల‌కు, ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌రైన స‌మాచారాన్ని అందించడంతో పాటు వారిలో చైత‌న్యాన్ని తీసుకురావ‌ల‌సిన అవ‌స‌రం ఫిక్కీ వంటి సంస్థ‌లకు ఎంతైనా ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు, గ‌త కొద్ది రోజులుగా ఫైనాన్షియ‌ల్ రెజల్యూశన్‌, డిపోజిట్ ఇన్ శ్యూరెన్స్‌ బిల్లు- ఎఫ్ ఆర్ డిఐ బిల్లు కు సంబంధించి కొన్ని వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి.

నిజానికి ప్ర‌భుత్వం ఖాతాదారుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు , బ్యాంకుల‌లో వారు దాచుకొన్న డ‌బ్బును కాపాడేందుకు , కృషిచేస్తోంది. అయితే ఇందుకు పూర్తి విరుద్ధమైన వార్తలు ప్ర‌చారం అవుతున్నాయి. ఖాతాదారులను, ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌ను త‌ప్పుదారి ప‌ట్టించే ఇటువంటి ప్ర‌చారాల‌ను తిప్పికొట్ట‌వ‌ల‌సిన బాధ్య‌త‌ ఫిక్కీ వంటి సంస్థ‌లపై ఉంది.

ప్ర‌భుత్వ గొంతుక‌, ప‌రిశ్ర‌మ గొంతుక‌, ప్ర‌జ‌ల గొంతుక వినిపించ‌డంలో స‌మ‌తూకం పాటించ‌డ‌ం ఎలా అన్న‌ దానిని మీరు ఆలోచించాలి. ఈ స‌మ‌న్వ‌యం ఎందుకు అవ‌స‌ర‌మో నేను ఒక ఉదాహ‌ర‌ణ‌ ద్వారా తెలియ‌జేస్తాను.

మిత్రులారా,

జిఎస్‌టి చ‌ట్టాన్ని తీసుకురావాల‌ని, దానిని అమ‌లు చేయాల‌ని పారిశ్రామిక వ‌ర్గాలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తూ వ‌చ్చాయి. దీనిని అమ‌లు లోకి తీసుకు వ‌చ్చిన త‌రువాత దీనిని మ‌రింత చురుకుగా అమ‌లు చేసేందుకు మీ సంస్థ ఏం చ‌ర్య‌లు తీసుకొంది ? రెస్ట్రాంట్‌ ల‌లో బిల్లుల‌పై ప‌న్ను త‌గ్గినా కూడా కొన్ని రెస్ట్రాంట్ లు బేసిక్ బిల్లును పెంచి ధ‌ర‌లు త‌గ్గించ‌డం లేద‌ని బిల్లుల కాపీల‌ను చూపుతుండ‌డం ఎంతో మంది సామాజిక మాధ్య‌మాల‌లో చురుకుగా ఉండే వారు ఇప్ప‌టికే గ‌మ‌నించి ఉంటారు. దీనిని బ‌ట్టి క‌స్ట‌మ‌ర్ల‌కు అందాల్సిన ప్ర‌యోజ‌నాల‌ను కొంద‌రు అందకుండా చేస్తున్నార‌న్న‌మాట‌.

ఇటువంటి వాటి విష‌యంలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న దానిపై ప్ర‌భుత్వం త‌న కృషి తాను చేస్తోంది. అయితే వ్యాపార‌ వ‌ర్గాలలో, ఖాతాదారుల‌లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఫిక్కీ ఏదైనా ప్ర‌య‌త్నం చేసిందా ?

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

జిఎస్‌టి వంటి వ్య‌వ‌స్థ‌ల‌ను రాత్రికి రాత్రి ఏర్పాటు చేయ‌జాలరు. గ‌త 70 సంవ‌త్స‌రాలుగా ఉన్న ప‌రిస్థితిని మార్చ‌డానికి మేం ప్ర‌య‌త్నిస్తున్నాం. గ‌రిష్ఠ సంఖ్య‌లో వ్యాపారాల‌ను దీనితో అనుసంధానం చేయాల‌న్న‌ది మా ల‌క్ష్యం.

అది ల‌క్ష రూపాయ‌ల టర్నోవర్ కానివ్వండి, లేదా ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్‌కానివ్వండి వ్య‌వ‌స్థీకృత రంగంలోకి చిన్న వ్యాపారిని కూడా తీసుకు వ‌చ్చేందుకు ప్రయ‌త్నిస్తున్నాం. ప్ర‌భుత్వానికి రాబ‌డి కోస‌మో లేక ఎంతో కొంత డ‌బ్బు ప్ర‌భుత్వానికి వ‌స్తుంద‌న్న ఉద్దేశంతో కాదు. ఎంత‌గా వ్య‌వ‌స్థీకృత రంగం ఉంటే అంత‌గా పార‌ద‌ర్శ‌క‌త్వం ఉంటుంది; అది పేద ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. దీనికి తోడు ఈ వ్య‌వ‌స్థీకృత విధానం కార‌ణంగా వారికి బ్యాంకుల‌ నుండి రుణం సుల‌భంగా ల‌భిస్తుంది. ముడి స‌ర‌కుల నాణ్య‌త పెరుగుతుంది, స‌దుపాయాల ఖ‌ర్చులు త‌గ్గుతాయి. అంటే చిన్న వ్యాపారాలు అంత‌ర్జాతీయ వ్యాపారంలో మ‌రింత పోటీని సంత‌రించుకుంటాయి. చిన్న‌ వ్యాపారుల‌కు మార్గ‌నిర్దేశం చేసేందుకు ఫిక్కీ త‌ప్ప‌కుండా ఒక పెద్ద కార్యక్ర‌మాన్ని నిర్వ‌హిస్తుంద‌ని నేను ఆశిస్తున్నాను.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఫిక్కీ కి ఎమ్ఎస్ఎమ్ఇ ప్రత్యేక విభాగాన్ని 2013 లో ఏర్పాటు చేసింది. 90 సంవ‌త్స‌రాల ఈ సంస్థ కు నాలుగు సంవత్స‌రాల క్రిత‌మే ఎమ్ఎస్ఎమ్ఇ విభాగం ఏర్పాటైంది. నేను ఈ విష‌యంపై ఏ వ్యాఖ్యా చేయ‌ద‌ల‌చుకోలేదు. అయితే ఇది ముద్ర యోజ‌న‌, స్టార్ట్- అప్ ఇండియా, స్టాండ్ -అప్ ఇండియా ప‌థ‌కాల విస్త‌ర‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డాలి. బాగా అనుభ‌వం క‌లిగిన సంస్థ‌లు చేతులు క‌లిపితే దీనితో మ‌న చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు మ‌రింత శ‌క్తిని స‌మ‌కూర్చుకోగ‌లుగుతాయి.

GeM గ‌వ‌ర్న‌మెంట్ ఇమార్కెట్ ప్లేస్‌పేరుతో ప్ర‌భుత్వం ఒక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసింది. దేశంలోని చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆ వ్య‌వ‌స్థ‌తో అనుసంధానం చేసేందుకు మీరు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేయాలి. ఈ జిఇఎమ్ వ్య‌వ‌స్థ ద్వారా చిన్న త‌యారీదారులు కూడా త‌మ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌భుత్వానికి అమ్మ‌డానికి అవ‌కాశం ఉంటుంది.

మీ నుండి నేను మ‌రొక‌టి కూడా ఆకాంక్షిస్తున్నాను. పెద్ద కంపెనీలు, చిన్న కంపెనీల‌కు పెండింగ్ బిల్లులు ఉంటే వాటిని స‌కాలంలో చెల్లించేలా చేసేందుకు ఏదైనా చేయాలి. ఇందుకు సంబంధించి నిబంధ‌న‌లు ఉన్నాయి. అయితే చాలా సంద‌ర్భాల‌లో చిన్న కంపెనీల బిల్లులు పెద్ద‌ కంపెనీల వ‌ద్ద పెండింగ్‌లో ఉండిపోతున్నాయన్న‌ది వాస్త‌వం. మూడు నాలుగు నెల‌ల‌కు ఒకసారి వారి బిల్లుల విష‌యంలో బ‌కాయిలు లేకుండా చూసుకోవాలి. బిల్లు బ‌కాయిల గురించి గ‌ట్టిగా అడిగితే వ్యాపార సంబంధాలు దెబ్బ‌తింటాయేమోన‌ని చిన్న కంపెనీలు అడ‌గ‌డానికి ఇబ్బంది ప‌డుతుంటాయి. ఇటువంటి ఇబ్బందుల‌ను తొల‌గించ‌డానికి మీ లాంటి సంస్థ‌లు కృషి చేయాలి.

మిత్రులారా,

గ‌త శ‌తాబ్దంలో వ‌చ్చిన పారిశ్రామిక విప్ల‌వం ఫ‌లితాల ప్ర‌యోజ‌నాల‌ను పూర్తిగా మ‌న దేశం అందిపుచ్చుకోలేక‌పోవ‌డానికి ఎన్నోకార‌ణాలు ఉన్నాయి. కానీ, ఇవాళ భార‌తీయులు స‌రికొత్త విప్ల‌వాన్ని సాధించేందుకు ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి.

ఈ ప్ర‌భుత్వం దేశ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాల‌ను రూపొందిస్తోంది. పాత చ‌ట్టాల‌ను తొల‌గించి కొత్త‌వాటికి రూప‌క‌ల్ప‌న చేస్తోంది. ఇటీవ‌ల మేం వెదురుకు సంబంధించి ఒక ముఖ్య‌మైన నిర్ణ‌యాన్ని తీసుకొన్నాం. వెదురు చెట్టు అవుతుందా కాదా అన్న దానికి సంబంధించి మ‌న దేశంలో రెండు ర‌కాల చ‌ట్టాలు ఉన్నాయి. అట‌వీ ప్రాంతం వెలుప‌ల పెంచే వెదురు, చెట్టు నిర్వ‌చ‌నం కిందకు రాదని ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యం వెదురు సంబంధిత ప‌రిశ్ర‌మ‌ల‌లో ప‌నిచేస్తున్న చిన్న వ్యాపారుల‌కు ఈ నిర్ణ‌యం ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది.

మిత్రులారా,

ఫిక్కీ లోని ఎక్కువ మంది స‌భ్యులు త‌యారీ రంగంతో సంబంధాలు క‌లిగివున్నారని నాకు చెప్పారు. ఇంజినీయరింగ్‌ వ‌స్తువులు, మౌలిక స‌దుపాయాలు, స్థిరాస్తి, నిర్మాణ సంబంధ వ‌స్తువుల‌ త‌యారీ ల వంటి రంగాల‌కు చెందిన వారు ఫిక్కీ కుటుంబంలో నాలుగో వంతు మంది ఉన్నారు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

భవన నిర్మాతల ఏక‌ప‌క్ష వ్య‌వ‌హ‌ర‌ణ గ‌త ప్ర‌భుత్వం వ‌ర‌కు ఎందుకు వెళ్ల‌లేదు ? మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఎంత‌గానో ఇబ్బందులు ప‌డుతున్నారు. త‌మ జీవిత ప‌ర్యంతం సంపాదించిన డ‌బ్బును బిల్డ‌రుకు స‌మ‌ర్పించినా ఇళ్ల‌ను పొంద‌లేక పోతున్న సంద‌ర్భాలు ఉన్నాయి. మ‌రి ఇటువంటి వాటి విష‌యంలో ఎందుకు గ‌ట్టి చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు ? ఎందుకు ? ఆర్ఇఆర్‌ఎ వంటి చ‌ట్టాలు గ‌తంలోనే తీసుకువ‌చ్చి ఉండ‌వ‌చ్చు. కానీ అటువంటి చ‌ట్టాలను ప్రవేశపెట్టలేదు. ఈ ప్ర‌భుత్వం మాత్ర‌మే మ‌ధ్య‌ త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను అర్థం చేసుకుని బిల్డ‌ర్ల ఏక‌ప‌క్ష ధోర‌ణికి అడ్డుక‌ట్ట వేసేందుకు చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చింది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

మార్చి నెలలో బ‌డ్జెటును స‌మ‌ర్పించిన త‌రువాత ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లుకు పూర్తి సంవ‌త్స‌రకాలం ఉండ‌డం లేద‌ని మా ప్ర‌భుత్వం మాత్ర‌మే గ్ర‌హించింది. వ‌ర్షాకాలం కార‌ణంగా మూడు నాలుగు నెల‌లు వృథాగా పోతున్నాయి. అందుకే ఈసారి బ‌డ్జెటు స‌మ‌ర్ఫ‌ణ‌ను ఒక నెల ముందుకు జ‌రుపుతున్నాం. దీనివ‌ల్ల ఆయా శాఖ‌లకు నిధులు స‌కాలంలో అందితే ఆయా ప‌థ‌కాల అమ‌లుకు పూర్తి సంవ‌త్స‌ర‌ కాలం ఉంటుంది.

మిత్రులారా,

యూరియా, జౌళి, విమాన‌యాన రంగాల‌లో ఈ ప్ర‌భుత్వం కొత్త విధానాల‌ను రూపొందించింది. అలాగే స‌మీకృత ర‌వాణా వ్య‌వ‌స్థ‌కు ఒక కొత్త విధానాన్ని, ఆరోగ్య‌ రంగానికి మ‌రో విధానాన్ని రూపొందించింది. అంటే ఏదో విధానం రూపొందించ‌డం కోసం విధానాన్ని రూపొందించ‌డం కాదు. యూరియాకు సంబంధించి మేం పాల‌సీని మార్చిన‌పుడు దేశంలో కొత్త‌గా యూరియా ప్లాంటులు ఏర్పాట‌య్యాయి. యూరియా ఉత్ప‌త్తి 18-20 ల‌క్ష‌ల ట‌న్నులు పెరిగింది. ఇక వ‌స్త్ర‌ ప‌రిశ్ర‌మ రంగంలో తీసుకువ‌చ్చిన కొత్త విధానం కోటి కొత్త ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించ‌నుంది. విమాన‌యాన రంగంలో తీసుకువ‌చ్చిన విధాన‌ప‌ర‌మైన మార్పుల‌వ‌ల్ల చెప్పులు వేసుకుని తిరిగే వారికి కూడా విమానయాన స‌దుపాయం అందుబాటులోకి వ‌స్తుంది. ర‌వాణా రంగాన్ని స‌మీకృతం చేయ‌డం వ‌ల్ల వివిధ ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల‌పై భారం త‌గ్గుతుంది.

గ‌డ‌చిన మూడు సంవ‌త్స‌రాల‌లో 21 రంగాల‌లో 87 ముఖ్య సంస్క‌ర‌ణ‌లను తీసుకురావ‌డం జ‌రిగింది. ర‌క్ష‌ణ ,నిర్మాణ, ఆర్థిక సేవ‌లు, ఫూడ్ ప్రాసెసింగ్‌, ఇంకా ప‌లు రంగాల‌లో కీల‌క మార్పులు చేశాం. ఈ మార్పుల ప్ర‌భావం ఆర్థిక‌ రంగానికి సంబంధించిన వివిధ కొల‌మానాల‌పై స్ప‌ష్టంగా మీరు గ‌మ‌నించి ఉంటారు. మూడు సంవ‌త్స‌రాల‌లో భార‌తదేశం 142 వ స్థానం నుండి 100 వ స్థానానికి చేరింది. భార‌తదేశ విదేశీ మార‌క ద్ర‌వ్య నిల్వ‌లు 30 వేల కోట్ల డాల‌ర్ల‌ నుండి 40 వేల కోట్ల డాల‌ర్ల‌ కు చేరాయి. గ్లోబ‌ల్ కాంపిటీటివ్‌నెస్‌ ఇండెక్స్ లో భార‌తదేశం ర్యాంకు 32 పాయింట్లు మెరుగైంది. గ్లోబ‌ల్ ఇన్నొవేష‌న్ ఇండెక్స్ 21 పాయింట్లు పెరిగింది. లాజిస్టిక్‌ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 19 పాయింట్లు పెరిగింది. ఇక విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల గురించి ప్ర‌స్తావించుకున్న‌ట్ట‌యితే గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో భార‌త‌దేశ విదేశీ ప్ర‌త్య‌క్ష‌పెట్టుబ‌డులు సుమారు 70 శాతం వ‌ర‌కు పెరిగాయి.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఫిక్కీ స‌భ్యుల‌లో ఎక్కువ మంది నిర్మాణ‌ రంగానికి చెందిన వారు. నిర్మాణ రంగం విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌లో 75 శాతం మొత్తం గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లోనే వ‌చ్చింద‌ని మీకు తెలిసే ఉంటుంది.

అలాగే, విమాన‌యాన రంగం కావ‌చ్చు, మైనింగ్‌, కంప్యూట‌ర్ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, ఎల‌క్ట్రిక‌ల్ ప‌రిక‌రాల రంగం కావ‌చ్చు, ఈ రంగాల‌లో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌లో స‌గం ఎఫ్‌డిఐ లు గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో వ‌చ్చిన‌వే.

భార‌తదేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఎంత బ‌లంగా ఉందో చూప‌డానికి నేను మ‌రికొంత స‌మాచారాన్ని అందిస్తాను. ఈ స‌మాచారం గ‌త రెండు మూడు రోజుల‌లో విడుద‌లైందే. ఈ విష‌యంపై మీరు దృష్టిపెట్టాల‌ని కోరుతున్నాను.

మిత్రులారా,

దేశీయ విపణి లో పాసింజ‌ర్ వాహ‌నాల అమ్మ‌కాలు న‌వంబ‌ర్‌ లో 14 శాతం పెరిగాయి. దేశ ఆర్థిక కార్య‌క‌లాపాల‌కు ప్ర‌తిబింబంగా నిలచే వాణిజ్య వాహ‌నాల అమ్మ‌కం మ‌న దేశంలో 50 శాతం వృద్ధిని సాధించింది. ఉద్యోగకల్పనకు ఒక సూచికగా ఎంచే త్రిచ‌క్ర వాహ‌నాల విక్రయాలు నవంబ‌ర్‌ నెలలో 80 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఆదాయాల పెరుగుద‌ల‌కు, గ్రామీణ ప్రాంతాల‌లో ఆదాయాల పెరుగుద‌ల‌కు సూచ‌న‌గా భావించే ద్విచ‌క్ర వాహ‌న అమ్మ‌కాల రంగం 23 శాతం వృద్ధి సాధించింది.

మిత్రులారా,

ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై సామాన్యుడి విశ్వాసం పెరిగిన‌పుడే ఇలాంటి పెద్ద పెద్ద మార్పులు సంభ‌విస్తాయ‌ని మీకు తెలుసు. ప్ర‌భుత్వం క్షేత్ర స్థాయిలో పాల‌నప‌ర‌మైన‌, ఆర్థిక‌పరమైన, న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లను తీసుకొంటోందన‌డానికి ఈ సంస్క‌ర‌ణ‌లు సాక్ష్యం. ప్ర‌భుత్వం చేప‌ట్టిన సామాజిక సంస్క‌ర‌ణ‌లు ఆర్థిక సంస్కర‌ణ‌ల‌కు దారి తీస్తున్నాయ‌ని ఈ సంస్క‌ర‌ణ‌లు రుజువు చేస్తున్నాయి. ఉపాధి క‌ల్ప‌న‌లో ఇవి ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు, ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస్ యోజ‌న‌ (పిఎంఎవై) ను గురించి చెప్పుకొన్నట్లయితే, 2022 నాటికి ప్ర‌తి పేద‌వాడికి గృహ వ‌స‌తిని క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తోందని తెలియ‌జేస్తున్నాను. ఇందుకోసం న‌గ‌రాలలో, గ్రామాల‌లో ల‌క్ష‌లాది ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ ఇళ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన మాన‌వ వ‌న‌రుల‌ను స్థానికంగానే స‌మ‌కూర్చుకోవ‌డం జ‌రుగుతోంది. నిర్మాణ సామ‌గ్రిని కూడా స్థానిక విపణునల నుండే సేక‌రిస్తున్నారు. అలాగే దేశంలో గ్యాస్ గొట్టపుమార్గం నిర్మాణ ప‌నుల కార‌ణంగా ప‌లు న‌గ‌రాల‌లో సిటీ గ్యాస్ పంపిణీ వ్య‌వ‌స్థ ను అభివృద్ధిపరచడం జ‌రుగుతోంది. సిఎన్‌జి స‌ర‌ఫ‌రా జ‌రిగే ప్రాంతాల‌లో కొత్త ఉపాధి విపణి అవ‌కాశాల ఏర్పాటు జ‌రుగుతోంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

దేశ అవ‌స‌రాల‌ను అర్థం చేసుకొని మ‌నం అంతా క‌లిసి పనిచేస్తే అప్పుడు ప్ర‌జ‌ల ఆశ‌లు, అవ‌స‌రాలు తీరుతాయి.
దేశం విదేశాల‌ నుండి దిగుమ‌తి చేసుకోక త‌ప్ప‌ని వాటిని మ‌న‌ దేశంలోనే ఉత్ప‌త్తి చేసే అంశాన్ని ఫిక్కీతో సంబంధం క‌లిగిన కంపెనీలు ప‌రిశీలించాలి. చాలా రంగాల‌లో ముడి స‌ర‌కును మ‌న దేశం నుండి సేక‌రించి విదేశాల‌లో వాటిని త‌యారు చేసి, తిరిగి మ‌న‌కే వాటిని అమ్ముతున్నారు. ఇటువంటి ప‌రిస్థితి నుండి దేశాన్ని బ‌య‌ట‌ప‌డేయాలి.

మిత్రులారా,

మ‌న దేశం 2022లో 75 సంవ‌త్స‌రాల స్వాతంత్య్ర దినోత్స‌వాల‌ను జ‌రుపుకోనుంది. మ‌న‌మంతా ‘న్యూ ఇండియా’ నిర్మాణానికి ప్ర‌తిజ్ఞ చేయాలి. ఫిక్కీ వంటి సంస్థ‌ల ప‌ని చాలా విస్తృత‌మైంది. వారి బాధ్య‌త ఎంతో గొప్ప‌ది. ‘న్యూ ఇండియా’ నిర్మాణానికి వారు కొత్త ప్ర‌తిజ్ఞ‌తో ముందుకువ‌స్తారని ఆశిస్తున్నాను. దేశ భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని ఫిక్కీ ఎటువంటి కొత్త ప్ర‌తిజ్ఞ‌ల‌ను చేయ‌గ‌ల‌దో ప‌రిశీలించాలి. ఏదైనా చేయ‌డానికి మీకు ఎన్నో రంగాలు ఉన్నాయి. ఫూడ్‌ ప్రాసెసింగ్‌, ఆర్టిషిషల్ ఇంటెలిజెన్స్, సౌర విద్యుత్తు, ఆరోగ్య సంర‌క్ష‌ణ ల వంటి రంగాలు ఫిక్కీ అనుభ‌వం నుండి ప్ర‌యోజ‌నాన్ని పొంద‌గ‌ల‌వు. దేశ ఎమ్ఎస్‌ఎమ్ఇ రంగానికి ఒక మేధోమ‌ధ‌న ఖ‌నిగా మీ సంస్థ ప‌నిచేయ‌గ‌ల‌దా ?

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

మ‌నం చేయ‌వ‌ల‌సిన‌వి ఎన్నో ఉన్నాయి. మ‌నం ప్ర‌తిజ్ఞ‌ చేసి వాటిని సాకారం చేయాలి. మ‌న ప్ర‌తినలు నెరవేరాయంటే దేశం విజ‌యం సాధించిన‌ట్లు అవుతుంది. అయితే మ‌నం ఒక విష‌యాన్ని మ‌న‌సులో పెట్టుకోవాలి. ఒక్కోసారి క్రికెట్‌లో ఏం జ‌రుగుతుందో గ‌మ‌నించండి.. కొంద‌రు బ్యాట్స్‌మెన్ 90 ప‌రుగులు చేసిన త‌రువాత సెంచ‌రీ కోసం నెమ్మ‌దిగా ఆడ‌డం మొద‌లుపెడ‌తారు. ఫిక్కీ వారిని అనుస‌రించ‌కూడదు. మీరు నిద్ర మేల్కొని, ఫోర్ లేదా సిక్స్‌ కొట్టి అప్పుడు సెంచ‌రీని అధిగమించాలి.

ఫిక్కీ కి మరియు ఫిక్కీ స‌భ్యుల‌కు మ‌రో సారి నా శుభాకాంక్ష‌లను తెలియ‌జేస్తూ నేను నా ప్ర‌సంగాన్ని ముగిస్తాను.

మీ అంద‌రికీ అనేకానేక ధన్యవాదాలు.