పిఎంఇండియా
గౌరవనీయులు, నా ప్రియ మిత్రులు, అధ్యక్షుడు మాక్రోన్, వీసీలు, పరిశ్రమ నాయకులు, ఆవిష్కర్తలు,
బోంజోర్!
నమస్తే!
భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం మరో దేశంతో వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని సంబంధాలు కేవలం ఉమ్మడి ప్రయోజనాలతో మాత్రమే కాకుండా ఉమ్మడి లక్ష్యంతో కూడా ముందుకు సాగుతాయి. భారత్, ఫ్రాన్స్ మధ్య ఉన్న సంబంధం కూడా అలాంటిదే.
అనుబంధం, దృఢవిశ్వాసం అనే రెండింటితో ఈ సంబంధం కూడుకొని ఉంది. ఇది ఆవిష్కరణనూ, స్ఫూర్తినీ తనలో ఇముడ్చుకుంది. ఉమ్మడి విలువలు, ఉమ్మడి దార్శనికతే పునాదిగా ఈ బంధం ఏర్పడింది.
ఈ బంధం ఆధారంగానే గడచిన కొన్నేళ్లుగా మేం సంయుక్తంగా కొత్త కార్యక్రమాలను ప్రారంభించాం. కొత్త ఆలోచనలకు మార్గనిర్దేశం చేశాం. అలాగే ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు సాధ్యమైనంత మేర కృషి చేస్తున్నాం.
అంతర్జాతీయ సౌర ఒప్పందమైనా, ఏఐ సంబంధిత చర్చలైనా లేదా భద్రత నుంచి సుస్థిరత వరకు విస్తరించిన మన సహకారమైనా.. మానవాళికి సంబంధించిన ఏ సమస్యకైనా పరిష్కారాన్ని అందించేందుకు మా రెండు దేశాలు ఎల్లప్పుడూ కలిసే పనిచేశాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో, భారత్–ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం ప్రారంభమైంది. ఈ రోజు ఫ్రాన్స్ భాగస్వామ్యంతో భారత్ ఇన్నోవేట్స్ ప్రారంభం కావడం కూడా మాకు అంతే సంతోషాన్నిస్తోంది.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా మిత్రుడు, అధ్యక్షుడు మాక్రోన్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్ మాక్రోన్..! ఇటీవల భారత్‌లో మీరు చేసిన పర్యటనలో.. ఈ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా కృషి చేయాలని మీరు అన్నారు. ఈ రోజు చేపడుతున్న ఈ కార్యక్రమం.. ఆ దిశగా వేసిన ముఖ్యమైన ముందడుగు అని నేను గర్వంగా చెప్పగలను.
భారత్‌లో ఉన్న ప్రతిభకు, యూరోపియన్ పెట్టుబడులకూ మధ్య వారధిగా భారత్ ఇన్నోవేట్స్ వేదిక ఆవిర్భవించింది. ఐరోపా నైపుణ్యంతో భారతీయ యువ ప్రతిభ అనుసంధానమయ్యే అవకాశాన్నిచ్చే వేదిక ఇది.
మిత్రులారా,
ప్రస్తుతం, 21వ శతాబ్దపు భారతదేశం ఒక గొప్ప పరివర్తన దశలో ఉంది. అంకుర సంస్థల విప్లవానికి భారత దేశం సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ విప్లవంలో, భారతదేశ యువత ఒక నూతన దృక్పథంతో, మానవాళికి ప్రయోజనాన్ని అందించేలా సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తున్నారు. మా యువ ఆవిష్కర్తలు అభివృద్ధి చేసిన అంతర్జాతీయ స్థాయి పరిష్కారాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ‘భారత్ ఇన్నోవేట్స్‘ ఒక వేదికగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమ నిర్వహణకు నా స్నేహితుడు, ఐఐటీ ఢిల్లీ బోర్డు ఛైర్‌పర్సన్ శ్రీ హరీశ్ సాల్వే విశేష కృషి చేశారు. ఆయననూ, మొత్తం బృందాన్నీ అభినందిస్తున్నాను.
మిత్రులారా,
ఈ రోజు, ఇక్కడ యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారిలో ఒకరు భారత్ భవిష్యత్తుని చూడొచ్చు. ఇంకొకరు భారత యువత విశ్వాసాన్ని చూస్తూ ఉండొచ్చు. ఇంకొకరు నవ భారత శక్తిని వీక్షించవచ్చు.
కేవలం పరిష్కారాలను వినియోగించుకునే దేశంగానే మిగిలిపోకుండా.. పరిష్కారాలను అందించే దేశంగా భారత్ ఎదుగుతోంది. ఇక్కడ, కొందరు ఏఐ ద్వారా గ్రామీణ జీవితాన్ని మార్చేందుకు కృషి చేస్తుండగా, మరికొందరు రైతులకు తోడ్పడేలా ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ సిటీలు, అధునాతన తయారీ, నూతన పదార్థాల ద్వారా స్మార్ట్ సిటీల భవిష్యత్తును మరికొందరు తీర్చిదిద్దుతున్నారు. ఇంకొందరు గ్రీన్ హైడ్రోజన్, విద్యుత్ వాహనాలు, బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా సుస్థిర భవిష్యత్తును అందిస్తున్నారు. అదే సమయంలో రక్షణ, భద్రతా రంగాలలో కొత్త టెక్నాలజీలను అనేక అంకుర సంస్థలు అభివృద్ధి చేస్తున్నాయి.
విస్తృత స్థాయిలో, వేగంగా భారత్ ఆవిష్కరణలు చేస్తోందని మీ సామర్థ్యాలను చూసి నేను చెప్పగలను. సుస్థిరమైన భవిష్యత్తు కోసం, యావత్ ప్రపంచం కోసం భారత్ ఆవిష్కరణలు చేస్తోంది.
మిత్రులారా,
ఈ కార్యక్రమంలో అనేక మంది వెంచర్ క్యాపిటలిస్టులు, పరిశ్రమ దిగ్గజాలు ఉన్నారు. వారి సమక్షంలో.. భారత్ నుంచి వచ్చిన ఈ యువ ప్రతిభావంతులను నేను అభినందించాలనుకుంటున్నాను.
ఇక్కడికి వచ్చిన వారంతా సంప్రదాయ మార్గాన్ని కాకుండా.. కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తమకంటూ ఒక కొత్త దిశను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మీరు సుమారు 100 నుంచి 125 అంకుర సంస్థలను చూస్తూ ఉండవచ్చు. కానీ ప్రస్తుతం భారత దేశంలో 2,00,000కు పైగా ఇలాంటి అంకుర సంస్థలు ఉన్నాయి. ఈ అంకురసంస్థలే పునరుత్తేజిత శక్తితో భారతీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల వృద్ధికి దోహదపడుతున్నాయి.
మిత్రులారా,
ఈ ప్రపంచానికి.. అంతరాయమూ, అభివృద్ధితో కూడిన దశాబ్దమిది. కొనసాగుతున్న సంఘర్షణలు, పెరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావం మధ్య మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం మానవాళి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ.. మన ముందున్న అవకాశాలు కూడా అంతే ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి.
కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన మెటీరియళ్లు.. ఇవన్నీ మానవాళి భవిష్యత్తును తీర్చిదిద్దే సాంకేతిక పరిజ్ఞానాలు. అవి మానవ నాగరికతకు సంబంధించిన తదుపరి అధ్యాయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ప్రతి సాంకేతిక విప్లవం మానవాళికి నూతన అవకాశాన్ని అందిస్తోంది. ప్రతి అవకాశమూ కొత్త బాధ్యతను తీసుకొస్తోంది. విశ్వసనీయమైన, సమ్మిళితమైన, మానవ కేంద్రకమైన, ప్రపంచ క్షేమాన్ని లక్ష్యంగా చేసుకున్న సాంకేతిక పరిజ్ఞానాల వైపు ఈ ప్రపంచం చూస్తోంది. ఈ తరుణంలో మానవాళి కోసం సాంకేతిక పరిజ్ఞానాలకు, మానవ కేంద్రక ఆవిష్కరణలకు భారతదేశం ప్రాధాన్యమిస్తోంది.
మిత్రులారా,
మా డిజిటల్ విప్లవానికి ఈ మంత్రమే ప్రధానాధారంగా ఉంది. ఇది భారతదేశ డిజిటల్ మౌలిక వసతుల సారాంశాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. మా ఏఐ దార్శనికత ప్రాథమిక సూత్రం కూడా ఇదే. అందరి కోసం ఏఐ – అందరి సంక్షేమం, శ్రేయస్సు కోసం. ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రధాన ఇతివృత్తం కూడా ఇదే.
మిత్రులారా,
ఆవిష్కరణలు, సమ్మిళితం ఒకదానికొకటి విరుద్ధమైనవి కావని, పరస్పరం సహకరించుకొనేవని భారత్ నిరూపించింది. ఏ ఆవిష్కరణ గొప్పదనమైనా అది దాని విలువలో ఉండదనీ, మానవులపై అది చూపే ప్రభావంలోనే ఉంటుందని దీని అర్థం.
ఇదే భారత్ ఇన్నోవేట్స్ స్ఫూర్తి. ఇదే భారతదేశ దార్శనికత. ఇక్కడ ఉన్న అంకుర సంస్థలతో పాటు, మీ అందరికీ కూడా ఇది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
మిత్రులారా,
భారత్ డీఎన్ఏలోనే ఆవిష్కరణ ఉంది. తన విజ్ఞానం, ఆవిష్కరణలతో ఈ ప్రపంచానికి కొన్ని వేల ఏళ్లు భారత్ నూతన దిశను అందించింది. గణిత శాస్త్రం నుంచి ఖగోళ శాస్త్రం వరకూ, వైద్యశాస్త్రం నుంచి యోగా వరకూ భారత్ చేసిన కృషి మానవాళి ప్రగతికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేశాయి. ఈ వారసత్వానికి కొత్త వేగాన్ని, కొత్త దిశనూ ప్రస్తుతం మేం అందిస్తున్నాం.
మిత్రులారా,
గడచిన 11-12 ఏళ్లలో ఆవిష్కరణలకు అవసరమైన బలమైన వ్యవస్థను భారత్ నిర్మించింది. మేధోహక్కులు పొందడం నుంచి ఇంక్యుబేషన్ వ్యవస్థల వరకూ, స్టార్టప్ ఇండియా నుంచి విధాన సహకారం వరకూ ఈ మొత్తం ప్రయాణం యుద్ధ ప్రాతిపదికన ముందుకు సాగింది.
ప్రస్తుతం, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్ ఉంది. అయితే, మా దృష్టి కేవలం ప్రధాన నగరాలకే పరిమితం కాలేదు. ఆవిష్కరణలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేలా మేం కృషి చేశాం.
పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబులు ఏర్పాటయ్యాయి. హ్యాకథాన్లు, ఆవిష్కరణ సవాళ్లతో యువత అనుసంధానమైంది. దేశవ్యాప్తంగా ఇంక్యుబేటర్లు, పరిశోధనా సంస్థలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఆవిష్కర్తలు నూతన టెక్నాలజీలతో అనుసంధానమయ్యారు.
ఈ ప్రయత్నాలన్నింటి ఫలితంగా విస్తృత స్థాయిలో పరివర్తనను భారత్ సాధించింది. ప్రస్తుతం డ్రోన్ దీదీల నుంచి అంకుర సంస్థల వ్యవస్థాపకుల వరకూ.. నూతన విజయ గాథలను మా మహిళా శక్తి లిఖిస్తోంది.
మిత్రులారా,
మా యువత శక్తిని మరింత ఉపయోగించుకొనేలా భారత డిఫెన్స్ రంగం ఆవిష్కరణలకు స్వాగతిస్తోంది. భారత్‌లో రక్షణ, అంతరిక్ష రంగాలతో ముడిపడిన వందలాది అంకురంస్థలు ప్రస్తుతం అద్భుతమైన రీతిలో పనిచేస్తున్నాయి.
ఇటీవలే అణువిద్యుత్ రంగంలో కూడా భారత్ గణనీయమైన సంస్కరణలు చేపట్టింది. శుద్ధ ఇంధనం, అధునాతన రియాక్టర్లు, అత్యాధునిక పరిశోధనల్లో నూతన అవకాశాలను ఈ సంస్కరణలు అందించాయి.
ఈ సంస్కరణ ఎక్స్‌ప్రెస్ ఆగదు. అది నిర్విరామంగా ముందుకు సాగుతూనే ఉంటుంది. భారత్‌లో ఏర్పాటయ్యే అంకుర సంస్థలు అనేక రెట్లు పెరుగుతాయి.
మిత్రులారా,
దశాబ్దం కిందటి వరకు.. భారతదేశాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించేదిగా ఈ ప్రపంచం చూసేది. ఇప్పుడు.. టెక్నాలజీని అందించేదిగా భారతదేశం మారుతోంది. భారత్ ఏది ఆవిష్కరించినా, ఏ పరిష్కారం అందించినా అది మానవాళిలో అధిక భాగానికి ప్రయోజనం చేకూరుస్తుంది. భారత్ ఇన్నోవేట్స్ లక్ష్యం కూడా ఇదే.
భారతదేశంతో కలిసి అంతర్జాతీయ ఆవిష్కరణల తదుపరి అధ్యాయాన్ని రూపొందించడానికి ప్రపంచానికి అందిస్తున్న ఆహ్వానమే భారత్ ఇన్నోవేట్స్.
వచ్చే మూడు రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలు, చర్చలకు గాను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేం భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం. మేం సహ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాం. ఉమ్మడి పరిశోధనా, ఉమ్మడి తయారీనీ చేపట్టాలనుకుంటున్నాం. మేం దీర్ఘకాలిక సహకారాన్ని ఆశిస్తున్నాం.
ఇక్కడ ఉన్న ప్రతి పెట్టుబడిదారుడినీ, ప్రతి విశ్వవిద్యాలయాన్నీ, ప్రతి పరిశోధనా సంస్థనూ, ప్రతి ఔత్సాహిక పారిశ్రామికవేత్తనూ భారత దేశానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మాతో కలసి పనిచేయండి. భారత్‌లో రూపొందించండి. భారత్‌లో అభివృద్ధి చేయండి. ప్రపంచం కోసం పరిష్కారాలను రూపొందించండి.
ధన్యవాదాలు.
సూచన: ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.
***
Speaking at the Bharat Innovates programme in France. Innovation, technology and the aspirations of our youth are driving India’s transformation and shaping the future.@BharatInnov2026
— Narendra Modi (@narendramodi) June 14, 2026
https://t.co/66fM69ixSl
India and France share a special partnership. pic.twitter.com/qfHpAfyXvk
— PMO India (@PMOIndia) June 14, 2026
India's young innovators are finding solutions that can benefit all of humanity. pic.twitter.com/z7EayizJ97
— PMO India (@PMOIndia) June 14, 2026
India is emerging as a contributor of solutions to the world. pic.twitter.com/AX6hrKd6Jt
— PMO India (@PMOIndia) June 14, 2026
Bharat innovates with Scale and Speed.
— PMO India (@PMOIndia) June 14, 2026
Bharat innovates for a Sustainable Future.
And Bharat innovates for the whole World. pic.twitter.com/6BZpiX4LE2
Innovation is in India's DNA. pic.twitter.com/ARvIxniAri
— PMO India (@PMOIndia) June 14, 2026
Today, India is emerging as a technology provider. pic.twitter.com/g6KPdJPqkO
— PMO India (@PMOIndia) June 14, 2026
Bharat Innovates is an invitation to the world to co-create the next chapter of global innovation with India. pic.twitter.com/Yfmx2v1kVF
— PMO India (@PMOIndia) June 14, 2026