పిఎంఇండియా
‘బాల బాలికలకు ఉచిత మరియు నిర్బంధ విద్య (ఆర్ టిఇ) హక్కు చట్టం, 2009’లో సవరణకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది 2015 మార్చి నెల 31వ తేదీ నాటికి ఉద్యోగంలో ఉన్న టీచర్లందరు విద్యాలయాల సంబంధిత అధికార సంస్థ నిర్దేశించిన మేరకు కనీస అర్హతను సమకూర్చుకోవాలని పేర్కొన్న నిబంధనలోని గడువును- (తత్సంబంధిత శిక్షణకాలాన్ని) నాలుగు సంవత్సరాల పాటు అంటే 2019 మార్చి నెల 31వ తేదీ వరకు- పొడిగించేందుకు వీలు కల్పిస్తుంది.
ఇది సర్వీసులో ఉన్న ఎలిమెంటరీ టీచర్లకు వారి శిక్షణను పూర్తి చేసుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. అంతే కాక, దేశంలో ప్రాథమిక విద్యను బోధించే స్థాయి టీచర్లంతా ఒక నిర్ణీత కనీసార్హతల ప్రమాణాన్ని కలిగివుండాలని సూచిస్తుంది కూడా. బోధనకు సంబంధించిన నాణ్యత ప్రమాణాన్ని పరిరక్షించేందుకు అవసరమని ఎంచే కనీస యోగ్యతను టీచర్లందరూ సాధించేటట్లుగా కూడా చూస్తుంది. ఇది అంతిమంగా.. మొత్తంమీద టీచర్ల నాణ్యతలోను, విద్యాబోధన ప్రక్రియలలోను మరియు తత్పర్యవసానంగా బాలల నేర్చుకొనే తత్వంలోను మెరుగుదలకు తోడ్పడగలదు. ప్రాథమిక విద్య తాలూకు నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యాన్ని ఈ చర్య చాటిచెబుతోంది.
పూర్వ రంగం:
2010 ఏప్రిల్ 1వ తేదీ నాటి నుండి ‘బాల బాలికలకు ఉచిత మరియు నిర్బంధ విద్య (ఆర్ టిఇ) చట్టం, 2009’ అమలులోకి వచ్చింది. ఇది 6 -14 ఏళ్ల వయో వర్గానికి చెందిన బాల బాలికలు అందరికీ ఉచిత, తప్పనిసరి ప్రాథమిక విద్య లభించాలని సూచిస్తోంది. ఈ చట్టంలోని 23(2) వ నిబంధన ప్రాథమిక స్థాయి లోని టీచర్లంతా- ఈ చట్టం అమలు ఆరంభమైన కాలం నాటికి ఆర్ టిఇ చట్టం లో ఉల్లేఖించిన తరహా కనీస అర్హతలను సంపాయించలేదని- వారు వీటిని అయిదు సంవత్సరాల కాలం లోపల, అంటే 2015 మార్చి నెల 31 కల్లా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని నిర్దేశిస్తోంది. అయితే, పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక విద్య స్థాయి లోని మొత్తం 66.41 లక్షల మంది టీచర్లలోను 11 లక్షల మంది ఇప్పటికీ శిక్షణపొందిన వారు కాదని తెలియజేశాయి. (ఈ పదకొండు లక్షల మందిలో 5.12 లక్షల మంది ప్రభుత్వ, మరియు ఎయిడెడ్ పాఠశాలల టీచర్లు కాగా, 5.98 లక్షల మంది ప్రయివేటు పాఠశాలల వారు ఉన్నారు.) 2015 మార్చి నెలాఖరు తేదీ నాటికి ఉద్యోగంలో ఉన్న టీచర్లంతా అకడమిక్ అథారిటీ నిర్దేశించిన కనీస అర్హతలు సంపాదించుకొనేటట్లు చూడడానికిగాను, అటువంటి శిక్షణ కోసం పట్టే కాలాన్ని నాలుగు సంవత్సరాల పాటు అంటే 2019 మార్చి 31 వ తేదీ వరకు పొడిగించడం కోసం ఆర్ టిఇ యాక్ట్, 2009 లో తగిన సవరణ చేయవలసిన అవసరం ఏర్పడింది.