పిఎంఇండియా
బిఎస్ఎన్ఎల్ లో 2103 జూన్ పదో తేదీ కన్నా ముందు పదవీవిరమణ చేసిన పింఛనుదారులకు, కుటుంబ పింఛనుదారులకు పింఛను సవరణ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. దీని వల్ల (i) 50 శాతం డిఎ/ డిఆర్ ను మూల వేతనం/ పింఛనులో కలిసిపోతుంది. ఫలితంగా ఫిట్ మెంట్ కోసం డిఎ / డిఆర్ లో 78.2 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. (ii) రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లింపు భారాన్ని సవరించే అవకాశం కూడా లభిస్తుంది.
2013 జూన్ పదో తేదీకి ముందు రిటైరైన బిఎస్ ఎన్ ఎల్ పింఛనుదారులు/ కుటుంబ పింఛనుదారులకు 2007 జనవరి ఒకటో తేదీ నుండి ఈ సవరణ వర్తిస్తుంది. అయితే వాస్తవ ప్రయోజనం మాత్రం 2013 జూన్ పదో తేదీ నుండి వర్తిస్తుంది. ప్రస్తుత బిఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులతో సమానంగా డిఎ/ డిఆర్ లో 78.2 శాతం ఫిట్ మెంట్ కోసం పరిగణనలోకి వస్తుంది. అయితే ఈ డి సి ఆర్ జి పెంపుదల, లీవ్ ఎన్ కాష్ మెంట్, పెన్షన్ కమ్యుటేషన్ ల వంటివి మాత్రం పింఛనుదారులకు వర్తించదు.
2000 అక్టోబర్ ఒకటో తేదీకి ముందు రిటైరైన టెలికమ్యూనికేషన్ ల విభాగం (డి ఒ టి), టెలికాం సర్వీసుల విభాగం (డి టి ఎస్), టెలికాం నిర్వహణ శాఖల (డిటిఒ) పింఛను బాధ్యత పూర్తిగా భారతదేశ ప్రభుత్వమే భరిస్తుంది. బి ఎస్ ఎన్ ఎల్ కు ఆ భారం ఏ విధంగానూ వర్తించదు. బిఎస్ ఎన్ ఎల్ లోకి తీసుకున్న ఉద్యోగుల పింఛను ప్రయోజనాల భారం కూడా భారతదేశ ప్రభుత్వమే పూర్తిగా తీసుకుంటుంది. అయితే ఎఫ్ ఆర్ -116 కింద బి ఎస్ ఎన్ ఎల్ వారు పని చేసిన కాలానికి తన వంతు పింఛను వాటాను మాత్రం చెల్లించాల్సివుంటుంది.
ఈ నిర్ణయాల వల్ల పింఛనుదారుల విషయంలో రూ.129.63 కోట్లు, కుటుంబ పింఛనుదారుల విషయంలో రూ.24.93 కోట్ల భారం ప్రభుత్వానిదవుతుంది. అలాగే 2013-14 సంవత్సరం నుండి బకాయిల చెల్లింపు భారం పింఛనుదారుల విషయంలో రూ.239.92 కోట్లు, కుటుంబ పింఛనుదారుల విషయంలో రూ.44.62 కోట్లుగా ఉంటుంది. ఈ సవరణ వల్ల దేశవ్యాప్తంగా ఇంచుమించుగా 1,18,500 మంది ప్రయోజనం పొందనున్నారు.
2013 జూన్ ఆరో తేదీకి ముందు రిటైరైన, బి ఎస్ ఎన్ ఎల్ లో విలీనం అయిన ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండు దీని వల్ల నెరవేరుతుంది. పింఛనులో వ్యత్యాసాలు తొలగిపోయి, పింఛనుదారులు కూడా ప్రస్తుత బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులతో సమానం అవుతారు. దీని వల్ల బి ఎస్ ఎన్ ఎల్ పై ఆర్థిక భారం తగ్గుతుంది. పారిశ్రామిక అశాంతి తొలగుతుంది. ప్రభుత్వం తన వాగ్దానాన్ని నెరవేర్చినట్లు కూడా అవుతుంది.
పూర్వ రంగం:
2013 జూన్ పదో తేదీకి ముందు పదవీ విరమణ చేసిన బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల పింఛనులో వ్యత్యాసాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకుంది. పింఛన్ బాధ్యతపై నిర్ణయమనేది ఎప్పటి నుండో ఉన్న డిమాండు. అంతే కాదు, కార్పొరేటీకరణ చేయడానికి ముందు.. అంటే బి ఎస్ ఎన్ ఎల్ స్థాపనకు ముందు వేరు వేరు స్థాయిలలో సాగుతూ వచ్చిన సంప్రదింపులలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రస్తుత నిర్ణయంతో నెరవేర్చినట్లు కూడా అవుతోంది.