Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బెంగళూరులో దశమ: సౌందర్యలహరి పారాయణోత్సవ మహాసమర్పణె సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

బెంగళూరులో దశమ: సౌందర్యలహరి పారాయణోత్సవ మహాసమర్పణె సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

బెంగళూరులో దశమ: సౌందర్యలహరి పారాయణోత్సవ మహాసమర్పణె సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

బెంగళూరులో దశమ: సౌందర్యలహరి పారాయణోత్సవ మహాసమర్పణె సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం


వేదికను అలంకరించిన ప్రముఖులు, వేదాంత భారతితో అనుబంధం గల మహిళలు సజ్జనులారా,

ఏదైనా ఒక ప్రదేశంలో చేరిన వారంతా ముక్త కంఠంతో మంత్రోచ్చారణ చేస్తే అత్యంత బలమైన ఒక మహాశక్తి ఆవిర్భవించి మన మనస్సును, శరీరాన్ని, ఆత్మను తనలో మమేకం చేసుకుంటుందన్నది మన పురాతన విశ్వాసం. ఈ అర్థంలోనే నాదబ్రహ్మాన్ని మనం అంగీకరిస్తాం. మంత్రోచ్చారణ లోని శక్తి ని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా నిరాకరించదు. నేను ఈ రోజు ఈ వాతావరణం నడుమ అద్భుతమైన దక్షిణామూర్తి, సౌందర్యలహరి మంత్రాలను ఉచ్చరిస్తుంటే అటువంటి శక్తి నే అనుభూతి చెందుతున్నాను. ఈ పవిత్ర భావన లోని మధురానుభూతి మాత్రమే గాక భగవంతుడితో తాదాత్మ్యం చెందాలన్న బలమైన వాంఛ కూడా ఓ రహస్యమే.

సౌందర్యలహరిలో ప్రతి మంత్రం భిన్నమైన భావనను, భిన్నమైన శక్తిని ప్రతిబింబిస్తుంది. ఈ క్షణంలో ఆ స్ఫూర్తి, శక్తి మనలో కొత్త చైతన్యాన్ని నింపుతున్నాయి. నవరాత్రి వేడుకలలో భాగంగా ఎన్నో ఏళ్ల నుండీ నవరాత్రి తోనూ, సౌందర్యలహరి తోనూ ముడి పడిన వ్యక్తిగా నేను చాలా అదృష్టవంతుడిని అనేది నాలోని భావన.

సర్వోన్నతులైన శ్రీ శ్రీ శంకర భారతి మహాస్వామి గారికి ఇక్కడ నేను శిరస్సును వంచి ప్రణమిల్లుతూ వేదాంత భారతి కి నా యొక్క కృతజ్ఞతలను వ్యక్తం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగం కావలసిందిగా వారు నన్ను ఆహ్వానించి, ఇక్కడ అత్యుత్తమ సమయాన్ని గడిపే అవకాశం ప్రసాదించారు. శ్రీ శ్రీ శంకర భారతి మహా స్వామి గారి నేతృత్వంలో సౌందర్యలహరి పాఠ్యానుభవాన్ని పొందే అవకాశం లభించినందుకు నేను ఎంతో భాగ్యశాలిని. స్వామి గారి ఆశీస్సులతో సౌందర్యలహరి ఒక దశాబ్దం పూర్తి చేసుకొంది.

మీకందరికీ నా వైపు నుండి అభినందనలూ, శుభాకాంక్షలూను. ఈ పవిత్ర కార్యంలో భాగస్వాములు అయినందుకుగాను మీరందరూ అదృష్టవంతులని నా నమ్మకం. సోదరులు మరియు సోదరీమణఉలారా, ఓ ఎనిమిది లేదా పది రోజుల కిందట నేను కేదారనాథ్ వెళ్లాను. అది అక్కడి ఆలయ ద్వారాలను మూసివేసే సమయం. కానీ, ఆ మహాదేవుడిని అర్చించే అవకాశం నాకు లభించడం నా భాగ్యం. నేను కేదారనాథ్ కు వెళ్లినప్పుడల్లా దుర్గమమైనటువంటి ఈ ఆలయానికి ఆదిశంకరాచార్య గారు వేలాది సంవత్సరాల క్రితం ఎలా చేరుకోగలిగారు ? అనే ప్రశ్న నా మనస్సులో తలెత్తుతుంటుంది.

ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో అయినా, అక్కడకు వెళ్లడం అంత సులభం ఏమీ కాదు. మరి ఆదిశంకరుల వారు వేల సంవత్సరాల కిందట ఎలా చేరుకోగలిగారు ? కేవలం 32 ఏళ్ల వయస్సుకే మూడు సార్లు దేశాన్నంతా చుట్టి నాలుగు చెరగులా నాలుగు మఠాలను స్థాపించగలిగే విధంగా శంకరాచార్యునికి ఉత్తేజాన్ని ఇచ్చిన ఆది అంతాలు లేని ఆ శక్తి స్వరూపం ఏది ? ఓ పూలమాలను కట్టినట్టు భారతదేశాన్ని సాంస్కృతికంగా ఏకీకృతం చేయడంలో ఆయన కృషి నిరుపమానం.

మన ఆధ్యాత్మిక సంప్రదాయాలను బలోపేతం కోసం ఆది శంకరాచార్యుల వారు తన జీవితాన్ని అంకితం చేశారు. మన సంప్రదాయాల్లోకి పాకిన అనేక చెడుగులను ఆయన కూలంకషంగా విశ్లేషించారు. అంతేకాదు.. మన లోని ఆ చెడుగులను ఎత్తిచూపడంలో అంత చిన్న వయస్సు లోనే ఎంతో సాహసం ప్రదర్శించారు. భవిష్యత్తరాలు తప్పుదోవ పట్టకుండా కచ్చితమైన వాదనను ముందుకు తెచ్చారు. శివ-శక్తి-విష్ణు-గణపతి, కుమారస్వామి లను సామూహికంగా ఆరాధించే సంప్రదాయం లోని ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పారు. భారతీయ సంప్రదాయాన్ని ఆయన పునఃస్థాపించారు. ఆదిశంకరాచార్యుల వారు వేదాలు, ఉపనిషత్తుల విజ్ఞానంతో మొత్తం భారతదేశాన్ని ఒక్కటి చేసి ఐకమత్య భావనతో జోడించారు. ఆయన పవిత్ర గ్రంథాలనే మాధ్యమంగా చేసుకొన్నారు. భిన్న విశ్వాసాలు, తత్త్వశాస్త్ర సిద్ధాంతాలలోని ఉత్తమ అంశాలు అన్నింటినీ క్రోడీకరించి ప్రజలంతా భక్తి విజ్ఞాన పథాన్ని అనుసరించేలా చైతన్యం తెచ్చారు. భవిష్యత్తు తరాల కోసం సౌందర్యలహరి ని ఆయన సృష్టించగా, అది దేశం లోని ప్రతి సామాన్యుడూ తనను తాను లీనం చేసుకొనే వ్యవస్థగా రూపుదాల్చింది. దైవాన్ని ప్రసన్నం చేసుకోవడంలో దైవం యొక్క భిన్న రూపాల మధ్య భేదాలు ఏవీ లేవని సౌందర్యలహరిలో మనకు భరోసా లభిస్తుంది.

‘‘ఏకం సద్విప్ర బహుధా వదంతి’’

సౌందర్యలహరి నుండి పొందిన ఆశీస్సులు ఎలాంటి విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరి మీదా కురుస్తాయి. సౌందర్యలహరిని పఠించే వారికి జ్ఞానం, సంపద, ఆరోగ్యం- ఒకటేమిటి.. సర్వం సిద్ధిస్తాయని మన విశ్వాసం. ఆదిశంకరాచార్యుల వారి తప:ఫలం భారతీయ సంప్రదాయంలో నేటికీ అదే రూపంలో ఉంటూ ప్రతి ఒక్కరినీ, ప్రతిదానిని ఏకీకృతం చేస్తోంది. నవ భారతానికీ ఈ సంస్కృతే ప్రాతిపదిక; ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ (అందరి సహకారంతో అందరి అభివృద్ధి) అనే మంత్రానికీ ఈ సంస్కృతే మూలాధారం.

సోదరులు మరియు సోదరీమణులారా, ఆదిశంకరాచార్యుల వారి సందేశాన్ని జనావళికి చేరవేయడం కోసమే శ్రీ శంకర భారతి మహాస్వామి గారు తన జీవితాన్ని అంకితం చేశారు. సకల ప్రపంచాన్ని తన కుటుంబంగా భావిస్తూ ఆదిశంకరాచార్యులు ఇచ్చిన ‘ఏకాత్మతా భావం’ సందేశం వేదాంత భారతి సంస్థ ద్వారా జనావళిని చేరుతోంది. విభిన్న భాషల్లో వేదాలు, ఉపనిషత్తులు, ఇతర పుస్తకాల ముద్రణ వారి కార్యకలాపాలతో ముడిపడి నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం.

మిత్రులారా, భారతీయ ఆధ్యాత్మిక వైభవం, పురాతన సందేశాన్ని ప్రజలు ఎంత ఎక్కువగా చదివితే తద్వారా ప్రపంచం అంత ఎక్కువగా లబ్ధి పొందుతుంది. ఇతరుల కన్నా తానే గొప్ప అన్న భావనను వ్యక్తీకరించుకోవడం కోసం లేదా మోక్షసాధన మార్గంపై ఘర్షణల వంటి వాటితో గందరగోళంలో పడిన మానవ జాతి సంక్షోభాల గుండా సాగుతోంది. అందుకే ఆదిశంకరాచార్యుల వారు ‘ద్వైత’ (రెండోది) అనేది లేని ‘అద్వైత’ లేదా ‘ఏకత’ సూత్రాన్ని ఆవిష్కరించారు. ద్వంద్వత అనేదే లేనపుడు ఇక ఘర్షణ లేదా వైరుధ్యాలకు తావే లేదు. జీవన గమనంలో అవరోధాలు ఎదురైనపుడల్లా ప్రపంచంలోని భిన్న ప్రాంతాలు భారతదేశం వైపే దృష్టి సారించాయి. ఈ విధంగా మన సంప్రదాయాలు ప్రపంచ సమస్యలన్నిటినీ పరిష్కరించగలవు. ఈ సంప్రదాయాలను మనం వారసత్వంగా అందిపుచ్చుకొన్నాం.

ఓం సహ నావవతు । సహ నౌ భునక్తు ।

సహ వీర్య: కరవావహై । తేజస్వి నావ‌ధీత మ‌స్తు మా విద్విషావ‌హై ।

ఓం శాంతిః శాంతిః శాంతిః ॥

ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలి.. ప్రతి ఒక్కరూ బలోపేతులు కావాలి. మనం ‘నేనే వర్ధిల్లాలి’ అనో, లేదా ‘నేనే బలవంతుడిని కావాలి’ అనో ఎన్నడూ అనం. ఆలయాలలో కూడా ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని, బలోపేతులు కావాలని మనం ప్రార్థిస్తాం. ఇదీ మన సంప్రదాయం. ఎవరూ ఇతరులపై అసూయ చెందరాదు.

ఇవాళ ఈ సందర్భంలో వేదాంత భారతి నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమం ‘వివేక దీపని’ మరియు ‘వివేక ఉత్కర్షని పోటీ’ ని గురించి నేను ప్రస్తావించదలిచాను. ఆది శంకరాచార్య తో, మన ఆధ్యాత్మిక సంప్రదాయాలతో, సంస్కృతితో మమేకం కావడాన్ని బలహీనపరచేందుకు ప్రయత్నాలు జరిగాయని చాలా కొద్దిమందికే తెలుసు. వీటిని నాశనం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా, వేలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ వారసత్వాన్ని అంతం చేయడం ఎవరివల్లా కాలేదు..

दीन-ए-इलाही का बेबाक बेड़ा,
नक्शा जिसका अक्स-ए-आलम में पहुंचा।
किए पांच सौ पार सातों समुंद्र,
न अमन में ठिठका न कोई गुलजाम में झिझका।
वो डूबा दोहाब-ए में गंगा के अंदर।।

అయితే, సుదీర్ఘ కాలం పాటు సాగిన బానిసత్వం ప్రభావం కారణంగా మన ఆధ్యాత్మిక విజ్ఞానం అత్యధికంగా పుస్తకాలకే పరిమితమైంది. అది కొద్దిమంది గురువుల వల్ల మాత్రమే పదిలంగా నిలచింది. స్వాతంత్ర్యం సిద్ధించాక చేయవలసిన రీతిలో కృషి సాగలేదు. ఇవాళ యువతరం ప్రతిదానిని మొబైల్ ఫోన్ లలో చదివేస్తున్న నేపథ్యంలో పుస్తకాల్లో దాగిన సంప్రదాయ విజ్ఞానం గురించి వాళ్లకు ఎలా తెలుస్తుంది ? ఈ ఘనమైన వారసత్వం గురించి వారికి ఎవరు చెబుతారు ? అందువల్ల పాఠశాల విద్యార్థులకు మన భారతీయ సంస్కృతిని గురించి, విలువలను గురించి చెప్పడానికి ‘వివేక దీపని’తో పాటు క్విజ్ పోటీని నిర్వహించాలనేది స్వామి వారు తలపెట్టినటువంటియ ఓ గొప్పకార్యం. ఇది భావి తరాలకూ ఒక ఘనమైన సేవ.

భారతీయ తత్త్వశాస్త్రంలో మోక్షసాధనే ఏ వ్యక్తికైనా అంతిమ లక్ష్యం. ‘వ్యష్టి లేదా వ్యక్తి, సమష్టి లేదా సమాజం, సృష్టి లేదా విశ్వం, పరమేష్ఠి లేదా దైవం’ తదితరాలన్నీ పరస్పరం ముడిపడినవని వేదాలు, ఉపనిషత్తుల సిద్ధాంతాలు విశ్వసిస్తాయి. మనం వాటిని ఒక్కటిగా తప్ప విడివిడిగా చూడలేం. ఈ సిద్ధాంతం ఈ గ్రహాన్ని ‘భూ మాత’గా గుర్తిస్తుంది. భూమి అందరిదీ అని, ఇది మన తల్లి అని చెబుతుంది. ఈ సిద్ధాంతమే ‘వసుధైవ కుటుంబకమ్’ అనే భావనకు జన్మనిచ్చింది.

ఇదేవిధంగా సౌందర్యలహరి లోనూ ఒక మంత్రం- ‘ఫలః అపివాంఛా సమాధికమ్’ అంటే.. భూమాత మనం కోరినదాని కన్నా అధికంగానే ప్రసాదిస్తుంది అని సూచిస్తుంది. అంతటి గొప్ప సత్యం ఈ సరళమైన పదంలో ప్రతిబింబిస్తుంది. నీరు, గాలి, నదులు, ధాన్యాలు, లోహాలు, మొక్కలు.. ప్రతి ఒక్కటీ మనకు ప్రకృతి తగినంతగా సమకూర్చిపెట్టింది. ఈ వరాన్ని పదిలం చేసుకోవడం అత్యంత అవశ్యం.

ఈ ఆలోచనే మన సంప్రదాయం. వనరులను సమతూకంతో వాడుకోవాలి తప్ప, ప్రకృతిని దోచుకొనే ప్రయత్నం చేయవద్దని అది మనకు ప్రబోధిస్తుంది. ప్రకృతిని దోచుకోవడమంటే నేరమే. కేవలం ‘ప్రయోజనాలను పిండుకోవడమే’ మానవుడికి గల హక్కు. మన సంప్రదాయం మనకు నేర్పింది ఇదే. మా పరిపాలన, కార్యనిర్వహణలలో దీనిని మీరు చూస్తూనే ఉండి ఉంటారు.

సోదరులు మరియు సోదరీమణులారా, న్యాయం, ఆత్మగౌరవం, అవకాశం, సౌభాగ్యం వంటివి తనకు మాత్రమే కాకుండా ప్రపంచానికి అంతటికీ దక్కే విధంగా భారతదేశం నిరంతర కృషి చేస్తూనే ఉంది. నిరుడు ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్ కు శ్రీకారం చుట్టడం మీకందరికీ తెలిసే ఉంటుంది. సౌర శక్తిని జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఇవాళ్టికీ కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలలో ప్రకృతిని పరిరక్షించాలన్న ఆకాంక్ష తొంగిచూడడాన్ని మీరు గమనించే ఉంటారు. సౌర, పవన, జల విద్యుత్తు రంగాలలో నేడు సాగుతున్న కృషిని మునుపెన్నడూ చూసి ఉండరు.

ప్రపంచంలోనే అతిపెద్ద నవీకరణ యోగ్య సామర్థ్య విస్తరణ కార్యక్రమం ఈ దేశంలో.. సౌందర్యలహరి కి నిలయమైన మన దేశంలో.. నడుస్తున్నది.

ఆ మేరకు 2030కల్లా మన శక్తి అవసరాలలో 40 శాతాన్ని శిలాజేతర ఇంధన ఆధారిత నవీకరణ యోగ్య శక్తి వనరుల ద్వారా తీర్చుకోవాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకొంది. ఇక 2022 లో భారతదేశం 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో అప్పటికల్లా 175 గీగావాట్ల ను సంపాదించుకోవాలన్న ధ్యేయంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. నేను చెబుతున్నది మెగావాట్ కాదు…అది గతకాలపు ముచ్చట. ఇప్పుడు మనం గీగావాట్ లను గురించి.. నవీకరణ యోగ్య శక్తి ఉత్పత్తిని గీగావాట్ల స్థాయిలో సాధించాలనే అంశంపై మాట్లాడుకుంటున్నాం. గడచిన మూడేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న కృషివల్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని 22000 మెగావాట్ల మేర పెంచి, సంధానం చేశాం. మునుపటి ప్రభుత్వం తన చివరి మూడేళ్లలో రూ.4,000 కోట్లు ఖర్చుచేసి, కేవలం 12,000 మెగావాట్ల సామర్థ్యం సాధించగలిగింది. మేం అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో దాదాపు రూ.11,000 కోట్లు వెచ్చించాం.

ప్రస్తుతం దేశ విద్యుదుత్పాదన సామర్థ్యం 300 గీగావాట్లు. ఇందులో తాప (బొగ్గు), జల, సౌర, పవన విద్యదుత్పాదన రంగాలన్నీ కలిసి ఉన్నాయి. మనకు లభ్యమయ్యే వనరులన్నిటినీ సద్వినియోగం చేసుకోగలిగితే ఒక్క సౌర శక్తి ద్వారానే మనం 750 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలమంటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. కాకపోతే మనం చేయాల్సిందల్లా మన సామర్థ్యాన్ని గరిష్ఠంగా వినియోగించుకోవడమే.

ప్రభుత్వం ఈ దిశగా అవిశ్రాంత కృషి చేస్తోంది. తదనుగుణంగా దేశవ్యాప్తంగా సోలార్ పార్కులు ఏర్పాటవుతున్నాయి. ఇళ్ల పైకప్పుమీద సౌర విద్యుత్ ఉత్పాదన కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భవన నిర్మాణ నిబంధనలను మార్చాం. ప్రభుత్వ భవనాల్లో సోలార్ ప్లాంటుల ఏర్పాటుకు స్వల్ప వడ్డీ రుణాలను అందిస్తున్నాం. సౌర విద్యుత్ ప్లాంటుల ఏర్పాటుకు మౌలిక సదుపాయాల హోదా ఇచ్చి, దీర్ఘకాలిక రుణాలు కూడా అందజేస్తున్నాం. బెంగళూరు ఒకవిధంగా స్టార్ట్- అప్ సంస్థల నగరం. ఇక్కడి యువత అన్వేషణలో, ఆవిష్కరణలో పాలు పంచుకొంటూ ఉంటారు. ఆ మేరకు స్టార్ట్- అప్ సంస్థలతో ముడిపడిన బెంగళూరు యువతకు ఆహ్వానం పలుకుతున్నాను. రండి.. పరిశుభ్రమైన వంట ఉద్యమాన్ని ప్రారంభిద్దాం.. సౌర శక్తిని వినియోగించే చౌకైన, అందుబాటు ధరతో వంట స్టవ్ ను తయారు చేయడం ఎలా ? నేటి ఆధునిక కుటుంబాలకు పాత నమూనా సౌర కుకర్లు తగినవి కావు. వారికి గ్యాస్, ఓవెన్ ల వంటివి కావాలి. నేడు ఇవన్నీ సాధ్యమే. యువతకు, స్టార్ట్- అప్ సంస్థలకు ఈ రంగంలో అతిపెద్ద విపణి నేడు సిద్ధంగా ఉంది. పెద్దవారైన మన తల్లులకు పరిశుభ్రమైన వంట ఒక వరం కాగలదు. అటవీ ప్రాంతాల్లో నివసించే వారు వంటచెరకు కోసం అడవులపై ఆధారపడే దుస్థితి తప్పుతుంది. సౌర శక్తి తోనే వారు తమ ఆహారాన్ని తయారుచేసుకోగలరు. దీనివల్ల పిల్లల కోసం ఆహార తయారీ సమయం తగ్గుతుంది. దేశానికి ప్రయోజనకరమైన ఆవిష్కరణల దిశగా మనం శ్రమించాలి. దేశంలోని ప్రతి సంస్థ తమ ఇంధన అవసరాలను తామే తీర్చుకోగలిగిన నాడు సమాజంపై దాని ప్రభావ స్థాయి ఎలా ఉంటుందో మీరే చూస్తారు.

మిత్రులారా, ఈ కొత్త విధానం మన పర్యావరణాన్ని రక్షించడంతో పాటు ప్రజాధనాన్ని ఎలా పొదుపు చేయగలదో సోదాహరణంగా వివరించాలని భావిస్తున్నాను. సోదరులు మరియు సోదరీమణులారా, ఇంతకుముందు రూ.350 విలువచేసే ఎల్ఇడి బల్బు నేడు కొత్త ‘ఉజాలా’ పథకం లో భాగంగా రూ.40- 45కే లభిస్తోంది. ఇప్పటిదాకా 27 కోట్ల ఎల్ఇడి బల్బులను దేశవ్యాప్తంగా మా ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందులో భాగంగా కర్ణాటక లోనూ సుమారు 1.75 కోట్ల బల్బులు పంపిణీ అయ్యాయి. ఒక ఎల్ఇడి బల్బును వినియోగించడం వల్ల రూ.250 వంతున పొదుపైనట్లు భావించినా, దేశం లోని మధ్య తరగతి ప్రజలు రమారమి రూ.7,000 కోట్ల దాకా పొదుపు చేసినట్టే. అంతేకాకుండా ఈ బల్బులతో ప్రతి ఇంటి విద్యుత్తు బిల్లు తగ్గుతుంది. ఇంట్లో ఈ బల్బులు అమర్చుకున్న వారికి ఇది కచ్చితంగా అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అంటే విద్యుత్తు వినియోగం తగ్గిందన్న మాట. ఇలా ఏడాది వ్యవధిలో మధ్య తరగతి కుటుంబాలు సుమారు రూ.14,000 కోట్లు ఆదా చేశాయి. సహజంగానే ఎల్ఇడి బల్బులు విద్యుత్తు వినియోగాన్ని తగ్గించాయి. అంటే మన స్థాపిత విద్యుత్తు సామర్థ్యంలో 7000 మెగావాట్ల ఉత్పాదన అవసరం తగ్గిందన్న మాట. ఒక 7000 మెగావాట్ల విద్యుదుత్పాదన కేంద్రం స్థాపించాలంటే కనీసం రూ.35- 40 వేల కోట్ల నిధులు అవసరం. దీన్నిబట్టి 7000 మెగావాట్ల విద్యుత్తు ఆదాతో మనం దేశానికి రూ.35- 40వేల కోట్లు పొదుపు చేశామన్న మాట! ఇది కేవలం మన పని పద్ధతిని ప్రణాళికబద్ధంగా మార్చుకోవడంద్వారా సాధ్యమైంది. ఎల్ఇడి బల్బుల కొనుగోలు, తద్వారా విద్యుత్తు వినియోగంలో తగ్గుదల ద్వారా మధ్య తరగతి ప్రజానీకం చేసిన ఆదా విలువ దాదాపు రూ.55- 60వేల కోట్లు. మొత్తంమీద మధ్య తరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరింది.

ప్రభుత్వ కృషి ఫలితంగా స్థానిక పాలన సంస్థలు వీధి దీపాలను ఎల్ఇడి బల్బులతో మారుస్తూ ఆర్థికంగానూ ప్రయోజనం పొందుతున్నాయి. నేను వారణాసి ఎంపీగా ఆ పట్టణం 15 కోట్లు ఆదా చేసేందుకు తోడ్పడ్డాను. ఆ నిధులు ఇప్పుడు ఇతర పథకాలకు ఉపయోగపడుతున్నాయి. దేశంలో ఒక రెండో అంచె నగరం సుమారు 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఆదా చేయగలదని దీన్నిబట్టి అంచనా వేయవచ్చు.

ఈ నిధులను సదరు నగరం అభివృద్ధి కోసం ఖర్చు చేయవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ కృషితో విదేశాల నుండి పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకొనే ఖర్చు తప్పే అవకాశం ఉంటుంది.

సోదరులు మరియు సోదరీమణులారా, పెట్రోల్, డీజిల్ లకు భవిష్యత్తు లేదు. ఈ సహజ వనరులు ఒకనాటికి ఇంకిపోతాయి.. ఇక సౌర శక్తి, పవన శక్తి, జల శక్తిలదే భవిష్యత్తు. ఈ శక్తుల ఉత్పాదన మన దేశంలో చాలా సులభం.. ఎందుకంటే మనం ప్రకృతి ఆరాధకులం, పరిరక్షకులం. వృక్ష పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేయడానికైనా వెనుకాడని వారసత్వ సంప్రదాయం మనది. ఓ కొమ్మను విరవాలన్నా మనం ప్రార్థన చేస్తాం. భూత దయ, జీవరాశులపై ప్రేమాభిమానాలను బాల్యం నుండే నేర్చుకొంటున్న జాతి మనది. ప్రతి రోజూ హారతి తరువాత మనం ‘‘వనస్పతాయః శాంతి ఆపః శాంతిః’’ (వనస్పతులారా మీకు శాంతి.. సర్వం శాంతి) అనే మంత్రాన్ని జపిస్తాం.

అయితే, కాలక్రమంలో ఈ సంప్రదాయం మాసిపోయిందన్నది నిజం. ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించే దిశగా మన యోగులు తమ కృషిని ముమ్మరం చేయాలి. సంప్రదాయాల రూపంలోని మన ప్రబోధాలను ఆచరణలోకి తెస్తేనే మనం వాతావరణ మార్పు సవాలును ఎదుర్కొనగలం. మన రుగ్వేదం మొత్తం దీనికే అంకితమైంది.

సోదరులు మరియు సోదరీమణులారా, ఉజ్జ్వల యోజనను గురించి కూడా ఒక ఉదాహరణ ఇవ్వాలని నేను భావిస్తున్నా. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఇప్పటి దాకా 3 కోట్ల మందికిపైగా పేద మహిళలకు వంటగ్యాస్ కనెక్షన్ లు ఇచ్చింది. ఇలా గ్యాస్ అందుబాటులో లేక ముందు వీరంతా వంట చెరకు మీదనో లేదా కిరోసిన్ మీదనో ఆధారపడి ఉండే వారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం వల్ల వారి జీవితాలకు సౌలభ్యంతో పాటు వారికి సురక్షిత పర్యావరణాన్ని కూడా కల్పించింది.

వ్యక్తులలో మార్పు, సమాజంలో మార్పు సహా మన దేశం కాలక్రమంలో అనేక మార్పులకు లోనైంది. కొన్నేళ్లుగా కొన్ని చెడుగులు మన సమాజంలోకి పాకాయి. కానీ, అటువంటి చెడుగులు ప్రవేశించినప్పుడల్లా సమాజంలో ఎవరో ఒకరు వాటి నిర్మూలనకు నేతృత్వం వహిస్తూ రావడం మన సమాజ విశిష్ట లక్షణం. సామాజిక ఉపద్రవాలకు వ్యతిరేకంగా మనను చైతన్యపరచడం కోసం మన గొప్ప రుషులు వారి జీవితాలనే అంకితం చేశారు. ఒకానొక కాలంలో మన దేశం రుషుల నాయకత్వంలోనే నడిచేది.

ఆది శంకరాచార్య, స్వామి బసవేశ్వర వంటి మహనీయులు ఎప్పటికప్పుడు ఇటువంటి సామాజిక రుగ్మతలను గుర్తించి మోక్షమార్గం చూపుతూండటం మన దేశానికే విశిష్టమైన లక్షణం. ఇప్పుడు సమయానుగుణంగా మన దేశంతో పాటు మన మతం, దైవం.. అంటే భారత మాత ను గురించి మాట్లాడాల్సి ఉంది. అవిద్య, అజ్ఞానం, పౌష్టికాహార లోపం, నల్లధనం, అవినీతి తదితర పీడ ల బారి నుండి దేశ మాత ను విముక్తం చేయాలంటే మన సాధులోకం, ఆధ్యాత్మిక సమాజం తమ కృషిని ముమ్మరం చేస్తూ దేశానికి మార్గదర్శనం చేయాల్సి ఉంది.

ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోను, సంయుక్త కృషితోను మనం ఒక న్యూ ఇండియా ను సృష్టించగలం. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి సహాయంతోనే అభివృద్ధి చెందగలుగుతారు.

సౌందర్యలహరి పఠనంపై, పదేళ్ల నిరంతర ఆధ్యాత్మికాచరణపై నేను మీ అందరికీ మరోసారి అభినందనలు తెలుపుతున్నా. గడచిన దశాబ్ద కాలంగా ఈ తపస్సులో నిమగ్నమైన ఆధ్యాత్మిక మార్గదర్శులకు శిరస్సును వంచి నమస్కరిస్తూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ శ్రీ శంకర భారతి మహాస్వామి గారికి పాదాభివందనం ద్వారా నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.

ఈ పవిత్ర సందర్భంలో నేను ఇక్కడకు హాజరయ్యే అవకాశం నాకు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నానని మరోసారి ప్రకటిస్తున్నాను. ఇది నాకు ఒక వరం వంటిది. మీ ఆశీస్సులను కోరుకొంటూ, తల్లి భారతి కోసం మంచి పనులను కొనసాగించాలనే నేను కోరుకొంటున్నాను.

అనేకానేక ధన్యవాదాలు.

***