పిఎంఇండియా
అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం
బ్రిక్స్ వ్యవసాయ పరిశోధన వేదిక-BRICS-ARP ఏర్పాటు కోసం భారత్-బ్రిక్స్ కూటమిలోని వివిధ దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి సంతకానంతర ఆమోదం తెలిపింది.
నేపథ్యం:
రష్యాలోని ఉఫాలో 2015 జూలై 9వ తేదీన నిర్వహించిన 7వ బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మొత్తం ప్రపంచానికే ఒక విలువైన కానుకవంటి బ్రిక్స్ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. బ్రిక్స్ సభ్య దేశాలలో సుస్థిర వ్యవసాయాభివృద్ధి, పేదరిక నిర్మూలనతోపాటు ప్రజానీకానికి ఆహార భద్రత కల్పన కోసం వ్యవసాయం రంగంలో వ్యూహాత్మక సహకారం దీని లక్ష్యం.
తదనుగుణంగా వ్యవసాయ పరిశోధన వేదిక ఏర్పాటు దిశగా రూపొందించిన అవగాహన ఒప్పందంపై గోవాలో 2016 అక్టోబరు 16వ తేదీన నిర్వహించిన 8వ బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సులో బ్రిబ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు సంతకాలు చేశారు. వ్యవసాయ పరిశోధన విధానం, శాస్త్ర-సాంకేతికత, ఆవిష్యరణలు, సామర్థ్య నిర్మాణం తదితర రంగాల్లో బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తృతపరచడం దీని ఉద్దేశం. అలాగే బ్రిక్స్ దేశాల్లో చిన్న కమతాల కోసం సాంకేతిక పరిజ్ఞాన రూపకల్పనను కూడా ఈ ఒప్పందం లక్షిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పోషకాహార లోపం, పేదరికం అసమానతలను పారదోలే దిశగా శాస్త్ర చోదిత వ్యవసాయాధార సుస్థిర అభివృద్ధికి బ్రిక్స్-ఏఆర్‌పీ ఒక సహజ వ్యవసాయ పరిశోధన వేదిక కాగలదు. ప్రత్యేకించి కర్షకులు, కర్షకేతరుల ఆదాయాల మధ్య అంతరాన్ని తొలగించడం, వ్యవసాయ వాణిజ్యాభివృద్ధి, జీవవైవిధ్య భద్రత, వాతావరణానుకూల వ్యవసాయం తదితరాలకు ఈ అవగాహన ఒప్పందం దోహదపడగలదు.