పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం భారతదేశం, కెనడా ల మధ్య కుదిరిన ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రానికి (ఎమ్ఒయు కు) ఎక్స్-పోస్ట్ అప్రూవల్ ను ఇచ్చింది. మేధో సంపత్తి (ఐపి) రంగంలో ద్వైపాక్షిక సహకారపూర్వక కార్యకలాపాలను నెలకొల్పుకొనేందుకు 2018 ఫిబ్రవరి 23వ తేదీన ఎమ్ఒయు పైన సంతకాలయ్యాయి. ఇరు దేశాలలో ఆర్థిక వృద్ధి, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణ లను ప్రోత్సహించడం ఈ ఎమ్ఒయు ఉద్దేశం.
ఈ ఎమ్ఒయు స్థూలమైన మరియు మార్పులకు అనువుగా ఉండే ఓ ఫ్రేమ్ వర్క్ ను నెలకొల్పేందుకు దోహదం చేస్తుంది. ఈ ఫ్రేమ్ వర్క్ ద్వారా రెండు దేశాలు ఉత్తమ విధానాలను ఇచ్చి పుచ్చుకొంటూ మేధో సంపత్తి సంబంధ హక్కుల (ఐపిఆర్స్) పై చైతన్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఐపిఆర్స్ ను మరింత మెరుగ్గా కాపాడుకోవడం కోసం సాంకేతిక బృందాలను భారతదేశం నుండి కెనడా కు, కెనడా నుండి భారతదేశానికి పంపుతాయి.
ఎమ్ఒయు లో భాగంగా చేపట్టే ప్రాధాన్యపూర్వక కార్యక్రమాలలో ఈ కింద ప్రస్తావించిన అంశాలు కలిసివుంటాయి:
• మేధో సంబంధి హక్కులకు సంబంధించి ప్రజలలో, విద్యాసంస్థలలో, వ్యాపార రంగాలలో చైతన్యాన్ని తెచ్చేందుకు ఉత్తమ విధానాలు, అనుభవాలను పరస్పరం మార్పిడి చేసుకొంటారు;
• మేధో సంబంధి హక్కులకు సంబంధించిన ప్రత్యేక రంగాలలో అనుభవజ్ఞులను మార్పిడి చేసుకొంటారు;
• పరస్పర మార్పిడి కార్యక్రమాలు, శిక్షణలు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, వివిధ అభివృద్ధి సంస్థలు, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు (ఎస్ఎమ్ ఇలు) కు చెందిన వారు సంయుక్తంగా గాని, ఏ ఒక్కరు గాని నిర్వహించుకోవచ్చు;
• ఆటోమేశన్, ఆధునికీకరణ పథకాలలో సహకరించుకొనేందుకు కూడా వీలుంది. డాక్యుమెంటేశన్ లో ప్రస్తుతం ఉన్న, కొత్తగా వచ్చిన అవగాహనపై చర్చించుకోవచ్చు;
• సాంప్రదాయక జ్ఞానాన్ని ఎలాగ పరిరక్షించుకోవాలో అర్థం చేసుకోవడంలో పరస్పరం సహకరించుకోవాలి. సంప్రదాయ జ్ఞానానికి సంబంధించిన సమాచార భాండాగారాలు (డేటాబేస్), దీనికి సంబంధించిన చైతన్యం వంటి అంశాలలో సహకరించుకోవాలి;
• స్థానిక మేధో హక్కులకు సంబంధించిన శిక్షణ కోసం వ్యాపార వర్గాలు సహకరించుకోవచ్చు; లేదా ఎమ్ఒయు కు లోబడి వారు పరస్పర సహకారానికి ప్రయత్నించవచ్చు.
***