Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం-చైనా రెండో అనధికార శిఖరాగ్ర సమావేశం


1. భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, చైనా ప్రజా గణతంత్రం అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ చెన్నై నగరం లో 2019 అక్టోబరు 11, 12 తేదీల్లో భారతదేశం-చైనా రెండో అనధికార శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు.

2. అంతర్జాతీయ, ప్రాంతీయ ప్రాముఖ్యం గల సార్వజనీన, దీర్ఘకాలిక, వ్యూహాత్మక అంశాల పై దేశాధినేతలిద్దరూ స్నేహపూర్వక వాతావరణం లో తమతమ అభిప్రాయాలను లోతైన రీతిలో పంచుకున్నారు.

3. జాతీయ ప్రగతి దిశ గా తమ తమ విధానాల ను కూడా వారు పరస్పరం పంచుకున్నారు.

4. ద్వైపాక్షిక సంబంధాల దశ, దిశల ను వారు సానుకూల దృక్పథం తో సమీక్షించుకున్నారు. అంతర్జాతీయ వేదిక పై రెండు దేశాలకు గల కీలక పాత్ర దృష్ట్యా భారతదేశం-చైనా ద్వైపాక్షిక సంబంధాల ను మరింత లోతుకు తీసుకెళ్లడంపైనా చర్చించుకున్నారు.

5. అంతర్జాతీయ పరిస్థితులు మళ్లీ గణనీయం గా చక్కబడుతుండటంపై నాయకులిద్దరూ తమ అభిప్రాయాల ను పంచుకున్నారు. నియమావళి ఆధారిత అంతర్జాతీయ క్రమం లో అన్ని దేశాలు ప్రగతిపథం లో సాగడానికి వీలు కల్పించే శాంతియుత, సురక్షిత, సుసంపన్న ప్రపంచాన్ని తీర్చదిద్దడం భారతదేశం-చైనా ల ఉమ్మడి లక్ష్యమని వారు అభిప్రాయపడ్డారు.

6. చైనా లోని వుహాన్ లో 2018 ఏప్రిల్ నాటి తొలి అనధికార శిఖరాగ్ర సమావేశం సందర్భం గా ఏకాభిప్రాయానికి వచ్చిన అంశాల ను వారు పునరుద్ఘాటించుకున్నారు. వర్తమాన అంతర్జాతీయ పరిస్థితుల మధ్య సుస్థిరత సాధన లో భారతదేశం-చైనా ల పాత్ర కీలకమని, రెండు దేశాల మధ్య గల విభేదాల ను ఉభయ పక్షాలు విజ్ఞత తో పరిష్కరించుకోవాలని, ఏ అంశం మీదనైనా విభేదాలుంటే అవి వివాదాలుగా ముదరకుండా చూసుకోవాలని నాటి సమావేశం లో తీర్మానించారు.

7. ఈ 21వ శతాబ్దపు సరికొత్త వాస్తవాల ను ప్రతిబింబించే సంస్కరణలు సహా నియమావళి ఆధారిత, సార్వజనీన అంతర్జాతీయ క్రమాన్ని పరిరక్షించడం, ముందుకు తీసుకెళ్లడం లో భారతదేశం-చైనా ల ఉమ్మడి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని నాయకులిద్దరూ అంగీకరించారు. ఆమోదిత అంతర్జాతీయ వాణిజ్య విధానాలు, నిబంధన లు తరచూ ప్రశ్నార్థకం అవుతున్న నేపథ్యం లో నియమావళి ఆధారిత బహుళపాక్షిక వాణిజ్య విధానాని కి మద్దతు తోపాటు దాన్ని బలోపేతం చేయడం ప్రధానమని వారిద్దరూ అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు అన్ని దేశాలు లబ్ధి పొందేవిధం గా సార్వత్రిక, సార్వజనీన వాణిజ్య ఒప్పందాల దిశ గా భారతదేశం, చైనా లు తమ సంయుక్త కృషి ని కొనసాగించాలని నిర్ణయించారు.

8. వాతావరణ మార్పు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సహా, అంతర్జాతీయ ప్రగతి సంబంధిత సవాళ్ల ను ఎదుర్కొనడంలో తమ తమ దేశాల్లో సాగుతున్న కీలక కృషి గురించి నాయకులిద్దరూ చర్చించారు. అంతర్జాతీయ సమాజం తన లక్ష్యాల ను సాధించడం లో రెండు దేశాలు సాగిస్తున్న కృషి తోడ్పడుతుందని వారు స్పష్టం చేశారు.

9. ఉగ్రవాదం ఉమ్మడి సవాలు గా కొనసాగుతుండటం పై నాయకులిద్దరు ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, చైనా లు రెండూ అత్యంత పెద్ద, వైవిధ్యభరిత దేశాలు కాబట్టి ఉగ్రవాద నిరోధంపై సంయుక్త కృషి ప్రాముఖ్యాన్ని వారు గుర్తించారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తం గా ఉగ్రవాద శిక్షణ, నిధులు సమకూర్చడం, మద్దతునివ్వడాన్ని ఎలాంటి విచక్షణకు తావులేకుండా అరికట్టే చట్రాన్ని బలోపేతం చేయడంపై అంతర్జాతీయ సమాజం హామీ ఇచ్చేవిధంగానూ సంయుక్త కృషి అవసరమని వారు అభిప్రాయపడ్డారు.

10. రెండు దేశాలు గొప్ప సమకాలీన నాగరక సమాజాలు గనుక, ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాల ను ప్రోత్సహించే దిశ గా చర్చల ను ముమ్మరం చేయడానికి ప్రాముఖ్యం ఉందని నాయకులిద్దరు గుర్తించారు. అలాగే, చారిత్రకంగాను ప్రధాన నాగరక దేశాలుగా, ప్రపంచం లోని ఇతర దేశాల సంస్కృతులు, నాగరకతలపై అవగాహన దిశ గాను చర్చలు ముమ్మరం చేయాల్సి ఉందని నాయకులిద్దరూ అంగీకారానికి వచ్చారు.

11. ఈ ప్రాంతం లో సుస్థిరత, సౌభాగ్యాల కు భరోసా ఇచ్చేవిధం గా ఈ ప్రాంతాన సార్వత్రిక, సార్వజనీన, సుసంపన్న, సుస్థిర వాతావరణం నెలకొనాల్సిన ప్రాముఖ్యం పైనా వారు తమ అభిప్రాయాల ను పంచుకున్నారు. పరస్పర ప్రయోజనకర, సమతుల ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’ కోసం సాగుతున్న చర్చల కు సత్వర ముగింపు ఇవ్వడం ముఖ్యమని కూడా వారు అంగీకారానికి వచ్చారు.

12. రెండు వేల ఏళ్లు గా భారతదేశం-చైనా ల మధ్య కొనసాగుతున్న గణనీయ సముద్ర మార్గ-వాణిజ్య సంబంధాలు, ప్రజల మధ్య అనాదిగా గల అనుబంధాలపై నాయకులిద్దరూ తమ తమ అభిప్రాయాల ను పంచుకున్నారు. ఈ నేపథ్యం లో భారతదేశం లోని తమిళ నాడు, చైనా లోని ఫ్యూజియన్ మధ్య సోదర-రాష్ట్ర సంబంధాలు నెలకొల్పుకోవడంపై వారు అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు మహాబలిపురం, ఫ్యూజియన్ రాష్ట్రాల మధ్య సంబంధాల అధ్యయనానికి ఒక అకాడమీ ఏర్పాటుకు గల అవకాశాల ను పరిశీలించేందుకు నిర్ణయించారు. అజంతా-డున్ హాంగ్ గుహ ల మధ్య అనుభవాల తరహా లో ఇది ఏర్పడాలని భావించారు. అంతేకాకుండా, శతాబ్దాలుగా విస్తృత సంబంధాలు కొనసాగుతున్న దృష్ట్యా భారతదేశం-చైనా ల మధ్య సముద్ర సంబంధాల పై పరిశోధన ల నిర్వహణకు అంగీకరించారు.

13. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థ ల ప్రగతి లక్ష్యాల గురించి తమ తమ దృక్పథాల ను నాయకులిద్దరూ పంచుకున్నారు. ఏకకాలం లో భారతదేశం-చైనా ల ప్రగతి పరస్పర ప్రయోజనకర అవకాశాల కు దోహద పడగలదని వారు ఏకాభిప్రాయాని కి వచ్చారు. ఆ మేరకు సానుకూల, కార్యసాధక, సార్వత్రిక దృక్పథం తో ఉభయపక్షాలు ముందుకు సాగాలని నిర్ణయించారు. అలాగే సాధారణ స్నేహ సంబంధాలు, సహకారాని కి అనుగుణం గా తమ తమ విధానాలు, కార్యాచరణల ఆదాన ప్రదానాన్ని పెంచుకోవాలని తీర్మానించారు. తదనుగుణం గా పరస్పర ప్రయోజనం గల అన్ని అంశాల పైనా వ్యూహాత్మక సమాచార ప్రదానాన్ని కొనసాగించేందుకు అంగీకరించారు. దీనికి సంబంధించి ఉన్నత స్థాయి చర్చల యంత్రాంగాల మధ్య ఆదాన ప్రదానాల వేగాన్ని సంపూర్ణం గా కొనసాగించాలని తీర్మానించారు.

14. స్నేహబంధం సానుకూల దిశ ఫలితం గా ద్వైపాక్షిక సంబంధాల ను సమున్నత శిఖరాల కు చేర్చగల అవకాశాలు ఏర్పడ్డాయని నాయకులిద్దరూ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రెండు దేశాల్లోనూ బలమైన ప్రజా మద్దతు దిశ గా కృషి సాగాలని అంగీకరించారు. ఈ నేపథ్యం లో 2020ని ‘‘భారతదేశం-చైనా సాంస్కృతిక, ప్రజా ఆదాన ప్రదానా ల సంవత్సరం’’గా ప్రకటించాలని నాయకులిద్దరూ నిర్ణయించారు. అలాగే వచ్చే ఏడాది (2020) భారతదేశం-చైనా దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని సంపూర్ణ స్థాయి లో వినియోగించుకునేందుకు అంగీకరించారు. ఆ మేరకు చట్టసభలు, రాజకీయ పార్టీలు, సాంస్కృతిక-యువజన సంస్థలు, సైనిక బలగాలు సహా అన్ని స్థాయుల లో ఆదాన ప్రదానాల ను మరింత ముమ్మరం చేయాలని సంకల్పం ప్రకటించారు. దౌత్య సంబంధాల 70 వార్షికోత్సవాల్లో భాగం గా రెండు దేశాలూ 70 రకాల కార్యక్రమాల ను నిర్వహించాలని నిర్ణయించారు. రెండు దేశాల నాగరకతల నడుమ చారిత్రక సంబంధాల కు సంబంధించి నౌకా యాత్ర ప్రధానాంశం గా ఒక సదస్సు నిర్వహణ కూడా ఇందులో అంతర్భాగం గా ఉంటుంది.

15. ఆర్థిక రంగం లో సహకార విస్తృతి, ప్రగతి భాగస్వామ్యం లో సాన్నిహిత్యాల ను మరింత ముందుకు తీసుకెళ్లాలని నాయకులిద్దరూ నిర్ణయించారు. ఈ కృషి లో భాగం గా రెండు దేశాల మధ్య వాణిజ్య-వ్యాపార సంబంధాల పెంపు, మెరుగైన వాణిజ్య సమతౌల్య సాధన లక్ష్యం తో ‘ఉన్నతస్థాయి ఆర్థిక-వాణిజ్య చర్చల యంత్రాంగం’ ఏర్పాటుకు సంకల్పించారు. అంతేకాకుండా తయారీ రంగ భాగస్వామ్యం ద్వారా గుర్తించిన రంగాల్లో పరస్పర పెట్టుబడుల ను ప్రోత్సహించేందుకు వారు అంగీకరించారు. దీనికి సంబంధించి ‘ఉన్నతస్థాయి ఆర్థిక-వాణిజ్య చర్చల యంత్రాంగం’ తొలి సమావేశం సందర్భంగా విధివిధానాలపై చర్చించాల్సింది గా తమ తమ అధికారుల ను ఆదేశించారు.

16. రెండు దేశాల మధ్య సరిహద్దు సహా అపరిష్కృత సమస్యల పై నాయకులిద్దరూ తమ అభిప్రాయాల ను వెల్లడించుకున్నారు. ఇందుకోసం నియమితులైన ప్రత్యేక ప్రతినిధులు సాగిస్తున్న కృషి ని వారు అభినందించారు. అదే సమయం లో ఉభయ పక్షాలు 2005లో అంగీకారానికి వచ్చిన రాజకీయ పరామితులు, మార్గదర్శకాల కు అనుగుణం గా సముచిత, సహేతుక, ఆమోదయోగ్య పరిష్కారం దిశ గా పరస్పర అంగీకార యోగ్య చట్రం రూపకల్పన కు ప్రయత్నించాలని వారికి సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యాల కు భరోసానిచ్చే ప్రయత్నాలు కొనసాగుతాయని, ఈ లక్ష్య సాధన లో భాగం గా ఉభయపక్షాలూ అదనపు విశ్వాస కల్పన చర్యల రూపకల్పన కోసం కృషి చేస్తాయని తాము విశ్వసిస్తున్నట్లు వారు పునరుద్ఘాటించారు.

17. సానుకూల దృక్పథం తో పరస్పర అవగాహన పెంపునకు, చర్చల ను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం దేశాధినేతల స్థాయి లో అనధికార శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించుకునే పద్ధతి కి ‘వుహాన్ స్ఫూర్తి’, ‘చెన్నై సమాగమం’ వంటివి అవకాశం కల్పిస్తున్నాయని ప్రధాన మంత్రి మోదీ, అధ్యక్షుడు శీ ప్రశంసించారు. భవిష్యత్తు లోనూ ఈ విధానాన్ని కొనసాగించేందుకు వారు అంగీకరించారు. తాము నిర్వహించబోయే మూడో అనధికార శిఖరాగ్ర సమావేశం కోసం చైనా లో పర్యటించాల్సిందిగా ప్రధాన మంత్రి మోదీ కి అధ్యక్షుడు శీ ఆహ్వానం పలికారు. ప్రధాన మంత్రి మోదీ ఈ ఆహ్వానాని కి ఆమోదం తెలిపారు.