పిఎంఇండియా
భారతదేశానికి, ఇంటర్ నేషనల్ సీబెడ్ అథారిటీకి మధ్య పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ అన్వేషణకు సంబంధించిన 15 సంవత్సరాల కాంట్రాక్ట్ పై సంతకాల ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ అన్వేషణను10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చేపడుతారు. పాలీమెటాలిక్ సల్ఫైడ్స్తో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతారు. హిందూ మహాసమద్రంలోని కేంద్ర, నైరుతి ప్రాంతాల్లో ఈ పనిని చేస్తారు.
ఈ 15 సంవత్సరాల కాంట్రాక్టుపై సంతకాల వల్ల హిందూ మహా సముద్రంలో కేటాయించిన ప్రాంతాంలో పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ అన్వేషణకు సంబంధించి భారతదేశానికి మాత్రమే గల హక్కులు చట్టబద్దతను పొందుతాయి. హిందూ మహాసముద్రంలో ఇప్పటికే కార్యకలాపాలను చాలా క్రియా శీలంగా కొనసాగిస్తున్న చైనా, కొరియా, జర్మనీల మాదిరి గానే భారతదేశ పాత్రను ఈ కాంట్రాక్టు అధికం చేస్తుంది. కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. వివిధ జాతీయ సంస్థలు, పరిశోధనా ప్రయోగశాలలు, సంస్థల భాగస్వామ్యంతో ఈ పని చేయడం జరుగుతుంది.
పూర్వ రంగం:
సముద్ర అంతర్భాగంలో పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ ఉంటాయి. ఇవి ఐరన్, కాపర్, జింక్, సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్ లను వివిధ పరిమాణాలలో కలిగి ఉంటాయి. సముద్ర అంతర్భాగంలో ఉబికి వచ్చే వేడి మాగ్మా నుండి వెలువడే వేడి వేడి ద్రవాల అవశేషాలనే పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ అంటారు. ఈ అవశేషాలు ఖనిజాలతో కూడిన గొట్టాల ద్వారా ఏర్పడతాయి.
పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ అన్వేషణకోసం గతంలో భారత ప్రభుత్వ భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ, ది ఇంటర్ నేషనల్ సీబెడ్ అథారిటీకి (ఐ ఎస్ ఎ)దరఖాస్తు చేయడం జరిగింది. యునైటెడ్ కన్ వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీ (యు ఎన్ సి ఎల్ ఒ ఎస్) కింద ఈ దరఖాస్తు చేయడం జరిగింది. దీనికి ఐ ఎస్ ఎ ఆమోదం తెలిపింది. 10000 చదరపు కిలో మీటర్ల సముద్రప్రాంతాన్ని కేటాయించడం జరిగింది. 15 సంవత్సరాల పాటు అన్వేషణ జరుగుతుంది. హిందూ మహాసముద్రంలో సెంట్రల్ ఇండియన్ రిడ్జ్ 85 సౌత్ వెస్ట్ ఇండియన్ రిడ్జ్ ప్రాంతం గుండా ఈ అన్వేషణ చేయాలి. అంతర్జాతీయ జలాల్లోని సముద్ర ప్రాంత జీవేతర వనరులు ఐ ఎస్ ఎ పరిధిలో ఉంటాయి.