పిఎంఇండియా
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్ బిఐ) యొక్క అనుబంధ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ బీకానేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్ కోర్ లను భారతీయ స్టేట్ బ్యాంకు అధికారపూర్వకంగా స్వాధీనం చేసుకొనే ప్రతిపాదనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
భారతీయ స్టేట్ బ్యాంకు (అనుబంధ బ్యాంకుల) చట్టం, 1959 ని మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ చట్టం, 1956ను రద్దు చేయడానికి ఒక బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ విలీనం ఫలితంగా కార్యకలాపాలలో దక్షత ఇనుమడించడం, నిధుల సమీకరణ వ్యయంలో తగ్గుదల ఇంకా ఇతరత్రా కారణాలరీత్యా సంస్థకు మిగులు ఏర్పడడం అనేది పునరావృత్తం అవుతూ ఉండొచ్చని, ఒకటో సంవత్సరంలో అయితే రూ.1,000 కోట్లకు పైగా మిగులు ఎదురుకావచ్చని అంచనా. అనుబంధ బ్యాంకుల ప్రస్తుత ఖాతాదారులకు ఎస్ బిఐ యొక్క గ్లోబల్ నెట్ వర్క్ అందుబాటులోకి రాగలదు. ఆరు వేరు వేరు బ్యాంకుల విడి విడి పర్యవేక్షణకు బదులు ఈ విలీనం అధిక విలువ కలిగిన క్రెడిట్ ఎక్స్ పోజర్ లపై కేంద్రీకృత పర్యవేక్షణ, నియంత్రణ లతో కూడిన మెరుగైన నిర్వహణకు బాట పరచగలుగుతుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1955 లో భాగంగా చోటు చేసుకొనే అధికారపూర్వక స్వాధీనం బలవత్తరమైన విలీన ఎన్ టిటీ ని ఏర్పరచడానికి దారితీస్తుంది. ఇది అనుబంధ బ్యాంకులు భౌగోళిక కేంద్రీకరణం తాలూకు ఏవైనా నష్టభయాలకు లోనవుతూ ఉంటే గనక అటువంటి స్థితిని కనీస స్థాయికి తగ్గించగలుగుతుంది. కార్యనిర్వహణపరమైన సామర్థ్యాన్ని, భారీ పరిమాణంలో జరిగే కార్యకలాపాల తాలూకు తక్కువ వ్యయాల లాభాలను కూడా ఈ విలీనం అందించగలదు. అలాగే, రిస్క్ మేనేజ్ మెంట్ ను మెరుగుపరచడంతో పాటు ఏకీకృత కోశాగార కార్యకలాపాల తాలూకు ప్రయోజనాలను అందించగలదు.
ప్రభుత్వ రంగ బ్యాంకులను సుసంఘటితపరచడం ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టపరచే దిశగా స్టేట్ బ్యాంక్ యొక్క అనుబంధ బ్యాంకుల అధికారపూర్వక విలీనంతో ఒక ముఖ్యమైన అడుగు వేసినట్లు అవుతుంది. ఇది ప్రభుత్వ ఇంద్రధనుష్ కార్యాచరణ ప్రణాళిక యొక్క అనుసరణే. ఇది బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయగలదని, ఆ రంగం యొక్క దక్షతను, లాభదాయకతను మెరుగుపరచగలదని భావిస్తున్నారు.