పిఎంఇండియా
భారత్ – కంబోడియా దేశాల మధ్య పర్యాటక రంగంలో పరస్పర సహకారం, ప్రోత్సాహం కోసం చేసుకున్న అవగాహన ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
భారత ఉప రాష్ట్రపతి సెప్టెంబరు 16వ తేదీన కంబోడియాలో పర్యటించిన సందర్భంగా ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశాలు ఇవి :
1. పర్యాటక రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకోవడం.
2. పర్యాటకానికి సంబంధించిన సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవడం.
3. హోటళ్లు, టూర్ ఆపరేటర్లతో సహా పర్యాటక రంగంలో భాగస్వాములందరి మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం.
4. మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను పరస్పరం నిర్వహించుకోవడంలో సహకారం అందించుకోవడం.
5. పర్యాటక, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడి పెట్టడం.
6. రెండు దేశాల మధ్య పర్యాటకాన్ని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా టూర్ ఆపరేటర్లు / మీడియా / ప్రభావ శీల వ్యక్తుల పర్యటనలను పరస్పరం ప్రోత్సహించడం.
7. రెండు దేశాల్లోనూ పర్యాటక రంగంలో ప్రమోషన్, మార్కెటింగ్, పర్యాటక స్థలాల అభివృద్ధి, నిర్వహణ విషయంలో అనుభవాలను పంచుకోవడం.
8. ఇరు దేశాల్లో జరిగే ట్రావెల్ ప్రదర్శనల్లో చురుగ్గా పాల్గొనడం.
9. సురక్షిత, గౌరవప్రద, సుస్థిర పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించడం.
నేపథ్యం
భారత పర్యాటక రంగానికి కంబోడియా కీలక విపణిగా మారుతోంది. కంబోడియా పౌరుల కోసం భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ టూరిస్టు వీసా(ఈటీవీ) సౌకర్యాన్ని విస్తరించింది. ఇది రెండు దేశాల మధ్య పర్యాటక వాణిజ్యాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో కంబోడియాతో చేసుకున్న తాజా అవగాహన ఒప్పందం మూలంగా ఆ దేశం నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతుందని కేంద్ర పర్యాటక శాఖ విశ్వసిస్తోంది.
భారత్, కంబోడియాలు స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను చిరకాలంగా కొనసాగిస్తున్నాయి. ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలు ప్రగాఢంగా కోరుకున్నాయి. ఇందులో భాగంగానే పర్యాటక రంగంలో సహకారం కోసం పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.