పిఎంఇండియా
అస్సాం ప్రభుత్వ సంస్థ అయిన అస్సాం పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (ఎఐడిసి) కి 4050 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఎఎఐ భూమిని కౌలుకు ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ భూమిని గువాహటిలోని లోక్ ప్రియా గోపినాథ్ బోర్దోలోయీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఎల్ జి బి ఐ ఏర్ పోర్ట్ ద) వద్ద సెంటర్ ఫర్ పెరిషబుల్ కార్గో (సిపిసి)ని ఏర్పాటుచేయడానికి, భవిష్యత్తులో దీనిని విస్తరించేటందుకు ఉపయోగించనున్నారు.
కౌలు ఒప్పందం కుదిరిన అనంతరం సంవత్సరానికి ఒక రూపాయి లాంఛనప్రాయ లైసెన్సు రుసుముతో ఎఎఐ కౌలుకు ఇస్తుంది. ఒప్పందం ఏడు సంవత్సరాలపాటు అమలవుతుంది. ఆ తరువాత కౌలు ఒప్పందాన్ని అప్పటి ఎఎఐ విధానానికి అనుగుణంగా తిరిగి రాసుకుంటారు.
పూర్వరంగం:
భారత దేశంలోని ఈశాన్య ప్రాంతం (ఎన్ ఇ ఆర్) వృక్ష జంతుజాలం సమృద్ధంగా ఉండే ప్రాంతం. వ్యవసాయం, ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతితో లభించే ఆదాయం ఎన్ ఇ ఆర్ ఆర్థికస్థితిగతులను మెరుగుపరచగలుగుతుంది. ఈ ప్రాంతం నుండి త్వరగా పాడయిపోయే సరుకుల ఎగుమతిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఇది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను పెంచగలుగుతుంది. త్వరగా పాడయిపోయే సరుకులను గువాహటి నుండి గగనతలం నుండి చేరవేసే సదుపాయాలను మరింత పటిష్టంగా అమలుపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని, గువాహటి లోని ఎల్ జి బి ఐ ఏర్ పోర్టు వద్ద 4050 చదరపు మీటర్ల భూమిని ఎ ఐ డి సి కి ఎఎఐ కౌలుకు ఇవ్వాలని నిర్ణయించడమైనది. ఈ స్థలంలో సిపిసి ని నెలకొల్పుతారు. అంతే కాకుండా భవిష్యత్తులో ఈ సెంటర్ ను విస్తరిస్తారు.
*****