పిఎంఇండియా
శ్రేష్ఠుడైన ప్రెసిడెంట్ శ్రీ ఎర్దోగాన్, మాననీయ ప్రతినిధి వర్గ సభ్యులు,
ప్రసార మాధ్యమాల సభ్యులారా,
ప్రెసిడెంట్ శ్రీ ఎర్దోగాన్ కు మరియు ఆయన మాననీయ ప్రతినిధివర్గానికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలకడం నాకు సంతోషాన్నిస్తోంది.
ఎక్సెలెన్సీ,
2015 నవంబర్ లో జి-20 శిఖరాగ్ర సభ సందర్భంగా నా తుర్కీ పర్యటనను ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాను. సుందరమైన మీ దేశానికి నేను వచ్చినప్పుడు నా పట్ల మీరు చూపిన ఆదరణ, సుహృద్భావం తిరిగి అందించడానికి మీ సందర్శన మాకు చక్కని అవకాశాన్ని ప్రసాదించింది.
మిత్రులారా,
భారతదేశం, తుర్కీ ప్రజలు తమ మధ్య లోతైన, చారిత్రక సంబంధాలను పెంచి పోషించుకున్నారు. సాంస్కృతిక పరమైన, భాషాపరమైన బంధాలు మన సమాజాలను వందలాది సంవత్సరాలుగా పెనవేసి ఉంచాయి.
రూమీ ఆవాసం టర్కీ అయినప్పటికీ, ఆయన నెలకొల్పిన వారసత్వం భారతదేశం లోని సూఫీ సంప్రదాయాలను సుసంపన్నం చేస్తూనే వస్తోంది.
మిత్రులారా, ఈ రోజు మేం జరిపిన సమగ్ర చర్చల్లో ప్రెసిడెంట్ శ్రీ ఎర్దోగాన్, నేను ఉభయ దేశాల మధ్య నెలకొన్న రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక బంధాలను గురించి సమగ్రంగా చర్చించాం. మన ప్రాంతంలో నెలకొంటున్న పరిణామాలపై మా భావాలను పంచుకున్నాం.
మిత్రులారా,
భారతదేశం, తుర్కీ రెండూ పెద్ద ఆర్థిక వ్యవస్థలు. వీటి వాణిజ్య బంధాన్ని మరింతగా విస్తరించుకునేందుకు, మరింత లోతుగా వేళ్లూనుకొనేటట్టు చేసేందుకు మన ఆర్థిక వ్యవస్థల బలం చక్కని అవకాశం కల్పిస్తోందన్న విషయాన్ని ప్రెసిడెంట్, నేను గట్టిగా విశ్వసిస్తున్నాం. మన దేశాలకు గల వ్యాపారావకాశాలను ఉభయ ప్రభుత్వాల స్థాయిలో వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో పరిశీలించాలని నేను భావిస్తున్నాను. మన దేశాల మధ్య గల 6 బిలియన్ డాలర్ల వాణిజ్య టర్నోవర్ ఉభయ దేశాల సారూప్యతలకు పూర్తి న్యాయం చేయడం లేదు. ఇరు దేశాల వ్యాపార, పారిశ్రామిక వర్గాలు దీనిని విస్తరించేందుకు ఇతోధిక కృషి చేయాలన్నది సుస్పష్టం.
ప్రెసిడెంట్ శ్రీ ఎర్దోగాన్ వెంట అత్యున్నత స్థాయి వ్యాపార ప్రతినిధివర్గం భారతదేశ సందర్శనకు రావడం నాకు ఆనందం కలిగించింది. వారిని, భారత పారిశ్రామిక రంగ దిగ్గజాలను ఉద్దేశించి ఈ రోజు ఉదయం మేం ఇద్దరం ప్రసంగించాం. త్వరిత గతిన వృద్ధిని సాధిస్తున్న భారతదేశంలో అంతర్గతంగా ఉన్న భిన్న, ప్రత్యేక వ్యాపారావకాశాలను తుర్కిష్ వ్యాపార సంస్థలు త్వరితంగా ఉపయోగించుకుంటాయని నేను నమ్ముతున్నాను. భారతదేశంలో మౌలిక వసతుల అవసరాలు, వీటిలో కొన్నింటిని నేను ఈ ఉదయం వ్యాపార వేత్తల సదస్సులో ప్రస్తావించాను. స్మార్ట్ సిటీల అభివృద్ధిపై మా విజన్ తుర్కీ సామర్థ్యాలకు దీటుగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను.
మేం చేపట్టిన ప్రధాన ప్రాజెక్టులు, కార్యక్రమాల అమలులో ఒంటరిగా గాని, భారత కంపెనీలతో కలిసి గాని తుర్కీ కంపెనీలు శక్తివంతమైన భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడాన్ని మేం ప్రోత్సహిస్తాం.
ఈ రోజున సంతకం చేసిన ఒప్పందాలు, మా మధ్య జరిగిన చర్చలు ఉభయ దేశాల మధ్య సంస్థాగత సహకారాన్ని మరింతగా బలోపేతం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నది నా అభిప్రాయం.
మిత్రులారా,
సమాజాలు కొత్త సవాళ్ళను, ముప్పును ఎదుర్కొంటున్న వాతావరణంలో మనం నివసిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న కొన్ని భద్రతాపరమైన సవాళ్ళకు సంబంధించిన సందర్భాలు, వాటికి దారి తీస్తున్న సంఘటనలు మనకి ఉమ్మడిగా ఆందోళన కలిగిస్తున్న అంశాలు.
ప్రధానంగా నిరంతరాయంగా ఎదురవుతున్న ఉగ్రవాద ముప్పు మన ఉభయులకు ఆందోళన కలిగిస్తోంది. అధ్యక్షునితో నేను ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించాను. ఏ లక్ష్యం లేదా ఏ కారణం లేదా ఏ హేతువు కూడా ఉగ్రవాదానికి కారణభూతం కాకూడదని మేం ఇద్దరం భావించాం.
ప్రపంచంలోని దేశాలన్నీ ఒక్క తాటి మీదకు వచ్చి ఉగ్రవాద శక్తులను, వాటికి ఆర్థిక సహాయం అందిస్తున్న సంస్థల కార్యకలాపాలను నిరోధించవలసిన అవసరం ఉంది. ఉగ్రవాదుల సీమాంతర కదలికలను కూడా నిరోధించాలి.
దౌర్జన్యకాండకు కారణం అవుతున్న సిద్ధాంతాలు, దౌర్జన్యకాండలో ఉపయోగించే పరికరాల వ్యాప్తిని నిరోధించడంతో పాటు దౌర్జన్యకాండకు మద్దతు ఇవ్వడం, అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వడం, ఉగ్రవాద చర్యలకు ఊపిరి పోయడం, ఉగ్రవాదులను తయారుచేయడం వంటి చర్యలన్నింటికీ వ్యతిరేకంగా అందరూ ఒక్కటిగా నిలిచి పోరాడాలి.
ఈ దురాగతాన్ని నిలువరించడానికి ద్వైపాక్షిక, బహుముఖీన వేదికలపై సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రెసిడెంట్, నేను అంగీకారానికి వచ్చాం.
మిత్రులారా,
ఐక్య రాజ్య సమితి వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు, భద్రత మండలి మరింత బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా పని చేసేందుకు వీలుగా ప్రాతినిధ్యాన్ని విస్తరించడం వంటి అంశాలపై కూడా మేం చర్చించాం. ఐక్య రాజ్యసమితి భద్రత మండలి 21వ శతాబ్ది వాస్తవాలకు దర్పణం పట్టేలా ఉండాలి గాని గత శతాబ్ది పరిస్థితులను ప్రతిబింబించేదిగా ఉండకూడదన్న విషయాన్ని మేం ఇద్దరం గుర్తించాం.
ఎక్సెలెన్సీ,
మిమ్మల్ని భారతదేశానికి మరోసారి నన్ను సాదరంగా ఆహ్వానించనివ్వండి. మీరు జరిపిన ఫలవంతమైన చర్చలకు ధన్యవాదాలు. మనం నిర్వహించిన చర్చలు కచ్చితంగా భారతదేశం- తుర్కీ భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి నడిపిస్తాయి. భారతదేశంలో మీరు గడిపే సమయం ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
మీకు ఇవే నా ధన్యవాదాలు.
బహుధా ధన్యవాదాలు.