పిఎంఇండియా
భారతదేశం, కిర్గి స్తాన్ ల మధ్య పర్యాటక రంగ సహకారాన్ని బలోపేతం చేసుకొనేందుకు ఉద్దేశించిన ఒక అవగాహనపూర్వక ఒప్పందంపై సంతకాలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ, కిర్గి స్తాన్ ప్రభుత్వ సాంస్కృతిక, సమాచార మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం వల్ల ఒనగూడే పరస్పర ప్రయోజనాలను పరిశీలిస్తే.. పర్యాటక రంగంలో సహకారం పటిష్ఠం అవుతుంది. ఉభయ దేశాల ఆర్థికాభివృద్ధి కోసం తమ తమ దేశాల్లో పర్యాటక రంగం అభివృద్ధికి, ప్రోత్సాహానికి తీసుకోవలసిన చర్యలపై నిర్మాణాత్మక చర్చలు చేపట్టే వీలు కలుగుతుంది. కిర్గి స్తాన్ వంటి ముఖ్యమైన వనరు విపణి నుండి పర్యాటకుల రాకడ పెరగడంలో ఈ అవగాహన ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది.
అవగాహన ఒప్పందం ప్రధాన లక్ష్యాలు ఇలా ఉన్నాయి :
అ) పర్యాటక రంగంలో ద్వైపాక్షిక సహకారం విస్తరణ.
ఆ) పర్యాటకానికి సంబంధించిన సమాచారం, గణాంకాల ఆదాన ప్రదానం.
ఇ) హోటళ్లు, పర్యటనల నిర్వాహకులువంటి పర్యాటక రంగ భాగస్వాములందరి మధ్య సహకారానికి ప్రోత్సాహం.
ఈ) మానవ వనరుల అభివృద్ధిలో ఆదానప్రదాన కార్యక్రమం రూపకల్పన.
ఉ) హోటళ్లు, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు.
ఊ) ద్వైపాక్షిక పర్యాటకానికి ప్రోత్సాహం దిశగా పర్యటనల
నిర్వాహకులు/మీడియా/అభిప్రాయ ప్రదాతల ఆదానప్రదాన పర్యటనలు.
ఎ) పర్యాటక గమ్యాల అభివృద్ధి-నిర్వహణ, మార్కెటింగ్‌లలో అనుభవాల ఆదాన ప్రదానం.
ఏ) ఒకరి దేశంలో ఒకరు ప్రయాణ ప్రదర్శనలు/వేడుకలు నిర్వహించడం.
ఐ) సురక్షిత, గౌరవనీయ, సుస్థిర పర్యాటకానికి ప్రోత్సాహం
సిఐఎస్ దేశాలలో ఒక భాగమైన కిర్గి స్తాన్‌ను ఆనుకొని కజక్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్ ల వంటి దేశాల సరిహద్దులు ఉన్నాయి. భారతదేశం, కిర్గి స్తాన్‌ల మధ్య కూడా బలమైన దౌత్య సంబంధాలు, సుదీర్ఘ కాలం నుండి ఆర్థిక సంబంధాలు నెలకొన్నాయి. కిర్గిజ్‌స్తాన్ నుండి గడచిన అయిదు సంవత్సరాలలో పర్యాటకుల రాక వివరాలు ఇలా ఉన్నాయి:-
2012 2013 2014 2015 2016
1348 2103 2479 2729 2883*
* 2016 జనవరి నుంచి నవంబరు వరకు..
***