పిఎంఇండియా
“భారతదేశ భూభాగంలో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలు, మతవాద దాడులు, వామపక్ష తీవ్రవాదం (ఎల్ డబ్ల్యు ఇ), సీమాంతర కాల్పులు, గనులు/ఐఇడి పేలుళ్ళ బాధితులైన పౌరులకు పరిహారం అందించే కేంద్ర పథకం” కింద పరిహారాన్ని 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. కేంద్ర పథకం ముఖ్యాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:-
1. దేశ చరిత్రలోనే తొలిసారిగా, భారతదేశం, పాకిస్తాన్ సరిహద్దు వెంబడి జరిగే సీమాంతర కాల్పుల్లో మరణించిన సాధారణ పౌరులకు ఉగ్రవాదం, ఎల్ డబ్ల్యు ఇ దౌర్జన్యకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇస్తున్న పరిహారానికి దీటుగా 5 లక్షల రూపాయలు అందిస్తారు.
2. సీమాంతర కాల్పులు, ఎల్ డబ్ల్యుఇ దౌర్జన్యకాండ సంఘటనలలో మరణించిన వారికి పరిహారాన్ని 3 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయలకు పెంచే అంశంపై ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది.
3. ఇక మీదట దేశంలోని ఏ ప్రాంతంలో అయినా ఉగ్రవాద దాడులు, లేదా ఎల్ డబ్ల్యుఇ తీవ్రవాద ఘటనలు, సీమాంతర కాల్పులు, బాంబు దాడులు, ఐఇడి పేలుళ్ళ సందర్భాలలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒకే విధంగా 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తారు.
4. ఇటువంటి సంఘటనలలో 50 శాతం లేదా అంతకు పైబడి అంగవైకల్యం కలిగిన వారికి కూడా 5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తారు.
5. ఇటువంటి కుటుంబాలలోని సభ్యులకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలలో ఏ ప్రభుత్వమూ ఉద్యోగం కల్పించి ఉండకూడదన్న షరతుకు లోబడి పరిహారం చెల్లిస్తారు.
6. 2008 సంవత్సరంలో ఆమోదించిన పథకం ప్రకారం ఉగ్రవాద, వామపక్ష తీవ్రవాద, మతవాద, నక్సల్ కార్యక్రమాలలో శాశ్వత అంగవైకల్యం పొందిన వారు లేదా మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఇంతవరకు 3 లక్షల రూపాయల వంతున పరిహారం అందించే వారు. ఎక్స్ గ్రేషియా లేదా ప్రభుత్వం లేదా ఇతర సంస్థలు అందించే సహాయం అందుకున్న కుటుంబాలు కూడా కేంద్ర సహాయం పొందేందుకు అర్హత కలిగి ఉంటాయి. 2008లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన నాటి నుండి ఇప్పటివరకు ప్రభుత్వం ఇటువంటి సంఘటనల బాధితులకు 35.89 కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించింది.
పూర్వ రంగం:
ప్రధాన మంత్రి 2014 అక్టోబరు 23వ తేదీన జమ్ము- కశ్మీర్ ను సందర్శించిన సమయంలో సీమాంతర కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయం ప్రస్తావనకు వచ్చింది. పాకిస్తాన్ తో దేశ వాయవ్య ప్రాంతంలో ఉన్న సరిహద్దు వెంబడి నివసిస్తున్న ప్రజలు సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందిని, దురవస్థను దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన 70 సంవత్సరాల తరువాత ప్రభుత్వం గుర్తించింది. భారతదేశం, పాకిస్తాన్ లకు మధ్య ఉన్న 770 కిలోమీటర్ల అధీన రేఖ (ఎల్ సి) వెంబడి, 220 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు (ఐ బి) వెంబడి 1990 నుండి కాల్పుల విరమణ, ఉగ్రవాదుల చొరబాట్లు తరచుగా జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనలలో సాధారణ పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం పరిహారాన్ని చెల్లించే పథకంలో పౌరులను కూడా చేర్చాలని నిర్ణయించింది.
***