పిఎంఇండియా
భారతదేశంలో వ్యాపార సరళీకరణకు మద్దతుగా భారతదేశం, యునైటెడ్ కింగ్ డమ్ (యు కె)ల మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పంద పత్రానికి (ఎమ్ ఒ యు) మంత్రిమండలి ఎక్స్- పోస్ట్ ఫాక్టో ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ ఎమ్ ఒ యు ఈ నెల ఆరంభంలో కుదిరింది.
వ్యాపార రంగంలో సంస్కరణల అమలును వేగవంతం చేయడానికి కావలసిన సాంకేతిక సహాయాన్ని అందించడానికి, ఉత్తమ విధానాలను అమలు చేయడానికి వీలుగా ఇరు దేశాల ప్రభుత్వ అధికారుల మార్పిడికి ఈ ఎమ్ ఒ యు దోహదం చేస్తుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం పరిధిలోకి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వస్తాయి. కింద తెలిపిన అంశాల్లో తన అనుభవాన్ని పంచుకోవడానికి యు కె ప్రభుత్వం ఆసక్తిని చూపుతోంది:
ఎ. చిన్న వ్యాపారాలకు, స్టార్టప్ కంపెనీలకు మద్దతు
బి. వ్యాపారాన్ని ప్రారంభించడం, రిజిస్ట్రేషన్
సి. పన్నుల చెల్లింపు, పన్నుల నిర్వహణ
డి. దివాలా
ఇ. నిర్మాణ సంబంధ అనుమతులు
ఎఫ్. విద్యుత్ సదుపాయం పొందడం
జి. తనిఖీ, నియంత్రణ సందర్భాల కోసం రిస్క్ తో కూడుకున్న విధివిధానాలు
హెచ్. సరిహద్దులను దాటి వాణిజ్యం
ఐ. స్పర్థాత్మక ఆర్ధిక రంగం
జె. రుణం పొందడం
కె. చట్టాల, నియంత్రణల ముసాయిదా తయారు చేసుకోవడం
ఎల్. స్టాకును, నియంత్రణలను తగ్గించుకోవడం
ఎమ్. నియంత్రణల ప్రభావాన్ని మదింపు చేయడం
సులువుగా వ్యాపారాన్ని చేపట్టడానికి వీలున్న దేశాల జాబితాను (డూయింగ్ బిజినెస్ రిపోర్ట్-2017) తీసుకుంటే, ఇందులోని 190 దేశాలలో భారతదేశం స్థానం 130. ఈ మధ్యకాలంలో ఈ విషయంలో యు కె అద్భుతమైన ప్రగతిని సాధించింది. సామర్థ్య నిర్మాణ విధానాలు, ఉత్తమ విధానాలను పంచుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు, విభాగాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారుల ఈ ఎమ్ ఒ యు ద్వారా లబ్ధి పొందుతారు. ప్రయాణాలకు అయ్యే ఖర్చులను, ఇతర విధివిధానాల అమలుకు అయ్యే వ్యయాలను, కలిసి చేపట్టే శిక్షణా కార్యక్రమాలు, ఇతర సమావేశాలను నిర్వహించడానికి అయ్యే ఖర్చులను ఇరు దేశాలు భరించాలి.
ఈ ఎమ్ ఒ యు కారణంగా యు కె ప్రభుత్వానికి చెందిన పలు సంస్థలు ప్రొఫెషనల్ కోర్సులను అందిస్తాయి. అధికారులు నిబంధనల ముసాయిదా తయారు చేయడానికి, ఫ్రంట్ లైన్ ఇన్ స్పెక్టర్లకు అవసరమయ్యే సామర్థ్య నిర్మాణానికి, ఇంకా ఉత్తమ విధానాలను పంచుకోవడానికి ఈ కోర్సులు ఉపయోగపడతాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ సహకారం కారణంగా భారతదేశ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంకా ఇతర సంస్థలు వినూత్న విధానాలను అమలు చేయడం వేగవంతం అవుతుంది. తద్వారా దేశంలో నియంత్రణ వాతావరణం సరళమై, సులువైన వాణిజ్య వాతావరణం ఏర్పడుతుంది.