Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

”భార‌త‌దేశం- ఇరాన్, రెండు ఘ‌న‌మైన నాగ‌రిక‌త‌లు: సింహావలోకనం మరియు అవకాశాలు” అంశంపై 2016 మే 23న ఏర్పాటైన స‌మావేశ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం; ఇదే వేదిక‌పై అరుదైన ప‌ర్షియా రాత‌ ప్ర‌తి విడుద‌ల‌

”భార‌త‌దేశం- ఇరాన్, రెండు ఘ‌న‌మైన నాగ‌రిక‌త‌లు: సింహావలోకనం మరియు అవకాశాలు” అంశంపై 2016 మే 23న ఏర్పాటైన స‌మావేశ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం; ఇదే వేదిక‌పై అరుదైన ప‌ర్షియా రాత‌ ప్ర‌తి విడుద‌ల‌

”భార‌త‌దేశం- ఇరాన్, రెండు ఘ‌న‌మైన నాగ‌రిక‌త‌లు: సింహావలోకనం మరియు అవకాశాలు” అంశంపై 2016 మే 23న ఏర్పాటైన స‌మావేశ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం; ఇదే వేదిక‌పై అరుదైన ప‌ర్షియా రాత‌ ప్ర‌తి విడుద‌ల‌


ఎక్స్‌లెన్సీ హ‌దిద్ ఆదెల్‌, ది హెడ్ ఆఫ్ ఫ‌ర్హింగ్‌స్తాన్‌

డాక్ట‌ర్ జ‌న‌తి, ది మినిస్ట‌ర్ ఆఫ్ క‌ల్చ‌ర‌ల్ అఫైర్స్ ఆఫ్ ఇరాన్‌,

ప్ర‌సిద్ధి చెందిన పండితులారా

సోదర సోదరీమణులారా

డాక్ట‌ర్ ఆదెల్‌, డాక్ట‌ర్ జ‌న‌తి.. ఈ ఇద్ద‌రి జ్ఞాన‌పూరిత వ‌చ‌నాలే ఈ కార్య‌క్ర‌మానికి ఉండాల్సిన ల‌క్ష‌ణాల‌ను నిర్ణ‌యించాయి. మీ స‌మావేశాన్ని స‌రైన స‌మ‌యంలో నిర్వ‌హిస్తున్నారు. శ‌తాబ్దాల త‌ర‌బ‌డి ఇరు దేశాల‌కు గ‌ల సంబంధ బాంధ‌వ్యాల‌ను గుర్తు చేసుకోవ‌డానికి, వాటిలో పున‌రుత్తేజాన్ని నింప‌డానికి ఇది సంద‌ర్భం. ఇరు దేశాల సాంస్కృతిక వార‌స‌త్వంలోని సౌంద‌ర్యాన్ని, సంప‌న్నత్వాన్ని కొత్త త‌రానికి ప‌రిచ‌యం చేయాల్సిన మ‌న క‌ర్త‌వ్యం కూడా ఈ సంద‌ర్భంగా నెర‌వేరుతుంది. ఈ బాధ్య‌త‌ను త‌మ భుజ‌స్కంధాల‌పైన వేసుకోగ‌ల అర్హ‌త ఎవ‌రికైనా ఉందంటే అది ఇక్క‌డ స‌మావేశ‌మైన విద్యావేత్త‌లు, పండితుల‌కే త‌ప్ప మ‌రొక‌రికి కాదు. ఈ సంద‌ర్భంగా నేను ముఖ్యంగా అభినందించ‌ద‌గ్గ వ్య‌క్తి డాక్ట‌ర్ ఆదెల్‌. ఈ అవ‌స‌రాన్ని గుర్తించ‌డంలో ఆయ‌న ముందున్నారు. ఇండియ‌న్ ఉప ఖండంపైన ప‌ర్షియా భాష‌లో ఎన్‌సైక్లోపిడియాను ప్ర‌చురించ‌డానికి ఆయ‌న కొన‌సాగిస్తున్న ప్రాజెక్టు ప‌రిశోధ‌కుల‌కు, పండితుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇరాన్‌కు చెందిన అనేక మంది పండితులు, ఆలోచ‌నాల‌ప‌రుల మ‌ధ్య ఉండ‌డం నాకు ద‌క్కిన అపూర్వ‌గౌర‌వంగా, సువ‌ర్ణ అవ‌కాశంగా భావిస్తున్నాను.

స్నేహితులారా,

ప్ర‌స్తుత పపంచవ్యాప్తంగా రాజ‌కీయ పండితులు వ్యూహాత్మ‌క కూడ‌లి గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే భార‌త‌దేశం, ఇరాన్ నాగ‌రిక‌త‌లు మ‌న రెండు దేశాల మ‌హోన్న‌త‌మైన సంస్కృతుల క‌ల‌యిక‌ను ఒక ఉత్ప‌వంలాగా జ‌రుపుకొంటున్నాయి. ఇరు దేశాల మ‌ధ్య గ‌ల చరిత్రాత్మ‌క సంబంధాలను, కాసేప‌టి క్రిత‌మే విడుద‌ల చేసిన అరుదైన ప‌ర్షియ‌న్ రాత‌ప్ర‌తి ‘క‌లిలెహ్- వ- దిమ్నెహ్’ ప్ర‌తిఫ‌లిస్తోంది. భార‌త‌దేశానికి చెందిన ఎంతో సులువైన‌ పురాతన జాత‌క క‌థలు, పంచ‌తంత్ర క‌థ‌లు ప‌ర్షియా రాత‌ప్ర‌తి ‘క‌లిలెహ్- వ- దిమ్నెహ్’గా రూపాంత‌రం చెంద‌డం గుర్తించ‌ద‌గ్గ విష‌యం. ఇరుదేశాల మ‌ధ్య‌ ఇచ్చి పుచ్చుకొనే సంప్ర‌దాయానికి, సాంస్కృతిక ఆలోచ‌న‌ల ప్ర‌వాహానికి ఇది ఒక అపురూప‌మైన ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. ఇరు దేశాల సంస్కృతులు, ఇరు దేశాలు ఒకే విధంగా ఆలోచిస్తున్నాయ‌న‌డానికి ఇది ఒక అంద‌మైన ఉదాహ‌ర‌ణగా భావించ‌వ‌చ్చు. పురాత‌న‌మైన నాగ‌రిక‌త‌ల జ్ఞానానికి ఇది అస‌లైన నిర్వ‌చ‌నం. తీపి ప‌దార్థాలను చూడ‌గానే నోట్లో నీరూరే వారికి భార‌త‌దేశాన్నుంచి వ‌చ్చిన పంచ‌దార ఇది.

ఈ సంద‌ర్భంగా శ్రీ హ‌ఫెజ్ ప్ర‌వ‌చ‌నాన్ని గుర్తు చేసుకోకుండా ఉండ‌లేక‌పోతున్నాను. ఈ సంద‌ర్భానికి అనుగుణంగా దానిని మార్చుకోవ‌డం జ‌రిగింద‌ని మ‌న‌వి.

शक्कर-शिकन शवंद हमे बुलबुलाने-अजम

ज़े ईन क़दे-हिन्दी कि बे-तेहरान मी रसद्

[దీనికి అర్ధం: భార‌త‌దేశాన్నుంచి టెహ్ రాన్‌కు వ‌చ్చిన ఈ తాజా తీపి వంట‌కాన్ని ఇరాన్ లోని అన్ని కోకిల‌లు అందుకుంటాయి.. అని.]

స్నేహితులారా,

శ‌తాబ్దాల త‌ర‌బ‌డి ఆలోచ‌న‌ల్ని, సంప్ర‌దాయాల్ని, క‌వుల్ని, క‌ళాకారుల్ని, క‌ళ‌ల్ని, భ‌వ‌న నిర్మాణ శాస్త్రాన్ని, సంస్కృతిని, వాణిజ్యాన్ని ఇరు దేశాలు ఇచ్చి పుచ్చుకోవ‌డంవ‌ల్ల ఇరు దేశాల నాగ‌రిక‌త‌లు ఉన్న‌త‌ స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇరు దేశాల సామ‌ర్థ్యానికి, ఆర్ధికాభివృద్ధికి మ‌న వార‌స‌త్వం ఒక ముఖ్య‌మైన వ‌న‌రుగా ఉప‌యోగ‌ప‌డింది. ప‌ర్షియా వార‌స‌త్వంలోని గొప్ప‌ద‌నం భార‌తీయ స‌మాజంలో క‌ల‌గ‌లిసిపోయింది. ఇరాన్ సంస్కృతిలోని ఓ భాగం భార‌తీయుల హృద‌యాల‌లో స్థిరపడింది. భార‌తీయ వార‌స‌త్వంలోని ఓ అంశం ఇరాన్ స‌మాజంలో పెనవేసుకుపోయింది. మ‌న పురాత‌న నాయ‌కులు, పౌరాణిక గాథల మ‌ధ్య‌ చెప్పుకోద‌గ్గ స్థాయిలో పోలిక‌లున్నాయి. భార‌త‌దేశంలోని అజ్మీర్ ష‌రీఫ్, హ‌జ‌ర‌త్ నిజాముద్దీన్ ద‌ర్గాల‌ను భార‌దేశంలో లాగానే ఇరాన్‌లోను అంతే భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో పూజిస్తారు. మ‌న ప్రాపంచిక అభిప్రాయాల‌ను, విలువ‌ల‌ను తీసుకున్న‌ప్పుడు- వాటిలో మ‌హాభార‌తానికి షానామాకు మ‌ధ్య‌, భీమునికి రుస్తుంకు మ‌ధ్య‌, అర్జునునికి అర్ష్‌కు మ‌ధ్య‌ పోలిక‌లు క‌నిపిస్తాయి. జ‌ర్దోజీ, గుల్‌దోజీ, ఛందేరీ లాంటి క‌ళ‌లు ఇరాన్ స‌మాజంలో భాగం కావ‌చ్చు; అవి ఇరాన్‌లో ఎంత సాధార‌ణ‌మైన‌వో భార‌త‌దేశంలో అంతే సాధార‌ణ‌మైన‌వి. ఇరాన్ సంస్కృతి లోని ఔన్న‌త్యాన్ని తీసుకున్న‌ప్పుడు, దానిని అంద‌రికీ ప‌రిచ‌యం చేసే ప‌ర్షియా భాష‌లోని అందాన్ని, క‌విత్వాన్ని ఎవ‌రు మ‌రిచిపోగ‌ల‌రు? భార‌త‌దేశంలో దాన్ని మా సొంతంగా భావిస్తున్నాం. భార‌త‌దేశానికి చెందిన‌ మ‌ధ్య యుగాల క‌వులు ప‌ర్షియాను, సంస్కృతాన్ని అక్క చెల్లెళ్లుగా భావించారు. భార‌త‌దేశ హిందూ మ‌త గ్రంథం రామాయ‌ణం ప‌ర్షియా భాష‌లో 12కు పైగా అనువాదాల‌ను క‌లిగి ఉన్నది. రామాయ‌ణంలో 250కి పైగా ప‌ర్షియా ప‌దాలు ఉన్నాయి. మ‌ధ్య‌ యుగాల భార‌త‌దేశంలో ప‌ర్షియా భాష న్యాయ‌స్థానాల భాష‌గా గుర్తింపు పొందింది. భార‌తీయుల హృద‌యాల‌లో అది చిర‌స్థాయిగా నిలిచిపోయింది కాబట్టే, ప‌ర్షియా భాష‌కు అంత ప్ర‌జాద‌రణ ల‌భించింది. భార‌త‌దేశంలోని న‌లభై దాకా విశ్వ‌విద్యాల‌యాలలో ప‌ర్షియాను బోధించ‌డం జరుగుతోంది. గ‌త 75 సంవ‌త్స‌రాలుగా ఆకాశవాణి ప‌ర్షియా భాష‌లో ప్ర‌సారాల‌ను అందిస్తోంది. ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర‌, ప్రజల దగ్గర 5 మిలియ‌న్ వ‌ర‌కు ప‌ర్షియా రాత‌ప్ర‌తులు ఉన్నాయి. దేశంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల పురాత‌న భాండాగారాల‌లో 20 మిలియ‌న్ కు పైగా ప‌ర్షియా దస్తావేజులున్నాయి. వీటిలో చాలా మ‌టుకు ఉమ్మ‌డి వార‌స‌త్వాన్ని క‌లిగి ఉన్నాయి. ఎందుకంటే వాటిని ఇరాన్ కాలిగ్రాఫ‌ర్స్ రాస్తే భారతీయు క‌ళాకారులు చిత్రీక‌రించారు. హైద‌రాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియంలో భార‌తీయ‌, ఇరాన్ క‌ళాకారుల‌, ర‌చ‌యిత‌ల క‌ల‌యిక‌తో రూపొందిన రాత‌ప్ర‌తుల‌ను అనేకం చూడ‌వ‌చ్చు. అన్ని రాత‌ప్రతుల‌ను, ప‌ర్షియా భాష‌లోని రాత‌ప్ర‌తుల‌తో క‌లిపి డిజిట‌ల్ రూపంలోకి మార్చ‌డానికి భార‌త‌దేశంలో భారీ స్థాయిలో కృషి జ‌రుగుతోంది. ప్ర‌తి సంవ‌త్స‌రం భార‌త‌దేశ రాష్ట్ర‌ప‌తి ప‌ర్షియా పండితుల‌కు అవార్డుల‌ను ఇస్తున్నారు.

సోదర సోదరీమణులారా,

పురాత‌న నాగ‌రిత‌క‌లు క‌లిగిన మ‌న రెండు దేశాలూ విదేశీ సంస్కృతుల‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డంలో, వాటిని అక్కున చేర్చుకోవ‌డంలో ప్ర‌సిద్ధి చెందాయి. ఇరు దేశాల మ‌ధ్య‌ సంబంధాలు ఒక్క మ‌న సంస్కృతుల‌ను మాత్ర‌మే ఉన్న‌తీక‌రించ‌లేదు; వాటి కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌రిధులు దాట‌ని, స‌హ‌న‌శీలమైన స‌మాజాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇరు దేశాల‌కు ఉన్న పురాత‌న బంధాల కార‌ణంగా ఎంతో ఉన్న‌త‌మైన సూఫీ త‌త్వం వెలుగులోకి వ‌చ్చింది. సూఫీత‌త్వం సిసలైన ప్రేమ‌, స‌హ‌నం అనే సందేశాన్ని ప్రవచించింది . దీనిని ప్రపంచ‌ మాన‌వాళి అంగీక‌రించింది. భార‌తీయ సర్వోన్న‌త భావ‌న ”వ‌సుధైక కుటుంబ‌కం”. ఇది ప్ర‌పంచం ఒకే కుటుంబం అని బోధిస్తుంది. సూఫీ త‌త్వం కూడా ఈ భావ‌న‌నే ప్ర‌తిఫ‌లిస్తోంది.

స్నేహితులారా,

భార‌త‌దేశం, ఇరాన్ ఎప్ప‌టినుంచో భాగస్వాములుగా, స్నేహితులుగా ఉన్నాయి. మ‌న చరిత్రాత్మ‌క బంధాల్లో మిట్ట ప‌ల్లాల‌ను చూసి ఉండ‌వ‌చ్చు. అయితే మ‌న భాగ‌స్వామ్యం మొత్తాన్ని చూసిన‌ప్పుడు, అది ఇరు దేశాల‌కు ప‌రిధులు లేని బ‌లాన్ని అందించే వ‌న‌రుగా ఉంది. ఇరుదేశాల‌కు గ‌ల సంప్ర‌దాయ బంధాలు, అనుబంధాల గ‌త వైభ‌వాన్ని తిరిగి నెల‌కొల్పుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ఇరు దేశాలు క‌లసి ప‌యనించాల్సిన తరుణం ఆసన్నం అయింది. ఎంతో ప్ర‌సిద్ధి చెందిన పండితులైన మీరు ఈ కృషిలో నిర్ణ‌యాత్మ‌క‌మైన పాత్ర‌ను పోషించాలి.

”భార‌త‌దేశం-ఇరాన్, రెండు ఘ‌న‌మైన నాగ‌రిక‌త‌లు: సింహావలోకనం మరియు అవకాశాలు” (”India and Iran, Two Great Civilizations: Retrospect and Prospects”) అనే పేరుతో నిర్వ‌హిస్తున్న ఈ స‌మావేశాన్ని ప్రారంభించ‌డం నాకెంతో సంతోష‌దాయ‌క‌మైన విష‌యం.

ఈ స‌మావేశం విజ‌వంతం కావాల‌ని నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను. అంతే కాదు, మీ చ‌ర్చ‌ల ద్వారా వెలుగులోకి వ‌చ్చే ఆలోచ‌న‌ల్ని తెలుసుకోవ‌డానికి నేను ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. ఐసిసిఆర్‌, ఫ‌ర్హింగ్ స్తాన్.. రెండూ క‌లసి ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం సంతోష‌దాయకం. మీరు ఈ స‌మావేశంలో చేసే చ‌ర్చ‌లు, నిర్ణ‌యాలు మ‌న రెండు దేశాల సాంస్కృతిక‌, విద్యా రంగాల‌ను బ‌లోపేతం చేస్తాయి. అంతే కాదు, ప్ర‌జ‌ల మ‌ధ్య‌ బంధాల్ని బలోపేతం చేస్తాయి.

ఈ కార్య‌క్ర‌మానికి న‌న్ను ఆహ్వానించినందుకు మీ అంద‌రికీ మ‌రో సారి కృత‌జ్ఞ‌తలు.

మీకు, ఈ కార్య‌క్ర‌మానికి శుభం జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాను.

శుక్రన్‌, నమస్కారములు.