పిఎంఇండియా
భారతదేశం, నైజీరియా ల మధ్య సవరించిన వైమానిక సేవల ఒప్పంద పత్రం (ఎఎస్ఎ) పై సంతకాలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. పూర్వపు ఒప్పంద పత్రంపై సంతకాలు 1978 జనవరి 31వ తేదీన జరిగాయి. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసిఎఒ) రంగంలో చోటు చేసుకొన్న తాజా పరిణామాలు, ఉభయ దేశాల మధ్య విమానాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని ఈ ఒప్పంద పత్రాన్ని సవరించాల్సి వచ్చింది.
భారతదేశానికి, నైజీరియాకు మధ్య నెలకొన్న పౌర విమానయాన సంబంధాలలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతిక బంధాన్ని మరింత పటిష్టపరచేందుకు ఇది దోహదకారిగా ఉంటుంది.
వైమానిక సేవల ఒప్పందం ముఖ్యాంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి :
i) ఉభయ దేశాలు ఒకటి లేదా అంతకు మించిన విమానయాన సంస్థలను సర్వీసుల నిర్వహణకు అనుమతించవచ్చు.
ii) అనుమతి పొందిన విమానయాన సంస్థలు ఒకరి భూభాగంలో మరొకరు కార్యాలయాల ఏర్పాటుకు, గగనతల సేవల ప్రోత్సాహం, విక్రయ సేవలకు అర్హత కలిగివుంటాయి.
iii) ఉభయ దేశాల భూభాగాలలోకి 3వ,4వ,5వ ఫ్రీడమ్ ట్రాఫిక్ హక్కులతో కార్గో సర్వీసులను నిర్వహించుకొనేందుకు ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చాయి.
iv) అనుమతి పొందిన విమాన యాన సంస్థలు వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని హేతుబద్ధమైన రీతిలో టారిఫ్ లను నిర్ణయించుకునే స్వేచ్ఛ కలిగివుంటాయి.
v) అనుమతి పొందిన విమాన యాన సంస్థలు పరస్పరం సహకార మార్కెటింగ్ ఏర్పాట్లను కూడా కుదుర్చుకోవచ్చు.
vi) కొత్త నిబంధన ప్రకారం, ఆయా విమానయాన సంస్థలు నిర్దేశిత రూట్ షెడ్యూల్ కు లోబడి రెండు వైపుల నుండి వారానికి 7 సర్వీసులు గరిష్ఠంగా నడిపేందుకు అర్హతను కలిగివుంటాయి.
vii) పైన ప్రస్తావించినవి కాకుండా, ఆపరేటింగ్ అనుమతుల రద్దుకు లేదా రద్దును ఎత్తి వేయడానికి, అనుమతించిన సర్వీసుల నిర్వహణకు సబంధించిన నియమావళిని మార్చేందుకు, రూట్లలో స్వేచ్ఛకు, వాణిజ్య అవకాశాలు అన్వేషించుకోవడానికి, వైమానిక భద్రతకు, వైమానిక భద్రతకు సంబంధించిన క్లాజ్ ల సవరణకు కూడా భారతీయ నమూనా ఎఎస్ ఎ కు లోబడి కొత్త ఎఎస్ ఎ లో అవకాశాలను పొందుపరచారు.