Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త‌దేశ‌పు తొలి హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు కు అహమదాబాద్‌ లో భూమి పూజ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్రసంగ పాఠం

భార‌త‌దేశ‌పు తొలి హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు కు అహమదాబాద్‌ లో భూమి పూజ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్రసంగ పాఠం

భార‌త‌దేశ‌పు తొలి హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు కు అహమదాబాద్‌ లో భూమి పూజ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్రసంగ పాఠం

భార‌త‌దేశ‌పు తొలి హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు కు అహమదాబాద్‌ లో భూమి పూజ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్రసంగ పాఠం


జ‌పాన్ నుండి విచ్చేసిన ప్ర‌ముఖుల‌కు, ఈ చారిత్ర‌క సంద‌ర్భంలో ఇక్క‌డికి విచ్చేసిన ప్ర‌ముఖులంద‌రికీ స్వాగ‌తం.

నా స‌న్నిహిత మిత్రుడు శ్రీ ఆబే శాన్‌కు, ప్ర‌త్యేకించి గుజ‌రాత్ గ‌డ్డ‌ మీద మ‌రో సారి స్వాగ‌తం ప‌లుకుతున్నాను.

మీ అంద‌రికీ ఇవే నా అభినంద‌నలు. జ‌పాన్ ప్ర‌ధాని, ప్ర‌పంచ నాయ‌కుల‌లో ఒక‌రు, భార‌తదేశానికి అత్యంత స‌న్నిహిత మిత్రుడు, నాకు మంచి మిత్రుడైన‌ జ‌పాన్ ప్ర‌ధానికి నిన్న మీరు హృద‌య‌పూర్వ‌క స్వాగ‌తం ప‌లికి, ఆతిథ్యమిచ్చినందుకు మీకు నేను కృత‌జ్ఞ‌త‌లను తెలియ‌జేస్తున్నాను.

మిత్రులారా, అర్థ మ‌న‌స్కత‌తో కూడిన సంక‌ల్పాలు, ప‌రిమిత క‌ల‌ల‌తో ఏ దేశ‌మూ ఎన్న‌టికీ ముందుకు పోలేదు. విస్తృత‌మైనటువంటి క‌ల‌లు మాత్ర‌మే ఒక దేశ గ‌మ‌నాన్ని, ఒక స‌మాజ గ‌మ‌నాన్ని , ఒక వ్య‌క్తి గ‌మ‌నాన్ని నిర్ణ‌యించ‌గ‌లుగుతాయి. ఇది ఒక ‘న‌వ భార‌తం’, దీని క‌ల‌లు విస్తార‌మైన‌వి. దీని గ‌మ‌నం అనంతం. దీనికి అప‌రిమిత‌మైన మనశ్శక్తి ఉంది.

ఈ రోజు, భార‌త దేశం ఎంతో కాలం నాటి త‌న క‌ల‌ను సాకారం చేసుకోవ‌డంలో ఒక గొప్ప ముంద‌డుగు వేసింది. ఈ సంద‌ర్భంగా ముంబయి- అహమదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ కు సంబంధించి భూమి పూజ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా 125 కోట్ల మంది ఈ దేశ ప్ర‌జ‌ల‌కు నేను శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. బులెట్ రైలు ప్రాజెక్టు వేగ‌వంతమైన ప్ర‌యాణంతో పాటు స‌త్వ‌ర ఫ‌లితాలు కూడా ఇవ్వ‌డ‌మే కాకుండా అద్భుత‌మైన ప్ర‌గ‌తికి, ఫాస్ట్ టెక్నాల‌జీకి కార‌ణ‌మౌతుంది. ఇది ఎంతో అనుకూల‌మైంది, భ‌ద్ర‌మైందీనూ. ఇది వేగంతో పాటు ఉపాధిని కూడా క‌ల్పిస్తుంది. ఇది మాన‌వ హిత‌క‌ర‌మైన‌దే కాకుండా ప‌ర్యావ‌ర‌ణ హిత‌క‌ర‌మైన‌ది కూడాను. భార‌తదేశం, జ‌పాన్ ల సంబంధాల‌లో ఈ రోజు ఎంతో చ‌రిత్రాత్మ‌క‌మైన రోజు. అలాగే ఇది ఒక భావోద్వేగ‌పూరితమైనటువంటి సంద‌ర్భం. ఒక మంచి స్నేహితుడు ఎన్న‌టికీ కాలానికి , స‌రిహ‌ద్దుల‌కూ అతీతుడు. అలాగే జ‌పాన్ కూడా భార‌త్‌కు ఎంత మంచి మిత్ర‌దేశ‌మో ఎంత స‌న్నిహిత దేశ‌మో కాలానికి, స‌రిహ‌ద్దుల‌కు అతీతంగా రుజువు చేసింది. ఈ దిశ‌గా ముంబయి, అహమదాబాద్ ల మ‌ధ్య తొలి హై స్పీడ్ రైలు ప్రాజెక్టు ఒక మంచి ఉదాహ‌ర‌ణ‌. ద్వైపాక్షిక సంబంధాలు బ‌లోపేతానికి ఇది ఒక మంచి గుర్తు. ఈ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం ఇంత స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో చోటు చేసుకుంటున్న‌దంటే అందుకు ఘ‌న‌త నా ప్రియ మిత్రుడు శ్రీ ఆబే శాన్‌కు ద‌క్కుతుంది. శ్రీ శింజో ఆబే వ్య‌క్తిగ‌తంగా శ్ర‌ద్ధ వహించి, ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూశారు.

మిత్రులారా, మానవ నాగ‌రక‌తా అభివృద్ధి అంతా ర‌వాణా ప‌ద్ధ‌తుల‌లో చోటు చేసుకొంటూ వ‌చ్చిన అభివృద్ధితో ముడిప‌డి ఉంది. మ‌నం ఒక‌సారి ఆసియా నాగ‌రక‌త‌ను నిశితంగా గ‌మ‌నించిన‌ట్ట‌యితే, తొలినాళ్ల‌లో గ్రామాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల ప్ర‌జ‌లు న‌దుల ఒడ్డున స్థిర నివాసం ఏర్పాటుచేసుకుని జీవించే వారు. ఆ త‌రువాత ఈ ప్రాంతాలు అభివృద్ధి కేంద్రాలుగా అవ‌త‌రించాయి. తదనంతరం రహదారులు అభివృద్ధికి మార్గాలుగా మారాయి. అలాగే జాతీయ ర‌హ‌దారులు వెళ్లినటువంటి న‌గ‌రాలు మ‌రింత అభివృద్ధిని సాధించాయి. ఇక ఇప్ప‌డు త‌దుప‌రి త‌రం అభివృద్ధి హై స్పీడ్ రైల్ కారిడార్‌ల స‌మీపంలో జ‌ర‌గ‌నుంది.

మిత్రులారా, ర‌వాణా వ్య‌వ‌స్థ- అది రైల్వేలు కానివ్వండి లేదా జ‌ల‌ మార్గాలు కానివ్వండి లేదా ఆకాశ మార్గాలు కానివ్వండి- ఇవి ఒక దేశం అభివృద్ధిలో ఎంతో కీల‌క‌మైన పాత్రను పోషిస్తాయి. ఈ ర‌వాణా వ్య‌వ‌స్థ దేశంలో వివిధ ప్రాంతాల మ‌ధ్య అనుసంధానానికి పునాదిగా నిలుస్తుంది. ఈ అనుసంధాన‌ం దేశ ప్ర‌జ‌ల‌కు ఎన్నో ర‌కాలుగా, ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అమెరికా చ‌రిత్ర గురించి బాగా ప‌రిచ‌యం ఉన్న వారికి తెలుసు.. అమెరికాలో రైల్వేలు అభివృద్ధి చెందిన త‌రువాత అక్క‌డ ఎలా ఆర్థిక ప్ర‌గ‌తిలో న‌వ‌శ‌కం ఆరంభ‌మైందో. ఇది ప్ర‌పంచం మొత్తానికి తెలుసు. కొద్ది సేప‌టి క్రిత‌మే, మ‌న మిత్రుడు శ్రీ ఆబే మ‌న‌కు చెప్పాడు రెండో ప్ర‌పంచ యుద్ధం త‌రువాత జ‌పాన్ ప‌రిస్థితి ఎలా ఉండిందో. ఎంత దారుణ‌మైన జీవితం అది. ఎంత‌టి పేద‌రికం అక్క‌డ అప్పుడు ఉండేది ? కానీ 1964లోనే అక్క‌డ బులెట్ రైలు ప్రారంభింప‌బ‌డింది. ఆ త‌రువాత క్రమంగా 15 దేశాల‌కు విస్త‌రించింది. ఇది జ‌పాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ ద‌శను తిప్పింది. ఇవాళ దాని ప్ర‌భావాన్ని యూరోప్ నుండి చైనా వ‌ర‌కు చూడ‌వ‌చ్చు.

హై స్పీడ్ రైళ్లు ఈ దేశాల‌లో కేవలం ఆర్థికప‌ర‌మైన మార్పుల‌కే కాకుండా సామాజికంగా కూడా మార్పుల‌కు దోహ‌ద‌ప‌డ్డాయి. అప్ప‌టికీ ఇప్ప‌టికీ కాలం మారింది. ఎన్నో మార్పులు వ‌చ్చాయి. ప్ర‌జ‌ల అవ‌స‌రాలూ మారాయి. అందువ‌ల్ల మ‌న విధానంలో కూడా మార్పు అవ‌స‌రం. కాలానికి అనుగుణంగా చిన్న ప్ర‌య‌త్నం జ‌రిగింది. కొత్త అంశాలను జోడించాం. అయితే నెమ్మ‌దిగా వెళ్లే స‌మ‌యం కాదిది. కాలం మ‌న‌ కోసం ఆగ‌దు. గ‌డ‌చిన వంద సంవ‌త్స‌రాల‌లో మార‌ని సాంకేతిక విజ్ఞానం గ‌త పాతికేళ్ల‌లో మార్పు చెందింది. మార్పులు ఇలా వేగంగా జ‌రుగుతుంటే, మ‌న దృష్టి కూడా కేవలం అనుసంధానం, వేగ‌వంత‌మైన అనుసంధానానికి మించి వెళ్లాలి. ఇదీ మ‌న ప్రాధాన్య‌ం. మ‌న ఉద్ఘాట‌న‌. హై స్ప‌ీడ్ రైలు ద్వారా వివిధ ప్రాంతాల మ‌ధ్య అనుసంధానం దూరాన్ని తగ్గించి, స‌రికొత్త ఆర్థిక ప్ర‌గ‌తికి మార్గాల‌ను ఆవిష్క‌రిస్తుంది.
మిత్రులారా, ఉత్ప‌త్తికి, ఆర్థిక ప్ర‌గ‌తికి నేరుగా సంబంధం ఉంది. ఉత్పాద‌క‌త ఉంటే ప్ర‌గ‌తి ఉంటుంది. హై స్పీడ్ క‌నెక్టివిటీ ద్వారా ఉత్పాద‌క‌తను పెంచాల‌న్న‌ది మా గ‌ట్టి సంక‌ల్పం.

మిత్రులారా, ఈ సంద‌ర్భంగా నేను జ‌పాన్ స్నేహం లోని గొప్ప‌త‌నాన్ని గురించి చెబుతాను. మ‌నం భార‌తీయులం- ముఖ్యంగా గుజ‌రాతీలం- ఏదైనా కొన‌డానికి బ‌య‌ట‌కు వెళ్లిన‌పుడు, ప్ర‌తిదానిని తూచి చూస్తాం. దానికి స‌రిప‌డిన‌ట్టు ప్ర‌తి పైసా గిట్టుబాటైందా లేదా అని చూస్తాం. లాభ‌ న‌ష్టాల‌ను అంచ‌నా వేసి చూస్తాం. మ‌నం ఏదైనా సాధార‌ణ బైక్ ను కొన‌డానికి బ‌య‌ట‌కు వెళ్లిన‌పుడు, బైక్‌కు రుణం కావాలంటే మ‌నం ప‌ది బ్యాంకుల త‌లుపులు త‌డ‌తాం. ప్ర‌తి బ్యాంకుకు ప‌ది సార్లు వెళ‌తాం. మ‌న‌కు త‌క్కువ వ‌డ్డీ రేటుకు ఎవ‌రు రుణం ఇస్తారా అని త‌ర‌చి చూస్తాం. ఎన్నో లెక్క‌లు క‌డ‌తాం. ఒక బ్యాంకు 8 శాతం వ‌డ్డీకి, మ‌రో బ్యాంకు 9 శాతం వ‌డ్డీకి రుణం ఇస్తామంటే , దానికీ మ‌ళ్లీ మనం లెక్క‌లు వేస్తాం. ఈ వ‌డ్డీరేటుకు నేను బైక్‌ను కొనుగోలు చేస్తే, వ‌డ్డీతో స‌హా అస‌లు తిరిగి చెల్లించే నాటికి నా బైక్ ధ‌ర ఎంత‌వుతుంది ? అని లెక్క‌లు వేస్తాం. ఇంత సూక్ష్మంగా మ‌నం లెక్క‌లు కడతాం. అంతేకాదు, బ్యాంకు ఉద్యోగి మ‌న‌కు చెప్ప‌డానికి అల‌సిపోయేంత‌వ‌ర‌కు ఆ బ్యాంకు చుట్టూ ప‌దే ప‌దే తిరుగుతుంటాం. 8 శాతం, 9 శాతం వ‌డ్డీ రేటుకు రుణం తీసుకోలేను, వ‌డ్డీరేటును కాస్త త‌గ్గించండ‌ని అడుగుతాం. ఎవ‌రైనా అర శాతం వ‌డ్డీ రేటు త‌గ్గించినా, మ‌నం ఆనంద‌ప‌డ‌తాం. ఇది మ‌న‌కు బాగా తెలుసు. అహమదాబాదీల‌కు ఇది ఇంకా బాగా తెలుసు.

మిత్రులారా, గ‌మ‌నించండి, భార‌త్‌కు జ‌పాన్ వంటి బ్యాంకు, శ్రీ ఆబే శాన్ వంటి మిత్రుడు దొరికిన‌ట్టుగా మ‌రెవ‌రికీ దొర‌క‌రు. ఎవ‌రైనా వ‌డ్డీ లేని రుణం ఇచ్చి, అది కూడా ప‌ది కాదు, ఇర‌వై కాదు యాభై సంవత్సరాలలో తిరిగి చెల్లించండ‌ని అంటారా ? దీనిని ఎవ‌రైనా న‌మ్ముతారా ? ప‌్ర‌జ‌లు ఇలాంటి బ్యాంకును పొంద‌లేరు. కానీ భారతదేశం ఇలాంటి స్నేహితుడిని పొందింది. బులెట్ రైళ్ళ కోసం 80 వేల కోట్ల రూపాయ‌ల‌ను కేవలం 0.1 శాతం వ‌డ్డీ రేటుతో మ‌న‌కు ఇవ్వ‌డానికి జ‌పాన్ నిర్ణ‌యించింది.

నేను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు బులెట్ రైలును గురించి మాట్లాడుతుంటే, న‌న్ను చాలా మంది అడిగేవారు, మ‌నం బులెట్ రైలును ఎందుకు తీసుకురావాలి అని. అలాగే మ‌రికొంద‌రు ఆయ‌న ఎప్పుడు తీసుకు వ‌స్తార‌ని ప్ర‌శ్నించే వారు. ఇంకొంద‌రు ఈ ప‌ని ఎప్పుడు చేస్తార‌నే వారు. చివ‌ర‌కు నేను తీసుకు రావ‌డం మొద‌లుపెట్టే స‌రికి నేను ఎందుకు దీనిని తీసుకువ‌స్తున్నాన‌ని అంటున్నారు ? సోద‌ర‌, సోద‌రీ మ‌ణులారా, ఈ బులెట్ రైలు మ‌న‌కు జపాన్ ఇస్తున్నటువంటి ఒక పెద్ద బ‌హుమ‌తి. ఏమాత్రం ఖ‌ర్చు లేకుండా ఈ ప్రాజెక్టు త‌యారవుతోంది. ఈ ప్రాజెక్టుకు ముందుకు వ‌చ్చి, ఆర్థిక‌, సాంకేతిక స‌హ‌కారాన్ని అందిస్తున్న‌ జ‌పాన్‌కు నేను కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.

సోద‌ర‌, సోద‌రీమ‌ణులారా, ఈ హై స్పీడ్ రైల్వే వ్య‌వ‌స్థ రెండు ప్రాంతాల మ‌ధ్య దూరాన్ని త‌గ్గించ‌డ‌మే కాకుండా 500 కిలోమీట‌ర్ల దూరంలోని న‌గ‌రాల‌లోని ప్ర‌జ‌లు కూడా ఒక‌రికొక‌రు ద‌గ్గ‌రవుతారు. అందువ‌ల్ల ఈ రైలు అమారూ అహమదాబాద్ నుండి ఆమ్చి ముంబయి వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ప్రాజెక్టు పూర్త‌యితే ముంబయి, అహమదాబాద్ ల మ‌ధ్య దూరాన్ని రెండు- మూడు గంట‌ల‌లో చేరుకోవ‌చ్చు.

దీనిని మ‌నం విమాన‌ ప్ర‌యాణంతో పోల్చి చూసుకుంటే, ముంబయికి హై స్పీడ్ రైలు ద్వారా విమాన ప్ర‌యాణానికి ప‌ట్టే స‌మ‌యం కంటే సగం స‌మ‌యంలోనే చేరుకోవ‌చ్చు. ఇక్క‌డి నుండి విమానాశ్రయానికి వెళ్ల‌డానికి, అక్క‌డ విధి విధానాలు పూర్తి చేయ‌డానికి, ప్ర‌యాణం పూర్త‌ి అయ్యాక విమానాశ్రయం నుండి ఇంటికో లేదా కార్యాలయానికో వెళ్ల‌డానికి ప‌ట్టే స‌మ‌యాన్ని లెక్క‌క‌ట్టి చూస్తే త‌క్కువ స‌మ‌యంలోనే బులెట్ రైలు ద్వారా గ‌మ్య‌స్థానాన్ని చేరుకోవ‌చ్చు.

చూశారా, ఇది ఎంత మార్పు తీసుకురానున్న‌దో. మీరు ఊహించ‌గ‌ల‌రా ఈ మార్పును. ప్ర‌జ‌ల‌కు ఎంత స‌మ‌యం ఆదా అవుతుందో క‌దా. దీనివ‌ల్ల ముంబయి, అహమదాబాద్ ల మ‌ధ్య వేలాది వాహ‌నాల ర‌ద్దీ కూడా త‌గ్గుతుంది. ఇది ప‌ర్యావ‌ర‌ణంపై కూడా ఎంతో సానుకూల ప్ర‌భావం చూపుతుంది. ఇంధ‌నం ఆదా అవుతుంది. ఇంధ‌నం ఆదా అయిందంటే విదేశీ మార‌క‌ద్ర‌వ్య నిల్వ‌లు ఆదా అయిన‌ట్టే. మ‌నం ఇంధ‌నాన్ని విదేశాల నుండి దిగుమ‌తి చేసుకుంటుంటాం. ఈ ప్రాజెక్టుతో ముంబయి, అహమదాబాద్ మార్గంలో కొత్త ఆర్థిక వ్య‌వ‌స్థ అభివృద్ధి చెంద‌నుంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే రెండు న‌గ‌రాల మ‌ధ్య గ‌ల మొత్తం ప్రాంతం ఒకే ఆర్థిక మండలంగా మారుతుంది. హై స్పీడ్ కారిడార్ ట్రాఫిక్‌ను వేగ‌వంతం చేయ‌డ‌మే కాకుండా ఇది వాణిజ్యాన్ని పెంపొందిస్తుంది. రెండు ప్రాంతాలవారి మ‌ధ్య మాటామంతీ పెరుగుతుంది. ఇది వాణిజ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే మాన‌వ వ‌న‌రుల బ‌దిలీకి లేదా స‌ర‌కుల ర‌వాణా అవ‌కాశాలు పెరుగుతాయి. దీనిని సుల‌భ‌త‌రం చేస్తుంది. ఇది నేనుముందే చెప్పిన‌ట్టు దేశ అభివృద్దికి దోహ‌దం చేస్తుంది. దేశం కొత్త వేగాన్ని అందుకొంటుంది.

ఏదైనా కొత్త సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులోకి వ‌చ్చిందంటే ఇది కేవ‌లం సంప‌న్న వ‌ర్గాల‌కే ఉప‌యోగ‌పడుతుంద‌న్న భావ‌న ఉంది. అయితే ఇందుకు సంబంధించిన అనుభ‌వం వేరేవిధంగా ఉంది. పేద‌ల‌కు సాధికారితను క‌ల్పించేందుకు మ‌నం సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వాడుకున్న‌ట్ట‌యితే పేద‌రికానికి వ్య‌తిరేకంగా త్వ‌ర‌గా పోరాటం చేసి విజ‌యం సాధించ‌వ‌చ్చు. అందువ‌ల్ల మ‌నం ఈ సాంకేతిక ప‌రిజ్ఞానాన్నిగ‌రిష్ఠంగా వాడుకుంటూ ఈ దేశ ప్ర‌జ‌ల జీవితాల‌తో అనుసంధానం చేస్తూ వారికి దానిని అందుబాటులోకి తేవ‌ల‌సి ఉంది. దేశ సామాన్య ప్ర‌జ‌లు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని బాగా వినియోగించ గ‌లిగితే అది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇవాళ మ‌నం కొత్త‌, అత్యంత అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని రైల్వేలో తీసుకువ‌స్తున్నాం. ఈ అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం ఫ‌లితాలు సామాన్యుడికి కూడా చేర్చేందుకు మనం కృషి చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు సంద‌ర్భంగా సాంకేతిక ప‌రిజ్ఞానంతో రైల్వేలు ఎంతగానో ప్ర‌యోజ‌నాన్ని పొందుతాయి. ఇది సాంకేతిక నిపుణులకు, విక్రేతలకు,ఈ ప్రాంత ఉత్ప‌త్తిదారుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రో వైపు మ‌న‌కున్న రైల్వే నెట్ వ‌ర్క్‌ను ఆధునీక‌రించాల్సి ఉంది. దీనితో మ‌నం ల‌బ్ధిని పొందుతాం.

మిత్రులారా, మ‌నం జ‌పాన్‌ నుండి సాంకేతిక విజ్ఞానాన్ని పొందుతుండ‌వ‌చ్చు. కానీ బులెట్ రైలుకు ఉప‌యోగించే ఎక్కువ‌ భాగం వ‌న‌రులను భార‌త‌దేశం నుండే స‌మ‌కూర్చుకోవ‌డం జ‌రుగుతుంది. అందువ‌ల్ల మ‌న ప‌రిశ్ర‌మలు ప్ర‌పంచ ప్ర‌మాణాల‌తో ప‌రిక‌రాల‌ను త‌యారుచేసి వాటిని స‌కాలంలో అందించాల్సి ఉంటుంది. త‌యారీ రంగంలో మ‌నం లోపాలు లేని, ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా ఎలాంటి ప్ర‌తికూల‌ ప్ర‌భావం చూప‌ని విధంగా ఉత్ప‌త్తిపై మ‌నం దృష్టి పెట్ట‌వ‌ల‌సి ఉంది. ఈ ప్రాజెక్టుతో ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా వేలాది ఉపాధి అవ‌కాశాలు అందుబాటులోకి రానున్నాయి.

మిత్రులారా, న‌వ‌భార‌త దేశానికి స‌మీకృత ర‌వాణా వ్య‌వ‌స్థ దేశానికి అవ‌స‌రం. ఇది ఒక ‘న్యూ ఇండియా’ క‌ల‌. అందువ‌ల్ల మనం దేశాన్ని భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా తీర్చిదిద్ద‌డంపై దృష్టి పెడుతున్నాం. ఇందుకు భ‌విష్య‌త్ త‌రాల అవ‌స‌రాల‌కు అనుగుణంగా మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించ‌వ‌ల‌సి ఉంది. రైల్వేలు, జాతీయ ర‌హ‌దారులు, జ‌ల‌మార్గాలు, విమాన‌యానం.. ఇలా అన్ని రంగాల‌లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న విష‌యంలో ఇంత‌కు ముందు ఎన్న‌డూ లేనంత వేగంగా ముందుకు పోతున్నాం. ఇంత‌కు ముందు ఎన్న‌డూ లేనంత వేగంగా రహదారుల నిర్మాణాన్ని చేప‌డుతున్నాం. ర‌వాణా రంగంలోనూ జి ఎస్‌టి ప్ర‌యోజ‌నాలు క‌నిపిస్తున్నాయి. ట్ర‌క్కుల రోజువారి ప్ర‌యాణ దూరం 30 శాతం పెరిగింది. ఇంత‌కు ముందు స‌ర‌కుల‌తో వెళుతున్న ట్ర‌క్కులు రోజుకు 200 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణిస్తుంటే జిఎస్‌టిని అమ‌లు చేసిన త‌రువాత, చెక్‌పోస్టు ఇబ్బందుల‌ను తొల‌గించిన త‌రువాత.. ఇవాళ అవే ట్ర‌క్కులు రోజుకు 250 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తున్నాయి. అందువ‌ల్ల జిఎస్‌టి అమ‌లుతోనే ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ వేగంలో 30 శాతం వృద్ధి సాధ్య‌మైంది. అంతేకాదు, ప్ర‌జ‌లు త‌క్కువ ధ‌ర‌కు స‌ర‌కులు పొంద‌డానికి అవ‌కాశం క‌లుగుతోంది.

ప‌ర్యావ‌ర‌ణ హిత‌క‌ర ర‌వాణా సాధ‌నంగా ఉండేందుకు ప్ర‌భుత్వం జ‌ల‌మార్గాల అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉంది. ఈ దిశ‌గా, మేం జాతీయ జ‌ల‌మార్గాల రూపంలో 106 (అధిక ప్రవాహాలున్న) న‌దుల‌లో జ‌ల‌మార్గాల‌ను అభివృద్ధి చేయ‌నున్నాం. విమాన‌యాన రంగమూ భార‌త‌దేశానికి మంచి అవ‌కాశాలు తీసుకువస్తోంది. గ‌డ‌చిన మూడు సంవ‌త్స‌రాల‌లో విమానాల‌లో ప్ర‌యాణిస్తున్న‌ వారు, అంటే దేశీయ విమానయానం చేస్తున్న‌ వారి సంఖ్య సుమారు మూడు కోట్ల మేర పెరిగింది. విమాన‌యాన రంగాన్ని బ‌లోపేతం చేసేందుకు తొలిసారిగా జాతీయ విమాన‌యాన విధానాన్ని తీసుకువచ్చాం. ఉడాన్‌ యోజ‌న స‌హాయంతో (విమాన ప్ర‌యాణ ప‌థ‌కం) మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల జీవితాల‌లో మార్పు రానుంది. ఈ ప‌థ‌కం కింద దేశంలో 70 చిన్న ప‌ట్ట‌ణాల‌కు విమాన సేవ‌ల‌ను అనుసంధానం అవుతాయి. దీనివ‌ల్ల సామాన్య ప్ర‌జ‌లు అందుబాటు ధ‌ర‌లలో విమాన సేవ‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌డానికి వీలుంటుంది.

ఇక ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం స‌హాయంతో ప్ర‌స్తుత రైల్వే వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డంతో పాటు కొత్త రైల్వే నెట్ వ‌ర్క్ నిర్మాణంపై దృష్టి పెట్ట‌డం జ‌రుగుతుంది. రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, రైల్వే ట్రాక్ డ‌బ్లింగ్ ప‌నులు, ట్రాక్ విద్యుదీక‌ర‌ణ‌ ప‌నుల‌ను ఇంత‌కు ముందు ఎన్న‌డూ లేని రీతిలో వేగ‌వంతం చేశాం. రైల్వేల‌పై ప్ర‌భుత్వం పెడుతున్నంత గా పెట్టుబ‌డి ఇంత‌కుముందు ఎన్న‌డూ పెట్ట‌లేదు. పెట్టుబ‌డి పెంచ‌డంతో పాటు ఎన్నో ద‌శాబ్దాలుగా పూర్తి కాకుండా ఉన్న ప్రాజెక్లులను పూర్తి చేయ‌డంపై కూడా దృష్టి పెట్టాం. భార‌తీయ రైల్వేల సామ‌ర్ధ్యాన్ని పెంచేందుకు , స‌ర‌కు ర‌వాణా మ‌రింతగా జ‌రిగేందుకు వీలుగా భార‌తదేశ ప్ర‌భుత్వం నిరంత‌రాయంగా కృషి చేస్తోంది.

ముంబయిలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నౌకాశ్రయం నుండి ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లోని దాద్రి వ‌ర‌కు ప‌శ్చిమాన స‌ర‌కు ర‌వాణాకే అంకిత‌మైన కారిడార్‌ను నిర్మించ‌డం జ‌రుగుతోంది. కోల్‌క‌తా నుంచి లూధియానా వ‌ర‌కు తూర్పున ర‌వాణాకే అంకిత‌మైన కారిడార్ నిర్మాణం జ‌ర‌గ‌నుంది. రాగ‌ల మూడు, మూడున్న‌ర సంవ‌త్స‌రాల‌లో మేం ఈ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌నున్నాం. ఈ ప్రాజెక్టులు పూర్త‌యితే ర‌ద్దీ త‌గ్గుతుంది. పాసింజ‌ర్ రైళ్ల‌కు కూడా స‌మ‌యం ఆదా అవుతుది. రైల్వేల సామ‌ర్ధ్యం పెరుగుతుంది.

మిత్రులారా,

రైల్వేల‌ను ఆధునీక‌రించే దార్శ‌నిక దృష్టిలో భాగ‌మే హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు. ఈ రోజు మ‌నం ఇందుకు సంబంధించి భూమి పూజ కార్య‌క్ర‌మం జ‌రుపుకోవ‌డం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సోద‌ర‌, సోద‌రీ మ‌ణులారా, ప్రియ‌మైన నాదేశ వాసులారా, ఈ రోజు భూమిపూజ జ‌రిగింది. ఇది మనకు స్వాతంత్ర్యం సిద్ధించి 70వ సంవ‌త్స‌రం. మ‌నం సాబర్ మతీ ఆశ్ర‌మ శ‌తాబ్ది వేడుక‌లను జ‌రుపుకొంటున్నాం. మ‌న దేశ 75వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకొనే 2022-2023 నాటికి ఈ ప్రాజెక్టు పూర్త‌యి, ఇప్పుడే శ్రీ ఆబే శాన్ చెప్పిన‌ట్టు మేమిద్దరం ఈ రైలులో ప్ర‌యాణించి ఈ ప్రాజెక్టును ప్రారంభించాల‌న్న‌ది నా ఆకాంక్ష‌, నా క‌ల‌. జ‌పాన్, భారతదేశాలు ఈ అంశంపై క‌దిలితే, దీనిని త‌ప్ప‌కుండా పూర్తి చేయ‌గ‌లుగుతాం. ఇందుకు నేను మీకు హామీ ఇవ్వ‌గ‌ల‌ను.

దీనితో పాటుగా హై స్పీడ్ శిక్ష‌ణ‌ సంస్థ బ‌రోడాలో ఏర్పాట‌వుతుంది. ఇందులో హై స్పీడ్ రైలు నిపుణుల‌ను త‌యారు చేస్తారు. ఇది చాలా ముఖ్య‌మైన ప్రాజెక్టు అని నేను విశ్వ‌సిస్తున్నాను. చాలా ఏళ్లుగా వ‌డోద‌ర రైల్వేల‌కు సంబంధించిన ఒక ప్ర‌ముఖ యూనిట్‌గా ఉంటూ వ‌చ్చింది. ఇప్ప‌ుడు జ‌పాన్ నిపుణులు ఇక్క‌డ‌కు వ‌స్తారు. హై స్పీడ్ రైల్వేల‌కు కావ‌ల‌సిన నిపుణులన త‌యారు చేయ‌డం, కొత్త టెక్నాల‌జీలను గురించి బోధించ‌డం వంటివి ఇక్క‌డ జ‌రుగుతాయి. దీనివ‌ల్ల గుజ‌రాత్‌కు చెందిన యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయి. మాన‌వ వ‌న‌రుల నైపుణ్యాల‌లో అభివృద్ధి జ‌రిగితే దేశ శ‌క్తి ఎన్నోరెట్లు పెరుగుతుంది. హై స్పీడ్ రైలు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ‌గా ఈ శ‌క్తి పెరుగుతుంది. ఇలాంటి కార్య‌క్ర‌మం ఇప్పుడు జ‌పాన్ తోడ్పాటుతో బ‌రోడాలో జ‌ర‌గ‌నుంది. ఇది ఆధునిక రైల్వే ఇంజ‌ినీయరింగ్ కార్య‌క్ర‌మం. భార‌త‌దేశ యువ‌తీయువకులు ఇందుకు సిద్ధంగా ఉండాలి. న‌వ‌ భార‌తానికి అవ‌స‌ర‌మైన స‌మ‌ర్థ‌త కలిగిన మాన‌వ వ‌న‌రుల‌ను సృష్టించేందుకు ఈ సంస్థ కృషి చేయ‌నుంద‌ని గ‌మ‌నించండి. హై స్పీడ్ రైల్వే కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన భూమి పూజ కంటే నేను హై స్పీడ్‌ రైళ్ల‌కు సంబంధించి ముంద‌స్తుగా ఈ దేశ యువ‌త‌కు మాన‌వ వ‌న‌రుల శిక్ష‌ణ నిచ్చే ఈ సంస్థ భూమిపూజకు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తాను. ఎందుకంటే, ఇది 21 వ శ‌తాబ్ద‌పు భార‌త‌దేశానికి పునాదిరాయిని వేస్తుంది.

ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ప్ర‌తినిధులు, భార‌తదేశం, జ‌పాన్ ల‌కు చెందిన ఉద్యోగులంద‌రికీ నేను అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. వారంద‌రి కృషి కార‌ణంగా ఈ ప్రాజెక్టు ఈ ద‌శ‌కు వ‌చ్చింది. ఇక అస‌లు ప్రాజెక్టు అమ‌లు కార్య‌క్ర‌మం ప్రారంభం అవుతున్న‌ది. ఉభ‌య‌ దేశాలూ క‌లిసి ఈ ప్రాజెక్టును అనుకున్న గ‌డువు క‌న్నా ముందే పూర్తి చేయ‌గ‌ల‌మ‌న్న విశ్వాసం నాకుంది. నేను మ‌రో మారు జ‌పాన్ ప్ర‌ధాని, నా ప్రియ‌ మిత్రుడు శ్రీ శింజో ఆబే కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. భార‌త‌దేశ‌పు రైలు నెట్‌వ‌ర్క్ ఎంత పెద్ద‌దంటే, ఒక వారం రోజుల మ‌న రైలు ప్ర‌యాణికుల సంఖ్య‌ జ‌పాన్ జ‌నాభా తో స‌మానం. అంత పెద్ద రైల్వే నెట్ వ‌ర్క్ మ‌న‌ది. ఎంత‌టి సామ‌ర్థ్యమో చూడండి. మ‌నకు ఎంతో అవ‌కాశం ఉంది. మాకు వేగం ఉంది. మీకు నైపుణ్యం ఉంది. ఇరువురం క‌ల‌సి ముందుకు సాగుతూ, ‘న‌వ భార‌తాని’కి కొత్త జోరును అందిద్దాం.

మ‌రోసారి, నేను గుజ‌రాత్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాను. జ‌పాన్ ప్ర‌ధాని గౌర‌వానికి త‌గిన‌ట్టు వారికి, నాకూ ఘ‌న స్వాగ‌తం ప‌లికినందుకు అభినంద‌న‌లు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర.. ఈ రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కూ నేను అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. ఈ రెండు రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు క‌లిసి ప‌నిచేస్తూ, కేంద్ర‌ప్ర‌భుత్వంతో, జ‌పాన్ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేస్తూ, ఒక్కొక్క ప‌నినే వేగంగా పూర్తి చేస్తూ, ఈ మొత్తం వ్య‌వ‌స్థ‌ను ముందుకు తీసుకువెళ్లాయి. అందుకు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రికి, మహారాష్ట్ర ముఖ్య‌మంత్రికి నేను
నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.

అనేకానేక ధ‌న్య‌వాదాలు.

***