పిఎంఇండియా
మనుషుల అక్రమ చేరవేత (హ్యూమన్ ట్రాఫికింగ్)ను అడ్డుకోవడంలోను, ఆ సమస్యను నివారించడంలోను సహకారం కోసం భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు ఎ ఇ) లు ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు)పై సంతకాలు చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ ఎమ్ ఒ యు పై త్వరలోనే సంతకాలు జరగగలవని భావిస్తున్నారు.
ఎమ్ ఒ యు రెండు దేశాల మధ్య మైత్రి బంధాన్ని బలోపేతం చేయగలదు. హ్యూమన్ ట్రాఫికింగ్ కు ప్రత్యేకించి మహిళలు, చిన్న పిల్లల అక్రమ చేరవేతకు సంబంధించిన సమస్యలన్నింటి నివారణ, రెస్క్యూ, రికవరీ, మరియు కంబాటింగ్ ప్రక్రియలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించగలదు.
ఎమ్ ఒ యు ముఖ్య అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి..:
1. అన్ని రకాలైన హ్యూమన్ ట్రాఫికింగ్ ను మరీ ముఖ్యంగా మహిళలు, చిన్నారుల అక్రమ చేరవేతను నివారించడంలో సహకారాన్ని పటిష్టపరచడం, ఇరు పక్షాలలో ట్రాఫికర్ ల, వ్యవస్థీకృత నేర మూకలపై పరిశోధనను, విచారణను వేగవంతం చేయడం;
2. మహిళల, చిన్న పిల్లల అక్రమ చేరవేతకు అడ్డుకట్ట వేయగల నివారక చర్యలను చేపట్టడం, ఇంకా.. ట్రాఫికింగ్ బాధితుల హక్కులను పరిరక్షించడం;
3. హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికి ఇరు పక్షాలలో యాంటి-ట్రాఫికింగ్ సెల్స్, ఇంకా టాస్క్ ఫోర్స్ లు కృషి చేస్తాయి;
4. హ్యూమన్ ట్రాఫికర్ లను అడ్డుకోవడానికి పోలీసులు, ఇతర సంబంధిత అధికార వర్గాలు సన్నిహిత సమన్వయంతో పనిచేసి, సంబంధిత సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకొంటాయి;
5. బాధితులను స్వదేశానికి పంపే ప్రక్రియను సాధ్యమైనంత వరకు శీఘ్రతరం చేస్తారు. బాధితుల సంరక్షణ, పునరేకీకరణ బాధ్యతను మాతృదేశం స్వీకరిస్తుంది;
6. ఎమ్ ఒ యు అమలును పర్యవేక్షించేందుకు ఇరు పక్షాలకు చెందిన ప్రతినిధులతో ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తారు.
పూర్వ రంగం
మనుషుల అక్రమ చేరవేతల గమ్యస్థానంగా ముఖ్యంగా డొమెస్టిక్ ట్రాఫికింగ్, లేదా ఇరుగు-పొరుగు దేశాల నుంచి ట్రాఫికింగ్ బారిన పడి దక్షిణ ఆసియా దేశాలు పీడనకు గురి అవుతున్నాయి. మధ్య ప్రాచ్యంలో దక్షిణ ఆసియా ప్రాంత బాధితుల జాడలు ఎక్కువగా వెల్లడి అవుతున్నాయి. యు ఎ ఇ కి ట్రాఫికింగ్ కు సంబంధించినంతవరకు భారతదేశం ఒక వనరుగాను, ట్రాన్సిట్ కంట్రీ గాను ఉంటోంది. అదే సమయంలో పురుషులు, మహిళల విషయంలో యు ఎ ఇ ఒక గమ్య స్థానంగాను, ట్రాన్సిట్ కంట్రీ గాను ఉన్నది. దక్షిణ ఆసియా, దక్షిణ పూర్వ ఆసియా, మధ్య ఆసియా, ఇంకా తూర్పు యూరప్ ల నుంచి మనుషులను అక్రమంగా చేరవేస్తున్నారు. అలా చేరవేతకు గురయిన వారు శ్రమ దోపిడీకి, యవ్వన దోపిడీకి లోనవ్వాల్సి వస్తోంది. యు ఎ ఇ లో ప్రయివేటు రంగంలో పనిచేస్తున్న వారిలో 95 శాతానికి పైగా వలస శ్రామికులే ఉంటున్నారు. వారిని ముఖ్యంగా ఇథియోపియా, ఇరిత్రియా, ఇరాన్, తూర్పు ఆసియా, దక్షిణ ఆసియా, దక్షిణ పూర్వ ఆసియా ల నుంచి భర్తీ చేసుకొంటున్నారు. ఈ శ్రామికులలో కొందరు యు ఎ ఇ లో వెట్టి చాకిరీలో సతమతం అవుతున్నారు. ఈ దేశాలలోని కొన్ని దేశాల నుంచి మహిళలు వారంతట వారు ఇష్టపూర్వకంగా యు ఎ ఇ లో ఇంటి పని చేసే వారు గాను, సెక్రటరీలు గాను, బ్యుటీషియన్ లు గాను, హోటళ్లలో పారిశుద్ధ్య కార్మికులు గాను పనిచేయడానికి తరలివెళ్తున్నారు. కానీ కొందరిని కట్టుబానిసతనంలోకి నెడుతున్నారు. అందుకుగాను వారి పాస్ పోర్టులను చట్టవిరుద్ధ పద్ధతులలో జప్తు చేసుకొంటున్నారు. వారి కదలికలపై ఆంక్షలు విధిస్తున్నారు. వేతనాలు చెల్లించడం లేదు; బెదరింపులకు, శారీరిక, యవ్వన వేధింపులకు లోను చేస్తున్నారు.
మనుషుల అక్రమ చేరవేతల నిరోధం దిశగా యు ఎ ఇ, భారతదేశం ల మధ్య అన్ని స్థాయిలలోను జరిపే ప్రయత్నాలు బలోపేతం అయిన పక్షంలో బాధితుల రక్షణకు ఎంతైనా అవసరం. ఇందుకోసం ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, నిఘా వర్గాల మధ్య సమాచార ఆదాన ప్రదానం, సంయుక్త పరిశోధన, హ్యూమన్ ట్రాఫికింగ్ సవాళ్లకు దీటైన సమన్వయంతో కూడిన ప్రతిస్పందన వ్యక్తం అవ్వాలి. దీనిని సాధించడం కోసం యు ఎ ఇ తో ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రంపై సంతకాలు చేయాలని ప్రతిపాదించారు. బంగ్లాదేశ్ తో ట్రాఫికింగ్ నిరోధ దిశగా ఇప్పటికే ఒక ఎమ్ ఒ యు పైన భారతదేశం ఈసరికే సంతకాలు చేసి ఉన్నది. అలాగే బహ్రెయిన్ తోను మరొక ఎమ్ ఒ యు పైన ఇదే నెలలో సంతకాలు చేయనున్నది.