Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మార్చి 8న ఢిల్లీలో రూ. 33,500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధానమంత్రి


మార్చి 8వ తేదీ మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ఢిల్లీలో రూ.33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ముందు సరోజినీ నగర్‌లోని జీపీఆర్‌ఏ టైప్-5 వసతి గృహాలను సందర్శించి.. అక్కడ మహిళలకు కేటాయించిన నివాసాల ఇంటి తాళంచెవులను ప్రధానమంత్రి స్వయంగా అందజేస్తారు.

సుమారు రూ.18,300 కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఢిల్లీ మెట్రోలో రెండు కొత్త కారిడార్లను జాతికి అంకితం చేస్తారు. వీటిలో దాదాపు 12.3 కిలోమీటర్ల మజ్లిస్ పార్కు-మౌజ్‌పూర్ బాబర్‌పూర్ (పింక్‌లైన్‌) కారిడార్‌.. సుమారు 9.9 కిలోమీటర్ల దీపాలి చౌక్-మజ్లిస్ పార్కు(మెజెంటా లైన్) కారిడార్లు ఉన్నాయి. ఈ కొత్త మార్గాల వల్ల బురారీ, జగత్‌పూర్-వజీరాబాద్, ఖజూరీ ఖాస్, భజన్‌పురా, యమునా విహార్, మధుబన్ చౌక్, హైదర్‌పూర్‌ బద్లీ మోర్, భలాస్వా, మజ్లిస్ పార్కు వంటి ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.

ఢిల్లీ మెట్రో వీ-ఏ దశ కింద సుమారు 16.10 కిలోమీటర్ల పొడవు గల మూడు కొత్త కారిడార్‌లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారు. ఈ మూడు కొత్త కారిడార్లలో ఆర్‌కే ఆశ్రమ మార్గం నుంచి ఇంద్రప్రస్థ, ఏరోసిటీ నుంచి ఇందిరా గాంధీ విమానాశ్రయం టెర్మినల్-1, తుగ్లకాబాద్ నుంచి కాళింది కుంజ్‌ ఉన్నాయి. ఈ కారిడార్ల ద్వారా దేశ రాజధానిలోని అనేక ముఖ్యమైన ప్రదేశాలకు ముఖ్యంగా నోయిడా, దక్షిణ ఢిల్లీ, విమానాశ్రయం మధ్య ప్రయాణించే వారికి మెరుగైన అనుసంధానం లభిస్తుంది.

సాధారణ నివాస గృహాల సమూహం(జీపీఆర్‌ఏ) పునరాభివృద్ధి ప్రణాళిక కింద ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించే లక్ష్యంతో రూ. 15,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సరోజినీ నగర్, నేతాజీ నగర్, కస్తూర్బా నగర్, శ్రీనివాసపురి వంటి కీలక ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు విస్తరించి ఉన్నాయి. పాతబడిన ప్రభుత్వ కాలనీలను ఆధునీకరించడం, ప్రభుత్వ ఉద్యోగుల, కార్యాలయాల కోసం అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించడం ఈ ప్రతిష్టాత్మక పథకం ముఖ్య ఉద్దేశ్యం.

ప్రభుత్వ ఖజానాపై ఎటువంటి భారం పడకుండా ఒక వినూత్నమైన స్వయం-స్థిర ఆర్థిక నమూనా ద్వారా ఈ ప్రాజెక్టులను పునరాభివృద్ధి చేశారు. ఈ వినూత్న నమూనాలో భాగంగా ప్రాజెక్టు స్థలంలో కొంత పరిమిత భాగాన్ని వాణిజ్య, నివాస అవసరాల కోసం అభివృద్ధి చేసి విక్రయిస్తారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆధునిక ప్రభుత్వ గృహాల నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ప్రజా సౌకర్యాల కల్పన కోసం వినియోగిస్తారు.

ప్రభుత్వ ఉద్యోగుల కోసం పునరాభివృద్ధి ప్రణాళిక 9,350 కంటే ఎక్కువ అత్యాధునిక ఇళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు 48 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం నిర్మితమవుతుంది. ఇది పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా.. భవిష్యత్తులో ఆదాయ వనరులను పెంచే సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది.

 

***