Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మీడియా, సాంకేతిక‌త‌, క‌మ్యూనికేష‌న్ అంశాల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న‌ రౌండ్ టేబుల్ స‌మావేశం

మీడియా, సాంకేతిక‌త‌, క‌మ్యూనికేష‌న్ అంశాల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న‌ రౌండ్ టేబుల్ స‌మావేశం


ప్రధాని న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న అమెరికాకు చెందిన హేమాహేమీలైన ముఖ్య కార్య నిర్వ‌హ‌ణాధికారుల (సిఇవోలు)తో రౌండ్ టేబుల్ స‌మావేశం జ‌రిగింది. ఈ సీఇవోలంతా మీడియా, ఎంట‌ర్‌టెయిన్ మెంట్ రంగాల‌కు చెందిన‌వారు.

ఈ స‌మావేశంలో పాల్గొన్న‌వారిలో న్యూస్ కార్ప్ అండ్ 21వ సెంచ‌రీ ఫాక్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్ రూప‌ర్ట్ ముర్దోక్, 21వ సెంచ‌రీ ఫాక్స్ సిఇవో జేమ్స్ ముర్దోక్‌, న్యూస్ కార్ప్ సిఇవో రాబ‌ర్ట్ థాంప్స‌న్‌, స్టార్ ఇండియా సిఇవో ఉద‌య్ శంక‌ర్ , డిస్క‌వ‌రీ క‌మ్యూనికేష‌న్స్ ప్రెసిడెంట్ -సిఇవో డేవిడ్ జ‌స్లావ్‌, సోనీ ఎంట‌ర్ టెయిన్ మెంట్ సిఇవో మైఖెల్ లింట‌న్, ఇంట‌ర్ ప‌బ్లిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఇవో మైఖెల్ రాత్‌, విసె మీడియా సిఇవో షేన్ స్మిత్‌, డ‌బ్ల్యు పిపి సిఇవో మార్టిన్ సోరెల్ , టైమ్ వార్న‌ర్ సిఇవో జెఫ్ బెవుకెస్, ఏ అండ్ ఇ నెట్‌వ‌ర్క్స్ సిఇవో నాన్సీ డ్యూబ‌క్, విశీ ఇండ‌స్ట్రీస్ ఛైర్మ‌న్ ఆంథోనీ ప్రాట్‌, రూట్ వ‌న్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీకి చెందిన విల‌య‌మ్ దుహామెల్‌, వాల్యూ యాక్ట్ క్యాపిట‌ల్ సిఇవో జెఫ్ ఉబ్బెన్ మొద‌ల‌గువారు ఉన్నారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఇవోలు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ సందర్భంగా వారు భార‌త‌దేశ భ‌విష్య‌త్ చ‌క్క‌గా ఉంటుంద‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. భార‌త్ చేప‌ట్టిన డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మాల‌ద్వారా దేశంలో కొన‌సాగుతున్న డిజిట‌ల్ మార్పులప‌ట్ల వారు ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ పుర‌గోమ‌న దిశ బ‌లంగా ఉండ‌డంతో దాని వ‌ల్ల డిజిట‌ల్ రంగ అభివృద్ధికి ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని వారు ధీమా వ్య‌క్తం చేశారు.

టెలివిజ‌న్ డిజిట‌లీక‌ర‌ణను వేగ‌వంతం చేయాల‌ని , సెల్యూల‌ర్ ప్రాథ‌మిక వ‌స‌తుల క‌ల్ప‌న‌ను బ‌లోపేతం చేయాల‌ని ఈ సందర్భంగా ప‌లువురు సీఇవోలు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని కోరారు.
విష‌య ప‌రిజ్ఙాన విస్త‌ర‌ణ ఈ మ‌ధ్య‌న స‌మ‌గ్ర‌మైన ప్ర‌జాస్వామిక దృక్ప‌థంతో జ‌రుగుతోంద‌ని దీనికి సాంకేతిక‌త‌, మీడియా రంగాల‌లో వ‌చ్చిన మార్పులే కార‌ణ‌మ‌ని ఈ స‌మావేశంలో ప్ర‌దాని న‌రేంద్ర మోదీ, సిఇవోలు అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచం టెక్నాల‌జీ ఆధారంగానే ముందుకుపోతోంది కాబ‌ట్టి డిజిట‌ల్ ప్రాథ‌మిక వ‌స‌తుల క‌ల్ప‌నలో అభివృద్ది అనేది భౌతిక ప్రాథమిక వ‌స‌తుల క‌ల్ప‌న అభివృద్దితో పాటు సమానంగా జ‌ర‌గాల‌ని ప్ర‌ధాని అన్నారు. భార‌త్ లో భారీ అవ‌కాశాల‌తోపాటు బారీ స‌వాళ్లు కూడా వారికోసం వేచి ఉన్నాయ‌ని ఆయ‌న సూచించారు. దేశ ప్రాంతీయ భాష‌ల‌ను దృష్టిలో పెట్టుకోవాల‌ని, ఎందుకంటే వాటి వ‌ల‌నే ఆయా కంపెనీల పెట్టుబ‌డుల ప‌థ‌కాలు దృఢ‌త‌ర‌మవుతాయ‌ని ఆయ‌న వివ‌రించారు. బ్రాడ్ బ్యాండ్ క‌నెక్టివిటీ ద్వారా ఆరువేల గ్రామాల‌ను క‌నెక్ట్ చేయాల‌నే ప్ర‌భుత్వ దూర‌దృష్టి గురించి ప్ర‌దాని మాట్లాడారు. 21 వ శ‌తాబ్దం పౌరుడి ముఖ‌చిత్రాన్ని ఊహించి ఆ పౌరుడు ఎలాంటి విలువ‌ల‌కు ప్రతినిధిగా ఉండాలి, ఎలాంటి స‌వాళ్ల‌ను ఎదుర్కోవాలి అనే విష‌యాల గురించి సీఇవోలు ఆలోచించాల‌ని ప్రదాని కోరారు. మాన‌వ వ‌న‌రుల అభివృద్ధిలో డిజిట‌ల్ సాంకేతిక‌త పోషించే పాత్ర గురిచి కూడా ఆయ‌న మాట్లాడారు. భార‌త‌దేశ ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపేతం చేయ‌డంలోను, దేశాభివృద్ధిలోను డిజిట‌ల్ సాంకేతిక‌త కీల‌క‌మైన పాత్ర పోషిస్తుంద‌నే విష‌యాన్ని తాను బ‌లంగా న‌మ్ముతున్న‌ట్టు ప్ర‌ధాని అన్నారు.