Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముంబ‌యి న‌గ‌ర ర‌వాణా ప్రాజెక్ట్ (ఎమ్ యు టి పి)- ఫేజ్ 3కు మంత్రివర్గం ఆమోదం


ముంబ‌యి న‌గ‌ర ర‌వాణా ప్రాజెక్ట్ (ఎమ్ యు టి పి) మూడో ద‌శ‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఈ ప్రాజెక్టు అంచ‌నా వ్యయం రూ. 8, 679 కోట్లు. పూర్త‌య్యే స‌రికి ఇది రూ.10, 947 కోట్లకు చేరవచ్చు. రాబోయే అయిదు సంవ‌త్స‌రాల్లో 13వ ప్ర‌ణాళిక‌ కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి కాగలదని ఆశిస్తున్నారు.

ముంబ‌యి-అహ‌మ్మ‌దాబాద్‌ / ఢిల్లీ మార్గంలో భాగ‌మైన విరార్‌-డహాణూ రహదారి మ‌ధ్య‌లో గ‌ల డ‌బుల్ లైనులో ప‌శ్చిమ రైల్వే స‌బర్బ‌న్ స‌ర్వీసుల‌ను న‌డుపుతోంది. ప‌లు స‌ర్వీసుల‌ కార‌ణంగా ప్ర‌ధాన లైను బిజీగా వుండ‌డంతో దీని పైన స‌బ‌ర్బ‌న్ స‌ర్వీసుల‌ను అద‌నంగా చేర్చ‌డం కుద‌ర‌దు. విరార్‌-డహాణూ రోడ్డు మ‌ధ్య‌లో అద‌నంగా డబుల్ లైనును నిర్మించ‌డం ద్వారా ఈ ప్రాంత‌లో ప్ర‌యాణికుల స‌మ‌స్య‌లు తీర‌తాయి. దీనివ‌ల్ల స‌బ‌ర్బ‌న్ స‌ర్వీసుల‌ను చ‌ర్చ్‌గేటు నుండి డహాణూ రోడ్డు వ‌ర‌కు విస్త‌రించ‌వ‌చ్చు. ఈ ప్రాంతంలో ఈ మ‌ధ్య‌ కాలంలో జ‌నాభా, న‌గ‌రీక‌ర‌ణ పెరిగిపోతున్న కార‌ణంగా అధికమవుతున్న ప్ర‌యాణికుల‌ కోసం పాన్వెల్-క‌ర్ జత్ డ‌బుల్ లైన్ గ‌ల స‌బ‌ర్బ‌న్ కారిడార్ సేవ‌లందిస్తుంది. ఈ ప్రాజెక్టు కార‌ణంగా పాన్వెల్ మీదుగా క‌ర్ జత్ నుంచి సిఎస్ టి ఎమ్ కు ప్ర‌త్యామ్నాయ మార్గం ఏర్ప‌రచుకోవ‌చ్చు. త‌ద్వారా ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ మీదుగా వున్న రూటుతో పోలిస్తే 23 కిలోమీట‌ర్ల దూరం త‌గ్గుతుంది. అంతేకాదు, సిఎస్ టి ఎంనుంచి క‌ర్ జత్‌కు గ‌ల ప్ర‌యాణ దూరం 35 నుండి 40 నిమిషాల‌ వ‌ర‌కు త‌గ్గుతుంది.

ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ నుండి వాశి/ పాన్వెల్ కు గానీ…తిరిగి వాశి / పాన్వెల్ నుంచి క‌ళ్యాణ్ కు ప్ర‌యాణం చేస్తున్నవారు థానె ద‌గ్గ‌ర దిగి ట్రాన్స్ హార్బ‌ర్ లింకు మీదుగా ప్ర‌యాణం చేయాల్సి వ‌స్తోంది. దీని వ‌ల్ల తాకిడి ఎక్కువ‌గా వున్న థానే స్టేష‌న్ పైన మ‌రింత భారం ప‌డుతోంది. ఐరోలి- కాల్వ కారిడార్ కార‌ణంగా థానే స్టేష‌న్ పైన భారం త‌గ్గుతుంది. థానేలో దిగాల్సిన అవ‌స‌రం లేదు కాబ‌ట్టి ప్ర‌యాణికుల‌కు స‌మయం క‌లిసివ‌స్తుంది. కొత్త‌గా కోచుల‌ను ఏర్పాటు చేసుకోవ‌డం వ‌ల్ల రైల్వే సేవ‌లు మెరుగై, ప్రయాణికుల తాకిడి త‌గ్గుతుంది. రైల్వే లైనుల మీదుగా అటూ ఇటూ దాటే వారిని 22 చోట్ల‌ నియంత్రించడానికి ప్ర‌తిపాదించిన ప‌నులు కార‌ణంగా ఈ స‌మ‌స్య కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌డుతుంది. ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది.

ఈ ప్రాజెక్టు కిందకు వ‌చ్చే ప్రాంతాలు మ‌హారాష్ట్ర‌లోని థానే, పాల్గార్‌, రాయ్ గ‌ఢ్‌, ముంబ‌యి జిల్లాలు.

పూర్వ రంగం:

మ‌ధ్య‌ రైల్వే, ప‌శ్చిమ రైల్వేల‌ లోని ముంబ‌యి స‌బ‌ర్బ‌న్ రైల్వే నెట్ వ‌ర్క్ 376 రూట్ కిలోమీట‌ర్ల‌ను క‌లిగివుంది. ఇందులో అయిదు కారిడ‌ర్లు ఉన్నాయి. రెండు ప‌శ్చిమ రైల్వేకు సంబంధించిన‌వి, రెండు మ‌ధ్య రైల్వేకు సంబంధించినవి కాగా మ‌రొక‌టి మ‌ధ్య రైల్వేకు చెందిన హార్బ‌ర్ లైన్‌. 2900కు పైగా గ‌ల రైలు స‌ర్వీసుల‌ ద్వారా ప్ర‌తి రోజూ దాదాపు ఎన‌భై ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు స‌బ‌ర్బ‌న్ సెక్ష‌న్‌లో ప్ర‌యాణిస్తున్నారు. ప్ర‌యాణికుల తాకిడి అధికంగా ఉన్న స‌మ‌యాల్లో స‌ర్వీసుల‌ పైన విప‌రీత‌మైన భారం ప‌డుతోంది. భౌగోళిక ప‌రిమితుల‌ కార‌ణంగా, జ‌నాభా అధికంగా విస్త‌రిస్తుండ‌డం వ‌ల్ల, వ్యాపార సంస్థ‌లు అధికంగా వుండ‌డం వ‌ల్ల ఈ రైల్వే నెట్ వ‌ర్క్ ముంబాయిలో ప్ర‌ధాన‌మైన ప్రయాణ మార్గంగా ఉంది. నానాటికీ పెరుగుతున్న ప్రయాణికుల ర‌ద్దీని త‌ట్టుకోవ‌డానికి పాన్వెల్ -క‌ర్ జత్ ( 28 రూట్ కిలోమీట‌ర్ల‌) మ‌ధ్య‌న కొత్త స‌బ‌ర్బ‌న్ కారిడర్ , ఐరోలి- కాల్వ ( 3 రూట్ కిలోమీట‌ర్ల‌) మ‌ధ్య‌న కొత్తగా కారిడర్ విస్త‌ర‌ణ‌, విరార్‌- డహాణూ రోడ్డు ( 63 రూట్ కిలోమీట‌ర్లు)ను నాలుగు లేన్ లకు మార్చ‌డం, కొత్త‌గా 565 కోచుల‌ను ఏర్పాటు చేసుకోవ‌డం, ప్ర‌యాణికులు లైన్ లను అటూ ఇటూ దాట‌కుండా నియంత్రించ‌డం మొద‌లైన చ‌ర్య‌లు ముంబ‌యి అర్బ‌న్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ (ఎమ్ యు టి పి) ఫేజ్ 3లో భాగంగా ఉన్నాయి.