పిఎంఇండియా
ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ పర్రికర్ మృతి కి 2019వ సంవత్సరం మార్చి నెల 17వ తేదీన గోవా లోని పణజీ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం సంతాపాన్ని వ్యక్తం చేసింది. కీర్తి శేషులు శ్రీ మనోహర్ పర్రికర్ జ్ఞాపకార్థం మంత్రివర్గం రెండు నిమిషాల సేపు మౌనాన్ని పాటించింది.
2019వ సంవత్సరం మార్చి నెల18వ తేదీ నాడు భారత ప్రభుత్వం పక్షాన ఒక రోజు సంతాపాన్ని పాటించేందుకు మరియు ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు, ఢిల్లీ, ఇంకా గోవా రాష్ట్రం అంతటా జాతీయ పతాకాన్ని అవనతం చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం శ్రీ మనోహర్ పర్రికర్ స్మారకార్థం ఈ దిగువ న పేర్కొన్న విధం గా ఒక సంతాప తీర్మానాని కి సైతం ఆమోద ముద్ర వేసింది:
“గోవా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ పర్రికర్ 2019వ సంవత్సరం మార్చి మాసం 17వ తేదీ నాడు గోవా లోని పణజీ లో మృతి చెందడం పట్ల మంత్రివర్గం ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేస్తోంది. ఆయన మరణం తో దేశం ఒక చిరకాలానుభవం కలిగిన గల, ప్రముఖ నాయకుడి ని కోల్పోయింది. సామాన్యుల ముఖ్యమంత్రి అని ఆయన ను ప్రేమ గా పిలుచుకొనే వారు.
గోవా లోని మాపుసా లో 1955వ సంవత్సరం డిసెంబర్ 13వ తేదీ న జన్మించిన శ్రీ పర్రికర్, మడ్ గావ్ లోని లొయోలా పాఠశాల లో విద్య ను అభ్యసించారు. ఆ తరువాత 1978వ సంవత్సరం లో ముంబయి లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మెటలర్జికల్ ఇంజీనియరింగ్ విభాగం లో పట్టభద్రుడయ్యారు. రాజకీయాల లోకి ప్రవేశించే కన్నా ముందు శ్రీ మనోహర్ పర్రికర్ చిన్న వయస్సు లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సభ్యుడై, తన విద్యాభ్యాసం ఆఖరు సంవత్సరాల లో ఒక ముఖ్య శిక్షక్ గా ఎదిగారు. ఐఐటి లో పట్టభద్రుడైన అనంతరం మాపుసా లో ఆర్ఎస్ఎస్ లో పని చేయడాన్ని పునః ప్రారంభించి, 26వ ఏట సంఘ్ చాలక్ అయ్యారు.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యుడి గా శ్రీ పర్రికర్ 1994వ సంవత్సరం లో గోవా విధాన సభ కు ఎన్నికయ్యారు. ఆయన 2000వ సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన మొట్టమొదటిసారి గా గోవా కు ముఖ్యమంత్రి అయ్యారు. 2002వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ వరకు ఆ పదవి లో కొనసాగారు. ఆయన 2002వ సంవత్సరం జూన్ 3వ తేదీ న ముఖ్యమంత్రి పదవి కి తిరిగి ఎన్నికై, 2005వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ వరకు సేవలు అందించారు. 2012వ సంవత్సరం మార్చి 9వ తేదీన ఆయన మూడో సారి గోవా కు ముఖ్యమంత్రి అయ్యి, ఆ పదవి లో 2014వ సంవత్సరం నవంబర్ 8వ తేదీ వరకు కొనసాగారు. 2014వ సంవత్సరం నవంబర్ 9వ తేదీన శ్రీ పర్రికర్ రక్షణ శాఖ కేంద్ర మంత్రి పదవి కి ఎంపికై, 2017వ సంవత్సరం మార్చి నెల 13వ తేదీ వరకు ఆ పదవీ బాధ్యతలను నిర్వహించారు. 2017వ సంవత్సరం మార్చి 14వ తేదీ నాడు మళ్ళీ గోవా ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేశారు.
శ్రీ పర్రికర్ ను ఆయన సీదాసాదా తనానికి మరియు ఒక చక్కని పరిపాలకుని గా శక్తియుక్తులు ప్రదర్శించినందుకు గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది. ఆధునిక గోవా నిర్మాణం లో, భారతదేశ సాయుధ బలగాల ఆధునికీకరణ కు, అలాగే మాజీ సైనికోద్యోగుల జీవనాన్ని మెరుగు పరచేందుకు ఆయన అందించిన తోడ్పాటు ఎన్నటికీ మరపురానిదే కానుంది.
శ్రీ పర్రికర్ కు ఐఐటి ముంబయి ద్వారా 2001వ సంవత్సరం లో ‘ప్రముఖ పూర్వ విద్యార్థి పురస్కారం’ ప్రదానం చేయడమైంది. అలాగే, 2018వ సంవత్సరం లో గోవా లోని నేశనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆయన కు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. అదే సంవత్సరం లో డాక్టర్ ఎస్.పి. ముఖర్జీ పురస్కారం ఆయన ను వరించింది. మరెన్నో పురస్కారాల ను కూడా ఆయన అందుకొన్నారు. ఆయన కు ఇద్దరు కుమారులు ఉన్నారు.
శ్రీ పర్రికర్ కుటుంబ సభ్యుల కు, గోవా ప్రజల కు ప్రభుత్వం పక్షాన మరియు యావత్తు దేశ ప్రజల తరఫు న మంత్రివర్గం తన హృదయ పూర్వక సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.”