పిఎంఇండియా
ఎల్లారిగు నన్న నమస్కారగళు! (అందరికీ నమస్కారం)
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ (బేలూర్ మఠం) అధ్యక్షులు పూజనీయ స్వామి గౌతమానంద మహారాజ్, శ్రీ రామకృష్ణ ఆశ్రమం (మైసూరు) అధ్యక్షులు పూజనీయ స్వామి ముక్తిదానంద, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ ట్రస్టీ పూజనీయ స్వామి యాదవేంద్రానంద, కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్‌చంద్ గెహ్లాట్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ డి.కె.శివకుమార్, పార్లమెంటు సభ్యులు శ్రీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్, ఎమ్మెల్యే శ్రీ విజయేంద్ర యడియూరప్ప, శ్రీ కె.హరీష్ గౌడ, ఇతర ప్రముఖులు, పూజనీయ సాధువులు, సోదరీసోదరులారా!
మైసూరు నగర ఆరాధ్య దైవం శ్రీ చాముండేశ్వరీ మాతకు మున్ముందుగా ప్రణమిల్లుతున్నాను. ఓ రెండు రోజుల కిందటే మనం గురు పౌర్ణమి పర్వదినం నిర్వహించుకున్నాం. నా ప్రస్థానం ఎక్కడ మొదలైందో, ఇవాళ నేను ఏ స్థానంలో ఉన్నానో మీకందరికీ తెలిసిందే. ఈ జీవన పయనంలో రామకృష్ణ మిషన్ పాత్ర నాకెంతో కీలకం. నేను మూడు నెలల కిందట హౌరాలోని బేలూర్ మఠానికి వెళ్లాను. అక్కడ పూజనీయ సాధువుల సత్సంగంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఇప్పుడిక్కడ మైసూరులోని శ్రీ రామకృష్ణ ఆశ్రమ సాధువులు, నా గురు సహోదరులను కలుసుకుని, వారి ఆశీస్సులు పొందే భాగ్యం నాకు మళ్లీ దక్కింది. మైసూరులోని ఈ పావన భూమిపై నేడు మీ అందరి సమక్షంలో నేనొక ప్రత్యేక శక్తిమంతమైన అనుభూతి పొందుతున్నాను. ఇక్కడి సాధువులందరికీ భక్తిపూర్వకంగా పాదాభివందనం చేస్తున్నాను.
మిత్రులారా!
భారత నిత్య సాంస్కృతిక చైతన్య నిలయం మైసూరు నగరం. ఇక్కడి ఆలయాలు, సంప్రదాయాలు, పండుగలు, మైసూరు దసరా, అద్భుత రాచప్రాసాదాలు, సంగీతసాహిత్యాలు- ఇలా అణువణువునా ఉట్టిపడే భారతీయ వారసత్వం ఇక్కడ ఉట్టిపడుతుంది. ఇదంతా ప్రత్యక్షంగా తిలకించడం నాకెంతో సంతృప్తినిస్తోంది. ఈ నగరం ఆ ఘన వారసత్వాన్ని అంతే నైపుణ్యంతో పరిరక్షిస్తూ, పరిపుష్టం చేస్తూ వస్తోంది. శ్రీ రామకృష్ణ ఆశ్రమం, స్వామి వివేకానంద జ్ఞాపకాలు కూడా మైసూరు వారసత్వంలో అవిభాజ్య భాగం. కొద్ది క్షణాల కిందటే స్వామి వివేకానంద ఇక్కడ కాలం గడిపిన చారిత్రక భవనాన్ని సందర్శించాను. కర్ణాటకలోని ఎందరో పండితులు, మేధావులకు ఈ ప్రదేశంతో అవినాభావ సంబంధం ఉంది. రాష్ట్రకవి కువెంపు వంటి మహనీయులు మైసూరులో ఉన్నప్పుడు శ్రీ రామకృష్ణ ఆశ్రమంతో వారికీ గాఢానుబంధం ఉండేది. నేడు, ‘వివేక స్మారక’ పేరిట స్వామి వివేకానంద యువజన సాంస్కృతిక కేంద్రం ప్రారంభోత్సవం రూపంలో ఈ లక్ష్యానికి మనమొక కొత్త ప్రాతిపదికను జోడిస్తున్నాం. ఈ నేపథ్యంలో శ్రీ రామకృష్ణ ఆశ్రమంతోపాటు దీనితో ముడిపడిన పండితులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా!
ఒక సామాన్యుడు గొప్ప వ్యక్తిత్వంగల అసామాన్యుడుగా మారిపోవడం అకస్మాత్తుగా సంభవించే పరిణామం కాదు. ఇందుకోసం జీవితంలో అనేక కఠిన పరీక్షలను ఎదుర్కోవాలి.. సాధన.. తపస్సు అవశ్యం. కఠోర పరిశ్రమతో సాధకుడు తననుతాను మలచుకోవాలి. కీర్తిప్రతిష్టలు వరించాక ప్రపంచం మీ వెంట నిలుస్తుంది తప్ప, తపోదీక్షలోగల గొప్ప వ్యక్తుల గుర్తింపు అంత సులభమేమీ కాదు. తపోదీక్షలోగల సాధకుడిని గుర్తించే వ్యక్తి అతడి విజయంలోనూ భాగస్వామి కాగలడు.
కాబట్టే, సోదరీసోదరులారా! స్వామి వివేకానంద జీవితంలో మైసూరుకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. సుమారు 130 ఏళ్ల కిందట యువ సన్యాసిగా దేశాటనలో భాగంగా స్వామీజీ మైసూరు నగరానికి వచ్చారు. ఈనాడున్న గుర్తింపు ఆయనకు ఆనాడు లేదు. కానీ, ఆయన అత్యున్నత ఆలోచన స్థాయిని పసిగట్టి, వివేకానందునితో జతకట్టిన ప్రముఖులలో మైసూరు మహారాజు ఒకరు. అనంతరం కాలంలో అమెరికా వెళ్లిన స్వామి వివేకానంద, అక్కడి నుంచి మైసూరు మహారాజుకు రాసిన లేఖలో ఆయన ద్వారా తనకు లభించిన మద్దతును ప్రముఖంగా ప్రస్తావించారు.
మిత్రులారా!
స్వామి వివేకానంద భారతీయ చైతన్యాన్ని ఎంతో చక్కగా ఆకళింపు చేసుకున్నారు. “పరోపకారార్థం యో జీవతి సజీవతి” (సమాజ హితం కోరేవారే నిత్య చైతన్యవంతులు) అని ప్రబోధించే శాస్త్ర సారాన్ని ఆయన జీర్ణించుకున్నారు. అంటే- పరోపకారమే పరమార్థంగా జీవించే వ్యక్తి వాస్తవిక జీవనం గడుపుతాడన్న మాట! ఈ బాటలోనే మైసూరు శ్రీ రామకృష్ణ ఆశ్రమం నిరుడు శతాబ్దం పూర్తి చేసుకుంది. విద్య, ఆరోగ్య సంబంధిత సేవలైనా, ప్రకృతి విపత్తుల వేళ సహాయ చర్యలైనా… స్వామి వివేకానంద వారసత్వాన్ని ఈ ఆశ్రమం సదా నిలబెడుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రారంభించిన ‘వివేక స్మారక’ కూడా సాధకులకు, భక్తులకు ఆధ్యాత్మికోన్నతిని ప్రసాదించగల పవిత్ర క్షేత్రంగా భాసిల్లుతుందని విశ్వసిస్తున్నాను. ‘శివ జ్ఞానే జీవ సేవ’ అన్నది స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక ప్రబోధం. అంటే- జీవరాశికి సేవ పరమేశ్వరుని సేవతో సమానం అని అర్థం. తదనుగుణంగా జీవితాన్ని అంకితం చేసుకోగల యువతను మనం ఈ ‘వివేక స్మారక’లో తీర్చిదిద్దాలి. స్వీయ సుఖదుఃఖాలకన్నా సమాజం, దేశంపై శ్రద్ధతోపాటు పేదలు, అణగారిన వర్గాల వేదనపై కరుణకు ప్రాధాన్యమిచ్చే వారుగా యువతరం రూపొందాలి. ‘దేశమే ప్రథమం’ అన్నది తారకమంత్రంగా, భరతమాత సేవే జీవిత లక్ష్యం చేసుకునే భావితరానికి మనం రూపమివ్వాలి.
మిత్రులారా!
విద్యను దేశ సర్వతోముఖాభివృద్ధికి బలమైన పునాదిగా స్వామి వివేకానంద పరిగణించారు. ఆ మేరకు విద్యావంతులైన యువతరం జాతికి వెలుగు చూపగలదని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలన్నీ తమ యువతరానికి ఎలాంటి విద్యనందిస్తున్నాయో ఆయన స్వయంగా పరిశీలించారు. కానీ, ఆనాడు భారత్ దాస్యంలో మగ్గుతూండేది. యువతరం కూడా బానిస సంకెళ్లతో బంధితమై కునారిల్లేది. నాటి నుంచి నేటిదాకా సుదీర్ఘ ప్రస్థానంలో మన యువతరం నాటి సంకెళ్లను తెంచుకుని, ప్రపంచ ప్రగతికి ఊతమిచ్చే శక్తిగా ఎదగింది. భారత ఆర్థిక వ్యవస్థ నేడు శరవేగంగా పురోగమిస్తోందంటే అది ఎవరి వల్లనంటారు? నిస్సందేహంగా దేశ యువతరం శక్తిసామర్థ్యాల వల్లనే! ఎవరి వల్ల ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకురావరణ వ్యవస్థగా భారత్ అవతరించింది? భారత యువత ప్రతిభ వల్లనే! ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా దేశం ఎవరి వల్ల ఎదగింది? యువత సామర్థ్యం వల్లనే! ఎవరి వల్ల మన దేశం రూపొందించిన డిజిటల్ వనరులు ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిస్తున్నాయి? భారత యువత సామర్థ్యం వల్లనే! సెమీకండక్టర్ తయారీ దిశగా సరికొత్త ప్రస్థానంలో భారత్ ఎవరి వల్ల వేగంగా ముందడుగు వేస్తోంది? యువత సామర్థ్యం వల్లనే! కృత్రిమ మేధ, డీప్ టెక్, అంతరిక్ష సాంకేతికత-ఆవిష్కరణ రంగాల్లో నూతనాధ్యాయం లిఖిస్తోందంటే ఎవరి వల్ల అంటారు? భారత యువశక్తి సామర్థ్యంతోనే!
అంతరిక్ష రంగంలో మన యువతరం సృష్టించిన అద్భుతాన్ని కొద్ది రోజుల కిందటే మనం చూశాం. వారి సారథ్యంలో రూపుదిద్దుకున్న ఒక ప్రైవేట్ సంస్థ రాకెట్ తొలిసారి విజయవంతంగా గగనానికెగసింది. రంగమేదైనా సరే… భారత యువతరం తమ సత్తాను చాటుకుంటోంది. చిన్న వ్యాపార చేసుకునే యువకుడు కూడా భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ముందడుగు వేయించడం మనమంతా చూస్తున్నాం. ‘ముద్రా’ రుణాలతో ఎందరో యువతీయువకులు సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నారు. దేశంలో అంకుర విప్లవానికి సారథులుగా ఎదుగుతున్నారు. ‘స్వయంసమృద్ధ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమాల వెనుక ఉన్నది భారత యువశక్తే!
మిత్రులారా!
ఏ దేశంలోనైనా యువతకు సముచిత అవకాశాలు, సరైన దిశానిర్దేశం లభించినపుడు.. తమ సొంత గడ్డపైనే గొప్ప కలలు కంటూ వాటిని సాకారం చేసుకోగల ఆత్మవిశ్వాసం కలిగినపుడు… వారి సామర్థ్యం ఆ దేశానికి ఒక బలమైన శక్తిగా పరిణామం చెందుతుంది. ఈ దిశగా మన విద్యాసంస్థలదే కీలక పాత్ర కాబట్టి, దేశంలో నేడు విద్యాసంస్థల సంఖ్య నిరంతరం పెరుగుతుండటం నాకెంతో సంతోషాన్నిస్తోంది. ఈ మేరకు గడచిన 12 ఏళ్లలో 650కి పైగా కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. అలాగే, 14 వేల కొత్త కళాశాలలు, 4 వేలకు పైగా కొత్త ‘ఐటీఐ’లు స్థాపితమయ్యాయి. వీటితోపాటు 9 కొత్త ‘ఐఐఎం’లు, 7 కొత్త ‘ఐఐటీ’లు, 13 కొత్త ‘ఎయిమ్స్’ కూడా ఏర్పాటయ్యాయి. వైద్య విద్యకు సంబంధించి కళాశాలల సంఖ్య 823కు, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1.40 లక్షలకు చేరింది.
మిత్రులారా!
ఒకవైపు మనం విద్యా మౌలిక సదుపాయాలను ఆధునికీకరిస్తున్నాం. మరోవైపు ఆధునిక అవసరాలకు తగినట్లు విద్యా విధానాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఆ క్రమంలోనే ‘జాతీయ విద్యా విధానం’ దేశ యువతను 21వ శతాబ్దానికి అనుగుణంగా సిద్ధం చేసే ఉపకరణంగా మారింది.
మిత్రులారా!
పాఠశాల విద్యను కూడా పెద్ద ఎత్తున ఆధునికీకరిస్తున్నాం. దేశవ్యాప్తంగా 14 వేలకు పైగా ‘పీఎం శ్రీ’ పాఠశాలలు ఏర్పాటయ్యాయి. విద్య పుస్తకాలకు పరిమితం కాకుండా, బాలల్లో ఆవిష్కరణాత్మక, శాస్త్రీయ దృక్పథం పెంపొందేలా చూడటం కోసం 10 వేలకు పైగా ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’ ఏర్పాటయ్యాయి.
మిత్రులారా!
విద్యతోపాటు దేశాభ్యున్నతీ అంతే ముఖ్యమని స్వామి వివేకానంద స్పష్టం చేశారు. విద్యలో, అవకాశాల్లో ఎలాంటి వివక్షకు తావుండురాదన్నది నేడు దేశ లక్ష్యంగా మారింది. సైనిక పాఠశాలలు సహా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో అమ్మాయిలకూ ప్రవేశం లభిస్తోంది. తద్వారా దేశ రక్షణలో వారు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. వైద్య, ఇంజినీరింగ్ విద్యను కూడా మాతృభాషలో అభ్యసించే సదుపాయాలు నేడు అందుబాటులో ఉన్నాయి. తద్వారా అవకాశాల పరంగా భాష ప్రాతిపదికన వివక్ష తగ్గుముఖం పడుతోంది.
మిత్రులారా!
యువశక్తి ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం కూడా సంతరించుకోవడం ఎంతో ముఖ్యం. క్రీడలకు ప్రాధాన్యమిచ్చే దేశాల్లోని యువతలో ఈ మూడు లక్షణాలు వేగంగా వికసిస్తాయి. అందుకే, మన దేశ వికాసంలో క్రీడలను ఓ కీలక భాగంగా పరిగణిస్తున్నాం. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’, ‘విశ్వవిద్యాలయ క్రీడలు’, ‘పారా గేమ్స్’, ‘వింటర్ గేమ్స్’ వంటి క్రీడా కార్యక్రమాలు దేశ యువత తమ ప్రతిభను చాటుకునే వేదికలయ్యాయి. దేశవ్యాప్తంగా ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలు విస్తరిస్తుండగా, ‘ఖేలో ఇండియా’ కేంద్రాల ద్వారా సౌకర్యాలు ఇనుమడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్న పట్టణాల దాకా సరికొత్త ప్రతిభకు విశేష గుర్తింపు లభిస్తోంది.
అంతేకాదు… మిత్రులారా!
ఈ కార్యక్రమాల ఫలితాలు నేడు ప్రస్ఫుటమవుతున్నాయి. అంతర్జాతీయ క్రీడా పోటీలలో భారత్ ప్రతిభ ఇనుమడిస్తోంది. మన క్రీడాకారులు సరికొత్త రికార్డులు సృష్టిస్తుండగా, భరతమాత పుత్రికలు దేశ కీర్తిప్రతిష్టలను నలుదిశలకూ విస్తరింపజేస్తున్నారు.
మిత్రులారా!
ఈ నేపథ్యంలో ‘వివేక స్మారక’ కూడా స్వామి వివేకానంద తరహాలో ఒక గొప్ప లక్ష్యం కోసం కృషి చేసేందుకు మనను ప్రోత్సహిస్తుంది. అటువంటి ఈ ప్రదేశం నుంచి మన యువతకు నేను కొన్ని విషయాలు సూచించదలచాను.
మిత్రులారా!
భారత్‌లోని అత్యంత పరిశుభ్ర నగరాల్లో మైసూరు తరచూ ఒకటిగా నిలుస్తూంటుంది. ఈ ఘనతకుగాను ఇక్కడి ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ సందర్భంగా పరిశుభ్రత పరంగా భవిష్యత్తులోనూ మన సంకల్పాన్ని నిరంతరం బలోపేతం చేసుకుంటామని మనం ప్రతిజ్ఞ చేయలేమా? ఆ మేరకు ఇక్కడి సహజ వనరులను పరిరక్షించుకునేలా పర్యావరణ ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టే ఉద్యమం తరహాలో అంకితభావంతో కృషి చేద్దాం.
మిత్రులారా!
ఈ రోజు ఇక్కడ ‘వాల్మీకి రామాయణం’ కన్నడ అనువాద ప్రతిని ఆవిష్కరించాం. ఈ నేపథ్యంలో కన్నడ భాషకు సంబంధించి నాదొక విజ్ఞప్తి… గొప్ప రచయితలకు, కవుల పేరెన్నికగల రాష్ట్రం కర్ణాటక. పఠన సంస్కృతికి కన్నడిగులు సదా ఒక ప్రతీక. ఈ స్మార్ట్‌ఫోన్ యుగంలో పఠనా వ్యాసంగాన్ని మనం మరింత ప్రోత్సహించాలి. యువతరం కన్నడ సాహిత్యంతో మమేకమయ్యేలా మనం వారికి స్ఫూర్తినివ్వలేమా?
మిత్రులారా!
పట్టు వస్త్రాలు, గంధపు చెక్క, హస్తకళలకు ప్రసిద్ధి చెందిన నగరం మైసూరు. మనం ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఎవరికైనా కానుక ఇవ్వదలచినపుడు అది భారతీయ హస్తకళాకారుల పనితనం, శ్రమతో రూపొందినదిగా ఉండేలా చూడలేమా? తద్వారా మన సంస్కృతికి ప్రోత్సాహం లభించడమే కాకుండా ఓ కుటుంబానికి ఆర్థిక చేయూత కూడా ఉంటుంది.
మిత్రులారా!
స్వామి వివేకానంద కలలుగన్న భారతదేశాన్ని సాకారం చేసే కర్తవ్యం నేటి తరానిదే. ఈ క్రమంలో ‘వివేక స్మారక’ వారికొక ఉత్సహ వనరు కాగలదని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. చివరగా- ఇక్కడ సమావేశమైన పూజనీయ సాధువులు, గురు సహోదరులు, మైసూరు ప్రజలందరికీ మరోసారి నమస్సులతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే.
***
Speaking at the inauguration of Viveka Smaraka at Sri Ramakrishna Ashrama in Mysuru.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
https://t.co/IqVEAM1gy9
Swami Vivekananda truly embodied the spirit of India. pic.twitter.com/gTNpyET9qX
— PMO India (@PMOIndia) August 1, 2026
India's youth are driving global growth. pic.twitter.com/qhOcHyFI7U
— PMO India (@PMOIndia) August 1, 2026
It is for today's generation to turn Swami Vivekananda's vision of India into reality. pic.twitter.com/oK58ejuZpg
— PMO India (@PMOIndia) August 1, 2026
Mysuru held an important place in Swami Vivekananda’s life.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
I am confident that the Viveka Smaraka will become a vibrant place for inspiring the youth to contribute to a better society. pic.twitter.com/zEnyDGIACK
Powered by the capabilities of our youth, India is making strides across various sectors. The energy of our young people is the driving force behind the success of initiatives such as Aatmanirbhar Bharat and ‘Make in India.’ pic.twitter.com/3aFDgucT7f
— Narendra Modi (@narendramodi) August 1, 2026
I am delighted that the National Education Policy is preparing our nation’s youth to meet the needs and aspirations of the 21st century. pic.twitter.com/C0wCO1F888
— Narendra Modi (@narendramodi) August 1, 2026
A special appeal… pic.twitter.com/i9R2zPi9Bb
— Narendra Modi (@narendramodi) August 1, 2026
ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಮೈಸೂರು ಪ್ರಮುಖ ಸ್ಥಾನವನ್ನು ಪಡೆದಿತ್ತು.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
ಉತ್ತಮ ಸಮಾಜಕ್ಕೆ ಕೊಡುಗೆ ನೀಡಲು ಯುವಕರನ್ನು ಪ್ರೇರೇಪಿಸುವ ಚೈತನ್ಯದಾಯಕ ಸ್ಥಳವಾಗಿ ವಿವೇಕ ಸ್ಮಾರಕ ಹೊರಹೊಮ್ಮಲಿದೆ ಎಂಬ ವಿಶ್ವಾಸ ನನಗಿದೆ. pic.twitter.com/8fGr0CCXBs
ನಮ್ಮ ಯುವಕರ ಸಾಮರ್ಥ್ಯದಿಂದ ಭಾರತವು ವಿವಿಧ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ದಾಪುಗಾಲು ಹಾಕುತ್ತಿದೆ. ನಮ್ಮ ಯುವಜನರ ಬಲವೇ ಆತ್ಮನಿರ್ಭರ ಭಾರತ ಮತ್ತು ಮೇಕ್ ಇನ್ ಇಂಡಿಯಾದಂತಹ ಉಪಕ್ರಮಗಳ ಯಶಸ್ಸಿನ ಹಿಂದಿನ ಪ್ರೇರಕ ಶಕ್ತಿಯಾಗಿದೆ. pic.twitter.com/azduelKqKq
— Narendra Modi (@narendramodi) August 1, 2026
ರಾಷ್ಟ್ರೀಯ ಶಿಕ್ಷಣ ನೀತಿಯು 21ನೇ ಶತಮಾನದ ಅಗತ್ಯಗಳು ಮತ್ತು ಆಕಾಂಕ್ಷೆಗಳನ್ನು ಪೂರೈಸಲು ನಮ್ಮ ರಾಷ್ಟ್ರದ ಯುವಕರನ್ನು ಸಜ್ಜುಗೊಳಿಸುತ್ತಿರುವುದು ನನಗೆ ಸಂತಸ ತಂದಿದೆ. pic.twitter.com/9Cbsidnbnz
— Narendra Modi (@narendramodi) August 1, 2026
ಒಂದು ವಿಶೇಷ ಮನವಿ... pic.twitter.com/u9br1QKPqX
— Narendra Modi (@narendramodi) August 1, 2026