Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మొజాంబిక్ తో ఒక దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా అక్కడి నుండి పప్పు ధాన్యాల దిగుమ‌తికి మంత్రిమండలి ఆమోదం


మొజాంబిక్ నుండి ప‌ప్పు ధాన్యాలను దిగుమ‌తి చేసుకోవ‌డానికి వీలు క‌ల్పించే అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద ప‌త్రం (ఎమ్ ఒ యు)పై సంతకాలు చేయడం ద్వారా ఒక దీర్ఘ‌కాలిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రైవేటు సంస్థ‌ల‌ నుండి గాని, లేదా రెండు దేశాలు నామినేట్ చేసే ప్ర‌భుత్వ సంస్థ‌ల ద్వారా ప్ర‌భుత్వానికి- ప్ర‌భుత్వానికి మ‌ధ్య‌ (జి2జి) జ‌రిగే విక్రయాల‌ ద్వారా గాని ప‌ప్పు దినుసుల‌ను దిగుమ‌తి చేసుకోవ‌డం జ‌రుగుతుంది.

మొజాంబిక్ లో కందిప‌ప్పుతో పాటు ఇత‌ర ప‌ప్పు ధాన్యాల ఉత్ప‌త్తిని ఈ ఎమ్ ఒ యు ధ్యేయం. మొజాంబిక్ తో ప‌ప్పు ధాన్యాల వ్యాపారాన్ని దశలవారీగా అధికం చేయ‌డం ద్వారా ఈ మేరకు ప్రోత్సాహాన్ని అందించనున్నారు. ఐదు ఆర్ధిక సంవ‌త్స‌రాల‌పాటు కందిప‌ప్పు, ఇంకా ఇత‌ర ప‌ప్పు ధాన్యాలను భార‌త‌దేశానికి మొజాంబిక్ ఎగుమ‌తి చేయ‌డంలో అందుకోవాల్సిన‌ ల‌క్ష్యాలు కూడా ఉన్నాయి. 2016-17 సంవ‌త్స‌రంలో ఒక ల‌క్ష ట‌న్నుల వ్యాపారాన్ని నమోదు చేయాలి. 2020-21 సంవ‌త్స‌రం కల్లా ఈ వ్యాపారాన్ని రెండు ల‌క్ష‌ల ట‌న్నులకు పెంచాల‌నేది ల‌క్ష్యం.

ఈ ఎమ్ ఒ యు కార‌ణంగా భార‌త‌దేశంలో ప‌ప్పు ధాన్యాల అందుబాటు సులువ‌వుతుంది. త‌ద్వారా వాటి ధ‌ర‌లు స్థిరంగా ఉంటాయి.

2015-16 సంవ‌త్స‌రంలో ప‌ప్పుధాన్యాల మొత్తం ఉత్పత్తి 17 మిలియ‌న్ ట‌న్నులుగా అంచ‌నా వేయ‌డం జ‌రిగింది. అదే స‌మ‌యంలో ఈ రంగంలో ఏర్ప‌డ్డ కొర‌త‌ను తీర్చ‌డానికి 5.79 మిలియ‌న్ ట‌న్నుల ప‌ప్పుధాన్యాల‌ను దిగుమ‌తి చేసుకోవ‌డం జ‌రిగింది. అయితే, దేశీయ ఉత్పత్తి.. ఇంకా దిగుమతులు కలసినా కూడా దేశంలోని అవసరాలను తీర్చలేకపోవడంతో, 2015-16 లోను మరియు వర్తమాన సంవత్సరంలోను పప్పు ధాన్యాల ధరలపై ఒత్తిడి ఏర్పడింది.

ప‌ప్పు ధాన్యాల కొర‌తను త‌గ్గించడానికిగాను ప్ర‌భుత్వం ప‌లు ప్ర‌యత్నాల‌ను మొద‌లుపెట్టింది. వీటికి తోడుగా మొజాంబిక్ తో దీర్ఘకాలిక జి2జి ఒప్పందాన్ని కుదుర్చుకోవ‌డం ద్వారా ప‌ప్పు ధాన్యాల లభ్యతపై మ‌రింత స్పష్టత వ‌చ్చింది. మొజాంబిక్ తో కుదుర్చుకున్న ఒప్పందం ఇతర దేశాలతో కూడా ఇటువంటి సర్దుబాటుకే దారి తీసే అవకాశం ఉంది.