Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యుఎన్ఇపి యొక్క ‘చాంపియన్స్ ఆఫ్ ద అర్థ్’ పురస్కారం కార్యక్రమం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

యుఎన్ఇపి యొక్క ‘చాంపియన్స్ ఆఫ్ ద అర్థ్’ పురస్కారం కార్యక్రమం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

యుఎన్ఇపి యొక్క ‘చాంపియన్స్ ఆఫ్ ద అర్థ్’ పురస్కారం కార్యక్రమం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

యుఎన్ఇపి యొక్క ‘చాంపియన్స్ ఆఫ్ ద అర్థ్’ పురస్కారం కార్యక్రమం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


ఐక్య‌ రాజ్య‌ స‌మితి సెక్రటరి జనరల్, శ్రేష్ఠులైన శ్రీ ఎంటోనియో గుటేరేస్ గారు, కేంద్ర మంత్రిమండలి లో నా స‌హ‌చ‌ర మంత్రులు శ్రీమ‌తి సుష్మా స్వ‌రాజ్ గారు, డాక్ట‌ర్ హ‌ర్ష్ వ‌ర్ధ‌న్ గారు, డాక్ట‌ర్ మ‌హేశ్ శ‌ర్మ గారు, ఐక్య‌ రాజ్య‌ స‌మితి యొక్క పర్యావ‌ర‌ణ కార్య‌క్ర‌మం కార్యనిర్వాహక సంచాలకుడు శ్రీ ఎరిక్ సోల్ హెమ్‌, భార‌త‌దేశం నుండి, ఇంకా ఇత‌ర ప్రాంతాల‌ నుండి ఇక్కడకు విచ్చేసిన అతిథులు,

మహిళలు మరియు సజ్జనులారా,

ఈ గౌర‌వాన్ని నాకు కట్టబెట్టినందుకు ఐక్య రాజ్య‌ స‌మితి కి ఎంతైనా రుణ‌ప‌డి వుంటాను. ఈ మ‌హ‌త్త‌ర‌మైన కార్య‌క్ర‌మాన్ని భార‌త‌దేశం లో నిర్వ‌హించ‌డం, ఇందుకోసం ఐక్య‌ రాజ్య‌ స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ ఆంటోనియో, శ్రీ ఎరిక్‌, ఆయ‌న బృంద‌ం స‌భ్యులు ఇక్క‌డ‌కు విచ్చేయడం ఎంతైనా గ‌ర్వ‌ కార‌ణం. ప‌ర్యావ‌రణం కోసం 1.25 బిలియ‌న్ భార‌తీయులు చూపుతున్న నిబ‌ద్ద‌త‌ ను దృష్టి లో పెట్టుకొని ద‌క్కిన గౌర‌వమే ఇది అని నేను ఇదివ‌ర‌కే చెప్పాను. ప్ర‌కృతి లోనే దైవాన్ని ద‌ర్శించ‌డం భార‌తీయ పురాత‌న సంప్ర‌దాయం. భూమి, ఆకాశం, అగ్ని, నీరు, గాలి.. పంచ‌భూతాల లో దైవాన్ని చూస్తోంది భార‌తీయ సంప్ర‌దాయం. దీనిని గౌర‌వించ‌డానికి ఇస్తున్న‌దే చాపియ‌న్స్ ఆఫ్ ద అర్థ్ అవార్డు.

ఈ గౌర‌వం నా ఆదివాసీ సోద‌రులకు, ఆదివాసీ సోద‌రీమ‌ణుల‌కు చెందుతుంది. అడ‌వులలో నివ‌సిస్తున్న వారు వారి జీవితాల‌ కంటే ఎక్కువ‌గా వనాల‌ను ప్రేమిస్తున్నారు. ఈ గౌర‌వం ఈ దేశం లోని మ‌త్స్య‌కారుల‌ కు ద‌క్కుతుంది. ఎందుకంటే వారు వారి ఉపాధి కి స‌రిపోయేటంత మ‌త్స్య‌ సంప‌ద‌ను మాత్ర‌మే న‌దుల‌ నుండి తీసుకొంటున్నారు కాబ‌ట్టి. మ‌న మ‌త్స్య‌కారులు బ‌డి కి గాని, క‌ళాశాల‌ కు గాని వెళ్లి చ‌దువుకోలేదు. కానీ వారు మ‌త్స్య‌ సంప‌ద పునరుత్ప‌త్తి స‌మ‌యం లో వేట‌ కు దూరం గా వుంటారు. ఆ స‌మ‌యంలో వారు వారి ప‌ని ని ఆపివేస్తారు.

ఈ గౌర‌వం మ‌న దేశం లోని అన్న‌దాత‌ల‌కు ద‌క్కుతుంది. ఎందుకంటే వారికి వాతావ‌ర‌ణ చ‌క్ర‌ం అనేది వారి జీవిత చ‌క్రం తో స‌మాన‌మైంది. వారు వారి జీవితాల కంటే అధికంగా నేల ను ప్రేమిస్తారు కాబ‌ట్టి.

ఈ గౌర‌వం భారీయ మ‌హిళ‌ కు ద‌క్కుతుంది. ఎందుకంటే శ‌తాబ్దాల త‌ర‌బ‌డి వారి జీవితం లో పున‌ర్ వినియోగం, పున‌ర్ త‌యారీ లు అనేవి ఓ భాగం కాబ‌ట్టి. భార‌తీయ మ‌హిళ‌లు వృక్షాలలో దైవాన్ని చూస్తున్నారు. అంతే కాదు వారు తుల‌సి మొక్క‌ నుండి ఆకుల‌ను లెక్కించి కోస్తారు. అంతే కాదు చీమ‌ల‌కు ఆహారాన్ని అందించ‌డం ఒక మంచి కార్య‌క్ర‌మం.

దేశం లో ప్ర‌కృతి ని, ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌డానికిగాను వారి యొక్క జీవితాల‌ను అంకితం చేసిన అనామ‌కులు ఎంద‌రికో ఈ గౌర‌వం ద‌క్కుతుంది. దేశం లోని మారుమూల ప్రాంతాలలో నివ‌సిస్తూ, కొండ‌ల లో, ఆదివాసీ ప్రాంతాలలో నివ‌సిస్తూ ఎటువంటి లాభాపేక్ష‌, న‌ష్టాలు లేకుండా సంతోష‌ం తో, సౌభాగ్యాల‌ తో నివ‌సించే వారికి ఈ గౌర‌వం ద‌క్కుతుంది.

ఈ గౌర‌వాన్ని అందిస్తున్నందుకు మీ అంద‌రికీ మ‌రోసారి నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను.

అంతే కాదు, ఇది భార‌త‌దేశానికి రెండు గౌర‌వాలు ల‌భించిన సంద‌ర్భం. ఎందుకంటే కోచి విమానాశ్ర‌యానికి కూడా పురస్కారం ల‌భించింది. సుస్థిర‌మైన శ‌క్తి వ‌న‌రుల‌ ప‌ట్ల మ‌న‌కు గ‌ల నిబ‌ద్ధ‌త‌ కు ఇది ప్ర‌తీక‌ గా నిలుస్తుంది. ఈ సంద‌ర్భం గా ఈ అవార్డు ను పొందిన వివిధ దేశాల సంస్థ‌ ల‌కు, నా స‌హ‌చ‌రుల‌కు ఇవే నా అభినంద‌న‌లు.

మిత్రులారా,

ప‌ర్యావ‌ర‌ణానికి, ప్ర‌కృతి కి సంబంధించిన భార‌తీయ తాత్విక‌త ను గురించి నేను చెబుతాను. ఎందుకంటే వాతావ‌ర‌ణం, విప‌త్తులు అనేవి మ‌న సంస్కృతి తో నేరు గా సంబంధాన్ని క‌లిగి వున్నాయి. వాతావ‌ర‌ణం మ‌న సంస్కృతి లో భాగ‌ం అయ్యేటంత‌ వ‌ర‌కు విప‌త్తుల‌ నుండి పారిపోవ‌డం కుదిరే ప‌ని కాదు.

ప్రస్తుతం ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల భార‌త‌దేశం క‌న‌బ‌రుస్తున్న సున్నిత‌త్వాన్ని ప్ర‌పంచం అంగీక‌రిస్తోంది. ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల మ‌నకు ఉన్నటువంటి బాధ్య‌త ఈనాటిది కాదు; అది వేల సంవ‌త్స‌రాలు గా మ‌న జీవితాల్లో భాగం గా ఉంది. ఈ విష‌యాన్ని కొద్ది సేప‌టి క్రితం సుష్మా గారు ప్ర‌స్తావించారు కూడాను. మ‌నం నిద్ర లేవ‌గానే ధ‌రణి మాత‌ ను క్షమాప‌ణ‌లు వేడుకొని కాళ్ల ను కింద ఆన్చుతాం. ఎందుకంటే మ‌నం భూమి మీద కాళ్లు ఆన్చాలి కాబట్టి. ఒక ర‌కం గా చూస్తే మ‌న బ‌రువు ను భూమాత మీద పెడుతున్నామ‌ని చెప్ప‌డ‌మే ఇది.

మ‌న సంప్ర‌దాయం లో :

స‌ముద్ర వ‌సానే దేవి ప‌ర్వ‌త స్తాన్ మండితే,
విష్ణు ప‌త్నీ న‌మ‌స్తుభ్యం పాద్ స్ప‌ర్శం క్ష‌మాస్వ‌మేవ్‌ అన్నారు.

దీని కి ఓ ధ‌రిత్రి మాతా, విష్ణుదేవుని ప‌త్నీ, స‌ముద్రాల‌నే వ‌స్త్రాలు గా చేసున్నావు, ప‌ర్వ‌తాలే నీ శ‌రీరం, శిర‌స్సు ను వంచి నీకు న‌మ‌స్క‌రిస్తున్నాను. నా కాళ్ల ను నీ మీద పెడుతున్నాను, ద‌య‌చేసి న‌న్ను క్ష‌మించు అని భావం.

ఈ సున్నిత‌త్వం మ‌న జీవితాల్లో భాగం. ప్ర‌కృతి ని మ‌నం ప్రాణం తో వున్న మ‌నిషి గా భావించాం. చెట్ల‌ ను, మొక్క‌ల‌ను పూజించ‌డం, ప్ర‌కృతి కి, రుతువుల‌ కు సంబంధించిన పండుగలను జరుపుకోవ‌డం, ఉప‌వాసాలు చేయ‌డం, మ‌న‌ కు ప్ర‌కృతి కి మధ్య ఉన్న బంధాన్ని గురించి జాన‌ప‌ద‌ కథ లలో మాట్లాడుకోవ‌డం దీనికి నిద‌ర్శ‌నం. ప్ర‌కృతి కి మ‌న‌కు ఉన్న బంధం కార‌ణం గానే మ‌న సంప్రదాయం లో విశ్వ క‌ళ్యాణానికి ప్రాధాన్య‌ాన్ని ఇచ్చాం.
ఈ నేప‌థ్యం లో య‌జుర్వేదం ఏం చెప్పిందంటే :

ఓమ్ ద్వయ‌: శాంతి: అంత‌రిక్షం శాంతి:,

పృథ్వీ శాంతి: రాపా: శాంతిరోషాధాయ‌: శాంతి,

వాన ప్ర‌స్థాయ‌: శాంతిర్‌, విశ్వే దేవా: శాంతి, బ్రహ్మ‌ం శాంతి:,

స‌ర్వం శాంతి:, శాంతిరేవ్ శాంతి:, స మ శాంతి రెది.

ఓమ్ శాంతి:, శాంతి:, శాంతి:.

మిత్రులారా,

ఈ సంస్కృత శ్లోకం లో దైవాన్ని ఎలా ప్రార్థించారో చూద్దాం:

వాయువు లో గాలి వెల్లివిరియాలి,
గ‌గ‌నం లో శాంతి ప్ర‌భ‌వించాలి,
భూమి మీద శాంతి వ్యాపించాలి,
నీరు శాంతంగా వుండాలి,
వ‌న మూలిక‌ల్లో, మందుల్లో శాంతి వుండాలి;
మొక్క‌లు, వృక్షాలు శాంతంగా వుండాలి,
ప్ర‌పంచ‌మంతా శాంతి ప‌ల్ల‌వించాలి, దేవ‌త‌లంద‌రిలో శాంతి వెల్లివిరియాలి అని దీనికి అర్థం.

విశ్వ‌వ్యాప్తం గా శాంతి వెల్లివిరియ‌డానికిగాను ఈ మంత్రాన్ని ప‌ఠించే వాళ్లం. దీన్ని ప‌ఠించ‌కుండా మ‌న సంప్ర‌దాయంలో య‌జ్ఞాలు, యాగాలు సంపూర్ణత‌ ను పొందేవి కావు. అంతే కాదు దైవం త‌న‌ను తాను ప‌రిచ‌యం చేసుకోవలసి వ‌చ్చిన‌ప్పుడు త‌న వ్యాప్తి ని గురించి ఆయ‌న వివ‌రించవలసి వ‌చ్చిన‌ప్పుడు, ఆయ‌న త‌నంత‌ తాను ఇలా అనే వారు.

శ్రోత‌స్య ఆస్మీ జాహ్మ‌వి,

సంసార్ ఆస్మీ సాగ‌ర్‌.

దీనికి- నేను స‌ర‌స్సు ను, నేను న‌ది ని, నేనే స‌ముద్రాన్ని అని- భావం. అందుకే నేను చెబుతున్నాను.. మీరు నాకు ప్ర‌దానం చేస్తున్న ఈ పురస్కారం దేశ ప్ర‌జ‌ల‌కు ఇస్తున్న గౌర‌వం అని. భార‌తీయులు త‌ర‌ త‌రాలు గా పాటిస్తున్న న‌మ్మ‌కాల‌కు మీరు ఇస్తున్న గౌర‌వం ఇది.

మిత్రులారా,

ఈ రోజున భార‌త‌దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ చాలా వేగం గా అభివృద్ధి ని సాధిస్తోంది. ప్ర‌తి ఏటా ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు పేద‌రికం నుండి బయట‌ప‌డుతున్నారు. ఈ అభివృద్ధి ని మ‌రింత ముందుకు తీసుకుపోవ‌డానికి మేం కృత‌నిశ్చ‌యం తో ఉన్నాం. ఈ ప‌ని ని ఎందుకు చేస్తున్నామంటే ఎవ‌రి తోనో పోటీ ప‌డ‌డానికి కాదు; మేం డ‌బ్బు కోసం అల‌మ‌టించ‌డం లేదు. మా జ‌నాభా లో ఒక భాగం ప్ర‌జ‌లు పేద‌రికం తో యాత‌న ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యం తోనే ఆర్ధికాభివృద్ధి కోసం శ్ర‌మిస్తున్నాం.

పేద ప్ర‌జ‌లు గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో జీవించేలా చూసే బాధ్య‌త మ‌న అంద‌రి మీదా ఉంది. ఎలాంటి తెలివి లేకుండా ప్ర‌కృతి ని దోచుకోవ‌డం కార‌ణంగా దాని ప్ర‌భావం ప‌లు దేశాల్లోని పేద ప్ర‌జ‌ల మీద ప‌డుతోంది. ప్ర‌తి సంవత్సరం క‌రువు, వ‌ర‌దలు పెరిగిపోతున్నాయి. ఈ ప్ర‌కృతి విప‌త్తుల కార‌ణం గా పేద ప్ర‌జ‌లు, బొటాబొటీ గా జీవ‌నం గ‌డుపుతున్న‌వారు తీవ్రంగా దెబ్బ‌తింటున్నారు.

ఇలా ఇబ్బందులు ప‌డుతున్న పేద ప్ర‌జ‌ల‌కు త‌గిన సాయం అందించవలసిన అవ‌స‌రం ఉంది. వారి జ‌నాభా అధికంగా ఉంది. ప్ర‌కృతి పైన అధిక భారాన్ని మోప‌డ‌కుండానే వారికి అభివృద్ధి ఫ‌లాల‌ను అందించాలి. వారికి చేయూత ను ఇవ్వవలసిన అవ‌స‌రం ఎంతైనా ఉంది..
ఈ విష‌యాన్నే నేను పారిస్ లో గ‌ట్టి గా వాదించాను; ప్ర‌చారం చేశాను. దీనికి సంబంధించిన విష‌యాల‌ను ప్ర‌పంచం ముందు ఉంచాను. ప్ర‌కృతి న్యాయం గురించి ప్ర‌చారం చేశాను. ప్ర‌కృతి న్యాయం జ‌రిగేలా చూడ‌కుండా ప్ర‌కృతిలో వ‌చ్చే ప్ర‌తికూల మార్పుల స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌లేం. ఈ దు:స్థితి నుండి బయటప‌డ‌లేం. నా వాద‌న‌ కు పారిస్ ఒప్పందం లో ఆమోదం ల‌భించ‌డం నాకు సంతోషంగా ఉంది. నా వాద‌న‌ కు మ‌ద్ద‌తు ప‌లికి ప్ర‌కృతి న్యాయం ప‌ట్ల‌ గ‌ల నిబ‌ద్ధత‌ ను ప్ర‌ద‌ర్శించారు. అయితే దీనిని క్షేత్ర‌ స్థాయి లో అమలు లో పెట్టాలంటే మ‌నం చాలా చేయవలసి వుంటుంది. దీనిని వేగ‌వంతంగా చేయాలి.

ముఖ్యంగా చెప్పాలంటే నేను శ్రేష్ఠులు ఎంటోనియో గుటెరెస్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. ఎందుకంటే ఈ కాలానికి సంబంధించిన‌ ఈ డిమాండ్ ను ఆయ‌న అంగీక‌రించారు. సుస్థిర అభివృద్ధి ల‌క్ష్యాల‌ను అందుకోవ‌డానికిగాను ఆయ‌న చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్యోటో ఒడంబడికల ప్రాథమిక పత్రానికి సంబంధించిన రెండో ప్ర‌తిపాద‌న కు ఆమోదం పొందే ప్ర‌క్రియ‌ ను మొద‌లుపెట్టారు.

అందుకే మేం భారతదేశం లో ‘స‌బ్ కా సాథ్, స‌బ్ కా వికాస్’ మార్గం లో ముందుకు అడుగులు వేస్తున్నాం. స‌బ్ కా వికాస్ ను గురించి నేను ప్ర‌స్తావించానంటే అందులో ప్ర‌కృతి కూడా భాగ‌మై ఉంది. ప్ర‌తి ఒక్క‌రూ చురుగ్గా భాగ‌స్వాములు కావాల‌ని నేను అభ్య‌ర్థిస్తున్నాన‌నంటే 1.25 బిలియ‌న్ భార‌తీయులంద‌రూ భాగ‌స్వాములు కావాల‌ని దీని అర్థం.

మిత్రులారా,

మ‌న దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ కు గ్రామాలు, న‌గ‌రాలు రెండూ ముఖ్య‌మైన మూల‌ స్తంభాలుగా ఉన్నాయి. భార‌త‌దేశం లో అత్య‌ధిక‌ శాతం జ‌నాభా గ్రామాలలో ఉపాధి ని పొందుతున్నారు. వ్య‌వ‌సాయాన్ని న‌మ్ముకొని ఉన్నారు. న‌గ‌రాలనేవి సేవ‌లను అందించ‌డానికి, త‌యారీ రంగాని కి నిల‌యంగా ఉన్నాయి. ఈ రెండు అంశాల‌ ను దృష్టి లో పెట్టుకొని ప్ర‌భుత్వం స‌మ‌గ్ర‌మైన విధానం తో ప‌ని చేస్తోంది.

దేశ వ‌ర్త‌మామానాన్ని, భ‌విష్య‌త్తు ను దృష్టి లో పెట్టుకొని ప్ర‌భుత్వం రూపొందిస్తున్న ప్ర‌తి ప్ర‌భుత్వ విధానాని కి స్వ‌చ్ఛ‌మైన‌, ప‌చ్చ‌ద‌నంతో కూడిన ప‌ర్యావ‌ర‌ణాన్ని పునాదిగా చేసుకుంటున్నాం.

మిత్రులారా,

మ‌న గ్రామాల‌న్నీ ప్ర‌కృతి ప‌ట్ల స్పృహ‌ తోనే ఉన్నాయి. అవి ప్ర‌కృతి తో త‌మ సంబంధాల‌ను కొన‌సాగిస్తున్నాయి. అంతే కాదు గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో మా దేశం లోని గ్రామాలు ప్ర‌కృతి తో త‌మ బంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకున్నాయి.

వ్య‌ర్థాల‌ నుండి సంప‌ద‌ ను సాధించాలి, జీవ‌న‌ వ్య‌ర్థాల‌ నుండి ఇంధ‌నాన్ని త‌యారు చేసుకోవాల‌నే కార్య‌క్ర‌మాల‌ను గ్రామాల్లో కూడా కొన‌సాగిస్తున్నాం. సేంద్రీయ వ్య‌వ‌సాయం మొదలు మ‌ట్టి ప‌రీక్ష‌ల కార్డుల‌ వ‌ర‌కు ప‌లు కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేయ‌డం ద్వారా ప్రతి బిందువు కు మ‌రింత పంట ను పొందేందుకు వీలుగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. త‌ద్వారా భూముల్లో, సాగునీటిలో విష‌పూరితమైన ర‌సాయ‌నాలు లేకుండా చేస్తున్నాం. అంతే కాదు జలాలను స‌మ‌ర్థవంతంగా ఉప‌యోగించుకోవాల‌నే అవ‌స‌రాన్ని ఇది మ‌రింత బ‌లోపేతం చేసింది. ఇక ప‌రిశ్ర‌మ‌లు, త‌యారీ గురించి మాట్లాడుకున్న‌ప్పుడు మ‌న ప్ర‌ధాన ల‌క్ష్యం ఎలాంటి లోపాలు లేకుండా, ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఉత్ప‌త్తులను సాధించ‌డం. వ్య‌వ‌సాయాన్ని గురించి మాట్లాడుకున్న‌ప్పుడు మ‌న ప్ర‌ధాన ల‌క్ష్యం ప్ర‌తి బిందువు కు మ‌రింత అధికం గా పంట‌ ను సాధించడమే.

మిత్రులారా,

ఈ రోజు న‌, న‌గ‌రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న దేశాల స‌ర‌స‌న భార‌త‌దేశం కూడా నిలచింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌న న‌గ‌ర జీవితం ఆక‌ర్ష‌ణీయంగాను, సుస్థిరంగా ఉండేలా చూడ‌డానికిగాను మేం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నాం.
ఈ రోజున‌, దేశంలో రాబోయే త‌రానికి కావల‌సిన మౌలిక స‌దుపాయాల ఏర్పాటు విష‌యం లో సుస్థిర‌మైన ప‌ర్యావ‌ర‌ణం, అంద‌రినీ క‌లుపుకుపోయే వృద్ధి ని ల‌క్ష్యం గా చేసుకొని ప‌ని చేస్తున్నాం. దేశంలో వంద ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రాల‌ను త‌యారు చేయ‌డానికిగాను ప‌నుల‌ను చాలా వేగ‌వంతంగా చేస్తున్నాం. మురుగునీటి పారుద‌ల‌ నుండి ప‌ర్య‌వేక్ష‌ణ దాకా అనేక నాణ్య‌మైన సేవ‌ల‌ను అందుబాటు లోకి తీసుకువస్తున్నాం.

స్థానిక ప్ర‌జ‌లు ఇచ్చిన సూచ‌న‌ల ప్ర‌కారం ఈ వ్య‌వ్థ‌లు అన్నింటికీ ప్రాతిప‌దిక‌ గా ఆధునిక సాంకేతిక‌త‌ ను, పున‌ర్ వినియోగ ఇంధ‌నాన్ని వినియోగించ‌డం జ‌రుగుతోంది. ప‌ర్యావ‌ర‌ణ హితంగా ఉండేలా జాతీయ ర‌హ‌దారుల‌ను, ఎక్స్ ప్రెస్ వే ల‌ను ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్ర‌ధాన ర‌హ‌దారుల వెంబ‌డి హ‌రిత మార్గాల‌ను ఏర్పాటు చేస్తున్నాం. నూత‌నంగా నిర్మిస్తున్న ప్ర‌ధాన ర‌హ‌దారుల్లో సౌర విద్యుత్తు వ్య‌వ‌స్థ‌ ల‌ను నెల‌కొల్ప‌డం ద్వారా ఆయా ర‌హ‌దారుల్లో కావాల‌సిన ఇంధ‌న అవ‌స‌రాల‌ను తీర్చుకోవ‌డానికిగాను ఎన్ని విధాలుగా మార్గం ఉంటుందో అన్ని విధాలుగాను చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. మెట్రో రైలు లాంటి న‌గ‌ర ర‌వాణా నెట్ వ‌ర్కుల‌కు సౌర విద్యుత్తు ను అందించ‌డం ద్వారా, రైల్వే వారు శిలాజ జనిత ఇంధ‌నం మీద ఆధార‌ప‌డ‌డాన్ని త‌గ్గిస్తున్నాం.

మిత్రులారా,

ఈ రోజు న భారతదేశం లో నీటి సంర‌క్ష‌ణ‌ కోసం, ఇంధ‌న సంర‌క్ష‌ణ కోసం ఉద్య‌మ స్థాయి లో కృషి జరుగుతోంది. ఈ ప‌ని నివాస గృహాల‌ నుండి వీధుల‌ దాకా, కార్యాల‌యాల‌ నుండి ర‌హ‌దారుల‌ దాకా, నౌకాశ్ర‌యాల‌ నుండి విమానాశ్ర‌యాల‌ దాకా జ‌రుగుతోంది. ఎల్ఇడి బ‌ల్బుల‌ నుండి వాన నీటి సంర‌క్ష‌ణ వ‌ర‌కు నూత‌న సాంకేతిక‌త‌ ల‌ను ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతోంది.
ఇదే కాకుండా చాలా వేగ‌వంత‌మైన చ‌ర్య‌ ల‌ను చేప‌ట్ట‌డం ద్వారా వంటగ‌దుల‌ నుండి ర‌వాణా రంగం వ‌ర‌కు స్వచ్ఛ‌మైన ఇంధ‌న ఆధారిత వ్య‌వ‌స్థ‌ ల‌ను ఏర్పాటు చేసుకుంటున్నాం.

గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో ప‌ది కోట్ల‌ కు పైగా గృహాల‌కు ఎల్ పి జి ని లింక్ చేశాం. 5.5 కోట్ల గ్యాస్ క‌నెక్ష‌న్ లను ఉజ్వ‌ల ప‌థ‌కం ద్వారా అందించడమైంది. నివాస గృహాల‌ను పొగ ర‌హితం గా చేయ‌డ‌మే కాకుండా ర‌వాణా రంగాన్ని కూడా పొగ‌ ర‌హితం గా చేసే పనిని పెద్ద ఎత్తు న కొన‌సాగిస్తున్నాం. నేశన‌ల్ క్లీన్ ఎయర్ ప్రోగ్రామ్ (ఎన్ సిఎపి) ద్వారా గాలి నాణ్య‌త‌ ను మెరుగుప‌ర‌చ‌డం జ‌రుగుతుంది. దీనిపై క‌స‌ర‌త్తు చేస్తున్నాం. వాహ‌న ఉద్గారాల ప్ర‌మాణాల‌ను నిర్ణ‌యించే అంశంపై చ‌ర్చ జ‌రిగి నిర్ణ‌యం తీసుకున్న త‌రువాత ప్ర‌స్తుతం ఉన్న బిఎస్-4 ప్ర‌మాణాల స్థానంలో బిఎస్-6 ప్ర‌మాణాల‌ను అమ‌లు చేయ‌డం జ‌రుగుతుంది.

మిత్రులారా,

సుల‌భ‌త‌ర‌మైన జీవ‌నం పై ప్ర‌త్యేక దృష్టి ని పెట్టిన రోజులు ఇవి. అంద‌రికీ గృహాలు, అంద‌రికీ విద్యుత్తు, అంద‌రికీ ఆహారం, అందరికీ విద్య‌, ఉపాధి అనేవి చాలా ముఖ్య‌మైన అంశాలు. ఇలాంటి స‌మ‌యం లో ఉద్యోగాల క‌ల్ప‌న‌ పై మ‌న‌కు ఉన్న నిబ‌ద్ద‌త మ‌రింత పెరిగింది. అయిన‌ప్ప‌టికీ ఇలాంటి స‌మ‌యం లో ప్ర‌కృతి ని అశ్ర‌ద్ధ చేయ‌డం లేదు. 2005తో పోల్చి చూసిన‌ప్పుడు రాబోయే రెండు సంవ‌త్స‌రాల్లో ఉద్గారాల తీవ్ర‌త‌ ను 20 నుండి 25 శాతం మేరకు త‌గ్గించ‌డానికి కృషి చేస్తున్నాం. 2030 కల్లా ఈ తీవ్ర‌త‌ను 30 నుండి 35 శాతానికి త‌గ్గించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. ఈ అన్నింటిలో మ‌నం అత్య‌ధిక స్థాయి లో విజ‌యాన్ని సాధిస్తే దానికి కార‌ణం ప్ర‌జ‌ల వ్య‌వ‌హార‌శ‌లి లో, ఆలోచ‌న విధానం లో వ‌చ్చిన పరివర్తనే.

మ‌న‌కు ఉన్న న‌మ్మ‌కాల‌కు తోడు ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల మ‌నం వహిస్తున్న శ్ర‌ద్ధ అనేది మ‌నం చేప‌డుతున్న ప‌నుల‌ ద్వారా మ‌రింత బ‌లోపేత‌ం అవుతోంది. ఇదే కార‌ణంతో 2022 కల్లా భార‌త‌దేశం ప్లాస్టిక్ కు తావు ఉండని దేశం గా అవ‌త‌రించబోతోంది.

మ‌హాత్మా గాంధీ మ‌హోన్న‌తమైన వ్య‌క్తిత్వాన్నుండి స్ఫూర్తి ని తీసుకొని భార‌త‌దేశం త‌న నిర్ణ‌యాల‌ను అమ‌లు చేసి ఫ‌లితాల‌ను పొందగలదన్న నమ్మ‌కం నాలో వుంది. అంతే కాదు భార‌త‌దేశం ప్ర‌పంచానికే మార్గ‌ద‌ర్శిగా నిలుస్తుంది. భార‌త‌దేశం చేసిన శ్ర‌మ‌ కు గుర్తింపు గా ఈ గౌర‌వాన్ని అందిస్తున్నందుకు ఐక్య‌ రాజ్య‌ స‌మితి కి మ‌రొక‌సారి నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.

మీ అమూల్య‌మైన స‌మ‌యాన్ని వెచ్చించి ఈ ముఖ్య‌మైన స‌మావేశం లో మీరు పాల్గొన్నారు. మ‌నం పెట్టుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డానికిగాను ఎలాంటి రాజీ లేకుండా కృషి చేయవలసిన బాధ్య‌త వ్య‌క్తిగ‌తంగా నా మీద ఉంది. ఇక్క‌డ‌కు వ‌చ్చి మ‌మ్మ‌ల్ని ప్రోత్స‌హిస్తున్నందుకు మీ అంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు.

మీకు ఇవే ధన్యవాదాలు.