పిఎంఇండియా
యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన ప్రసిద్ధ ప్రదేశం, యోగ్యకర్తలోని ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. గౌరవ సూచకంగా ప్రధానమంత్రితో కలిసి ఇండోనేషియా అధ్యక్షుడు గౌరవ శ్రీ ప్రబోవో సుబియాంటో ఆలయ సందర్శనకు వెళ్లారు. ఈ ఆలయ సముదాయంలో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపట్టనున్న పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రారంభానికి గుర్తుగా ఇరుదేశాల నాయకులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
9వ శతాబ్దంలో నిర్మించిన ప్రంబనన్ ఆలయ సముదాయం ఇండోనేషియాలోనే అతిపెద్ద ఆలయ సముదాయం. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు దీన్ని అంకితమిచ్చారు. భారత్, ఇండోనేషియా మధ్య ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక వారసత్వానికి శాశ్వత చిహ్నంగా ఈ ఆలయ సముదాయం నిలుస్తుంది.
అధ్యక్షుడు ప్రబోవో 2025లో భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇరుదేశాల నేతల నిర్ణయం మేరకు ఈ పరిరక్షణ ప్రాజెక్టు కొనసాగుతోంది. ప్రంబనన్ ఆలయ సముదాయ పునరుద్ధరణకు భారత్ నుంచి సహాయాన్ని పొందేందుకు ఈ ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది.
ఆగ్నేయాసియాలోని పలు ప్రపంచ వారసత్వ ప్రదేశాల పునరుద్ధరణ, పరిరక్షణలో భారతదేశానికి మంచి గుర్తింపు ఉంది. గతంలో ఇండోనేషియాలోని బోరోబుదూర్ ఆలయ సముదాయానికి సంబంధించి పత్రాల నమోదు పనులను ఏఎస్ఐ విస్తృతంగా చేపట్టింది. ప్రంబనన్ ఆలయ సముదాయం పునరుద్ధరణ, పరిరక్షణకు భారత్ అందిస్తున్న మద్దతు ఇరుదేశాల మధ్యనున్న ఉమ్మడి నాగరికత వారసత్వాన్ని కాపాడటంలో భారతదేశానికున్న నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.