Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యువజన వ్యవహారాలలో సహకారం కోసం భారతదేశం, ఆర్మేనియా ల మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రంపై సంతకాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


యువజన వ్యవహారాలలో సహకారం కోసం భారతదేశం, ఆర్మేనియా ల మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రం గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు)పై ఇప్పటికే సంతకాలయ్యాయి.

2017 ఏప్రిల్ లో ఎమ్ఒయు పై సంతకాలు జరిగాయి. ఈ ఎమ్ఒయు అయిదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. ఆ తరువాత, ఈ ఎమ్ఒయు ను నవీకరించుకొనే ఉద్దేశం లేనట్లు ఒక పక్షం మరొక పక్షానికి నోటిఫై చేయని పక్షంలో, దీని గడువు తేదీ ముగియడానికన్నా కనీసం ఆరు నెలల ముందుగానే తనంతట తాను వరసగా వచ్చే అయిదేళ్ల కాలాల ప్రాతిపదికన నవీకరణకు నోచుకొంటూ ఉంటుంది. ఒక పక్షం మరొక పక్షానికి ఆరు నెలల ముందు నోటీసును ఇవ్వడం ద్వారా ఈ ఎమ్ఒయు ను రద్దు చేయడానికి వీలు ఉంది.

ఇరు పక్షాలు నిర్వహించే కార్యక్రమాలు, కార్యకలాపాలలో పాలు పంచుకోవడం, సమాచారాన్ని మరియు విజ్ఞానాన్ని పంచుకోవడం, రెండు దేశాల మధ్య యువతీయువకుల బృందాల రాకపోకల ద్వారా రెండు దేశాల మధ్య యువతకు సంబంధించిన వ్యవహారాలలో సహకారాన్ని బలపరచుకోవడం మరియు ప్రోత్సహించడం ఈ ఎమ్ఒయు యొక్క ధ్యేయంగా ఉంది.

యువత, యువ సంఘాల ప్రతినిధుల మరియు యువజన విధాన రూపకల్పనకు బాధ్యులుగా ఉన్న ప్రభుత్వ అధికారుల మార్పిడి సహా యువజనులకు సంబంధించిన అంశాలలో రెండు దేశాలు సహకరించుకోనున్నాయి. యువతకు సంబంధించిన అంశాలపై రెండు దేశాలలోనూ జరిగే అంతర్జాతీయ సమావేశాలు మరియు చర్చాసభలకు ఆహ్వానాలను ఇచ్చి పుచ్చుకోవడం, ముద్రిత సామగ్రి, చిత్రాలు మరియు అనుభవాలను పరస్పరం ఆదాన ప్రదానం చేసుకోవడానికి సైతం ఇది వర్తిస్తుంది. అలాగే యువజన అంశాల సంబంధిత పరిశోధన, ఇతరేతర సమాచారం, రెండు దేశాలలోనూ జరిగే యువజన శిబిరాలు, యువజనోత్సవాలు, ఇంకా ఇతర యువజన సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనడం వంటి వాటిలోనూ ఈ సహకారం కొనసాగుతుంది.

***