Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

యు ఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యు ఎస్ ఐ బి సి) 40వ ఎ జి ఎమ్ లో ప్రధాన మంత్రి కీలకోపన్యాసం పూర్తి పాఠం

యు ఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యు ఎస్ ఐ బి సి) 40వ ఎ జి ఎమ్ లో ప్రధాన మంత్రి కీలకోపన్యాసం పూర్తి పాఠం


సోదర సోదరీమణులారా,

1. ఇంత భారీ సంఖ్యలో గుమికూడిన ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల మధ్యకు మరోసారి వచ్చినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ రోజు ఉదయం నేను ప్రెసిడెంట్ శ్రీ ఒబామాతో భేటీ అయ్యాను. ఉభయ దేశాలకు ఆసక్తి ఉన్న పలు అంశాల పైన మేం ఒకరి అభిప్రాయాలను మరొకరికి తెలియజేసుకొన్నాం. అమెరికాతో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలు ఎప్పటి కన్నా బలీయంగా ఉన్నాయి. భవిష్యత్తు మరింత ఉజ్జ్వలంగా ఉంటుందని మేం ఇద్దరం అభిప్రాయపడ్డాం.

2. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో బలహీనతలు ఇంకా కొనసాగుతూనే ఉన్న తరుణంలో మీతో నేను మాట్లాడుతున్నాను. ప్రపంచంలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ క్లిష్ట స్థితిలోనే ఉన్నాయి. అభివృద్ధికి కొత్త చోదక శక్తులను ఈ ప్రపంచం అన్వేషించాల్సిన సమయం ఆసన్నం అయింది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన ప్రజాస్వామిక వ్యవస్థల్లో ఒకటిగా ఈ కొత్త చోదక శక్తి ప్రజాస్వామ్యమే అయితే సమంజసంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. భారతదేశం ప్రపంచ వృద్ధికి కొత్త చోదక శక్తిగా నిలచేందుకు సిద్ధంగా ఉందని మీకు తెలియజేయడం నాకు ఆనందాన్నిస్తోంది.

3. అతి పెద్దదైన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి బహుళ ప్రయోజనాలను అందిస్తోంది. భారతదేశం ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న అతి పెద్ద మార్కెట్ ప్రపంచానికి అందిస్తోంది. కాని భారతదేశం ఒక మార్కెట్ కన్నా చాలా విస్తృతమైనది. అవేమిటో చూడండి..

– విశ్వసనీయమైన భాగస్వామి

– అత్యుత్తమ ప్రతిభ గల శాస్ర్తీయ, ఇంజినీరింగ్, మేనేజరియల్ నిపుణులు

– ఆలోచనలు, ప్రయోగాలకు ఆలవాలం

– అత్యున్నత సామర్థ్యాలు గల పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల నెలవు

– ప్రజాస్వామ్యం, సత్వర అభివృద్ధి ఒకదానితో మరొకటి కలసి ప్రయాణం చేయగలవనేందుకు వాస్తవ చిత్రం

4. భారతదేశం నూతన అభివృద్ధి శకంలో పయనిస్తున్నందు వల్ల ఆంట్ర ప్రనర్ షిప్, నవకల్పన ల విషయంలో అమెరికా నుండి పాఠాలు నేర్చుకోవాలని భావిస్తోంది. భిన్న రంగాల్లో శాస్ర్త సాంకేతిక నవకల్పనల్లో అమెరికా అగ్రగామిగా కొనసాగుతుంది.

– ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నాణ్యత లలో మెరుగుదల

– డ్రగ్స్ నుంచి డ్రోన్ల వరకు, హైబ్రిడ్ కార్ల నుంచి హైడ్రో ఫ్రాకింగ్ వరకు

అమెరికా ఘన చరిత్ర గల దేశమే కాదు…ఎంతో ఉజ్జ్వలమైన భవిష్యత్తు కూడా ఉన్న దేశం. అందుకే మన భాగస్వామ్యం వల్ల ఉభయ దేశాలు లబ్ధిని పొందుతాయి.

5. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతదేశం, అమెరికా సమాజాలు పోషిస్తున్న పాత్ర ఉభయ దేశాల సంబంధాల్లో ప్రత్యేక స్వభావం. ఒక దేశానికి చెందిన వలసదారులు మరో దేశంలో వలసదారులుగా మారడం, అత్యున్నత గౌరవ ప్రతిష్ఠలు ఉభయ దేశాలకు ఆర్జించడం అత్యంత అరుదైన అంశం. నానాటికీ విస్తరిస్తున్న భారతదేశం-అమెరికా సంబంధాలను బలీయంగా నిలపగల శక్తి ఇండియన్- అమెరికన్ లు.

6. నేను అధికారంలోకి వచ్చి ఇటీవలే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. 2014లో మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు అప్పుడే అధికార పగ్గాలు చేపట్టాను. అత్యంత సవాళ్ళతో కూడిన దేశీయ, అంతర్జాతీయ వాతావరణంలో ఉన్నాం. ఇన్వెస్టర్ల విశ్వాసం అత్యంత కనిష్ఠ స్థాయిలో ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దేశంలో నెలకొన్న జడత్వం పట్ల, ప్రతిష్టంభన పట్ల వ్యాపార వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. అధికార యంత్రాంగంలో నెలకొన్న బాధ్యతరాహిత్యం, బూజు పట్టిపోయిన విధానాలపై ప్రతి ఒక్కరు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రెండేళ్ళ వ్యవధి లోనే మేం ఆ అవరోధాలన్నింటినీ అధిగమించి ఆర్థిక పురోగతిలో అందరినీ ఆకట్టుకోగల స్థితికి చేరాం.

7. మా విధానాల్లోని ముఖ్యాంశాలను ఆవిష్కరించేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. సంస్కరణ, పరివర్తన నా విధానం అని ఎన్నోసార్లు చెప్పాను. సగటు మనిషి జీవితంలో పరివర్తన తీసుకు రాగల విధానాలే సంస్కరణలు అన్నది నా ఆలోచన. గత రెండు సంవత్సరాల కాలంలో ఆర్థిక సంస్కరణల కన్నా అతీతమైన సంస్కరణల సమగ్ర ప్యాకేజిని మేం ఆవిష్కరించాం. వాటిని నేను 4 రకాలుగా వర్గీకరిస్తున్నాను…

– బలమైన పునాదులకు దోహదపడే స్థూల ఆర్థిక సంస్కరణలు

– పెట్టుబడులను, వాణిజ్య రంగాన్ని ప్రోత్సహించి సామర్థ్యాలు, ఉత్పాకతను పెంచడం ద్వారా వృద్ధికి, ఉపాధికి ఊతం ఇచ్చే సంస్కరణలు

– మహిళలు, రైతాంగం సహా సమాజంలోని బలహీన, నిరుపేద వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందించగల సంస్కరణలు

– అవినీతిపై ప్రత్యక్ష పోరాటం

8. స్థూల ఆర్థిక సంస్కరణతో నేను మొదలుపెడతాను.

9. మేం అధికారం చేపట్టిన తర్వాత ద్రవ్యోల్బణం, విత్త లోటు, విదేశీ రుణ చెల్లింపులు, కరెంట్ ఖాతా లోటు అన్నీ తగ్గాయి. జిడిపి వృద్ధిరేటు, విదేశీ మారకం నిల్వలు, స్టాక్ మార్కెట్ విలువలు, ఇన్వెస్టర్ల విశ్వాసం అన్నీ ఇనుమడించాయి. ఎంతో మథనం చేసిన అనంతరం రూపొందించిన విధానాల ఫలమే ఈ విజయానికి కారణం. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయగల ద్రవ్య విధానాన్ని అనుసరించడంతో పాటు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ద్రవ్య విధానం రూపకల్పనకు సర్వ స్వతంత్రమైన సంఘాన్ని ఏర్పాటు చేశాం. మేం ఆర్థిక స్థిరీకరణ పథంలో పయనిస్తున్నాం. వరుసగా మూడు బడ్జెట్లలో విత్త లోటు గణనీయంగా తగ్గుతూ వచ్చింది. విత్త లోటు తగ్గిస్తూనే ఉత్పాదక విభాగాల్లో ప్రభుత్వ పెట్టుబడులను పెంచాం.

10. రెండు మార్గాల ద్వారా దీన్ని మేం సాధించగలిగాం. శిలాజ ఇంధనాలపై మేం కార్బన్ పన్ను ను విధించాం. డీజిల్ ధరలపై నియంత్రణలు తొలగించే సాహసోపేతమైన చర్య ద్వారా ఇంధన సబ్సిడీలను తొలగించాం. ఆ తర్వాత ఆ సబ్సిడీల స్థానంలో పన్నులు విధించాం. స్వచ్ఛ ఇంధన సుంకాన్ని ఎనిమిది విడతలుగా 50 రూపాయల నుంచి 400 రూపాయలకు పెంచాం. ప్రపంచవ్యాప్తంగా కార్బన్ పన్నులపై ఎంతో చర్చ జరుగుతోంది, అది కేవలం మాటలకే పరిమితం. కాని మేం ఆచరణలోకి తెచ్చాం. కొత్త విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వృధావ్యయాన్ని గణనీయంగా తగ్గించాం. బయోమెట్రిక్ గుర్తింపు ద్వారా అర్హులైన వారి ఖాతాలకు నేరుగానే సబ్సిడీ ప్రయోజనాలను బదిలీ చేస్తున్నాం.

11. ఇప్పుడు మేం వృద్ధిని, ఉపాధిని ఉద్దీపింపచేసే విధానాలను గురించి నన్ను వివరించనివ్వండి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు మేం ఎంతగా సరళీకరించామో మీ అందరికీ తెలిసిందే. చాలా రంగాల్లో ఎఫ్ డి ఐ లు ఆటోమేటిక్ రూట్ లో అనుమతిస్తున్నాం. రక్షణ, రైల్వే రంగాల్లో కూడా ఎఫ్ డి ఐ లను అనుమతిస్తున్నాం. ఎంతో కాలంగా పెండింగులో ఉన్న బీమా సంస్కరణల బిల్లును విజయవంతంగా ఆమోదింపచేసుకోగలిగాం. అమెరికన్ కంపెనీలతో పాటు పలు కంపెనీలు మా బీమా రంగంలో పెట్టుబడులు పెంచాయి. “వ్యాపార నిర్వహణకు అనుకూల వాతావరణం” కల్పించే విషయంలో ఎన్నో ముఖ్య చర్యలు తీసున్నాం. వ్యాపార నిర్వహణ విషయంలో అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో ఎన్నో మెట్లు పైకి ఎక్కాం. అత్యున్నత నాణ్యత గల, సమర్థవంతమైన ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసేందుకు విదేశీ, దేశీయ ఇన్వెస్టర్లను ప్రోత్సహిస్తున్నాం. లాజిస్టిక్ సదుపాయాలు మెరుగుపరిచేందుకు రహదారులు, రైల్వేలు, నౌకాశ్రయాలు, జల మార్గాల అభివృద్ధిని చేపట్టాం. వస్తువుల రాకపోకలు త్వరితంగా జరిగేందుకు వీలుగా పోర్టుల్లో వసతులు మెరుగుపరిచాం. అమెరికాలో స్టార్టప్ ల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని మేం ఎంతో ఆరాధిస్తున్నాం. అదే విధానాన్ని మేం అనుసరించే ప్రయత్నం చేస్తున్నాం. మా స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద ఎందరో నవతరం పారిశ్రామికులకు అవకాశం కల్పించాం. 2015 సంవత్సరంలో కనీసం టాప్ టెన్ లో కూడా లేని బెంగళురు దేశంలో నవకల్పనల ఆవిష్కారానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా 2016లో ఎంపికయింది.

12. ఆర్థిక రంగం విజయవంతం కావాలంటే బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ అత్యంత కీలకం. బ్యాంకింగ్ నిర్ణయాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల నియామకాల్లో అవినీతి, క్రోనీయిజం అత్యధికంగా ఉన్న వ్యవస్థ మాకు వారసత్వంగా లభించింది. దేశంలోనే తొలిసారిగా బ్యాంకర్లతో విహారయాత్రా స్థలంలో సమావేశమయ్యాను. బ్యాంకర్లకు స్పష్టమైన పని నిర్వహణా విధానాలు, బాధ్యతాయుతంగా నిర్వహించే యంత్రాంగం ఏర్పాటు చేశాం. బ్యాంకులకు తగినంత మూలధనం కల్పనకు భరోసా ఇచ్చాం. బ్యాంకింగ్ నిర్ణయాల్లో జోక్యాన్ని పూర్తిగా నిర్మూలించాం. బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో పర్యవేక్షణలో నియామకాలు చేసే కొత్త విధానం అమలులోకి తెచ్చాం. బ్యాంకుల అధిపతులుగా విశ్వసనీయత, సమర్థత గల వారిని నియమించాం. 47 సంవత్సరాల క్రితం బ్యాంకులు జాతీయం చేసిన తరువాత తొలిసారిగా ప్రైవేటు రంగానికి చెందిన వృత్తి నిపుణులను బ్యాంకుల సి ఇ ఒ లుగా నియమించాం.

13. వృద్ధి సమ్మిళితంగా ఉండే విధానాలు ప్రవేశపెట్టాం. జన్ ధన్ యోజన ద్వారా రెండు వందల మిలియన్ ప్రజలను బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకువచ్చాం. ప్రపంచంలోని పలు దేశాల జనాభా కన్నా వీరి సంఖ్య ఎక్కువే. ఇప్పుడు ఆ మిలియన్ల మంది ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములయ్యారు. వడ్డీరేటుకు ఇప్పుడు సార్థక నామం ఏర్పడింది. పిరమిడ్ కు అట్టడుగు భాగంలో ఎంతో బలం ఉన్నట్టు ప్రజలు నిరూపించారు. నమ్మండి, నమ్మకపోండి…జన్ ధన్ యోజన పథకం ఇవాళ మొత్తం దాదాపు 600 కోట్ల డాలర్ల నిల్వలను కలిగి ఉన్నది.

14. జన్ ధన్ యోజన పేదల సామర్థ్యాన్ని పెంచింది. ఎలక్ట్రానిక్ పేమెంట్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. జన్ ధన్ ఖాతాదారుల్లో ప్రతి ఒక్కరూ డెబిట్ కార్డు పొందేందుకు అర్హులే. మొబైల్ ఎ టి ఎమ్ లు ప్రారంభించేందుకు బ్యాంకులు, తపాలా కార్యాలయాలను ప్రోత్సహిస్తున్నాం. చేతిలో ఇమిడిపోయే ఒక పరికరం సహాయంతో డబ్బు విత్ డ్రా చేసుకోవడంతో పాటు తేలికపాటి బ్యాంకింగ్ కార్యకలాపాలు చేపట్టేందుకు సహాయపడే విధానమే మొబైల్ ఎ టి ఎమ్.

15. సామాజిక భద్రతా పథకాల సహాయంతో ప్రజలకు భద్రత కల్పించాం. ప్రమాద బీమా, జీవిత బీమా, పింఛను అందించేందుకు తక్కువ చందాతో కూడిన సబ్సిడీల భారం లేని బీమా పథకాలను ప్రవేశపెట్టాం. వాటికి గల కవరేజ్ విస్తృతి వల్ల ప్రీమియమ్ ను తక్కువగా ఉంచగలిగాం. ఇప్పుడు 120 మిలియన్ భారతీయులకు ఇవి అందుబాటులో ఉన్నాయి.

16. లింగ సమానత్వం సాధనపై ప్రత్యేకంగా దృష్టి సారించి, మహిళలకు సాధికారత అందించాం. బాలికల విద్యకు అవసరమైన నిధులు అందుబాటులో ఉండేందుకు వీలుగా అధిక వడ్డీతో కూడిన ఒక కొత్త సేవింగ్స్ పథకాన్ని ప్రవేశపెట్టాం. గ్రామీణ మహిళలు కట్టెలతో వంట చేయడం వల్ల ఏర్పడుతున్న అనారోగ్యం బారి నుండి వారికి రక్షణను కల్పించే లక్ష్యంతో 50 మిలియన్ కొత్త గ్యాస్ కనెక్షన్లు గ్రామీణ ప్రాంతాల్లో అందజేస్తున్నాం. స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ముద్ర యోజన ను ప్రవేశపెట్టాం. అందులో 70 శాతం లబ్ధిదారులు మహిళలే. 27 మిలియన్ కు పైగా మహిళలే ఆధిపత్యం ఉన్న వ్యాపారాలకు సహాయం అందించాం. మహిళలు కూడా యుద్ధ రంగంలో ముందు వరుసలో నిలిచేందుకు వీలుగా సాయుధ దళాల నియామకం నిబంధనలు కూడా మార్చాం. కొత్త నిబంధనలతో కార్పొరేట్ రంగంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా మహిళలు మరింత అధిక సంఖ్యలో నియమించేందుకు వెసులుబాటు కల్పించాం.

17. భారత ప్రజలకు ఇప్పటికీ ప్రధాన జీవనాధారం వ్యవసాయమే.. రసాయనాల వినియోగానికి సబ్సిడీ ఎరువులను తరలించడం ద్వారా రైతాంగానికి సబ్సిడీ ఎరువులు అందకుండా చేస్తున్నారు. దీనికి తేలికపాటి పరిష్కారంగా వేప పూత పూసిన ఎరువులను ప్రవేశపెట్టాం. దీని వల్ల ఇతర ప్రయోజనాలకు వీటిని మళ్ళించే అవకాశం లేకుండా పోయింది. మొత్తం యూరియా అంతటినీ వేప పూత తోనే విక్రయించే ప్రయత్నం కూడా పూర్తయింది. దీని వల్ల కోట్లాది రూపాయల వ్యవసాయ సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టగలిగాం. తేలికపాటి సంస్కరణలు ఎంత సమర్థంగా ఉంటాయో ఇది నిరూపిస్తోంది.

18. భూసారాన్ని గురించిన సమాచారాన్ని రైతన్నలకు అందించేందుకు దేశవ్యాప్తంగా సాయిల్ హెల్త్ కార్డులను ప్రవేశపెట్టాం. దీని వల్ల తమ భూసారానికి దీటైన ఉత్తమ పంటను రైతులు ఎంపిక చేసుకుని మెరుగైన దిగుబడులు పొందే వీలు కలుగుతుంది. వ్యవసాయ ఉపకరణాల్లో వృధాని నివారించడంతో పాటు పంట దిగుబడులు పెరిగేందుకు, భూసార పరిరక్షణకు కూడా ఇది సహాయపడుతుంది. రసాయనిక ఎరువుల వినియోగం తగ్గడం వల్ల వినియోగదారుల ఆరోగ్యానికి కూడా రక్షణ ఏర్పడుతుంది. పర్యావరణ పరిరక్షణకు కూడా సహాయకారిగా ఉంటుంది. 140 మిలియన్ సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేయడం ద్వారా 25 మిలియన్ నమూనాలు సేకరించి దేశంలోని భిన్న ప్రాంతాల్లోని 1500 ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం.

19. ఇప్పుడు మీ ముందుంచబోతున్నది ప్రపంచంలోని అధిక శాతం మంది విమర్శకులు సైతం ఆశ్చర్యపోయే చర్య… అవినీతి తీవ్రత తగ్గింపు. ఏ వర్థమాన ఆర్థిక వ్యవస్థ వృద్ధికైనా అవినీతే ప్రధాన అవరోధమని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతూ ఉంటారు. అవినీతి నిర్మూలనకు మేం నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ రంగ బ్యాంకుల అనుభవాన్నినేను ఇప్పటికే మీకు తెలియచేశాను. అత్యంత కీలకమైన ప్రకృతి వనరుల కేటాయింపులో విచక్షణతో కూడిన విధానాలకు మేం స్వస్తి చెప్పాం. గనులు, స్పెక్ట్రమ్, ఎఫ్ ఎమ్ రేడియో లైసెన్సులు పారదర్శకంగా కేటాయించే విధానాన్ని ప్రవేశపెట్టాం. లబ్ధిదారుల ఖాతాల్లోకే వారికి అందించే ప్రయోజనాలన్నింటినీ జమ చేయడం ద్వారా లీకేజిలు అరికట్టాం. ఉద్యోగాల్లో సీనియర్ స్థానాల్లో సమగ్రత గల వారినే నియమించుకునేందుకు వీలుగా సిబ్బంది నిర్వహణ విధానాల్లో మార్పులు చేశాం. పన్ను ఎగవేతలు, నల్లధనం కూడబెట్టడం వంటి చర్యలకు వ్యతిరేకంగా చైతన్యం తీసుకురావడానికి భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాం. అవినీతి నిర్మూలన చర్యల వల్ల అధికంగా లాభపడుతున్న వారు పేదలే.

20. ఇక రానున్న సంవత్సరాలలో మేం అనుసరించే బాను గురించి వివరిస్తాను.

21. క్రమశిక్షణ, వివేకంతో కూడిన స్ధూల ఆర్థిక విధానాలను కొనసాగించాలనుకుంటున్నాం. దీర్ఘకాలిక సుస్థిర అభివృద్ధికి ఈ తరహా స్థూల ఆర్థిక విధానాలే అవసరమని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను.

22. సమ్మిళిత, సమానత్వ విధానాలను అవలంబించడం ద్వారానే మేం దీనిని సాధిస్తాం. అభివృద్ధి ఫలాలు ఏ కొద్ది మందికో కాకుండా అధిక శాతం మందికి అందించడానికి ఈ చర్యలు చాలా అవసరం. అవినీతిపై పోరాటానికి కూడా ఇలాంటి విధానాలను కొనసాగించడం అవసరం.

23. పెట్టుబడుల వాతావరణాన్ని, వ్యాపార నిర్వహణ విధానాలను మెరుగుపరచడం మేం కొనసాగించాలనుకుంటున్న మూడో చర్య. వ్యాపారాలను ఆహ్వానించడమే కాదు…వ్యాపార నిర్వహణకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయడంలో భారత్ ను మించిన గమ్యం మరొకటి లేదని ప్రపంచం విశ్వసించేలా చేయాలన్నదే మా లక్ష్యం. ఎఫ్ డి ఐ విధానాలు సరళం చేయడం ద్వారా తొలి లక్ష్యాన్ని ఇప్పటికే సాధించాం. రెండో లక్ష్య సాధన దిశగా కూడా చక్కని ముందడుగు వేశాం. రానున్న కాలంలో మరింతగా మెరుగుపరుస్తాం.

24. “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమాన్ని మరింతగా పటిష్ఠం చేస్తాం. దేశీయ మార్కెట్ కు అవసరం అయిన ఉత్పత్తులు తయారుచేయడమే కాదు…దిగుమతి ప్రత్యామ్నాయంగా కూడా దీన్ని ఉపయోగించాలన్నది మా ధ్యేయం. ప్రపంచం అంతటికీ కావలసిన అంతర్జాతీయ శ్రేణి ఉత్పత్తులను తయారుచేయాలన్నది మా భావన. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి మేం గట్టి ప్రయత్నం చేస్తున్నాం. భారతదేశం నుండి తయారయ్యే ఉత్పత్తులే కాదు…సేవలకు కూడా సంపన్న దేశాలు తమ మార్కెట్లు తెరవడం ఇందుకు ప్రధానం. ఇది భారతదేశానికి, అమెరికాకు కూడా లాభదాయకమైన చర్య. కష్టపడి పని చేయగల యువ జనాభా అధికంగా ఉన్న భారతదేశం ప్రపంచానికి భావి మానవ వనరుల సరఫరా కేంద్రంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా పెట్టుబడులు, నవకల్పనలు, భారత మానవ వనరులు, ఔత్సాహిక పారిశ్రామిక ధోరణులు కలిస్తే అనూహ్యమైన శక్తి ఏర్పడుతుందన్నది నా స్వప్నం. ఇలాంటి భాగస్వామ్యాల ద్వారా మనం ఆర్థిక వ్యవస్థలను పటిష్ఠం చేసుకోగలుగుతాం.

25. పన్ను విధానాలపై ఎలాంటి సందిగ్ధాలకు తావు లేకుండా ఊహించగలవిగానే ఉండేలా చూడాలన్నది మా లక్ష్యం. ఈ దిశగా మా ప్రయత్నం కొనసాగిస్తాం. అమెరికాతో అడ్వాన్స్ డ్ ప్రైసింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ఈ దిశగా మేం ఎంతో పురోగమించాం. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళాలన్నది మా లక్ష్యం. ఇదే సమయంలో పన్ను ఎగవేతలను, అందుకు దొంగదారులను వెదకే ధోరణులపై మేం గట్టి చర్యలు తీసుకుంటూనే ఉంటాం.

26. రక్షణ రంగాన్ని కూడా మేం మరింతగా తెరుస్తాం. లైసెన్సింగ్ విధానాల వల్ల కొన్ని సందర్బాల్లో భారత రక్షణ రంగంలో పెట్టుబడుల జాప్యం జరుగుతోందని నాకు తెలుసు. రక్షణ రంగానికి మరింత తేలికపాటి, సమర్థమైన ప్రాజెక్ట్ లైసెన్సింగ్ విధానం అమలుపరిచేందుకు గల అవకాశాలను అన్వేషిస్తున్నాం. వెస్టింగ్ హౌస్ నుండి మేం ఆరు అణు రియాక్టర్లు కొనుగోలు చేస్తున్నాం. అణు, శాస్త్రసహకారంలో ఇది ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది. మరింతగా సరళీకరించిన రైల్వేల రంగంలో భారీ పెట్టుబడి పెట్టిన తొలి కంపెనీ జి ఇ కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దేశంలో పేద రాష్ట్రాలలో ఒకటైన బిహార్ లో ఆ సంస్థ లోకోమోటివ్ తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది. ఇలాగే మరిన్ని పెట్టుబడులు కూడా తరలి వస్తాయని నేను ఆశిస్తున్నాను.

27. భారతదేశానికి గంగానది అత్యంత ప్రత్యేకం. గంగానదీ జలాల ప్రక్షాళన కోసం చేపట్టిన “నమామి గంగే” ప్రాజెక్టు పెద్ద ఎత్తున ప్రారంభం కావడానికి సిద్దంగా ఉంది. రానున్న సంవత్సరాల్లో మా ప్రథమ ప్రాథమ్యాల్లో ఇదొకటి. ఎన్వైరాన్ మెంటల్ ఇంజినీరింగ్, జలాలు, మురుగుజలాల శుద్ధి వంటి రంగాల్లో నైపుణ్యాలు ఉన్న అమెరికన్ కంపెనీలకు ఇది చక్కని అవకాశం. గంగానదికి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలన్నది మా లక్ష్యం. అందుకే నా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యాన్నిస్తోంది.

28. సోదర సోదరీమణులారా, పరివర్తన చెందుతున్న భారతదేశం దిశగా మా ప్రయాణం మొదలయింది. ప్రపంచ జనాభాలో ఆరో వంతు జనాభా ఉన్న పరివర్తిత భారతదేశం ప్రపంచ పరివర్తనకు మూలంగా నిలుస్తుంది. ఈ ప్రయాణం సుదీర్ఘమైనది. కానీ ఇప్పటివరకు మేం సాధించిన పురోగతి మేం ఆ గమ్యాన్ని చేరుకోగలం అన్న నమ్మకాన్ని నాలో కలిగించింది. ఆ ప్రయాణంలో మాతో కలసి నడవండంటూ మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. మీ కంపెనీలకు చక్కని బాలెన్స్ షీట్లు అందంచడమే కాదు…మరింత మెరుగైన భారతదేశం, మరింత మెరుగైన అమెరికా, మరింత మెరుగైన ప్రపంచం ఆవిర్భావానికి ఇది సహాయకారిగా నిలుస్తుంది.

మీకు ఇవే నా ధన్యవాదాలు..