Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం


గౌరవ ప్రధానమంత్రి క్రిస్టర్‌సన్ గారు,
గౌరవ ఉర్సులా వాన్ డెర్ లీయెన్ గారు,
గౌరవ రాజవంశీయులకు,
వోల్వో గ్రూప్ అధ్యక్షులు, సీఈవో గారు, 

‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’  అధ్యక్షులు గారు
ఇక్కడ ఈ సమావేశానికి హాజరైన ప్రముఖ వ్యాపారవేత్తలు, సోదరీ సోదరులందరికీ,
నమస్కారం!
ముందుగా, ఈ రౌండ్ టేబుల్‌ సమావేశానికి నన్ను ఆహ్వానించిన ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్‌సన్‌ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమావేశం గోథెన్‌బర్గ్‌లో జరగడం నాకు సంతోషంగా ఉంది. ఈ నగరం ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందినది. ఈ నగరం యూరప్ తయారీ రంగ స్ఫూర్తికి చిహ్నంగానూ నిలుస్తుంది.

మిత్రులారా,

‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ వంటి విశిష్ట వేదికనుద్దేశించి ప్రసంగించడం నాకు లభించిన గౌరవం.

మీలో కొందరిని నేను ఇంతకుముందే కలిశాను. మరికొందరిని ఈ రోజే మొదటిసారి కలుస్తున్నాను. కానీ ఒక విషయం మాత్రం నిశ్చయం… మీరంతా ఏదో ఒక విధంగా భారత్‌తో అనుసంధానమై ఉన్నారు.

 

కొందరికి చెందిన తయారీ కార్యకలాపాలు భారత్‌లో కేంద్రీకృతమై ఉన్నాయి. మరికొందరికి, పరిశోధనాభివృద్ధి కార్యకలాపాలు భారత్‌లో కొనసాగుతున్నాయి. కొందరు తమ మానవ వనరుల కేంద్రాన్ని భారత్‌లో కలిగి ఉంటే… మరికొందరి సరుకు రవాణా వ్యవస్థలు భారత్‌తో అనుసంధానమై ఉన్నాయి. మీలో చాలామంది భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈనాటి సమావేశం ఒక చక్కటి అవకాశం.

మిత్రులారా,

భారత్-ఐరోపా మధ్య సంబంధాలు ఈ రోజు సరికొత్త మలుపు వద్ద నిలిచి ఉన్నాయి. ప్రభుత్వ స్థాయిలో, మేం ప్రతిష్ఠాత్మకమైన, వ్యూహాత్మకమైన ఎజెండాను రూపొందించుకున్నాం.

భారత్–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరింది. ఉర్సులా వాన్ డెర్ లేయెన్ గారు చెప్పినట్లుగా… ఇది నిజంగానే “అన్ని ఒప్పందాలకు మాతృక” వంటిది. వీలైనంత త్వరగా ఇది అమలయ్యేలా చూడటమే మా సంకల్పం.

భద్రత, రక్షణ భాగస్వామ్యం… రవాణా ఒప్పందం మన సహకారానికి నూతన దిశను నిర్దేశించాయి. భారత్-ఈయూ వాణిజ్య, సాంకేతిక మండలి మన భాగస్వామ్యానికి నూతన సంస్థాగత బలాన్ని సమకూర్చింది. డిజిటల్ సాంకేతికతలు, సరుకు రవాణా వ్యవస్థలు, ఆవిష్కరణల వంటి రంగాల్లో భారత్-ఐరోపాలు కలిసి పనిచేస్తున్నాయి.

భారత్-మధ్యప్రాచ్యం-ఐరోపా ఆర్థిక కారిడార్ వంటి చరిత్రాత్మక కార్యక్రమాలు అనుసంధానాన్ని, ఆర్థిక సమైక్యతను వేగవంతం చేస్తున్నాయి. హరిత పరివర్తన, సుస్థిర వృద్ధి విషయంలో మన ఆలోచనలు, ప్రాధాన్యాలు ఒకేవిధంగా ఉన్నాయి.

మనం విస్తృత దృక్పథంతో చూసినప్పుడు… మన మధ్య బలమైన రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక బంధం ఉంది. సమతుల్యమైన, సురక్షితమైన, సుస్థిరమైన ప్రపంచం కోసం భారత్-ఐరోపాలు వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి.

మిత్రులారా,

ప్రభుత్వాలు విధాన ప్రణాళికను, సంస్థాగత మద్దతును, విధానపరమైన దిశానిర్దేశాన్ని మాత్రమే అందించగలవు. క్షేత్రస్థాయిలో నిజమైన పరివర్తన మీ అందరి కృషి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే, భారత్‌తో కలిసి పనిచేయాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఈ రోజు నూతన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. భారత్ 140 కోట్ల జనాభా ఆశల సమాహారమైన దేశం. మా యువ జనాభా, విస్తరిస్తున్న మధ్యతరగతి వర్గం, మౌలిక సదుపాయాల రంగంలో జరుగుతున్న వేగవంతమైన విస్తరణ… ఇవన్నీ భారత వృద్ధికి కొత్త ఊపునిస్తున్నాయి.

గత పన్నెండు సంవత్సరాలుగా “సంస్కరణ, పనితీరు, పరివర్తన” అనే మంత్రంతో భారత్ ముందుకు సాగుతోంది. ప్రభుత్వ రాజకీయ సంకల్పం అండగా, ఈ సంస్కరణల రథం పూర్తి వేగంతో ముందుకు దూసుకుపోతోంది.

వస్తు-సేవల పన్ను భారత్‌ను “ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్” దార్శనికత దిశగా ముందుకు నడిపించింది. దివాలా, బ్యాంక్రప్టసీ నిబంధనలు వ్యాపార సంస్కృతికి మరింత జవాబుదారీతనాన్ని జోడించాయి. కార్పొరేట్ పన్ను సంస్కరణలు తయారీ రంగాన్ని మరింత సమర్థంగా మార్చగా… కార్మిక చట్టాలు వాటి అమలును సరళీకరించి, మరింత పారదర్శకంగా చేశాయి.

ఎఫ్‌డీఐ సంస్కరణలతో అనేక రంగాల్లో ప్రపంచ పెట్టుబడులకు మార్గం సుగమమైంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్‌ఐ) పథకాలు ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, వాహనాల విడిభాగాలు, సోలార్ మాడ్యూల్స్, టెలికమ్యూనికేషన్స్, వస్త్ర పరిశ్రమ వంటి రంగాల్లో తయారీ రంగానికి బలమైన ఊపునిచ్చాయి.

మేం అనుమతుల కోసం నిబంధనల భారాన్ని తగ్గించడం సహా… కాలం చెల్లిన వేలాది నిబంధనలను రద్దు చేశాం. వ్యాపార సౌలభ్యాన్ని పరిపాలనలో అంతర్భాగం చేశాం. డిజిటల్ ఇండియా చొరవ ప్రజా సేవలను మరింత పారదర్శకంగా, సమర్థంగా, మరింత అందుబాటులో ఉండేలా చేసింది.

భారత్ ఈ రోజు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థను కలిగి ఉంది. మా దేశ అంకుర సంస్థలు ఏఐ, ఫిన్‌టెక్, అంతరిక్షం, డ్రోన్‌లు, బయోటెక్, వాతావరణ సాంకేతికత, రవాణా వంటి రంగాల్లో ప్రపంచ స్థాయి పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నాయి.

భారత్ ఈ రోజు అత్యుత్తమ ప్రతిభను, అత్యున్నత స్థాయిని, డిమాండ్‌నూ, స్థిరత్వాన్నీ కలిగి ఉంది. అన్నింటికీ మించి 140 కోట్ల మంది ప్రజల సంకల్పం, ఆకాంక్షలూ భారత్ వద్ద ఉన్నాయి. మేం సంకల్పం నుంచి పెట్టుబడుల దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది.

ఈ విషయంగా ఐదు సూచనలను నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను.

మొదటిది: టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాలు. వొడాఫోన్, ఎరిక్సన్, నోకియా, ఆరెంజ్ వంటి సంస్థలకు భారత్‌లో విస్తృతమైన అనుభవం ఉంది. 5జీ నుంచి 6జీకి పరివర్తన, ఏఐ-ఆధారిత నెట్‌వర్క్‌లు, సురక్షిత కనెక్టివిటీ, డిజిటల్ సమ్మిళితత్వం వంటి అంశాల్లో భారత్ కీలక భాగస్వామిగా అవతరించగలదు. భారత్‌ను ప్రపంచ స్థాయి పరిశోధనాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మీ అందరి భాగస్వామ్యం కీలకం.

రెండోది: ఏఐ, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, డీప్-టెక్ తయారీ రంగం. ఏఎస్ఎమ్ఎల్, ఎన్ఎక్స్‌పీ సెమీకండక్టర్లు, ఎస్ఏపీ, క్యాప్ జెమిని వంటి అగ్రగామి సంస్థల అధినేతలంతా ఈ రోజు ఇక్కడ ఉన్నారు. వేగంగా పరిణామం చెందుతున్న భారత ‘ఎండ్-టు-ఎండ్’ సాంకేతిక వ్యవస్థలో భాగస్వాములుగా మారాలని మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను.

భారత దార్శనికత సుస్పష్టం: మనమంతా కలిసికట్టుగా సాంకేతిక ఆవిష్కరణల తదుపరి తరాన్ని భారత్ కేంద్రంగా ముందుకు నడిపిద్దాం.

మూడోది: హరిత పరివర్తన, పరిశుద్ధ ఇంధనం. అనిశ్చితులతో కూడిన నేటి ప్రపంచ వాతావరణంలోనూ భారత్… ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పరిశుద్ధ ఇంధన సామర్థ్యాన్ని విస్తరించడంపై దృష్టి సారిస్తోంది. ఈఎన్‌జీఐఈ, టోటల్ఎనర్జీస్, షెల్, యుమికోర్ వంటి కంపెనీలు పరిశుద్ధ ఇంధనం, హైడ్రోజన్, ఇంధన నిల్వ, ఎలక్ట్రిక్ వాహనాలు, డీకార్బనైజేషన్‌లో ప్రపంచ అగ్రగాములుగా ఉన్నాయి. మీరు భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టవచ్చు.

నాల్గోది: మౌలిక సదుపాయాలు, రవాణా, పట్టణ పరివర్తన. వోల్వో గ్రూప్, మాస్క్, ఎయిర్‌బస్, సాబ్ ఏబీ, ఆర్సెలార్ మిట్టల్, హైడెల్‌బర్గ్ వంటి సంస్థలన్నింటి నైపుణ్యం భారత పరివర్తనతో ప్రత్యక్షంగా అనుసంధానమై ఉంది. సుస్థిర సిమెంట్, హరిత ఉక్కు, రవాణా, లాజిస్టిక్స్, ఏరోస్పేస్, రక్షణ వంటి రంగాల్లో భారత్-ఐరోపా భాగస్వామ్యం ప్రపంచ స్థాయి ఫలితాలను అందించగలదు.

ఐదోది: ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్. ఆస్ట్రాజెనెకా, రోష్, మెర్క్, ఫిలిప్స్, నెస్లే, యునిలివర్ వంటి కంపెనీలు భారత్‌తో చాలా కాలంగా కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు, మనం ఈ భాగస్వామ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలి.

టీకాలు, క్యాన్సర్ సంరక్షణ, డిజిటల్ ఆరోగ్యం, పోషణ, వైద్య పరికరాల రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. మీరు “భారత్ కోసం రూపకల్పన, భారత్‌లో తయారీ, భారత్ నుంచి ఎగుమతి” అనే నమూనాతో ముందుకు సాగవచ్చు.

సమయ పరిమితుల కారణంగా, ఇక్కడ ఉన్న ప్రతి కంపెనీ పేరును నేను ప్రస్తావించలేకపోయాను. భారత్‌లో అందరి కోసం అపారమైన అవకాశాలు ఉన్నాయి. మీ అందరికీ నా ఆహ్వానం.

మిత్రులారా,

ఈ సూచనలను మీ ముందు ఉంచిన తర్వాత… నేను ఒక సవాలునూ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి కంపెనీ… భారత్‌తో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడం కోసం హామీ ఇవ్వగలదా? రాబోయే ఐదేళ్లలో భారత్‌లో ప్రారంభించబోయే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను గుర్తించగలదా?

ఈ ప్రాజెక్టులన్నీ సకాలంలో అమలు జరిగేలా చూసేందుకు భారత ప్రభుత్వం పూర్తి మద్దతును అందిస్తుంది. ఈ కార్యక్రమాలను క్రమం తప్పకుండా సమీక్షించి, పర్యవేక్షించడానికి మనం ఒక సంస్థాగత యంత్రాంగాన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు.
 

మిత్రులారా,

మనం సంవత్సరానికోసారి భారత్-ఐరోపాల సీఈఓల స్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశాన్నీ నిర్వహించవచ్చు. భారత్-ఐరోపాలు రెండింటికీ చెందిన పారిశ్రామిక సంస్థలను ఈ వేదికతో అనుసంధానించవచ్చు. ఆయా రంగాల వారీగా కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయవచ్చు.

యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ… భారత డెస్క్‌ను లేదా భారత కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలనీ నేను సూచిస్తాను. దాని విధులు సులభతరంగా ఉండవచ్చు… భారత్‌లో ఇప్పటికే పనిచేస్తున్న కంపెనీల విస్తరణకు మద్దతునివ్వడం. దేశంలో పెట్టుబడి పెట్టాలనుకునే కొత్త కంపెనీల ప్రవేశాన్ని సులభతరం చేయడం. వ్యాపారపరమైన ఆందోళనలను సమర్థంగా పరిష్కరించడం.

మిత్రులారా,

భారత్-ఐరోపా మధ్య భాగస్వామ్యం కేవలం ఆర్థిక గణాంకాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఉమ్మడి విలువలపై ఆధారపడిన భాగస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం, వైవిధ్యంతో కూడిన భాగస్వామ్యం. ఇది విశ్వాసం, పారదర్శకతతో కూడిన భాగస్వామ్యం. ఇది ఆవిష్కరణలు, సమ్మిళితత్వంతో కూడిన భాగస్వామ్యం.

ప్రపంచం అనిశ్చితిని ఎదుర్కొంటున్న సమయంలో… సరుకు రవాణా వ్యవస్థలు ఒత్తిడికి లోనవుతున్న సందర్భంలో… సాంకేతిక పోటీ తీవ్రమవుతున్న పరిస్థితిలో… ఇంధన భద్రత, వాతావరణ చర్యలు రెండూ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు… భారత్-ఐరోపాలు కలిసి స్థిరత్వం, సుస్థిరత, ఉమ్మడి శ్రేయస్సుకు బలమైన మూలస్తంభాలుగా నిలవగలవు.

ఈ స్ఫూర్తితో, భారత అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములవ్వాలని మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. గోథెన్‌బర్గ్‌లో ఈ రోజు ప్రారంభమవుతున్న ఈ చర్చలు… రాబోయే సంవత్సరాల్లో భారత్-ఐరోపా పారిశ్రామిక భాగస్వామ్యంలో నూతన అధ్యాయాన్ని లిఖిస్తాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను.

ఇంత పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొని, నా ఆలోచనలను మీతో పంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీలో ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు.

గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.

***