పిఎంఇండియా
రవాండాలోని కిగాలీలో జరిగిన ది మీటింగ్ ఆఫ్ పార్టీస్ టు ది మాంట్రియల్ ప్రొటోకాల్ ఆఫ్ ది వియన్నా కన్వెన్షన్‌లో భారత ప్రభుత్వం అనుసరించిన వైఖరికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
కిగాలీలో జరిగిన చర్చలలో హైడ్రో ఫ్లోరో కార్బన్లు (హెచ్ఎఫ్‌సి లు) మాంట్రియల్ ప్రొటోకాల్ లో భాగంగా ప్రమాదకర రసాయనాల జాబితాలో చేర్చాల్సిన అంశంపైనే ప్రధానంగా చర్చించారు. వీటి ఉత్పత్తి, వినియోగాన్ని దశలవారీగా తగ్గించేందుకు మాంట్రియల్ ప్రొటోకాల్‌లో భాగంగా సమకూర్చిన బహుళపాక్షిక నిధి నుండి ఆర్థిక సహాయం తీసుకోవాలని నిర్ణయించారు. హెచ్ఎఫ్‌సి ల వల్ల ఓజోన్ పొర క్షీణత జరగకపోయినా, భూతాపం పెరుగుతోంది. అందుకే వీటిని అదుపు చేయడం ద్వారా భూతాపాన్ని పరిమితం చేయవచ్చు. తద్వారా పర్యావరణ సమస్యల పరిష్కారానికి సాయంగా ఉంటుంది.
ఇందుకోసం 2024 నుండి 2030 మధ్య సరైన ఆధార సంవత్సరాలను ఎంపిక చేసుకొనేందుకు (మూడు ఐచ్ఛికాలలో ఒకదానిని ఎంపిక చేసుకోవడం) వాదించేందుకు అవకాశం ఇవ్వాలన్న కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత అంశాలు, లక్షణాల ఆధారంగా.. ప్రభుత్వంతో చర్చించి ఐచ్ఛికాలలో ఒకదానిని ఎంచుకొనే అధికారాన్ని ఇచ్చేందుకు కూడా మంత్రిమండలి సమ్మతి తెలిపింది. కిగాలీలో జరిగిన చర్చల సందర్భంగా ఆధార, స్తంభన (ఫ్రీజ్) సంవత్సరాలపై భారత్ విజయవంతంగా చర్చించింది. వీటి ద్వారా దేశీయంగా శీతలీకరణ యంత్రాల ద్వారా పని చేస్తున్న వివిధ రంగాలు ప్రత్యామ్నాయాలు చూసుకొనేందుకు తగినంత సమయం ఇవ్వాలని భారత్ సూచించింది. తద్వారా తక్కువ అదనపు ఖర్చుతో ఎక్కువ పర్యావరణ సంబంధ ప్రయోజనాలు పొందేందుకు అవరోధాలు తొలగుతాయని స్పష్టం చేసింది.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు రెండు సెట్ల ఆధార సంవత్సరాలు ఉండాలని కిగాలీ సమావేశాల్లో అంగీకరించారు. భారత్ కు 2024, 2025, 2026 ఆధార సంవత్సరాలుగా ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల భారత ఆధార వినియోగం, ఉత్పత్తికి 65 శాతం అదనపు హెచ్ఎఫ్‌సి ఆమోదం లభిస్తుంది. అయితే 2024/2025లో భారత్ సాంకేతిక సమీక్ష నిర్వహిస్తే.. భారత్ స్తంభన సంవత్సరం (ఫ్రీజ్ ఇయర్) 2028గా ఉంటుంది. ఒకవేళ శీతలీకరణ యంత్రాలను వాడే రంగాల పురోగతి ముందుగా నిర్ణయించుకున్న దానికన్నా ఎక్కువగా ఉంటే.. భారత్ తన ఫ్రీజ్ ఇయర్ ను 2030 వరకు పెంచుకోవచ్చు. కాగా, 2029 వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలు హెచ్ఎఫ్ సీల వినియోగం, ఉత్పత్తిని 70 శాతం వరకు తగ్గించుకోనున్నాయి. కిగాలీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం భారత్ 2032 నుంచి నాలుగు దశల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయనుంది. 2032లో 10శాతం, 2037లో 20 శాతం, 2042లో 30 శాతం, 2047లో 85 శాతం వరకు విడతల వారీగా హెచ్ఎఫ్ సిలను తగ్గించుకోనుంది.
మాంట్రియల్ ప్రొటోకాల్ కు జరిగిన కిగాలీ సవరణలలో తొలిసారిగా, కొత్త శీతలీకరణ, సాంకేతికత వచ్చినపుడు విద్యుత్ సామర్థ్య వృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఇందుకోసం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిశోధనాత్మక ప్రయోగాలు (ఆర్ & డి), సర్వీసింగ్ సెక్టారుకు నిధులను కూడా ఆర్థిక పరిష్కారాలపై జరిగిన ఒప్పందాల్లో చేర్చారు.