Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్వ జ్ఞాన్ సంగమ్ లో ట్యాక్స్ అడ్మినిస్ట్రేటర్లను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం

రాజస్వ జ్ఞాన్ సంగమ్ లో ట్యాక్స్ అడ్మినిస్ట్రేటర్లను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం

రాజస్వ జ్ఞాన్ సంగమ్ లో ట్యాక్స్ అడ్మినిస్ట్రేటర్లను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజస్వ జ్ఞాన్ సంగమ్ కార్యక్రమంలో పాల్గొని, ట్యాక్స్ అడ్మినిస్ట్రేటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ మండలి (సి బి డి టి), ఎక్సైజ్ మరియు కస్టమ్స్ కేంద్రీయ మండలి (సి బి ఇ సి).. ఈ రెండు రెవెన్యూ మండలులు ఏక కాలంలో సమావేశం కావడం ఇదే మొట్టమొదటి సారి.

కార్యక్రమం మొదట్లో ప్రధాన మంత్రి అధికారులను వారి సూచనలను, సలహాలను ఇవ్వవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అధికారులలో కొంతమంది డిజిటైజేషన్, పన్నులకు సంబంధించిన నియమ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించడం, పన్ను చెల్లింపుదారులకు సదుపాయాలు, పన్నుల పరిధిని పెంచడం, ట్యాక్స్ అడ్మినిస్ట్రేటర్లకు ప్రాథమిక సదుపాయాలను, డిజిటల్ సదుపాయాలను మరింత మెరుగుపరచవలసిన అవసరం ఉందనేటటువంటి వేరు వేరు అంశాలపైన వారి అభిప్రాయాలను వ్యక్తంచేశారు.

రాజస్వ జ్ఞాన్ సంగమ్ లో అధికారులు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగాను, నిర్మొగమాటంగాను వ్యక్తం చేయవచ్చంటూ ప్రధాన మంత్రి వారిని ఉత్సాహపరిచారు. దేశ పౌరులలో చట్ట నిబంధనల పట్ల గౌరవ, ఆదరణలు ఉండాలని, అలాగే పన్నులు ఎగవేసే వారికి చట్టం వారిని శిక్షించగలదన్న భయం కూడా ఉండాలని ప్రధాన మంత్రి చెప్పారు. ట్యాక్స్ అడ్మినిస్ట్రేటర్లు అంటే ప్రజలు భయపడవలసిన పని లేదని ఆయన స్పష్టం చేశారు.

భారతదేశం ఇవాళ చరిత్రలో ఒక విశిష్టమైన దశలో ఉందని, ఈ దేశ ప్రజలలో నెలకొన్న మహత్వాకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చాల్సివుందని ఆయన అన్నారు. అలా చేసినప్పుడే, ఆ ఆకాంక్షలు దేశ అభివృద్ధికి తోడ్పడతాయన్నారు.

ట్యాక్స్ అడ్మినిస్ట్రేటర్లు వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని జనింపచేయాలని ఆయన సూచించారు. గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవాలంటూ “గివ్ ఇట్ అప్” కార్యక్రమాన్నితీసుకువచ్చిన సంగతిని ప్రస్తావిస్తూ, ట్యాక్స్ అడ్మినిస్ట్రేటర్లు ఒక మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తే పన్నుల పరిధిని కూడా గణనీయంగా పెంచడం సాధ్యపడుతుందన్నారు.

రాపిడ్ (RAPID) పేరుతో 5 అంశాల ప్రణాళికను గురించి ప్రధాన మంత్రి ట్యాక్స్ అడ్మినిస్ట్రేటర్లకు వివరించారు. ఇందులో ఆర్ అనే అక్షరం రెవిన్యూ కు, ఎ అనే అక్షరం జవాబుదారుతనానికి సూచికలు, ఇక పి ప్రాధాన్యాన్ని, ఐ సమాచారాన్ని, డి డిజిటైజేషన్ ను సూచిస్తాయి. జ్ఞాన్ సంగమ్ ను కర్మ సంగమ్ గా మార్చి వేయాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల ఈ సమావేశంలో వెలికి వచ్చిన ఆలోచనలు క్షేత్ర స్థాయిలో నిర్ధిష్ట కార్యాచరణకు బాట వేయగలుగుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ, ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ సిన్హా, ప్రధాన మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటెరీ శ్రీ నృపేంద్ర మిశ్రా, రెవిన్యూ కార్యదర్శి శ్రీ హస్ ముఖ్ అదియా లతో పాటు సి బి డి టి, సి బి ఇ సి ల ఛైర్మన్ లు కూడా పాల్గొన్నారు.