Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌తో పాటు ఇతర మహనీయులకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి


రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌తో పాటు రాజ్యాంగ పరిషత్తు సభ్యులందరికీ ప్రధానమంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. వారు మనకు  బహుమతిగా ఇచ్చిన రాజ్యాంగం భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక అమూల్య వారసత్వమని, ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) సంకల్పాన్ని నెరవేర్చుకొనేందుకు దేశ ప్రజలకు మార్గదర్శనాన్ని అందిస్తూ ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు.
రాజ్యాంగంలో పొందుపరుచుకున్న సిద్ధాంతాలను మరింత శక్తిమంతంగా మలచుకోవాలన్న నిబద్ధతను శ్రీ మోదీ మరో మారు స్పష్టం చేస్తూ, సంస్కృత భాషలో గల ఓ సుభాషితాన్ని ప్రస్తావించారు. పండితులు అనేక మందితో కలిసి ప్రతి విషయాన్ని ఆమూలాగ్రంగా చర్చించి వివేచనతో నిర్ధారించి మరీ రూపొందించిన విధానాలు, సిద్ధాంతాలు ఎట్టి పరిస్థితులలో రూపుమాసిపోవని, అవి కల కాలం నిలచి ఉంటాయని ఈ కింద  సుభాషితం సూచిస్తున్నది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘దేశవాసులందరికి రాజ్యాంగ దినోత్సవ హార్దిక శుభాకాంక్షలు.
ఈ పవిత్ర సందర్భంగా పూజ్య బాబాసాహెబ్‌తో పాటు రాజ్యాంగ పరిషత్తు సభ్యులైన మహనీయులందరికీ వందనాలను ఆచరిస్తున్నాను.
వారు మనకు బహుమతిగా అందించిన రాజ్యాంగం భారతీయ ప్రజాస్వామ్యానికి అందిన అమూల్య వారసత్వం. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసుకోవడంలో మనకు  రాజ్యాంగం మార్గదర్శిగా ఉంటుంది.
రాజ్యాంగ దినోత్సవం అంటే అది మన రాజ్యాంగ శిల్పులకు శ్రద్ధాంజలి ఘటించే రోజు. అంతే కాదు, రాజ్యాంగంలో పొందుపరుచుకున్న విలువలను పటిష్టపరుచుకొనే దిశగా మన నిబద్ధతను పునరుద్ఘాటించే రోజు కూడా.
బహుధా బహుభిః సార్థం చిన్తితాః సునిరూపితాః
కథన్చిన్న విలీయన్తే విద్వద్భిశ్చిన్తితా నయాః’’ అని పేర్కొన్నారు.