Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రియాద్‌లో ఎల్ & టి కార్మికుల నివాస స‌ముదాయాన్ని సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి

రియాద్‌లో ఎల్ & టి కార్మికుల నివాస స‌ముదాయాన్ని సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ఈ రోజు రియాద్‌ లోని ఎల్ & టి కార్మికుల నివాస స‌ముదాయాన్ని సంద‌ర్శించారు. రియాద్ మెట్రో నిర్మాణం చేప‌ట్టిన క‌న్సార్టియమ్ లో ఎల్ & టి భాగ‌స్వామిగా ఉంది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, రియాద్ మెట్రో ప్రాజెక్టులో ఎల్ & టి కార్మికుల కృషిని ప్ర‌శంసించారు. “మీ క‌ఠోర శ్ర‌మ ఈ వేళ న‌న్ను ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చింది” అని ఆయన అన్నారు.

విదేశాలలో భార‌తీయ కార్మికులు చేస్తున్న ప‌నులు సంప‌ద‌ను ఆర్జించ‌డ‌మే కాకుండా, దేశ ప్ర‌తిష్ఠ‌ను కూడా ఇనుమ‌డింప‌చేస్తున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌పంచ‌ం లోని వేరు వేరు ప్రాంతాలలో అనేక ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ప్రాజెక్టులను విజ‌య‌వంతంగా పూర్తి చేసినందుకు భార‌తీయ కార్మికుల‌ను ఎంతో ఆద‌రాభిమానాల‌తో గుర్తు చేసుకుంటూ ఉంటార‌ని ఆయ‌న అన్నారు. భవిష్యత్తులో రియాద్ మెట్రో కూడా భారతీయ కార్మికులు అందించిన సేవలను గురించి ఇదే విధమైన జ్ఞాప‌కాలను రేకెత్తిస్తుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

విదేశాలలోని భార‌తీయ కార్మికుల బంధువుల వద్ద నుంచి తాను అందుకొనే ఉత్త‌రాల ద్వారా అక్కడి భారతీయ కార్మికులను గురించి తాను త‌ర‌చుగా తెలుసుకొంటూ ఉంటానని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఈ లేఖ‌ల ద్వారా వారి సంతోషాలతో పాటు దుఃఖాన్నికూడా తాను పంచుకుంటూ ఉంటాన‌ని ఆయ‌న చెప్పారు. ఆ సంద‌ర్భాలలో “నన్ను మీ కుటుంబంలో ఒక స‌భ్యుడిగా భావిస్తుంటాను” అని ఆయన అన్నారు.

విదేశాలలో ప‌ని చేయాల‌ని కోరుకొనే వారికి స‌హాయ‌కారిగా కేంద్ర‌ ప్ర‌భుత్వం చేప‌ట్టిన “e-migrate” కార్య‌క్ర‌మాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. మ‌రిన్ని “వ‌ర్క‌ర్ రిసోర్స్ సెంట‌ర్ల”ను ప్రారంభించ‌నున్నట్లు ఆయన తెలిపారు. MADAD పోర్ట‌ల్ కేంద్ర‌ ప్ర‌భుత్వాన్ని త‌క్ష‌ణ‌మే సంప్రదించేందుకు ఒక మార్గమన్నారు. ప్ర‌పంచానికి అవ‌స‌ర‌మైన మాన‌వ వ‌న‌రులను అందించ‌గ‌ల సామ‌ర్థ్యం భార‌తదేశానికి ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

అక్క‌డ గుమికూడిన వేయి మందికి పైగా కార్మికులు ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతుండగా పలు సందర్భాలలో ఉత్సాహంగా హ‌ర్ష‌ధ్వానాలు చేశారు. త‌రువాత ప్ర‌ధాన మంత్రి కార్మికులతో భేటీ అయ్యి, అల్పాహారాన్ని స్వీక‌రించారు.