పిఎంఇండియా
రాజస్థాన్ లోని జైపూర్ లో రైజింగ్ రాజస్థాన్ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు-2024, రాజస్థాన్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. జైపూర్ ప్రదర్శన, సమావేశ కేంద్రం (జేఈసీసీ)లో ఈ కార్యక్రమం జరుగుతోంది. సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ.. రాజస్థాన్ విజయ ప్రస్థానంలో ఈ రోజు మరో ప్రత్యేకమైన రోజని అన్నారు. పింక్ సిటీ – జైపూర్ లో జరుగుతున్న రైజింగ్ రాజస్థాన్ అంతర్జాతీయ సదస్సు-2024కు హాజరైన పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులు, పెట్టుబడిదారులు, ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూడా ఆయన అభినందించారు.
భారత్ లోని వాణిజ్య పరిస్థితులు ఆ రంగంలోని నిపుణులు, పెట్టుబడిదారుల్లో ఉత్సాహం కలిగిస్తున్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘ఆచరణ, పరివర్తన, సంస్కరణ’ అనే మంత్రంతో భారత్ ప్రతీ రంగంలోనూ పురోగతి సాధించిందని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత భారత్ ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలిగిందనీ, కానీ ఒక్క గత దశాబ్ద కాలంలోనే భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందనీ అన్నారు. “గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ, ఎగుమతులు దాదాపు రెట్టింపు అయ్యాయి” అని శ్రీ మోదీ చెప్పారు. 2014కు ముందు దశాబ్దంతో పోలిస్తే గత దశాబ్దంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా రెండు రెట్లు పెరిగాయని ఆయన చెప్పారు. భారత్ లో మౌలిక సదుపాయాల వ్యయం దాదాపు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.11 లక్షల కోట్లకు పెరిగిందని కూడా ఆయన పేర్కొన్నారు.
“ప్రజాస్వామ్యం, ప్రజలు, సాంకేతిక సమాచారం– సేవల వాస్తవిక శక్తికి భారత్ సాధించిన విజయం నిదర్శనం’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత్ వంటి వైవిధ్యభరితమైన దేశంలో ప్రజాస్వామ్య విజయం, సాధికారత గొప్ప విజయమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య దేశంగా ఉంటూ మానవాళి సంక్షేమాన్ని కాంక్షించడం భారత తాత్వికతకు మూలమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇది భారత్ మౌలిక స్వభావమన్నారు. దేశ ప్రజలు తమ ప్రజాస్వామిక హక్కులను వినియోగించుకుని, భారత్ లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని కొనియాడారు. భారతదేశపు ఈ ప్రాచీన సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తున్న యువశక్తిని శ్రీ మోదీ కొనియాడారు. మున్ముందు చాలా ఏళ్ల పాటు ప్రపంచంలోని అత్యంత యువ దేశాల్లో భారత్ ఒకటిగా ఉండబోతోందనీ.. ఎక్కువ మంది యువత ఉన్న, అందునా నిపుణులైన యువత ఉన్న దేశంగా నిలవబోతోందనీ ఆయన తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం పలు సానుకూల చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
సాంకేతికత, సమాచార శక్తుల రూపంలో గత దశాబ్ద కాలంలో భారత యువత కొత్త కోణంలో దేశానికి జవసత్వాలను అందించిందని శ్రీ మోదీ అన్నారు. నేటి ప్రపంచంలో ప్రతీ రంగంలో సాంకేతికత, సమాచారం (డేటా) ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఈ శతాబ్దాన్ని నడిపిస్తున్నది సాంకేతికత, సమాచారం (డేటా)’’ అని శ్రీ మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్యం, ప్రజలు, సమాచార వ్యవస్థల వాస్తవిక శక్తిని భారత్ ప్రపంచానికి చాటుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామ్యీకరించడం ప్రతి రంగానికీ, సమాజానికీ ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో భారత్ నిరూపించింది” అని శ్రీ మోదీ అన్నారు. యూపీఐ, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వ్యవస్థ, ప్రభుత్వ ఇ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం), డిజిటల్ వాణిజ్యం కోసం సార్వత్రిక వ్యవస్థ (ఓఎన్ డీవీసీ) వంటి వివిధ డిజిటల్ కార్యక్రమాలను ఉదాహరిస్తూ.. ఇలాంటి అనేక వేదికలు డిజిటల్ వ్యవస్థ శక్తికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. వాటి ప్రభావం రాజస్థాన్ లోనూ స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమనీ.. రాజస్థాన్ అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరితే దేశాభివృద్ధి కూడా అదే స్థాయిలో పురోగమిస్తుందని శ్రీ మోదీ దృఢ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.
వైశాల్యం పరంగా రాజస్థాన్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమని పేర్కొన్న శ్రీ మోదీ.. రాజస్థాన్ ప్రజలు విశాల హృదయులని కొనియాడారు. వారు కష్టపడి పనిచేసే స్వభావం గలవారనీ, నిజాయితీపరులనీ, కఠినమైన లక్ష్యాలను సాధించాలనే సంకల్పం గలవారనీ, దేశమే ప్రథమమని విశ్వసించడంలో వారు ముందుంటారనీ, దేశం కోసం ఏదైనా చేయగల ప్రేరణ గలవారనీ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యానంతర ప్రభుత్వాలు దేశాభివృద్ధికి గానీ, దేశ వారసత్వాన్ని నిలపడానికి గానీ ప్రాధాన్యం ఇవ్వలేదనీ.. ఆ భారాన్ని రాజస్థాన్ అనుభవించిందనీ ఆయన అన్నారు. రాజస్థాన్ కు ఎంతో మేలు చేసేలా.. అభివృద్ధి – వారసత్వాలను మంత్రప్రదంగా భావించి తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి స్పష్టంచేశారు.
రాజస్థాన్ ఎదుగుతున్న రాష్ట్రం మాత్రమే కాదనీ, ఇది విశ్వసనీయమైనదనీ స్పష్టం చేసిన ప్రధానమంత్రి.. ఆ రాష్ట్రం గ్రహణశీలమైనదనీ, కాలానుగుణంగా తననుతాను ఎలా మెరుగుపరచుకోవాలో ఈ ప్రాంతానికి తెలుసనీ చెప్పారు. సవాళ్లను ఎదుర్కొని, కొత్త అవకాశాలను సృష్టించడానికి రాజస్థాన్ మారుపేరని కూడా ఆయన అన్నారు. రాజస్థాన్ ను సూచించే ‘ఆర్’కు.. బాధ్యతాయుతమైన (రెస్పాన్సివ్), సంస్కరణ శీల (రిఫార్మిస్ట్) ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా ప్రజలు కొత్త కోణాన్ని జోడించారని శ్రీ మోదీ అన్నారు. అనతికాలంలోనే విశేషంగా కృషిచేశారంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రిని, ఆయన బృందాన్ని కొనియాడారు. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఏడాదిని పూర్తి చేసుకోబోతోందని పేర్కొన్న శ్రీ మోదీ.. పేదలు, రైతుల సంక్షేమం, యువతకు కొత్త అవకాశాల కల్పన, రోడ్లు, విద్యుత్ సదుపాయం, నీటి సదుపాయాల వంటి వివిధ రంగాల్లో రాజస్థాన్ వేగవంతమైన అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అంకిత భావంతో, సమర్థవంతంగా కృషిచేశారని ప్రశంసించారు. నేరాలు, అవినీతిని నియంత్రించడంలో ప్రభుత్వ సత్వర చర్యలు పౌరులు, పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయన్నారు.
అభివృద్ధిలో రాజస్థాన్ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడం అత్యంత ప్రధానమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. రాజస్థాన్ సహజ వనరులకు నిలయమనీ, సుసంపన్నమైన వారసత్వంతో ఆధునికత అనుసంధితమై ఉన్నదనీ, అత్యంత విశాలమైన భూభాగం ఉందనీ, అత్యంత సమర్థవంతమైన యువశక్తీ ఇక్కడ ఉన్నదనీ వ్యాఖ్యానించారు. రోడ్ల నుంచి రైల్వేల వరకు, ఆతిథ్యం నుంచి హస్తకళల వరకు, పొలాల నుంచి కోటల వరకు అనేక ఆకట్టుకునే అంశాలు రాజస్థాన్‌లో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రత్యేకతలు రాజస్థాన్ ను పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుస్తాయని శ్రీ మోదీ అన్నారు. నేర్చుకోవడం, సామర్థ్యాన్ని పెంచుకోవడం రాజస్థాన్ విశిష్టత అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అందుకే, ఇప్పుడిక్కడి ఇసుక దిబ్బల్లోనూ చెట్లకు పుష్కలంగా ఫలాలు ఉన్నాయనీ.. ఆలివ్, జట్రోఫా సాగు పెరుగుతోందనీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మక్రానా పాలరాతి, కోటా దోరియాలతోపాటు.. జైపూర్ నీలి కుండలు, ప్రతాప్ గఢ్ తేవా ఆభరణాలు, భిల్వారా వస్త్ర ఆవిష్కరణల ఘనత విశిష్టమైనదని ఆయన పేర్కొన్నారు. నాగౌర్ లోని పాన్ మేఠీ పరిమళం కూడా ప్రత్యేకమైనదనీ, ప్రతి జిల్లాలోని విశిష్టతను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందనీ అన్నారు.
జింక్, సీసం, రాగి, పాలరాతి, సున్నపురాయి, గ్రానైట్, పొటాష్ మొదలైనవాటితో భారత ఖనిజ నిల్వలలో ఎక్కువ భాగం రాజస్థాన్ లో ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవి భారత స్వావలంబనకు బలమైన పునాది అనీ, దేశ ఇంధన భద్రతకు రాజస్థాన్ ప్రముఖంగా దోహదం చేస్తుందనీ అన్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సృష్టించాలని భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని గుర్తు చేశారు. ఇందులోనూ రాజస్థాన్ ప్రముఖ పాత్ర పోషిస్తోందనీ, దేశంలోని అతిపెద్ద సోలార్ పార్కుల్లో చాలావరకూ ఇక్కడ నిర్మిస్తున్నామనీ శ్రీ మోదీ అన్నారు.
రెండు అతిపెద్ద ఆర్థిక కేంద్రాలైన ఢిల్లీ, ముంబైలను.. మహారాష్ట్ర, గుజరాత్ ఓడరేవులను ఉత్తర భారతదేశంతో రాజస్థాన్ అనుసంధానించిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 250 కిలోమీటర్ల ఢిల్లీ–ముంబై పారిశ్రామిక కారిడార్ రాజస్థాన్ లో ఉందని పేర్కొన్నారు. దీనివల్ల రాజస్థాన్ లోని అల్వార్, భరత్ పూర్, దౌసా, సవాయ్ మాధోపూర్, టోంక్, బుండి, కోటా జిల్లాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. జైపూర్, అజ్మీర్, సికార్, నాగౌర్, అల్వార్ జిల్లాల గుండా వెళ్లే ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ వంటి 300 కిలోమీటర్ల ఆధునిక రైలు వ్యవస్థ రాజస్థాన్ లో ఉందని శ్రీ మోదీ అన్నారు. ఇంతపెద్ద అనుసంధాన ప్రాజెక్టులకు రాజస్థాన్ కేంద్రంగా ఉన్నదని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. పెట్టుబడులకు ఇది అద్భుతమైన గమ్యస్థానమనీ, ముఖ్యంగా డ్రై పోర్టులు, రవాణా రంగానికి అపారమైన అవకాశాలున్నాయనీ ప్రధానమంత్రి పేర్కొన్నారు. బహుళ ప్రయోజనాలున్న రవాణా పార్కులు, రంగాల వారీగా దాదాపు రెండు డజన్ల పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందనీ.. రెండు వాయు రవాణా కాంప్లెక్సులను నిర్మిస్తోందనీ ఆయన తెలిపారు. దీంతో పారిశ్రామిక అనుసంధానత మరింత మెరుగుపడి, రాజస్థాన్ లో పరిశ్రమల స్థాపన మరింత సులభమవుతుందన్నారు.
పర్యాటక రంగం దేశ భవిష్యత్తును సుసంపన్నం చేయగలదని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. భారతదేశంలో ప్రాకృతిక, సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యంతోపాటు.. సమావేశాలకు, వివాహ పర్యాటకానికి, వారసత్వ పర్యాటకానికీ అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. భారత పర్యాటక రంగంలో రాజస్థాన్ ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. చరిత్ర, వారసత్వం, విస్తారమైన ఎడారులు, సుందరమైన సరస్సులతోపాటు వైవిధ్యభరితమైన సంగీతం, వంటకాలు ఇక్కడ ఉన్నాయనీ.. ఇది పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగ ఆవశ్యకాలను తీరుస్తుందనీ అన్నారు. వివాహ కార్యక్రమాలను ఇక్కడే చేసుకుని, జీవితంలోని మధుర క్షణాలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ భావించే ప్రపంచంలోని ఉత్తమ ప్రదేశాల్లో రాజస్థాన్ ఒకటని ఆయన అన్నారు. రాజస్థాన్ లో వన్యప్రాణి పర్యాటకానికి అపారమైన అవకాశాలున్నాయనీ.. రణథంబోర్, సరిస్కా, ముకుంద్ర హిల్స్, కియోలాడియో తదితర ప్రదేశాలు వన్యప్రాణి ఔత్సాహికులకు కనువిందు చేస్తాయనీ శ్రీ మోదీ పేర్కొన్నారు. రాజస్థాన్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలను, వారసత్వ కేంద్రాలను మరింత మెరుగ్గా అనుసంధానం చేయడంపై ప్రధానమంత్రి సంతోషం వ్యక్తంచేశారు. వివిధ ఇతివృత్తాలతో పర్యటన పథాలకు సంబంధించిన పథకాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన తెలిపారు. 2004 – 2014 మధ్య దాదాపు 5 కోట్ల మంది విదేశీ పర్యాటకులు భారతదేశానికి వచ్చారనీ.. 2014 – 2024 మధ్య మూన్నాలుగు సంవత్సరాలు కోవిడ్ ప్రభావిత కాలమే అయినా 7 కోట్లకు పైగా విదేశీ పర్యాటకులు భారత్ ను సందర్శించారని చెప్పారు. కోవిడ్ విపత్తు సమయంలో పర్యాటకం స్తంభించినప్పటికీ, భారత్ కు వచ్చే పర్యాటకుల సంఖ్య చాలా వరకు పెరిగిందని శ్రీ మోదీ తెలిపారు. భారత ఇ–వీసా సదుపాయాన్ని అనేక దేశాల పర్యాటకులకు విస్తరించడం విదేశీ పర్యాటకులకు చాలా సహాయపడిందన్నారు. దేశంలో నేడు దేశీయ పర్యాటక రంగం కూడా కొత్త రికార్డులు సృష్టిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉడాన్ యోజన, వందే భారత్ రైళ్లు, ప్రసాద్ వంటి పథకాలు రాజస్థాన్ కు ఎంతో ప్రయోజనం చేకూర్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వ వైబ్రెంట్ విలేజ్ వంటి కార్యక్రమాల ద్వారా రాజస్థాన్ కు కూడా ప్రయోజనం కలిగిందన్నారు. భారత్ లోనే వివాహాలు చేసుకోవాలని ప్రజలను శ్రీ మోదీ అభ్యర్థించారు. అది రాజస్థాన్ కు లబ్ధి చేకూరుస్తుందన్నారు. రాజస్థాన్ లో వారసత్వ పర్యాటకం, సినీ పర్యాటకం, పర్యావరణ పర్యాటకం, గ్రామీణ పర్యాటకం, సరిహద్దు ప్రాంత పర్యాటకాలను విస్తరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పెట్టుబడిదారులను ప్రధాని కోరారు. తద్వారా రాజస్థాన్ పర్యాటక రంగం బలోపేతమవడంతోపాటు వ్యాపార వృద్ధికీ అది దోహదపడుతుందన్నారు.
అంతర్జాతీయంగా సరఫరా, వివిధ కార్యకలాపాల శ్రేణుల్లో ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ.. అతి పెద్ద సంక్షోభం సమయంలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా, అవిచ్ఛిన్నంగా పనిచేసే వ్యవస్థ నేడు ప్రపంచానికి అవసరమని ప్రధానమంత్రి అన్నారు. ఇందుకోసం విస్తృతమైన తయారీ కేంద్రంగా భారత్ ఉండడం అత్యావశ్యకమనీ.. ఇది భారత్ కు మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ అవసరమేననీ ఆయన అన్నారు. ఈ బాధ్యతను అర్థం చేసుకుని తయారీ రంగంలో స్వయంప్రతిపత్తి దిశగా భారత్ సంకల్పించిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద తక్కువ వ్యయంలోనే తయారీకి భారత్ ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. భారత పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలు, టీకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రికార్డు స్థాయిలో తయారీ వల్ల ప్రపంచానికి చాలా ప్రయోజనం కలిగిందన్నారు. ఇంజినీరింగ్ వస్తువులు, రత్నాలు–ఆభరణాలు, వస్త్రాలు, హస్తకళలు, వ్యవసాయ ఆహార ఉత్పత్తులు సహా గత ఏడాది కాలంలో రాజస్థాన్ నుంచి ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరిగాయని శ్రీ మోదీ తెలిపారు.
భారతదేశంలో తయారీని పెంచడంలో పీఎల్ఐ పథకం పాత్ర అంతకంతకూ పెరుగుతోందనని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఎలక్ట్రానిక్స్, స్పెషాలిటీ స్టీల్, ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్, సోలార్ పీవీ, ఔషధ రంగాలు నేడు పురోగమిస్తున్నాయన్నారు. పీఎల్ఐ పథకం వల్ల దాదాపు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, రూ.11 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు తయారవుతున్నాయని, రూ.4 లక్షల కోట్ల ఎగుమతులు పెరిగాయని ఆయన తెలిపారు. లక్షలాది మంది యువతకు కొత్తగా ఉపాధి లభించిందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అనేక అవకాశాలున్న రాజస్థాన్ కూడా ఆటోమోటివ్, ఆటో కాంపోనెంట్ పరిశ్రమ కోసం గట్టి పునాదులతో సన్నద్ధమైందని ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా రాజస్థాన్‌లో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. రాజస్థాన్ లో తయారీ రంగ సామర్థ్యాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని శ్రీ మోదీ పెట్టుబడిదారులను కోరారు.
‘రైజింగ్ రాజస్థాన్’ శక్తిమంతమైన భావన అన్న ప్రధాన మంత్రి, ఎంఎస్‌ఎంఈల పరంగా దేశంలోని మొదటి 5 రాష్ట్రాలలో రాజస్థాన్ కూడా ఒకటని అన్నారు. ప్రస్తుత సదస్సులో ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. రాజస్థాన్‌లో 27 లక్షలకు పైగా చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలున్నాయని, చిన్న తరహా పరిశ్రమల్లో 50 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారని శ్రీ మోదీ తెలిపారు. రాజస్థాన్ భవితవ్యాన్ని మార్చే సత్తా ఈ సంఖ్యకుందని, ప్రభుత్వం తక్కువ సమయంలోనే కొత్త ఎంఎస్ఎంఈ విధానాన్ని ప్రవేశపెట్టిందని హర్షం వ్యక్తం చేశారు. తగిన విధానాలు, నిర్ణయాల ద్వారా భారత ప్రభుత్వం కూడా ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేస్తోందని అన్నారు. “భారత ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే కాక, ప్రపంచ సరఫరా, ఆర్థిక వ్యవస్థలను దృఢంగా తీర్చిదిద్దటంలో కీలకంగా మారాయి..” అని ప్రధాని అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఫార్మా సంబంధిత సరఫరా వ్యవస్థ ఎదుర్కొన్న సంక్షోభాన్ని గుర్తుచేస్తూ, బలమైన పునాదులు కలిగిన భారత ఫార్మా రంగం ప్రపంచానికి దన్నుగా నిలిచిందని వ్యాఖ్యానించారు. అదేవిధంగా దేశాన్ని ఇతర ఉత్పత్తుల కీలక తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఈ దిశగా ఎంఎస్‌ఎంఈలు ప్రధాన పాత్ర పోషించగలవని శ్రీ మోదీ అన్నారు.
ఎంఎస్‌ఎంఈలు మరిన్ని అవకాశాలను పొందేందుకు, మరింత వృద్ధి సాధించేందుకు, వాటి నిర్వచనాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్న ప్రధాని, ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల ఎంఎస్‌ఎంఈలను అధికారిక ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేసిందని, దీని వల్ల వాటికి రుణసదుపాయం మెరుగయ్యిందని అన్నారు.
ప్రభుత్వం రుణ ఆధారిత హామీ పథకాన్ని (క్రెడిట్ లింక్డ్ గ్యారెంటీ స్కీమ్) ప్రారంభించిందని, పథకం కింద చిన్న పరిశ్రమలకు సుమారు రూ. 7 లక్షల కోట్ల సాయం అందించామని ప్రధాని చెప్పారు.
గత దశాబ్దంలో, ఎంఎస్ఎంఈలకు రుణాలు రెండింతల మేర పెరిగాయని గణాంకాలను వెల్లడిస్తూ, 2014లో దాదాపు రూ. 10 లక్షల కోట్లగా ఉన్న రుణాల సొమ్ము, నేడు రూ. 22 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉందని ప్రధాని చెప్పారు. రాజస్థాన్ కూడా దీని వల్ల లబ్ధి పొందిందని, పెరుగుతున్న ఎంఎస్‌ఎంఈల బలం రాజస్థాన్ అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు.
“స్వావలంబన సాధించిన భారతదేశం వైపు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాం” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్ అభియాన్’ దార్శనికత ప్రపంచస్థాయిదని, దాని ప్రభావం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉందని శ్రీ మోదీ అన్నారు. ప్రభుత్వ స్థాయిలో ‘ఏకోన్ముఖ ప్రభుత్వ విధానం’తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పారిశ్రామిక, తయారీ రంగ వృద్ధికి ప్రభుత్వం ప్రతి రంగాన్ని, ప్రతి అంశాన్ని ప్రోత్సహిస్తోందని ప్రధాని అన్నారు. ‘సబ్కా ప్రయాస్’ స్ఫూర్తి రాజస్థాన్ అభివృద్ధికి, దేశాభివృద్ధికీ దోహదపడగలదన్న విశ్వాసాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.
తమ ప్రసంగాన్ని ముగిస్తూ, రైజింగ్ రాజస్థాన్ సంకల్పాన్ని బలపర్చాలని శ్రీ మోదీ పెట్టుబడిదారులందరినీ కోరారు. రాజస్థాన్ ను, భారతదేశాన్ని సందర్శించాలని ప్రపంచ దేశాల ప్రతినిధులను కోరిన ప్రధాని, ఈ యాత్ర వారికి మరపురాని అనుభవంగా మిగిలిపోగలదని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభౌ కిసన్‌రావ్ బాగ్డే, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పరిశ్రమల ప్రముఖులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
ఈ ఏడాది డిసెంబరు 9 నుంచి 11వ తేదీ వరకు జరగే పెట్టుబడుల సదస్సు ఇతివృత్తం ‘రిప్లీట్, రెస్పాన్సిబుల్, రెడీ’ (సమృద్ధ, బాధ్యయతాయుత, సన్నద్ధ)గా ఉంది. సదస్సులో నీటి భద్రత, అనుకూల పద్ధతుల ఖనిజాన్వేషణ, అనుకూలమైన ఆర్థిక పద్ధతులు, సమ్మిళిత పర్యాటకం, వ్యవసాయ–వ్యాపార ఆవిష్కరణలు, మహిళల నేతృత్వంలో అంకుర పరిశ్రమలు సహా 12 రంగాలకు చెందిన ఇతివృత్త ఆధారిత సమావేశాలను నిర్వహిస్తున్నారు. సదస్సు సందర్భంగా ‘నగరాల్లో సౌకర్యవంతమైన జీవనం కోసం మెరుగైన నీటి నిర్వహణ (వాటర్ మేనేజ్‌మెంట్ ఫర్ లివబుల్ సిటీస్), ‘పరిశ్రమల బహుముఖీనత – తయారీ తదితరాలు’, ‘వాణిజ్యం, పర్యాటకం’ వంటి అంశాలపై ఎనిమిది దేశాల ప్రత్యేక సమావేశాలు కూడా జరుగుతాయి.
మూడు రోజుల్లో ‘ప్రవాసీ రాజస్థానీ కాంక్లే’వ్, ‘ఎంఎస్‌ఎంఈ కాంక్లేవ్’ పేరిట సమావేశాలు జరుగుతాయి. రాజస్థాన్ గ్లోబల్ బిజినెస్ ఎక్స్‌పోలో రాజస్థాన్ పెవిలియన్, కంట్రీ పెవిలియన్స్, స్టార్టప్స్ పెవిలియన్ వంటి ప్రత్యేక పెవిలియన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 16 భాగస్వామ్య దేశాలు, 20 అంతర్జాతీయ సంస్థలు సహా మొత్తం 32 దేశాలు ఈ సదస్సులో పాల్గొంటాయి.
Rajasthan is emerging as a prime destination for investment, driven by its skilled workforce and expanding market. Addressing the Rising Rajasthan Global Investment Summit in Jaipur.https://t.co/5CadzvGEyP
— Narendra Modi (@narendramodi) December 9, 2024
Experts and investors around the world are excited about India. pic.twitter.com/umKkGMymZw
— PMO India (@PMOIndia) December 9, 2024
India's success showcases the true power of democracy, demography, digital data and delivery. pic.twitter.com/0TUVAUMKXB
— PMO India (@PMOIndia) December 9, 2024
This century is tech-driven and data-driven. pic.twitter.com/7SxqXLHHIP
— PMO India (@PMOIndia) December 9, 2024
India has demonstrated how the democratisation of digital technology is benefiting every sector and community. pic.twitter.com/fTLhdDIqH6
— PMO India (@PMOIndia) December 9, 2024
Rajasthan's R factor... pic.twitter.com/hyoisSRkm3
— PMO India (@PMOIndia) December 9, 2024
Having a strong manufacturing base in India is crucial. pic.twitter.com/GlXNCWZt0T
— PMO India (@PMOIndia) December 9, 2024
India's MSMEs are not only strengthening the Indian economy but are also playing a significant role in empowering the global supply and value chains. pic.twitter.com/zqxNdDYDNq
— PMO India (@PMOIndia) December 9, 2024
Rising Rajasthan is a commendable effort, showcasing how Rajasthan is emerging as a hub for innovation, growth and entrepreneurship. Powered by a rich heritage, a culture of enterprise and progressive policies, Rajasthan is paving the way for a brighter future. pic.twitter.com/nUOn3Z5qA6
— Narendra Modi (@narendramodi) December 9, 2024
India has demonstrated how democracy, demography and data are powering growth. pic.twitter.com/hQip3pvpn8
— Narendra Modi (@narendramodi) December 9, 2024
Rajasthan is surely rising, reliable and receptive. Additionally, it is also responsive and reformist. pic.twitter.com/Limpu7Fvso
— Narendra Modi (@narendramodi) December 9, 2024
India has immense potential in the tour, travel and hospitality sector. pic.twitter.com/u3oNtMo7Eb
— Narendra Modi (@narendramodi) December 9, 2024
Rising, Reliable, Receptive और खुद को Refine कर रहे राजस्थान के R-Factor में अब ये महत्वपूर्ण पहलू भी जुड़ गया है…. pic.twitter.com/5dCoPmsiIj
— Narendra Modi (@narendramodi) December 9, 2024
राजस्थान में हेरिटेज, फिल्म, इको, रूरल और बॉर्डर एरिया टूरिज्म की अथाह संभावनाएं हैं। इन क्षेत्रों में निवेश से यहां टूरिज्म सेक्टर को नई मजबूती मिलेगी। pic.twitter.com/wV9IOq8GfF
— Narendra Modi (@narendramodi) December 9, 2024
राजस्थान के मैन्युफैक्चरिंग पोटेंशियल को नई ऊर्जा मिले, इसको लेकर मेरा यह आग्रह… pic.twitter.com/b06yEgJNeu
— Narendra Modi (@narendramodi) December 9, 2024
हम अपनी नीतियों और निर्णयों से MSMEs को लगातार मजबूत कर रहे हैं। राजस्थान की नई MSMEs पॉलिसी इसका एक बड़ा उदाहरण है। pic.twitter.com/WyslXsyLeH
— Narendra Modi (@narendramodi) December 9, 2024