పిఎంఇండియా
రైల్వేల రంగం లో విజ్ఞాన శాస్త్ర సంబంధమైన మరియు సాంకేతిక విజ్ఞాన పరమైన సహకారాన్ని బలోపేతం చేసుకొనేందుకు భారతదేశం లోని రిసర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ స్ ఆర్గనైజేశన్ (ఆర్‌డిఎస్ఒ)కు, రిపబ్లిక్ ఆఫ్ కొరియా రైల్ రోడ్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ (కెఆర్ఆర్ఐ)కి మధ్య కుదిరిన ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు) వివరాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టికి తీసుకురావడమైంది. ఈ ఎంఒయు పై 2018 జులై 10వ తేదీన సంతకాలయ్యాయి.
ప్రభావం:
రైల్వే రంగం లోని తాజా పరిణామాలపైన, విజ్ఞానంపైన కొరియా లోని రైల్వే విభాగం తో సంప్రదింపులు జరిపేందుకు ఒక వేదిక ను ఈ ఎంఒయు సిద్ధం చేస్తుంది. ఇది సాంకేతిక నిపుణుల రాకపోకలకు, నివేదికల, సాంకేతిక పత్రాల ఆదాన ప్రదానానికి, నిర్దిష్ట సాంకేతిక రంగాల పై దృష్టి సారిస్తూ నిర్వహించే చర్చా సభలు/ కార్యశాలలకు మరియు శిక్షణ కు కూడా మార్గాన్ని సుగమం చేస్తుంది.
వివరాలు:
ఈ ఎంఒయు ఈ కింద పేర్కొన్న రంగాలలో ప్రత్యేక శ్రద్ధ తో కూడిన సహకారానికి ఫ్రేమ్ వర్క్ ను సమకూర్చుతుంది:-
పరస్పర ప్రయోజనాలను నెరవేర్చేటటువంటి సంయుక్త పరిశోధనలకు సంబంధించిన ప్రణాళిక రచన మరియు ఆ పరిశోధనల కొనసాగింపు;
భారతదేశం లో తాజా రైల్వే ఆర్ అండ్ డి సదుపాయాల స్థాపన లో సహకారం; సాంకేతిక చర్చా సభ లేదా వేదిక కు సంబంధించిన ప్రణాళిక రచన మరియు నిర్వహణ; ఆర్ డిఎస్ఒ సిబ్బందికి కెఆర్ఆర్ఐ ద్వారా స్వల్ప కాల శిక్షణ కార్యక్రమం;
నిర్దిష్ట పథకాల కోసం కెఆర్ఆర్ఐ కి, ఆర్ డిఎస్ఒ కు మధ్య సిబ్బంది మార్పిడి కార్యక్రమం;
రెండు దేశాల లోను రైల్వే పరిశ్రమ అభివృద్ధికై కన్సల్టెన్సీ;
ఉభయ పక్షాలు అంగీకరించే మేరకు మరే విధమైన సహకారపూర్వక కార్యక్రమాలు అయినా సరే.
***