పిఎంఇండియా
రైల్వే భద్రత అంశంపై జపాన్ తో మెమొరాండం ఆఫ్ కోఆపరేషన్ (ఎమ్ఒసి) పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఎమ్ఒసి పైన ఇప్పటికే 2017 ఫిబ్రవరి లో సంతకాలయ్యాయి.
ఎమ్ఒసి పై సంతకాలు జరిగినందువల్ల ఈ కింద పేర్కొన్న రంగాలలో సహకారం సాధ్యపడుతుంది:
1. రైలు మార్గ భద్రత (ఉదాహరణకు రైలు పట్టాలను అతకటం, రైలు పట్టాల తనిఖీ, ట్రాక్ సర్క్యూట్ ల వంటివి).
2. రైలు మార్గ భద్రతకు సంబంధించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం (ఆటోమేటిక్ ఇన్స్ పెక్షన్ టెక్నాలజీ వంటివి).
3. రైలు పెట్టెలు, ఇంజను ల భద్రత (ఉదాహరణకు నిర్వహణ వంటివి).
4. ఈ ఎమ్ఒసి పరిధిలోకి వచ్చే ఏదైనా ఇతర రైల్వే భద్రతకు సంబంధించిన అంశం దేనినైతే ఇరు పక్షాలు కలిసి నిర్ణయించుకొంటాయో; ఇటువంటి నిర్ణయం తీసుకొనేటప్పుడు ప్రధానంగా రైల్వే ప్రమాదాలను నివారించడాన్ని పరిగణనలోకి తీసుకొంటారు. ఇందుకోసం ప్రమాద కారణాలను విశ్లేషించడం జరుగుతుంది.
భారతీయ రైల్వేలు రైల్వే రంగం లోని తాజా పరిణామాలను, విజ్ఞానాన్ని గురించి సంభాషించడానికి మరియు పంచుకోవడానికి ఈ ఎమ్ఒసి ఒక వేదికను సిద్ధం చేస్తుంది. ఈ ఎమ్ఒసి లో భాగంగా సహకరించుకొనే అంశాలలో-
అ. నిపుణులను పంపించడం
ఆ. కీలకమైన సిబ్బందికి జపాన్ లో శిక్షణ
ఇ. సమాచారం మరియు ఉత్తమ పద్ధతుల వివరాలను ఇచ్చి పుచ్చుకోవడం
ఈ. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రిసర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్ డిఎస్ ఒ) కు నేషనల్ ట్రాఫిక్ సేఫ్టీ అండ్ ఎన్వైరాన్ మెంటల్ లేబొరేటరీ ఆఫ్ జపాన్ సహా ఇతర సంస్థలు, మంత్రిత్వ శాఖల తోడ్పాటుకు ఆయా దేశాల చట్టాలు, నియమ నిబంధనలకు లోబడి మార్గం సుగమం చేయడం వంటివి- భాగంగా ఉంటాయి.
****