పిఎంఇండియా
రైల్వే రంగంలో సాంకేతిక సహకారం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన భూ ఉపరితల, సముద్ర మార్గాల ఫెడరల్ రవాణా సాధికార సంస్థ తో కుదిరిన అవగాహనా ఒప్పందం గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి వివరించడం జరిగింది. ఈ ఒప్పందంపై 2018 ఫిబ్రవరి 10వ తేదీన సంతకాలు చేయడం జరిగింది.
ఈ అవగాహనా ఒప్పందం ద్వారా ఈ కింద తెలియజేసిన అంశాలలో సాంకేతిక సహకారం లభిస్తుంది.
ఏ. ప్రమాదాల నియంత్రణ, భద్రత మరియు సాంకేతిక విచారణ;
బి. స్టేషన్ల పునరాభివృద్ధి;
సి. రైలు ఇంజన్లు, బోగీలు, వ్యాగన్లు; మరియు
డి. భాగస్వాములు సంయుక్తంగా గుర్తించిన ఏ ఇతర అంశమైనా.
ప్రయోజనాలు :
రైల్వేల రంగంలో ఆధునిక పరిణామాలు మరియు పరిజ్ఞానం గురించి పరస్పరం తెలుసుకోడానికీ, పంచుకోడానికీ భారత రైల్వేలకు ఈ అవగాహనా ఒప్పందం ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఉమ్మడిగా ఆమోదించుకున్న సహకార ప్రోజెక్టులు అమలు చేసుకోడానికీ, సమాచారాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకోడానికీ, నిపుణులతో సమావేశాలు, సదస్సులు, సాంకేతిక పర్యటనలు నిర్వహించుకోడానికీ ఈ అవగాహనా ఒప్పందం వీలు కలుగజేస్తుంది.
నేపధ్యం :
రైల్వేల రంగంలో సాంకేతిక సహకారం కోసం – మన రైల్వే మంత్రిత్వశాఖ – వివిధ విదేశీ ప్రభుత్వాలతోనూ, ఆయా దేశాల రైల్వే సంస్థలతోనూ అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేసింది. హై స్పీడ్ కారిడార్లు, ప్రస్తుతం ఉన్న మార్గాలలో వేగం పెంచడం, ప్రపంచ స్థాయి స్టేషన్ల అభివృద్ధి, భారీ కార్యక్రమాలు, రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణ మొదలైన అంశాలను పరస్పర సహకారం కోసం గుర్తించడం జరిగింది. రైల్వేల సాంకేతికత, వినియోగం, పరిజ్ఞానం ఇచ్చిపుచ్చుకోవడం, సాంకేతిక పర్యటనలు, శిక్షణ, సదస్సులతో పాటు పరస్పరం ఆసక్తి ఉన్న అంశాలలో వర్కుషాపులు నిర్వహించుకోవడం ద్వారా సహకారాన్ని సాధించడం జరిగింది.
***