Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లఖ్ నవూ లో అట‌ల్ బిహారీ వాజ్ పేయి వైద్య విశ్వ‌విద్యాల‌యాని కి శంకుస్థాప‌న‌ కార్యక్రమం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


ఉత్త‌ర్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీమ‌తి ఆనందీ బెన్ ప‌టేల్ గారి కి, నా మంత్రిమండలి సహ‌చ‌రులు సీనియర్ మంత్రి, ఇదే నియోజకవర్గ ప్ర‌తినిధి శ్రీ రాజ్ నాథ్ సింహ్, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య‌నాథ్ జీ, ఉప ముఖ్య‌మంత్రి శ్రీ కేశ‌వ్ ప్ర‌సాద్ జీ, శ్రీ దినేశ్ శ‌ర్మ జీ, అసెంబ్లీ స్పీక‌ర్ శ్రీ నారాయ‌ణ్ దీక్షిత్ జీ, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ మంత్రులు, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఎంపీలు, ఇక్కడ కు తరలివచ్చినటువంటి మహిళ లు మరియు సజ్జనులారా,

ల‌ఖ్ నవూ ఎంపీ నాకు స్వాగ‌తం ప‌లికారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి న‌న్ను స్వాగ‌తించారు. అంతే కాదు కాశీ ఎంపీ కూడా నాకు అభినంద‌న‌ లు తెలుపుతున్నారు. ఎంతో ముఖ్య‌మైన రెండో కార్య‌క్ర‌మం లో ఈ రోజు న పాల్గొంటున్నందుకు నేను చాలా అదృష్ట‌వంతుడి ని. అట‌ల్ బిహారీ వాజ్ పేయి గారి ని గురించి, ఆయన దార్శనిక‌త ను గురించి రెండు కార్య‌క్ర‌మాల లో మాట్లాడ‌డం నాకు ద‌క్కిన గౌర‌వం.

ఇక్క‌డ‌ కు రావ‌డానికి ముందు ఢిల్లీ లో అట‌ల్ జ‌ల్ యోజ‌న కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాను. ఈ కార్య‌క్ర‌మం లో భాగం గా 6,000 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి దేశం లోని 7 రాష్ట్రాల లో భూగ‌ర్భ జ‌లాల మ‌ట్టాన్ని పెంచ‌డం జ‌రుగుతుంది. ఈ ఏడు రాష్ట్రాల‌ లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కూడా ఒక‌టి.

దీనికి సంబంధించి ల‌ద్దాఖ్- హిమాచ‌ల్ ను క‌లుపుతున్న రోహ్ తాంగ్ సొరంగాని కి అట‌ల్ సొరంగం అనే పేరు ను పెట్ట‌డం జ‌రిగింది.

యాదృచ్ఛికం గా ఇదే రోజు న మ‌నం సుప‌రిపాల‌న దినోత్స‌వాన్ని కూడా జ‌రుపుకొంటున్నాము. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌ ను నిర్వ‌హిస్తున్న భ‌వ‌న ప్రాంగ‌ణం లో అట‌ల్ జీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించుకోవ‌డం జ‌రిగింది. లోక్ భ‌వ‌న్ నుండి సుప‌రిపాల‌న ను అందిస్తూ ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించాల‌నుకొనే వారి కి ఆయ‌న విగ్ర‌హం స్ఫూర్తి ని అందిస్తూనే వుంటుంది.

మిత్రులారా, అంతే కాదు అట‌ల్ వైద్య విశ్వ‌విద్యాల‌య నిర్మాణం కోసం పునాది రాయి ని వేయ‌డం జ‌రిగింది. ఎన్నో సంవత్సరాలు గా ల‌క్నోను అట‌ల్ జీ త‌న క‌ర్మ‌భూమి గా చేసుకున్నారు. ఇది చాలా కాలం ఆయ‌న పార్ల‌మెంటు సీటు. ల‌ఖ్ నవూ కు వ‌చ్చి ఇక్క‌డ విద్య‌, ఆరోగ్య రంగాల‌ కు సంబంధించిన సంస్థ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసే అవ‌కాశం ల‌భించ‌డం ఎంతో అదృష్టం గా భావిస్తారు. ఆ భాగ్యం నాకు ల‌భించింది.

ల‌ఖ్ నవూఎంపీ గా శ్రీ అట‌ల్ జీ ప‌ని చేస్తున్న స‌మ‌యం లో ఆయ‌న ఇక్క‌డ అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల ను ప్రారంభించారు. రింగ్ రోడ్డు నిర్మాణం గాని లేదా పాత ల‌ఖ్ నవూ లో మురుగునీటి పారుద‌ల వ్య‌వ‌స్థ‌ ను ఏర్పాటు చేయ‌డం, విమానాశ్ర‌యాన్ని ఆధునీక‌రించ‌డం, వాల్మీకి ఆంబేడ్ కర్ ఆవాస్ యోజ‌న ను ప్రారంభించ‌డం, అలాగే ల‌ఖ్ నవూ కు ఒక కొత్త అస్తిత్వాన్ని ఇచ్చేలా బ‌యోటెక్ పార్క్ ను ప్రారంభించ‌డం ఆయ‌న హ‌యాం లో జ‌రిగాయి. ఇప్పుడు ఎంపీగా ప‌ని చేస్తున్న శ్రీ రాజ్ నాథ్ గారు కూడా అట‌ల్ జీ వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకొని ఈ న‌గ‌ర అభివృద్ధి కోసం అంకిత‌భావం తో ప‌ని చేస్తున్నారు.

స్నేహితులారా, అట‌ల‌్ జీ అంటుండే వారు.. జీవితాన్ని ముక్క‌ ముక్కలు గా చూడ‌వ‌ద్ద‌ని, స‌మగ్రం గా అర్థం చేసుకోవాలి అని. ఇది ప్ర‌భుత్వాని కి, సుప‌రిపాల‌న‌ కు వ‌ర్తించే స‌త్యం. ఇది సుప‌రిపాల‌న‌ ను అందించ‌డానికి ప‌నికి వ‌చ్చే ప్రామాణిక సూత్రం.

స‌మ‌స్య‌ల‌ ను స‌మూలం గా,స‌మ‌గ్రం గా అర్థం చేసుకొని వాటి ని ప‌రిష్క‌రించ‌క‌పోతే సుప‌రిపాల‌న సాధ్యం కాదు. నాకు సంతృప్తి గా వుంది.. ఎందుకంటే అంద‌రికీ న్యాయం జ‌రిగేలా ప‌రిపాల‌న ను అందించాలనే ఆలోచ‌న‌ ను చ‌క్క‌గా అమ‌లు చేస్తూ శ్రీ యోగీ గారి ప్ర‌భుత్వం స‌మ‌ర్థ‌వంతం గా ప‌ని చేస్తోంది.

ఇదే ఆలోచన‌ ను అట‌ల్ వైద్య విశ్వ‌విద్యాల‌యం ప్ర‌తిఫ‌లిస్తోంది. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అందించే వైద్య విద్యారంగాని కి సంబంధించి ఇది ఏక‌రూప‌త‌ ను అందిస్తుంది. ఈ వైద్య విద్య కోర్సు ఆరంభం నుండి ప‌రీక్ష‌ లు పూర్త‌ి అయ్యే వ‌ర‌కు ఏక‌రూప‌త‌, స‌హ‌జ‌సిద్ధ‌మైన ప్ర‌త్యేక‌త వుంటాయి.

వైద్య క‌ళాశాల కావ‌చ్చు, దంత‌వైద్య క‌ళాశాల‌, పారామెడిక‌ల్ క‌ళాశాల‌, న‌ర్సింగ్ క‌ళాశాల‌, ఆమాటకు వస్తే వైద్యానికి సంబంధించిన ఏ కోర్స‌ు అయినా, డిగ్రీ అయినా స‌రే.. వీటికి సంబంధించిన వ్య‌వ‌స్థ‌ లు, విధానాలు ఒకే ప‌ర్య‌వేక్ష‌ణ కింద కొన‌సాగుతాయి.

ప్ర‌భుత్వ సంస్థ‌ లు, పాక్షిక ప్రభుత్వ సంస్థ‌ లు, ప్రైవేటు వైద్య సంస్థ‌లు.. ఇవి అన్నీ ఈ విశ్వ‌విద్యాల‌యం ఆధ్వ‌ర్యంలోనే కొన‌సాగుతాయి. విద్యాసంవ‌త్స‌రాని కి సంబంధించిన కార్య‌క్ర‌మాల‌న్నీ అంద‌రికీ వ‌ర్తిస్తాయి. స‌రైన స‌మ‌యాని కి, పార‌ద‌ర్శ‌క‌మైన ప‌ద్ధ‌తి లో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ వుంటుంది. ఈ విశ్వ‌విద్యాల‌య ఏర్పాటు కార‌ణం గా ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లోని వైద్య విద్య నాణ్య‌త మ‌రింత‌ గా అభివృద్ధి చెందుతుంది.

మిత్రులారా, మా ప్ర‌భుత్వం పాల‌న చేప‌ట్టిన మొద‌టి రోజు నుండే ఆరోగ్య‌ రంగం అభివృద్ధి కి సంబంధించి మా దార్శ‌నిక‌త‌, విధానాలు చాలా స్ప‌ష్టం గా ఉన్నాయి. ఆరోగ్య‌ రంగం అభివృద్ధి పై ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ ను వహించి ఈ రంగాని కి సంబంధించిన మౌలిక సౌక‌ర్యాల‌ ను మెరుగు ప‌ర‌చ‌డానికి కృషి చేస్తున్నాము.

ఆరోగ్య రంగం అభివృద్ధి కి సంబంధించి మా విధి విధానాలు ఇలా ఉ న్నాయి. మొద‌ట రోగ నివార‌ణ‌ కు ప్రాధాన్య‌ాన్ని ఇస్తున్నాము. రెండోది వైద్య‌సేవ‌ల ను అంద‌రి కి అందుబాటు లో ఉంచుతూ, వాటిని విస్త‌రిస్తున్నాము. మూడోది స‌ర‌ఫ‌రా కు సంబంధించింది. ఈ రంగాని కి సంబంధించి ఎటువంటి డిమాండు వ‌చ్చినా దాని ని తీర్చ‌గ‌లిగేలా చూడ‌డం.

ఇక నాలుగోది యుద్ధ ప్రాతిప‌దిక‌ న క‌ల‌గ‌జేసుకుంటూ ఆరోగ్య రంగ సంబంధిత ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం. దీనికి నిద‌ర్శ‌న‌మే ప్ర‌భుత్వం ప్రారంభించిన ప‌థ‌కాలు. వీటి ని చూడండి. వీటి ని ఉప‌యోగించుకోండి. అంతే కాదు నేను చెప్పిన విధి విధానాల్ని అనుస‌రించండి.

మిత్రులారా, అనారోగ్యం బారి న ప‌డి, ఆర్ధికం గా ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండాలి అంటే మొద‌ట మ‌నం చేయవలసింది ఈ అనారోగ్యం రాకుండా చూసుకోవ‌డం. దీనిని నివార‌ణ చ‌ర్య‌ల ద‌శ అంటారు. ఇందుకోసం సాక్ష్యాల‌ తో స‌హా ప్ర‌జ‌ల లో చైత‌న్యం పెంచాలి. ప్ర‌జ‌లు ఈ విష‌యం ప‌ట్ల మ‌రింత శ్ర‌ద్ధ పెడితే వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి హెచ్చుతుంది. వారి శ‌రీరం ఆరోగ్యం గా ఉంటుంది. స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం కూడా ఇటువంటిదే. రోగ నివార‌ణ‌ కు సంబంధించి బృహ‌త్త‌క‌ర‌మైన కార్య‌క్ర‌మాల లో యోగ ఒక‌టి. యోగా చేయ‌డానికి ఏమాత్రం ఖ‌ర్చు కాదు.

మా ప్ర‌భుత్వం ప్రారంభించిన కార్య‌క్ర‌మాల లో ముఖ్య‌మైంది ఉజ్వ‌ల యోజ‌న‌. పొగ పొయ్యిల‌ బారి నుండి మాతృమూర్తుల‌ ను విముక్తుల‌ ను చేసే ప‌థ‌కం ఇది. ఇది కూడా రోగ నివార‌ణ వైద్య విధాన‌మే. అలాగే ఫిట్ ఇండియా ఉద్య‌మం లో భారతదేశం లో ప్ర‌తి ఒక్కరి ని భాగ‌స్వాముల‌ ను చేయ‌డం, వారి లో స్ఫూర్తి ని నింప‌డం. దీనితో పాటు ఆయుర్వేదాన్ని ప్రోత్స‌హించ‌డం అనేవి రోగ నివార‌ణ విధానం లో భాగ‌మే. స‌మ‌గ్ర‌మైన ఆరోగ్య సేవ‌ల కోసం ఇప్పుడు డిమాండ్ పెరుగుతుండ‌డం తో ఈ చ‌ర్య‌ల‌న్నిటిని తీసుకోవ‌డం జ‌రుగుతోంది.

మందుల ద్వారా దుష్ప్ర‌భావాలు క‌ల‌గ‌కుండా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. ఈ విష‌యంలో ఆయుర్వేద వైద్యం కీల‌క పాత్ర ను పోషిస్తుంది. ఇటువంటి ప్ర‌తి కార్య‌క్ర‌మం ద్వారా రోగాలు రాకుండా ముందే వాటి ని నివారించుకోవ‌డం జ‌రుగుతుంది. ఈ అంశాని కి సంబంధించి మ‌నం ఎంత‌గా కృషి చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఇలా చేయ‌డం వ‌ల్ల‌ ఆరోగ్య‌ రంగాని కి సంబంధించిన అనేక స‌మ‌స్య‌ లు ప‌రిష్కార‌ం అవుతాయి. ఈ ప‌ని ని చేయ‌డంవ‌ల్ల ఒక ప్రక్క అంటువ్యాధుల నివార‌ణ జ‌రుగుతుంది. మ‌రో ప్రక్క‌ జీవ‌న‌ శైలివ‌ల్ల క‌లిగే రోగాల నివార‌ణ కూడా మెరుగ్గా జ‌రుగుతుంది.

మిత్రులారా, రోగాలు వ‌చ్చి చికిత్స తీసుకొనే బ‌దులు అస‌లు రోగ‌మే రాకుండా నివార‌ణ చేసుకోవ‌డానికి గాను చేప‌ట్టిన చ‌ర్య‌ల లో ముఖ్య‌మైంది గ్రామీణ ప్రాంతాల లో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. ఇవి దేశ‌వ్యాప్తం గా ఒక ల‌క్షా 25 వేలు ఉన్నాయి. రోగాల‌ కు సంబంధించిన ల‌క్ష‌ణాల‌ ను ముందే గుర్తించి త‌ద‌నుగుణ‌మైన చికిత్స ను ఇవి ముందే అందిస్తున్నాయి. అలాగే మా ప్ర‌భుత్వం ప్ర‌త్యేకం గా చేపడుతున్న ఆరోగ్య‌ రంగ కార్య‌క్ర‌మాల లో మరో ముఖ్య‌మైంది టీకా ల విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మం. కొత్త టీకాల‌ ను అద‌నం గా చేర్చాము. దేశం లోని మారుమూల ప్రాంతాల లో సైతం టీకాల ను ఇవ్వ‌డం జ‌రుగుతోంది. ఈ మ‌ధ్య‌నే కాన్ పుర్‌ లో దీని ని ప్రారంభించడమైంది. ప‌శువుల ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకొని వాటి కాలి కి, నోటి కి వ‌చ్చే వ్యాధుల‌ ను నివారించ‌డానికి టీకాలు వేశాము. దీని వ‌ల్ల‌ ప‌శువుల ఆరోగ్యానికే కాదు మ‌నుషుల కు కూడా అనారోగ్యం క‌ల‌గ‌కుండా ముందే నివార‌ణ జ‌రిగిన‌ట్ట‌వుతుంది. ప‌శువు లు ఆరోగ్యంగా ఉంటే వాటి ద్వారా స‌మాజం లో వ‌చ్చే రోగాల నివార‌ణ కూడా జ‌రుగుతుంది. కాబ‌ట్టి ఆయా ప్రాంతాల అవ‌సరాల‌ను బ‌ట్టి స‌మ‌గ్ర‌మైన‌, సంపూర్ణ‌మైన విధానాల ద్వారా ఆరోగ్య భ‌ద్ర‌త‌ ను సాధించ‌గ‌లుగుతాము.

మిత్రులారా, ఆరోగ్య భ‌ద్ర‌త‌ కు సంబంధించి ఇక రెండో ద‌శ‌ ను తీసుకుంటే ఇది అంద‌రి కి ఆరోగ్య సేవ‌ల క‌ల్ప‌న‌. దీనిని సాధించ‌డం కోసం మా ప్ర‌భుత్వం అనేక చరిత్రాత్మ‌క విధానాల‌ ను అమ‌లుపరుస్తోంది.

ఆయుష్మాన్ భార‌త్ కార్య‌క్ర‌మం ద్వారా దేశంలోని 70 ల‌క్ష‌ల మంది పేద రోగులు ఉచిత చికిత్స‌ల‌ను పొందారు. ఆయుష్మాన్ భార‌త్ యోజ‌న అనేది దేశం లోని అతి పెద్ద కార్య‌క్ర‌మం. ఆయుష్మాన్ భార‌త్ ల‌బ్ధిదారుల సంఖ్య‌ ను తీసుకుంటే ఇది అమెరికా, కెన‌డా, మెక్సికో ల జ‌నాభా కంటే అధికం గా ఉంటుంది. అతి త‌క్కువ స‌మ‌యం లోనే ఈ పథకం లో 70 ల‌క్ష‌ల మంది ల‌బ్ధి పొందారు. వీరి లో చాలా మంది చికిత్స చేయించుకోలేక త‌మ‌లో తాము బాధ‌ప‌డుతూ మౌనం గా మ‌ర‌ణం కోసం ఎదురు చూసిన‌వారే. ఎంత త్వర‌గా మ‌ర‌ణం వ‌స్తే అంత మంచిది అనుకున్నారు. రోగాల‌ తో ఎన్ని రోజులు అయినా బాధ‌ప‌డాల‌నుకున్నారు త‌ప్ప చికిత్స‌ లు తీసుకొని, ఆప‌రేశన్ లు చేయించుకొని త‌ద్వారా త‌మ‌ త‌మ పిల్ల‌ల‌ పైన ఆర్ధిక భారాన్ని మోపాల‌ని అనుకోలేదు. హృద్రోగాలు, కేన్స‌ర్ వంటి రోగాల‌ కు కూడా చికిత్స తీసుకోకుండా జీవితం పై ఆశ‌ ను వ‌దలివేసుకొని వుండే వారు. అయితే ఆయుష్మాన్ భార‌త్ స్కీము అమ‌ల‌వ‌డంతో వారి కి కొత్త జీవితం వ‌చ్చింది. వారి జీవితాల్లో కొత్త‌గా ఆశ‌లు చిగురించాయి. ఒక రూపాయి అయినా ఖ‌ర్చు పెట్ట‌కుండా మొత్తం 70 ల‌క్ష‌ల మంది కి ఉచిత చికిత్స ల‌భించింది. ఈ స్కీము ను అమ‌లుచేయ‌డం లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ చక్క‌టి పాత్ర‌ ను పోషిస్తుండ‌డం నాకు సంతోషాన్ని క‌లిగిస్తోంది. ఒక ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోనే 11 ల‌క్ష‌ల మంది నిరుపేద రోగులు ఈ ఆయుష్మాన్ భారత్ స్కీము ద్వారా ఉచిత చికిత్స పొంది, ప్రాణాల ను కాపాడుకొన్నారు.

అలాగే జ‌న్ ఔష‌ధి స్కీము ద్వారా త‌క్కువ‌ ధ‌ర‌కే మందుల‌ ను అందుబాటు లోకి తీసుకు రావ‌డం జ‌రుగుతోంది. మందుల దుకాణాని కి వెళ్లి వంద‌ రూపాయ‌లు పెట్టి కొనుగోలు చేసే మందులను ఈ జ‌న్ ఔష‌ధి కేంద్రాల‌ ద్వారా 30 నుండి 40 రూపాయ‌ల‌కే పొంద‌వచ్చు. క్ర‌మం త‌ప్ప‌కుండా మందుల‌ ను కొనుగోలు చేసే వారు వారి మందుల బిల్లుల‌ పై ప్ర‌తి నెలా 800, 1000, 1200, 1500 రూపాయ‌ల‌ వ‌ర‌కు ఆదా చేైసుకోగ‌లుగుతున్నారు. ఈ కార‌ణం గా దేశ‌మంతటా ఈ జ‌న్ ఔష‌ధి కేంద్రాలు ప్ర‌జాద‌ర‌ణ ను పొందుతున్నాయి. అంతే కాదు ప్ర‌జ‌లు కూడా ఈ మందుల‌ ప‌ట్ల సంతృప్తి ని వ్య‌క్తం చేస్తున్నారు. అదే కాలం లో స్టెంట్ లు, మోకాలి చిప్ప తొడుగు ల ధ‌ర‌లు కూడా గ‌ణ‌నీయం గా త‌గ్గాయి.

మిత్రులారా, దేశం లోని నిరుపేద‌ల‌కు ఆరోగ్య భ‌ద్ర‌తా రంగం అందుబాటు లోకి వ‌స్తోంది. అంతే కాదు మ‌రో ప‌క్క ఆరోగ్య భ‌ద్ర‌త కోసం డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్ పెరిగే కొద్దీ నూత‌న ఆసుప‌త్రుల‌ కు, చికిత్సాల‌యాల‌ కు, నూత‌న న‌ర్సింగ్ కేంద్రాల స్థాప‌న‌ కు అవ‌కాశాలు పెరుగుతున్నాయి. మెడిక‌ల్ సీట్ల సంఖ్య గ‌త ఐదు సంవ‌త్స‌రాల లో రికార్డు స్థాయి లో పెరిగింది. ఈ ఏడాది దేశ‌వ్యాప్తం గా నూత‌నం గా 75 వైద్య క‌ళాశాల‌ ల కోసం అనుమ‌తి ని ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింది. ప్ర‌తి మూడు లోక్ స‌భ సీట్ల‌కుగాను ఒక వైద్య క‌ళాశాల‌ ను ప్రారంభించాల‌నే ల‌క్ష్యాని కి అనుగుణం గా విజ‌య‌వంత‌మైన అడుగులు వేస్తున్నాము. దీని ద్వారా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కూడా పెద్ద ఎత్తున ల‌బ్ధి ని పొందుతోంది. గ‌త రెండు మూడు సంవ‌త్స‌రాలు గా ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో రెండు డ‌జ‌న్ల‌ కు పైగా వైద్య క‌ళాశాల‌ లు ప్రారంభ‌ం అయ్యాయి. వీటి లో చాలా వ‌ర‌కు ఇప్ప‌టికే ప‌ని చేయ‌డం మొద‌లుపెట్టాయి. మ‌రికొన్ని నిర్మాణ ద‌శ‌ లో ఉన్నాయి.

మిత్రులారా, దేశం లో మ‌హిళ‌ల‌, చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డానికిగాను మా ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాల‌ ను అమ‌లు చేస్తోంది. జాతీయ పోష‌ణ ఉద్య‌మాన్ని యుద్ధ ప్రాతిప‌దిక‌ న అమ‌లు పరుస్తున్నాము. 2025వ సంవత్సరం కల్లా దేశం లో నుండి టి బి ని పూర్తిగా పార‌ద్రోల‌డానికిగాను జాతీయ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. ఈ విధం గా నాలుగు కోణాల లో చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు దేశ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డం లో కీల‌క పాత్ర ను పోషిస్తున్నాయి. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ ద్వారా చికిత్స‌ల‌ కు పెట్టే ఖ‌ర్చు లు త‌గ్గుతున్నాయి.

మిత్రులారా,

ప్ర‌జారోగ్య రంగంలో క‌ని విని ఎరుగ‌ని రీతి లో జ‌రుగుతున్న ప‌ని వ‌ల్ల ఒన‌గూరే ఫ‌లితాలు ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లో క‌నిపిస్తున్నాయి. బోద‌కాలు వ్యాధి ని నియంత్రించ‌డం లో ముఖ్య‌మంత్రి యోగి గారు, ఆయ‌న స‌హ‌చ‌రులు, రాష్ట్ర ప్ర‌జ‌లు ప్ర‌శంస‌నీయంగా ప‌ని చేశారు. ఇందుకుగాను మీ అంద‌రి కి నా అభినంద‌న‌లు తెలియ‌జేసుకుంటున్నాను. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సాధించిన ఈ విజ‌యాన్ని అంత‌ర్జాతీయ సంస్థ‌ లు గుర్తించి ప్ర‌శంసిస్తున్నాయి. రాష్ట్రం లోని ప్ర‌తి గ్రామం లో ఆరోగ్య‌, పారిశుద్ధ్య సౌక‌ర్యాల‌ ను అందుబాటు లోకి తేవ‌డానికిగాను ప్ర‌భుత్వం ప్రారంభించిన కార్య‌క్ర‌మం రాష్ట్ర ప్ర‌జ‌ల జీవితాల లో చ‌క్క‌టి మార్పు ను తీసుకు రావ‌డానికి చేప‌ట్టిన ముఖ్య‌మైన కార్య‌క్ర‌మం గా భావిస్తున్నాను. ఇప్పుడు రాష్ట్రం లో జాతీయ పోష‌ణ కార్య‌క్ర‌మం మ‌రియు ఇంద్ర‌ధ‌నుష్ కార్య‌క్ర‌మాలు త్వ‌రిత‌ గ‌తి న అమ‌లు అవుతున్నాయి. వీటివ‌ల్ల రాష్ట్రం లో ప్ర‌తి చిన్నారి, ప్ర‌తి పౌరుడు ఆరోగ్యం గా ఉంటారు. దీనికి సంబంధించిన కార్య‌క్ర‌మాన్ని అంద‌రి కి అందుబాటు లోకి తేవ‌డానికి ప్ర‌భుత్వం తీసుకొంటున్న చ‌ర్య‌ ల‌ కార‌ణం గా రాష్ట్ర ప్ర‌జ‌ల జీవితం సుఖ‌వంతం గా కొన‌సాగుతుంది.

మిత్రులారా, సుప‌రిపాల‌న దినోత్స‌వ సందర్భంగా నూత‌న సంవ‌త్స‌రంలో, నూత‌న ద‌శాబ్దంలోకి అడుగుపెడుతున్న ఈ స‌మ‌యంలో అట‌ల్ గారి మ‌రో ప్రబోధాన్ని మ‌నం స్మ‌రించుకోవాలి. భార‌త‌దేశం ప్ర‌గ‌తి కోసం ప్ర‌తి త‌రం చేసిన కృషి ని రెండు అంశాల ప్రాతిప‌దిక‌ గా మ‌దింపు చేయాలని అట‌ల్ జీ అనే వారు. ఈ రెండు అంశాలు ప్ర‌తి పౌరుని కి వ‌ర్తిస్తాయి. ఈ రెండిటి ని మ‌న ముందుంచుకొని ఏ ప‌నినైనా చేయాలి. దీనికిగాను అట‌ల్ జీ ఒక మార్గాన్ని చూపారు. ఈ రెండు అంశాల లో మొద‌టిది మ‌న‌కు మ‌న పెద్ద‌ల‌ నుండి వార‌సత్వం గా వ‌చ్చిన స‌మ‌స్య‌ల్లో ఎన్నింటిని ప‌రిష్క‌రించాము? అవును. మ‌నం మ‌న పెద్ద‌ల‌ నుండి ఆస్తుల‌నే కాదు స‌మ‌స్య‌ల‌ ను కూడా వార‌స‌త్వంగా పొందుతాము. అయితే వీటి లో ఎన్నిటి ని ప‌రిష్క‌రించ‌గ‌లిగాము? ఇక రెండో అంశం, మ‌నం మ‌న చ‌ర్య‌ల కార‌ణంగా జాతి భ‌విష్య‌త్తు అభివృద్ధి కోసం వేసిన పునాది ఎంత బ‌లంగా ఉంది?

మిత్రులారా ఈ రెండు ప్ర‌శ్న‌ల నేప‌థ్యం లో ఈ రోజు న మ‌నం చెప్ప‌గ‌లం గ‌తం లో ఎన్న‌డూ సాధించ‌ని విజ‌యాల‌ తో భార‌త‌దేశం 2020వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతోంది అని. మ‌నం మ‌న పెద్ద‌వాళ్ల‌ నుండి వార‌స‌త్వం గా పొందిన సామాజిక‌, ఆర్ధిక‌, రాజ‌కీయ స‌మ‌స్య‌ లు స‌వాళ్ల ను, అవి ఎలాంటివైనా స‌రే, వాటి ని స్థిర‌చిత్తం తో ప‌రిష్క‌రించుకోవ‌డానికి కృషి చేస్తున్నాము.

ఆర్టిక‌ల్ 370నే తీసుకోండి. ఇది దేశాన్ని ఎంతో కాలం గా ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌స్య‌. ఇది ఎంతో ఇబ్బంది గా మారింది. ఈ స‌మ‌స్య మా ప్ర‌భుత్వాని కి వార‌స‌త్వం గా అందింది. ఈ క్లిష్ట‌మైన స‌మ‌స్య‌ ను నేర్పు గా ప‌రిష్క‌రించాల్సిన బాధ్య‌త‌ ను తీస‌కున్నాము. దీనిని సులువు గా ప‌రిష్క‌రించాము. దీని కి సంబంధించి అంద‌రి లో ఉన్న అనుమానాల ను నివృత్తి చేశాము.

అలాగే ఎంతో కాలం గా ఉన్న రామ జ‌న్మ‌భూమి వివాదం స‌మ‌స్య‌ంకు శాంతియుత ప‌రిష్కారాన్ని తీసుకు రా
గలిగాము. భార‌త‌దేశాని కి స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌రువాత దేశ విభ‌జ‌న జ‌రిగింది. తదనంతరం పాకిస్తాన్, బాంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్ లలో పేద‌లు, ద‌ళితులు ల‌క్ష‌ల మంది ఆయా దేశాల‌ను విడచి, భార‌త‌దేశాని కి కాందిశీకులు గా వ‌చ్చారు. త‌మ మ‌తాన్ని కాపాడుకోవ‌డానికి, త‌మ ఆడ‌బిడ్డ‌ ల గౌర‌వాన్ని కాపాడుకోవ‌డానికిగాను వారు భార‌త‌దేశానికి వచ్చారు. అలా శ‌ర‌ణార్థులు గా వచ్చిన‌ వారి గౌర‌వ మ‌ర్యాద‌ల ను పౌర‌స‌త్వ చ‌ట్టం కాపాడుతోంది. ఇటువంటి అనేక స‌మ‌స్య‌ల ను దేశం లోని 130 కోట్ల మంది భార‌తీయులు ప‌రిష్క‌రించారు.

ఎంతో ఆత్మ‌విశ్వాసంతో 2020లోకి భార‌త‌దేశం అడుగుపెడుతోంది. నూత‌న ద‌శాబ్దంలోకి ప్ర‌వేశిస్తోంది. ఇప్ప‌టికీ దేశంలో మిగిలిపోయిన స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించ‌డానికిగాను భారతదేశం లో ప్ర‌తి ఒక్కరు కృషి చేస్తున్నారు. ప్ర‌తి పేద‌వాడి కి వ‌స‌తి గృహాన్ని అందించ‌డానికి లేదా ప్ర‌తి గృహాని కి నీటి ని అందించ‌డానికి కృషి చేస్తున్నారు. స‌వాళ్లు ఎంత పెద్ద‌వి అయినా స‌రే, వాటి ని స‌వాల్ చేయ‌డ‌ం అనే మ‌న‌స్త‌త్వం తో మ‌నం ముంద‌డుగు వేస్తున్నాము.

మిత్రులారా, 2014వ సంవత్సరం నుండి 2019వ సంవత్సరం వ‌ర‌కు స‌వాళ్ల‌ను స‌వాల్ చేసి, వాటి అంతు చూడ‌డానికిగాను ఎటువంటి అవ‌కాశాన్ని వ‌ద‌ల‌కుండా ప‌ని చేశాము. 2014వ సంవత్సరం కంటే ముందు దేశం లో దేశం లోని స‌గం జ‌నాభా కు అయినా మరుగుదొడ్లు లేవు. ఇప్పుడు వారు అంద‌రు మ‌రుగుదొడ్ల వసతి ని ఏర్పాటు చేసుకొన్నారు. దేశం లోని కోట్లాది కుటుంబాల లో మ‌న త‌ల్లులు, మ‌న సోద‌రీమ‌ణులు వారి జీవిత పర్యంతం పొగ పొయ్యిల‌ తో తంటాలు ప‌డి జీవించారు. ఇప్పుడు ప్ర‌తి ఇంటి కి వంట గ్యాస్ అందుతోంది.

గ‌తం లో వేల గ్రామాల లో వేల కుటుంబాలు విద్యుత్తు సౌక‌ర్యం లేక చీక‌టి లో మ‌గ్గుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ కుటుంబాల‌ కు క‌రెంటు సౌక‌ర్యం వ‌చ్చింది. గ‌తం లో దేశం లోని స‌గం జ‌నాభా బ్యాంకుల‌ కు దూరంగా వుండేది. కానీ ఇప్పుడు వారంద‌రి కోసం బ్యాంకు ల తలుపులు తెరువబడ్డాయి. దేశం లో కోట్లాది కుటుంబాల‌కు త‌మ‌కంటూ సొంత ఇల్లు ఉండేది కాదు. ఇప్పుడు రెండు కోట్ల కుటుంబాల‌ కు ప‌క్కా గృహాల ను ఇవ్వ‌డం జ‌రిగింది. 2022 వ సంవత్సరం కల్లా దేశం లోని ప్ర‌తి నిరుపేద కుటుంబాని కి ఇంటి ని అందించాల‌నే సంక‌ల్పం తో ప‌నులు చాలా వేగం గా జ‌రుగుతున్నాయి.

దేశం లోని ప్ర‌తి గ్రామాని కి ర‌హ‌దారి సౌక‌ర్యాన్ని, రైల్వే మార్గం తో సంబంధాల‌ ను ఏర్ప‌ర‌చ‌డానికిగాను ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌తి ఇంటి కి గొట్టపుమార్గం ద్వారా నీటి ని స‌ర‌ఫ‌రా చేయాల‌నే నిర్ణ‌యాన్ని అమ‌లు చేసేందుకు మా ప్ర‌భుత్వం పూర్తి సిద్ధం గా ఉంది. ఇలా మ‌నం అందిస్తున్న ప‌రిష్కారాలు నూత‌న భార‌త‌దేశ ప్ర‌గ‌తి కి అవ‌స‌ర‌మైన బ‌ల‌మైన పునాది ని వేస్తున్నాయి. ఈ బ‌ల‌మైన పునాది ని ఆధారం చేసుకొనే 5 ట్రిలియ‌న్ డాలర్ విలువైన ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ ను సాధించాల‌నే ల‌క్ష్యాన్ని అందుకోవ‌డానికి మ‌నం గ‌ట్టి గా ప‌ని చేస్తున్నాము. త‌ద్వారా కోట్లాది భార‌తీయుల జీవ‌న ప్ర‌మాణాలు పెరుగుతాయి. దేశం లోని పేద‌రికం పోయి ప్ర‌జ‌లు గౌర‌వ మ‌ర్యాద‌ల‌ తో జీవించ‌గ‌లుగుతారు.

మిత్రులారా, ఇది సుప‌రిపాల‌న‌. దీనినే స్వ‌రాజ్ అంటారు. అట‌ల్ బిహారీ వాజ్ పేయి గారు, మ‌హా మాననీయ శ్రీ మాల‌వీయా గారు మొద‌లైన జాతి నిర్మాత‌ల సంక‌ల్ప‌ం ఇది. మా ప్ర‌భుత్వం దృష్టి లో సుప‌రిపాల‌న అంటే …ప్ర‌తి పౌరుడు/ పౌరురాలు యొక్క ఫిర్యాదుల‌ ను ప‌రిష్క‌రించ‌డం. ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్ధి అంద‌రి కి చేకూర‌డం. ప్ర‌తి భార‌తీయుని కి అవ‌కాశాలు అంద‌డం. ప్ర‌తి భార‌తీయుని కి భ‌ద్ర‌త క‌ల్పించ‌డం. అంద‌రి కి సౌక‌ర్యాలు అందుబాటులోకి రావ‌డం. దేశం లోని ప్ర‌తి ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ ఈ ప‌నుల‌ ను చేయాలి. ప్ర‌జ‌ల‌ కు సేవ‌లందించాలి.

సుప‌రిపాల‌న‌ కు సంబంధించి ఒకే ఒక మంత్రం ఉంది. అది స‌బ్ కా సాథ్‌, సబ్ కా వికాస్ ఔర్ స‌బ్ కా విశ్వాస్‌. ఈ స్ఫూర్తి, త‌త్వాల ఆధారంగానే మ‌నం క‌లిసి మెలిసి వుంటున్నాము.

మిత్రులారా, స్థిర‌మైన ప్ర‌య‌త్నం చేసి మేం అధికారం ప‌ట్ల ప్రేమ‌ కు దూరం గా జ‌రిగాము. దానికి బ‌దులు గా ప్ర‌జ‌ల‌కు అందించే సేవా విలువ‌ల మీద దృష్టి పెట్టాం. దేశం లోని సామాన్య ప్ర‌జ‌ల జీవితాల లో ప్ర‌భుత్వ జోక్యం ఎంత వీలుంటే అంత త‌గ్గితేనే ఇది సాధ్య‌మ‌వుతుంది. ప్ర‌భుత్వ‌ం అంటే అంద‌రి తో స్నేహ‌పూర్వ‌కంగా మెలిగేది. అంతేకానీ అవ‌రోధాల ను, గంద‌ర‌గోళాన్ని సృష్టించేది కాదు. అటువంటి ప్ర‌భుత్వ‌ పాల‌న ను అందించ‌డానికి మేము ప్ర‌య‌త్నిస్తున్నాము. మా ప్ర‌భుత్వం తీసుకొన్న చ‌ర్య‌ల‌ ను ఒక సారి స‌మీక్షిస్తే మా ప్ర‌తి అడుగు లో ఇదే విష‌యాన్ని మీరు గ‌మ‌నించ‌గ‌లు.

దస్తావేజు పత్రాల ధ్రువీక‌ర‌ణ‌ కోసం గ‌తంలో ఉన్న‌తాధికారుల సంత‌కాల‌ తో కూడిన అటెస్టేష‌న్ ప్ర‌క్రియ ఉండేది. ఇప్పుడు అటువంటి ప్ర‌క్రియ లేదు. మీకు మీరే ద్రువీక‌ర‌ణ చేసుకుంటే చాలు, మీకు మీరు బాధ్య‌త తీస‌కుంటే చాలు. అది ప్ర‌భుత్వానికి స‌రిపోతుంది. మిమ్మ‌ల్నే ప్ర‌భుత్వం న‌మ్ముతుంది.

ప్ర‌స్తుతం అనేక ప్ర‌భుత్వ సేవ‌ల‌ ను ఆన్ లైన్ లో పొంద‌డం జ‌రుగుతోంది. సేవ‌ల‌ కు సంబంధించిన అంశాల‌ ను డిజిట‌లైజ్ చేశాము. జ‌న‌నాల ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ మొదలు పెన్శన్ కోసం ఇచ్చే ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ దాకా అన్నీ అన్ లైన్‌ లో తీసుకోవ‌చ్చు. గ‌తం లో ఇవి కావాలంటే సామాన్య మాన‌వుడి కి చాలా క‌ష్ట‌మ‌య్యేది. ప్ర‌భుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది ప‌డుతుండే వాడు. కానీ ఇప్పుడు వారికి అటువంటి క‌ష్టాలు లేవు. అన్ని ప‌నులు సులువు గా జ‌రిగిపోతున్నాయి.

మిత్రులారా, మ‌న సుప‌రిపాల‌న లోని మ‌రో ద‌శ‌ కు చేరుకొంటున్నాము. ఇందులో ప్ర‌జ‌లు ధ‌ర‌ఖాస్తులు పెట్టుకోవలసిన అవ‌స‌రం లేదు. ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి, వారి ఇంటి త‌లుపులు త‌ట్టి వారికి ఏమైనా స‌మ‌స్య‌లు ఉన్నాయా? ఉంటే చెప్పండి, వెంట‌నే ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతుందని వారి ని అభ్య‌ర్థిస్తుంది. మీరు చూసే ఉంటారు.. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల ఉప‌యోగార్థం అమ‌లు చేస్తున్న ప్ర‌తి ప‌థ‌కం కోసం సాంకేతిక‌త‌ ను, డేటా సైన్స్ ను వినియోగించుకొంటున్నాము. వీటి ద్వారా ల‌బ్ధిదారుల‌ ను గుర్తించ‌డం, వారికి ప‌థ‌కాల ను స‌క్ర‌మం గా అంద‌జేయ‌డం జ‌రుగుతోంది.

ల‌బ్దిదారుల‌ కు నేరుగా ల‌బ్ది చేకూర్చేలా, వారికి వేగం గా ప‌థ‌కాలు అందేలా చూడ‌డ‌మ‌నే విధానాన్ని ప్ర‌భుత్వ సంస్కృతి లోకి తెచ్చాము. దీనివ‌ల్ల పార‌ద‌ర్శ‌క‌త సాధ్య‌మ‌వుతోంది. ప్ర‌జ‌ల‌ కు ప‌థ‌కాలు వేగం గా అందుతున్నాయి. అంతే కాదు ఎంతో నిజాయతీ గా ప‌న్నులు చెల్లించే వారి డ‌బ్బు స‌క్ర‌మం గా ఉప‌యోగ‌ప‌డుతోంది.

మిత్రులారా, ఈ రోజు న ఈ గ‌డ్డ మీద‌ నుండి ఈ రాష్ట్రాని కి చెందిన యువ‌త‌ కు, ప్ర‌తి పౌరుని కి మ‌రో అభ్య‌ర్థ‌న ను కూడా చేయ‌ద‌లుచుకున్నాను.

దేశాని కి స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌రువాత సంవ‌త్స‌రాల‌ లో ఏం జ‌రిగిందీ మ‌నం చూశాము. హ‌క్కుల‌ కు అత్యున్న‌త ప్రాధాన్య‌ాన్ని ఇచ్చాము. ఇప్పుడు మ‌నం దేశాని కి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 సంవత్సరాలు నిండిన సంద‌ర్భాన్ని జ‌రుపుకోబోతున్నాము. స్వాతంత్ర్య స‌మ‌ర యోధులు క‌న్న క‌ల‌ల‌ ను చూడండి. ప్ర‌స్తుతం దేశం ఏం కోరుకుంటున్న‌దంటే మ‌నం విధుల‌ కు, బాధ్య‌త‌ల‌ కు స‌మాన ప్రాధాన్య‌ాన్ని ఇవ్వవలసిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లో నిర‌స‌న‌ల పేరిట జ‌రిగిన అల్ల‌ర్ల‌ ను చూడండి. కొంత‌ మంది హింస‌ కు తెగ‌బ‌డ్డారు. ప్ర‌జ‌ల ఆస్తుల‌ ను ధ్వంసం చేశారు. వారు ఒక సారి ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి. తాము అనుస‌రించిన మార్గం స‌రైన‌దేనా ? అని త‌మ‌ ను తాము ప్ర‌శ్నించుకోవాలి. త‌మ హింసాత‌త్వం మంచిదేనా ? అని ప్ర‌శ్నించుకోవాలి. ధ్వంస‌మైన ఆస్తులు రేపు పిల్ల‌ల‌ కు ఉప‌యోగ‌ప‌డ‌తాయా లేదా? అనే విష‌యాన్ని తేల్చుకోవాలి.

కాసేపు మ‌నసు పెట్టి ఆలోచిద్దాము. హింస‌ లో చ‌నిపోయిన వారి ని గురించి, గాయ‌ప‌డిన అమాయ‌కుల ను గురించి, ఈ ఆందోళ‌న‌ ల కార‌ణంగా గాయ‌ప‌డిన పోలీసు సిబ్బంది ని గురించి, వారి కుటుంబ స‌భ్యుల ను గురించి ఆలోచన చేద్దాము. వదంతుల ను న‌మ్మి హింస‌ కు తెగ‌బడే వారి కి, ప్ర‌భుత్వ ఆస్తుల‌ ను ధ్వంసం చేసే వారి కి ఒక అభ్య‌ర్థ‌న ఎందుకు చేస్తున్నానంటే మీరు ఈ విష‌యం ఆలోచించండి. స‌రి అయిన ర‌హ‌దారులు, ర‌వాణా వ్య‌వ‌స్థ‌ లు, మెరుగైన మురుగు నీటి పారుద‌ల వ్య‌వ‌స్థ‌ లు ప్ర‌తి పౌరుని హ‌క్కు. అందుకే వాటి ని భ‌ద్రం గా కాపాడుకోవాలి. శుభ్రంగా వుంచుకోవాలి. ఇది కూడా పౌరులు గా మ‌న బాధ్య‌త అని మ‌రచిపోకూడ‌దు.

మ‌నం హ‌క్కుల‌ కు, విధుల‌కు స‌మ ప్రాధాన్య‌ాన్ని ఇవ్వాలి. నాణ్య‌మైన విద్య‌, అంద‌రికీ అందుబాటులో విద్య అనేవి మ‌న హ‌క్కు లు. అయితే అదే కాలం లో విద్యాసంస్థ‌ల భ‌ద్ర‌త‌, ఉపాధ్యాయుల‌ కు గౌర‌వం ఇవ్వ‌డం అనేవి మ‌న బాధ్య‌త‌ లు. వైద్య సౌక‌ర్యాలు మ‌న హ‌క్కు. అయితే అదే కాలం లో వైద్యుల‌ కు మ‌ద్ద‌తుగా నిలిచి వారికి త‌గిన గౌర‌వాన్ని ఇవ్వ‌డం మ‌న బాధ్య‌త‌.

శాంతి భ‌ద్ర‌త‌ లు కావాల‌ని కోరుకోవ‌డం మ‌న హ‌క్కు. అయితే అదే కాలం లో మ‌న‌కు భ‌ద్ర‌త ను క‌ల్పించే పోలీసులను, వారి ప‌ని ని గౌర‌వించ‌డం మ‌న బాధ్య‌త‌. హ‌క్కుల‌ కు ప‌రిధి ఉంటుంది. అయితే విధులు బాధ్య‌త‌ల‌నేవి విస్తృతమైన‌వి.

మిత్రులారా, ఈ ఆలోచ‌న విధానం అనేది అటు పౌరుల‌ కు ఇటు ప్ర‌భుత్వాని కి ఇద్ద‌రికీ ముఖ్య‌మే. ప్ర‌భుత్వ బాధ్య‌త ఏమిటి అంటే అది తాను చేస్తున్న ప‌ని ని ఐదు సంవ‌త్స‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసి చూడ‌వ‌ద్దు; ఐదు త‌రాల‌ ను దృష్టిలో పెట్టుకొని ప‌ని చేయాలి. ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌న శ‌క్తివంచ‌న లేకుండా ప‌ని చేస్తున్నందుకుగాను నాకు సంతోషం గా ఉంది.

శ్రీ అట‌ల్ జీ ని స్మ‌రించుకుంటూ ఈ రోజు న మ‌నం చేయ‌బోయే తీర్మానం ఎలా ఉండాలి అంటే మ‌న బాధ్య‌త‌ల ను నిర్వ‌ర్తిద్దాం, మ‌న ల‌క్ష్యాల‌ను అందుకుందాము. అంతే కాక, సుప‌రిపాల‌న‌ ను ముందుకు తీసుకుపోదాము. ప్ర‌జ‌ల ఆకాంక్ష ఇది. శ్రీ అట‌ల్ బిహారీ వాజ్ పేయి మ‌న‌ కు నేర్పిన పాఠ‌మిది.

శ్రీ అట‌ల్ వైద్య విశ్వ‌విద్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ కు మ‌రో సారి నా అభినంద‌న‌లు. కొద్ది రోజుల లో ప్రారంభం కానున్న నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భం గా అంద‌రి కి ఇవే నా శుభాకాంక్ష‌లు. 2020వ సంవత్సరం లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ కు మ‌రింత మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటూ
అంద‌రి కి కృత‌జ్ఞ‌త‌ లు తెలియ‌జేసుకుంటున్నాను.

**********