Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లిగో- ఇండియా మెగా సైన్స్ ప్ర‌తిపాద‌న‌కు సైద్ధాంతిక ఆమోదాన్ని తెలిపిన కేంద్ర మంత్రిమండ‌లి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ‌ స‌మావేశం ఎల్ఐజిఒ (లిగో) – ఇండియా మెగా సైన్స్ ప్ర‌తిపాద‌న‌కు సైద్ధాంతిక ఆమోదాన్ని తెలిపింది. లిగో ఇండియా గురుత్వాక‌ర్ష‌ణ త‌రంగాల‌ పైన ప‌రిశోధ‌న‌లు చేయ‌నున్న‌ది. లేజ‌ర్ ఇంట‌ర్‌ఫెరోమీట‌ర్ గ్రావిటేష‌న‌ల్ వేవ్ అబ్ జ‌ర్వేట‌రీ ఆఫ్ ఇండియానే సంక్షిప్తంగా లిగో- ఇండియా ప్రాజెక్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఒక‌ ప్ర‌యోగాత్మ‌క ప‌థ‌కంగా అణు శ‌క్తి విభాగం, సైన్స్ అండ్ టెక్నాల‌జీ విభాగం (డిఎస్ టి) నిర్వ‌హించ‌నున్నాయి. గురుత్వాక‌ర్ష‌ణ త‌రంగాల గుర్తింపు ఈ మ‌ధ్య‌నే వెల్ల‌డి అయిన‌ విష‌యం తెలిసిందే. సైన్స్‌లో చ‌రిత్రాత్మ‌క‌మైన సంఘ‌ట‌న‌గా ఈ గుర్తింపున‌కు పేరొచ్చింది. గురుత్వాకర్ష‌ణ త‌రంగాల గుర్తింపు విశ్వంలో దాగిన కొన్ని అత్యంత గొప్ప‌ ర‌హ‌స్యాలను ఛేదించేందుకు స‌హాయ‌ప‌డ‌నుంది. ఈ నేప‌థ్యంలో లిగో-ఇండియా మెగా సైన్స్ ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం ల‌భించ‌డం యాదృచ్ఛిక ఘ‌ట‌న అని చెప్ప‌వ‌చ్చు.

లిగో- ఇండియా ప్రాజెక్టు ద్వారా గురుత్వాక‌ర్ష‌ణ త‌రంగాల అత్యాధునిక ప‌రిశీల‌నాల‌యాన్ని నెలకొల్పడం జ‌రుగుతుంది. ఈ ప్రాజెక్టును అమెరికాలోని కాల్‌టెక్‌, ఎంఐటి సంస్థ‌ల తోడ్పాటుతో ప‌ని చేస్తున్న లిగో లాబ‌రేట‌రీ సాయంతో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా సైంటిస్టుల‌కు, ఇంజినీర్ల‌కు గురుత్వాక‌ర్ష‌ణ త‌రంగాల విష‌యంలో మునుపెన్న‌డు లేని రీతిలో చాలా లోతుగా ప‌రిశోధ‌న‌లు చేసే అవ‌కాశంతో పాటు ఖ‌గోళ‌ క్షేత్రంలో నాయ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం కూడా చేజిక్క‌గ‌ల‌ద‌ని ఆశించ‌వ‌చ్చు.

అత్యాధునిక సాంకేతిక‌త‌ను స‌మ‌కూర్చే గొప్ప అవ‌కాశాలను భార‌తీయ పారిశ్రామిక రంగానికి లిగో-ఇండియా ప్రాజెక్టు ఇవ్వ‌గ‌ల‌దు. ఈ ప్రాజెక్టులో భాగంగా స‌మ‌త‌ల భూభాగంలో అల్ట్రా హై వ్యాక్యూంతో కూడిన‌ 8 కిలోమీట‌ర్ల పొడ‌వైన బీమ్ ట్యూబ్ ను నిర్మించ‌వ‌ల‌సి ఉంటుంది.

ఈ ప్రాజెక్టు భార‌తీయ విద్యార్థులకు, యువ శాస్త్ర‌వేత్త‌ల‌కు శాస్త్ర‌, సాంకేతిక విజ్ఞాన రంగాల‌లో స‌రికొత్త అంశాల‌ను అన్వేషించేందుకు స్ఫూర్తిని అందించ‌గ‌లుగుతుంది. అలాగే, ఇది దేశంలో శాస్త్రీయ ప‌రిశోధ‌న‌కు కొత్త ఉత్తేజాన్ని కూడా ఇస్తుంది.

***

AKT/BVA/SH