Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారాణసీ లోని జాతీయ విత్తన పరిశోధన మరియు శిక్షణ కేంద్రం (ఎన్ఎస్ఆర్ టిసి) కేంపస్ లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్ఆర్ఐ), దక్షిణ ఆసియా ప్రాంతీయ కేంద్రం (ఐఎస్ఎఆర్ సి) ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం వారాణసీ లోని జాతీయ విత్తన పరిశోధన మరియు శిక్షణ కేంద్రం (ఎన్ఎస్ఆర్ టిసి) వద్ద అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్ఆర్ఐ), దక్షిణ ఆసియా ప్రాంతీయ కేంద్రం (ఐఎస్ఎఆర్ సి) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

ఈ ప్రతిపాదనలో భాగంగా, వారణాసి లో ధాన్యం విలువను పెంచే ఒక సమర్ధమైన కేంద్రాన్ని నెలకొల్పుతారు. ఇందులో ధాన్యం మరియు గడ్డి లో భారీ లోహాల నాణ్యత మరియు స్థాయిని నిర్ణయించే సామర్ధ్యంతో ఒక ఆధునిక, ప్రగతిశీల ప్రయోగశాల కూడా కలిసివుంటుంది. దేశవ్యాప్తంగా ధాన్యం విలువను నిర్ధారించే భాగస్వాములకు అవసరమైన సామర్ధ్య నిర్మాణాన్ని కూడా ఈ కేంద్రం చేపడుతుంది.

తూర్పు భారతదేశం లో ప్రప్రథమ అంతర్జాతీయ కేంద్రంగా రూపుదిద్దుకోగల ఈ సంస్థ, ఈ ప్రాంతంలో బియ్యం ఉత్పత్తిని పెంపొందించి, స్థిరీకరించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. తూర్పు భారతదేశంలోనూ, ఇదేవిధమైన వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్న ఇతర దక్షిణాసియా మరియు ఆఫ్రికా దేశాలలోనూ ఆహార పదార్ధాల ఉత్పత్తి, నైపుణ్యాభివృద్ధికి ఈ కేంద్రం ఒక వరం కాగలదని ఆశిస్తున్నారు.

ఐఎస్ఎఆర్ సి నుండి లభించే ప్రయోజనాలు

ధాన్యంలో ప్రత్యేక రకాలను అభివృద్ధి చేయడానికి వీలుగా భారతదేశంలో అపారంగా ఉన్న జీవ వైవిధ్యాన్ని వినియోగించుకోడానికి ఈ కేంద్రం సహాయపడుతుంది. భారతదేశంలో, ఒక్కొక్క హెక్టారుకు అధిక సరాసరి దిగుబడి, మెరుగైన పోషక విలువలు సాధించేందుకు ఇది సహాయపడుతుంది. భారతదేశంలో నెలకొన్న ఆహార మరియు పోషక భద్రతా సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది. దేశంలో విలువ ఆధారితమైన ఆహార విధానాన్ని అమలుచేయడానికి ఈ కేంద్రం మద్దతిస్తుంది. ఈ సంస్థ, రైతులకు వృథాను తగ్గించి, విలువను పెంచి, అధిక ఆదాయాన్ని సమకూరుస్తుంది. దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలతో పాటు, తూర్పు భారతదేశంలోని రైతులు ప్రధానంగా ఈ కేంద్రం ద్వారా ప్రయోజనం పొందుతారు.

ఐఎస్ఎఆర్ సి నిర్వహణ

అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్ఆర్ఐ) కు చెందిన ధర్మకర్తల మండలి ఐఆర్ఆర్ఐ సిబ్బందిలో ఒక తగిన సభ్యుడిని డైరెక్టర్ గా నియమిస్తుంది. ఐఆర్ఆర్ఐ ట్రస్టీల బోర్డు ఆధ్వర్యంలో ఐఎస్ఎఆర్ సి పనిచేస్తుంది. సమన్వయ సంఘానికి ఐఆర్ఆర్ఐ డైరెక్టర్ జనరల్ అధ్యక్షునిగాను, భారత ప్రభుత్వ వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమ విభాగం (డిఎసి & ఎఫ్ డబ్ల్యు) కార్యదర్శి సహ అధ్యక్షునిగాను ఉంటారు. ఈ సంఘానికి ఇతర సభ్యులుగా ఐసిఎఆర్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (పంటల శాస్త్రం); ఎన్ఎస్ఆర్ టిసి, డైరెక్టర్ ; భారతదేశంలో ఐఆర్ఆర్ఐ ప్రతినిధి ; ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి ; నేపాల్, బంగ్లాదేశ్ ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు ప్రయివేటు రంగ ప్రతినిధులు ఉంటారు.

ఈ కేంద్రం ఏర్పాటుకు డిఎసి&ఎఫ్ డబ్ల్యు మరియు ఐఆర్ఆర్ఐ, ఫిలిప్పీన్స్ ల మధ్య ఒక అవగాహనపూర్వక ఒప్పందం పై సంతకాలు జరుగుతాయి. ప్రయోగ శాలలకు, కార్యాలయాలకు, శిక్షణా తరగతులకు మొదలైన వాటికి స్థలంతో పాటు అనుబంధ మౌలిక సదుపాయాలూ మరియు భూమిని వారాణసీ లోని ఎన్ఎస్ ఆర్ టిసి వద్ద డిఎసి&ఎఫ్ డబ్ల్యు కేటాయిస్తుంది.