Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషా ముక్త్ యువ’ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించనున్న ప్రధానమంత్రి


‘వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషా యుక్త్ యువ’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు వీడియో అనుసంధానం ద్వారా ప్రారంభించనున్నారు. యువతను మాదకద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచేలా ప్రేరేపించడం, వారి కమ్యూనిటీల్లో సానుకూల సామాజిక మార్పునకు యువత కృషి చేసేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

మత్తుపదార్థాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 100 వారాల పాటు జరిగే జన భాగీదారీ ఉద్యమానికి ఈ ప్రారంభోత్సవం నాంది పలుకుతుంది. ఈ ఉద్యమం ద్వారా మత్తుపదార్థ రహిత సమాజ నిర్మాణం గురించి అవగాహన కల్పించడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రతీవారం ఆదివారం రోజున పలు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో క్రీడా కార్యక్రమాలు, వాకథాన్‌లు, ధ్యాన తరగతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, వీధి నాటకాలు, చర్చా వేదికలు, కళల పోటీలు, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలూ భాగంగా ఉంటాయి.

మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక సామూహిక ఉద్యమాన్ని రూపొందించేందుకు… విద్యా సంస్థలు, యువజన సంఘాలు, పౌర సమాజ సమూహాలు, పారిశ్రామిక సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా సమాజ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ వాలంటీర్లు, మై భారత్ జాతీయ సేవా పథకం వాలంటీర్లు సహా, యువజన సంఘాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీవోలు), పారిశ్రామిక సంఘాల యువజన విభాగాలు దీనిలో పాలుపంచుకోనున్నాయి. 125కు పైగా భాగస్వామ్య ఆధ్యాత్మిక సంస్థలూ ఈ కార్యక్రమంలో వీడియో అనుసంధానం ద్వారా పాల్గొంటాయి.